Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deshabhashalandu thelugu lessa

ఈ సంచికలో >> శీర్షికలు >>

తప్పించుకోలేని మొహమ్మాటాలు - భమిడిపాటి ఫణిబాబు

tappinchukoleni mohamaataalu

అసలు మొహమ్మాటం అంటేనే, నచ్చినా నచ్చకపోయినా భరించాలి కదా, మళ్ళీ ఇందులో ఈ "తప్పించుకోలేని" అనగా ఏమి, అనే సందేహం తప్పకుండా వస్తుంది అందరికీ. కొంతమందుంటారు, అసలు ఈ మొహమ్మాటమనేదేమిటో కూడా తెలియని ప్రాణులు, వాళ్ళకి ఏ పట్టింపూ ఉండదు. డంకా బజాయించి చెప్పకలిగే ధైర్యం ఉన్నవాళ్ళు, అవతలివాడు ఏమనుకుంటే ఏమిటిలే అనుకునేవారన్నమాట. ప్రస్థుతం ఈ వ్యాసానికి శీర్షికగా పెట్టబడిన "తప్పించుకోలేని" మొహమ్మాట బాధితులగురించన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేది.

చాలామంది ఈ మొహమ్మాటాల ధర్మమా అని ఇరుకులో పడిపోతూంటారు. పాపం ఏమీ చెప్పలేరూ, అధవా చెప్తే అవతలివారు ఏమనుకుంటారో అనే భయం మూలాన దిగమింగేసుకుంటూంటారు. ప్రతీవారూ ఏదో ఒక సందర్భంలో ఈ మొహమ్మాటాలకి బలైపోయినవారే. కొంతమంది ఓ కొత్త విషయం అంటే మానవ స్వభావాల విషయంలో ఏదో నేర్చుకున్నామని అనుకుంటారే కానీ, వారి మనస్సులోఉండే in built మొహమ్మాటమనేది ఉందే, అది మాత్రం చెప్పాపెట్టకుండా బయటకొచ్చేస్తూంటుంది. దానితో మళ్ళీ ఎక్కడున్నావే గొంగళీ అంటే.... అన్న సామెతలాగ, ఈ మొహమ్మాటమూ, ఈయనా జంటకవుల్లాగ జీవితం లాగించేస్తూంటారు. పాపం ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాడు, ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలీ అని. కానీ లాభం మాత్రం శూన్యం.

ఏదో ఆఫీసులో పనిచేసే స్నేహితుల ఇళ్ళకి వెళ్ళాల్సొస్తుంది, సరీగ్గా ఇలాటిచోట్ల చూస్తూంటాము, ఈ వెళ్ళినవారిని చూసి, ఎవరింటికైతే వెళ్ళేరో ఆ దంపతులు మొహంమీద ఎక్కడలేనీ ఆనందం పులిమేసికుని, ( లోపల్లోపల ఎంత తిట్టికుంటున్నా సరే)  ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ... అంటూ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఏదో కొద్దిరోజులక్రితమే, వారి అబ్బాయిదో, అమ్మాయిదో పెళ్ళి అయిందనుకుందాము, ఇంక ఈ వచ్చినవారి పని అయిపోయిందే. ఆ ఇంటి ఇల్లాలు, ఏదో కాఫీ, టిఫినూ తయారుచేయడానికి వంటింట్లోకి వెళ్తుంది. ఇదివరకటిరోజుల్లో అయితే, పెళ్ళిళ్ళలో ఏదో మంగళసూత్రం కడుతున్నప్పుడో, లేదా మధుపర్కాలూ, మెళ్ళో కర్పూరపు దండలతోనో ఓ ఫొటో ఉండేది.

కానీ కాలక్రమేణా, ఫొటో బదులు, ఫొటోలు తీయిస్తున్నారు.వాటన్నిటినీ ఓ ఆల్బం లో అతికించేసి, ఓ రెండు మూడు వాల్యూమ్ములో,  మొత్తం మూడు కాపీలు తయారుచేసి ఈ పెళ్ళికొడుకు తల్లితండ్రులకి ఒక కాపీ, పెళ్ళికూతురి వాళ్ళకి ఓ కాపీ, కొత్తదంపతులకి ఒక కాపీ బట్వాడా చేస్తారు. ఈ 'తప్పించుకోలేని' మొహమ్మాటస్థులు, ఇందులో ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ అయిదారుకేజీల బరువుండే మూడు వాల్యూమ్ముల ఆల్బం చూడ్డంలో ఇరుక్కుపోతారు.

ఆ ఫొటోల్లో ఉన్నవారు ఎవరో వీళ్ళకి తెలియకపోవడం మాట అటుంచి, తెలుసుకోవడంలో కూడా అంత ఆసక్తిఉండకపోయినా, ఈ ఆల్బం ల దాడినుంచి తప్పించుకోలేరు. వంటింట్లో, ఆ ఇంటావిడ కాఫీ టిఫిన్లు తయారుచేస్తున్నంతసేపూ, ఈ వచ్చినవాళ్ళు చచ్చినట్టు చూడాల్సిందే. పైగా స్కూళ్ళలో యూనిట్ టెస్టుల్లోలాగ, మధ్యమధ్యలో, వీళ్లెవరూ, వాళ్ళెవ్వరూ అంటూ ప్రశ్నలు కూడా వేస్తూండాలి. అలా వేయకపోని పక్షంలో "పనికి ఆహారం" పథకంలో, టిఫినూ, కాఫీ క్యాన్సిలైపోతాయి. సాంకేతిక అభివృధ్ధి ధర్మమా అని, ఈమధ్య ఆల్బమ్ముల స్థానంలో విడియో సీడీ లు వచ్చాయి. ఓ సీడీ పెట్టేసి, రిమోట్ చేతికందకుండా, ఓ ప్లాస్మా టీవీ ముందర కూలేస్తారు ఈ వెళ్ళినవాళ్ళని.

మధ్యమధ్యలో ఓమాటు తొంగిచూస్తూ...  విశ్వాసపాత్రంగా ప్రశ్నలు అడగడం మూలాన, ఆ ఇంటి ఇల్లాలు, ఈ "త.మొ.బా." ( తప్పించుకోలేని మొహమ్మాట బాధితులు) లకి , ఓ ప్లేటులో తినడానికీ, ఓ కాఫీ కూడా ఇస్తారు. అదృష్టం బాగుంటే మారు కూడా అడగొచ్చు. మారడిగినప్పుడు, బాగుందంటే మళ్ళీ వేస్తారేమో అని భయం, వద్దంటే, "అదేమిటీ బాగోలేదా మా ఇంట్లో చేసిందీ.." అంటారేమో అని భయం. మళ్ళీ ఇక్కడకూడా మొహమ్మాటమే. ఆ ఇంట్లో చిన్నపిల్లల్లాటివారున్నారంటే ఇంకో గొడవ-- వాళ్ళకొచ్చిన విద్యలన్నీ మన ముందర అరంగేట్రం చేయిస్తారు. ఇంత హైరాణా భరిస్తే వెళ్ళేటప్పుడు ఓ తాంబూలం, అప్పుడప్పుడు ఓ బ్లౌజు పీస్ బోనస్ గా కూడా దొరకచ్చు.

ఏదో తనూ, భార్యా బయటకు తిరగడానికి ఉంటుంది కదా అని, ఓ స్కూటరో బైక్కో కొనుక్కుంటే వచ్చే బాధలు ఇంకోరకం. ఏ పక్కవాడో వచ్చి, మాస్టారూ నా స్కూటరు సర్వీసింగుకి ఇచ్చానూ, మీ బండి ఓసారి ఇస్తే  బజారుకి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను ప్లీజ్, అంటాడు. ఈ పెద్దమనిషేమో కాదనలేడూ, సరే అనడం తరవాయి, ఝూమ్మంటూ వెళ్ళిపోయి, ఏ సాయంత్రానికో ఆ బండి తిరిగిస్తాడు. మర్నాడు ఆఫీసుకెళ్ళడానికి బండి స్టార్ట్ చేస్తే తెలుస్తుంది, పెట్రోల్ రిజర్వ్ లోకి వచ్చేసిందని, ఇదేమిటీ మొన్ననే కదా ట్యాంకు ఫుల్ చేయించానూ అనుకుంటాడు. అప్పుడు తడుతుంది, ఓహో నిన్న ఆ పక్కాయన తీసికెళ్ళేడుగా, ఆయన నిర్వాకమన్నమాట.. అని. పోనీ అలాగని తన బండి ఇంకొకరికి ఇవ్వనూ అని చెప్పగలడా, అబ్బే మొహమ్మాటం. చివరకి ఆ ఇంటావిడే ఈయన rescue కి వచ్చి, మా ఆవిడకి ఇష్టం ఉండదండీ అని నామీద పెట్టేయండి అంటుంది.

ఏ కొడుకుదో, కూతురిదో పెళ్ళికి  శుభలేఖలు ఇచ్చేటప్పుడు కూడా  ఇలాటి అనుభవాలు ఎదురౌతూంటాయి. ఎవరింటికో వెళ్తారు, వారిని పెళ్ళికి పిలవడానికి, అకస్మాత్తుగా అక్కడ, ఈయనకి అంతంతమాత్రంగా పరిచయం ఉన్న పెద్దమనిషి ఒకరు కనిపిస్తారు. ఒకర్ని పిలిచి ఇంకోరికి కార్డు ఇవ్వకపోతే బాగుండదేమో అనుకుని, అక్కడికక్కడే, ఇంకొకరి పేరున్న కార్డు మీద కొట్టేసి ఈయన పేరు వ్రాస్తాడు. ఇలా ప్రతీవారింటికీ వెళ్ళగా, అక్కడ తటస్థపడ్డ ఇంకోరికి  ఇచ్చుకుంటూ పోతే, చివరకు తడిపిమోపెడవుతుంది. వీటినే తప్పించుకోలేని మొహమ్మాటాలంటారు. ఇలాటివే వివిధరకాలైన మొహమ్మాటాలనుండీ బయటపడలేకున్నాము.  ఏమాత్రం sensitivity ఉన్నవాళ్ళకైనా ఇలాటివి తప్పవు.

మరిన్ని శీర్షికలు
saametha by bannu