Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

"బావగారూ... బాలేరు అని ప్రేక్షకుడు అని ఉంటే..."

ప్రేక్షకుడు ఇలా అని ఉంటే 2001లో నేను దర్శకుణ్ణయ్యి ఉండేవాణ్ణి కానేమో... ఇంకా బాగా లేటయ్యుండేది. అసలవ్వకపోయి అయినా ఉండేది.

1998లో ఒకరోజు... చిరంజీవి గారింట్లో ఆయన టేబుల్ కి ఎదురుగా ఆయన్ని ఫేస్ చేస్తూ గురువుగారు శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పక్కనే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫైల్స్ పట్టుకుని గురువుగారికి ప్రామ్టింగ్ ఇవ్వడానికి రెడీగా నేను. కొంచెం దూరంగా దర్శకులు శ్రీ జయంత్ గారు, నిర్మాత సి. నాగబాబు గారు, శ్రీ అల్లు అరవింద్ గారు. పి.వి.ఆర్ గారు హిలేరియస్ ఫస్ట్ హాఫ్ నెరేట్ చేశారు. ఆ తృప్తిలో చిన్న విరామం ఇచ్చారు. ఆ గ్యాప్ లో చిరంజీవి గారు అందరికీ వేడివేడిగా జీడిపప్పు ఉప్మా తెప్పించి స్వయంగా ఆవకాయ వడ్డించారు. అప్పుడు చూశాను దూరంగా మెట్ల మీద కూర్చుని ఆ నెరేషన్ అంతా పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధగా విన్నారని. సెకండాఫ్ చెప్పడం మొదలుపెట్టారు పి.వి.ఆర్. సగం తర్వాత పరేష్ రావల్ ఇంట్లో జరిగే ఓ హెవీ డ్రామా సీను చాలా బాగా చెప్తున్నారు. గట్టిగా నవ్వు వినిపించింది. అందరూ కంగుతిన్నారు. చూస్తే మెట్ల మీంచి కళ్యాణ్ బాబు. తర్వాత కంటిన్యూ చేసి మొత్తం కథ చెప్పేశారు. చిరంజీవి గారు, అరవింద్ గారు ఓకే అనేశారు. జయంత్ గారికి, నాగబాబు గారికి టెన్షన్ రిలీఫ్. చిరంజీవి గారు కళ్యాణ్ గారిని పిలిచి అడిగారు. "ఏరా కళ్యాణ్! అంత మంచి డ్రామా సీన్ చెప్తుంటే అలా నవ్వావేంటి? పెద్దబ్బాయి(పి.వి.ఆర్ గారిని చిరంజీవి గారు రకరకాలుగా పిలుస్తారు - పెద్దబ్బాయి అని, వెంకీ అని, వెంకట్ అని, ఇలా) ఫ్లో డిస్టర్బ్ అయిపొయింది" అని.

"ఏం లేదన్నయ్యా! ఇంటర్వెల్ సీన్ లో హీరోయిన్ ని చూడగానే నీ రియాక్షన్ గుర్తొచ్చి నవ్వొచ్చింది" అన్నారు. "మూడు రీళ్ళ తర్వాత కూడా నీకు గుర్తొచ్చిందంటే సినిమా ఓకే కదా!" అన్నారు. కళ్యాణ్ బాబు నవ్వుతూ తలూపేశారు.

వెంకటేశ్వరరావు గారికి మాత్రం అప్పుడే భారం దిగినట్టయింది. అప్పటివరకు ఆయన కూడా లోలోపల డ్రామా ఏవన్నా మెలో డ్రామా అయిందా అని టెన్షన్ పడుతూనే ఉన్నారు. (360 సినిమాలు రాసినా, హీరోకి, నిర్మాతకి, దర్శకుడికి డైలాగ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళనుభవించే భావోద్వేగాలు, పాటించే భక్తిశ్రద్ధలే వాళ్ళనివ్వాల్టికీ పరిశ్రమలో అగ్రరచయితలుగా నిలబెట్టాయని నేను ఖచ్చితంగా చెప్పగలను).

అలా షూటింగ్ స్టార్టయింది. కేవలం చిరంజీవి గారి సినిమాకి పని చెయ్యాలన్న కోరికతోనే "ప్రేమించుకుందాం... రా" తర్వాత సురేష్ ప్రొడక్షన్ లాంటి అగ్ర సంస్థలో కొనసాగకుండా డైరెక్టర్ జయంత్ గారితో బైటకొచ్చేశాను. ఆ సినిమా మీద పూర్తిగా చూపించేశాను. ఏ రోజూ నాగబాబుగారికి గానీ, చిరంజీవిగారికి గానీ, అరవింద్ గారికి గానీ నేను చిరంజీవి గారి అభిమానినని చెప్పలేదు. ఈ రోజుకీ చెప్పలేదు. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో స్పెసిఫిక్ గా అడిగితే తప్ప. కానీ, నాగబాబు గారు, చిరంజీవి గారు మాత్రం నన్ను బాగా అభిమానించారు. కథానుగుణంగా "బావగారూ... బాగున్నారా" టైటిల్ నేను సూచించగానే ఓకే చెప్పారు. అవసరం లేకున్నా ప్రెస్ మీట్స్ లో నాగురించి ప్రత్యేకించి చెప్పారు. పరుచూరి బ్రదర్స్ కి స్క్రిప్ట్ లో అసిస్ట్ చేయడం చూసి జయంత్ గారికి చెప్పి స్క్రీన్ ప్లే లో నా పేరు కూడా వేయించారు. అది వాళ్ళ సంస్కారం, నా అదృష్టం. డబ్బింగ్ జరుగుతుండగా చిరంజీవి గారితో నేను ఉన్నాను. స్క్రిప్ట్ ఫాలో అవుతూ. ఆయన్ని కలవడానికొచ్చిన ప్రముఖ నిర్మాతలు శ్రీ అశ్వనీదత్ గారు, శ్రీ దేవీ వరప్రసాద్ గారు, శ్రీ విజయ బాపినీడు గారు తదితరులకి నేను త్వరలో దర్శకుణ్ణవుతానని, మంచి సినిమాలు తీస్తానని నా భుజం మీద చెయ్యేసి మరీ చెప్పేవారు. ఈ మధ్య ఆయన కేంద్రమంత్రి అయిన సందర్భంగా అభినందనలు తెలపడానికి వెళ్తే కూడా అంతే అభిమానంతో మాట్లాడారు.

"బావగారూ బావున్నారా" టైటిల్ అందరూ ఓకే అనుకున్నాక చిరంజీవి గారికి చెప్తే, "సపోజ్ ఆడియన్స్ బాలేదు అంటే..." అనడిగారు. "ఉంటారండి... తింగరోళ్ళు... టైటిల్ లో మనమే నెగిటివ్ గా అనే ఆప్షన్ ఎందుకివ్వాలి?" అని అడిగారు. దీనికి ఎవ్వరి దగ్గరా సమాధానం లేదు. ఎందుకంటే ఎవ్వరం ఎక్స్ పెక్ట్ చేయలేదు కాబట్టి. తర్వాత రెండు మూడ్రోజుల తర్వాత నాగబాబు గారికి చెప్పాన్నేను "సార్! అన్నయ్యగారి సినిమాలకి రెగ్యులర్ సినిమా ప్రేక్షకుల కన్నా ఎక్కువమంది అభిమానులే ఉంటారు. వాల్లెలాగూ ఈయన సినిమాల గురించి నెగిటివ్ గా మాట్లాడరు. ఇంక వెయ్యిమందిలో ఒకడో, ఇద్దరో లేదా మిగతా హీరోల అభిమానులో ఇలా అన్నా మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. అదీ కాక, మన సినిమా బావుంది - 'బాలేదు' అనే చాన్స్ జయంత్ గారు సినిమాలో ఎక్కడా ఇవ్వలేదు - ఇంక డౌటెందుకు?" అన్నాను. నాగబాబు గారు చిరంజీవిగారికి ఇలాగే కన్వే చేశారో లేదో తెలీదు గానీ ఆ తర్వాతే ప్రెస్ మీట్ పెట్టి టైటిల్ ఎనౌన్స్ చేశారు. నా కాన్ఫిడెన్స్ లాగే ఆ సినిమా బాగా ఆడింది (125 రోజులు) - అంజనా ప్రొడక్షన్స్ లో మొదటి కమర్షియల్ హిట్ సినిమా అయింది. అభిమానం కొద్దీ చిరంజీవి గారు పరిశ్రమలో నా గురించి చేసిన ప్రచారమే నాకు మొదటిసారి దర్శకత్వం చేయడానికి అనేక అవకాశాలనుతెచ్చిపెట్టింది. అందులో నేనెంచుకున్నదే ఎమ్మెస్ రాజుగారి 'మనసంతా నువ్వే'. అలా, నేను దర్శకుణ్ణవడానికే ఇండస్ట్రీకి వచ్చానని గుర్తించిన హీరో బాలకృష్ణ గారు అయితే, నాకు అసోసియేట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చిన హీరో చిరంజీవి గారు.





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
film chances for youth