Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami vivekananda biography first part

ఈ సంచికలో >> శీర్షికలు >>

అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

13. ఏ కులజుడేమి యెవ్వడైననేమి

ఏ కులజుడేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడే హరినెఱిగినవాడు

పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ తత్పరుడు కాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులు తానేయని భావించువాడు

నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పర బుద్ధి దగిలినవాడు
కర్మమార్గములు గడవని వాడే
మర్మమై హరిభక్తి మఱవని వాడు

జగతిపై హితముగా జరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ తెలిసినవాడే
తగిలి వేంకటేశు దాసుడయినవాడు(01-292)

తాత్పర్యము

అక్కడ అనగా అంతరాత్మలో హరిని సంపూర్ణముగా తెలుసుకొన్నవాడు ఏ కులములో పుడితే ఏమి? ఎవరైతే ఏమి? (కులమతాలకు అతీతుడని భావం)

సత్య సంపద కలిగి అందరి హృదయాలలో వ్యాపించిన వాడు, ఇతరులను నిందించుటకు ఆశ లేనివాడు(ఇష్టం లేనివాడు), అపురూపముగా అన్ని జీవులయందు దయ చూపించువాడు, ఇతరులు కూడా తనలాంటి వారని భావించేవాడు ఏ కులములో పుడితే ఏమి? ఎవరైతే ఏమి?

పవిత్రుడై తపము, సంతోషము, ఆస్తికత్వము, దానము, భగవదర్చన, వేదాంతశ్రవణము, లజ్జ, మతి, జపము, వ్రతము మొదలైన నియమములతో మనస్సును తన అధీనములో ఉంచుకొనువాడు, ధర్మము పాటించు వాడు, కర్మ మార్గములు వదలని వాడు, జీవ స్థానమైన హరి భక్తిని ఎప్పుడూ మరిచిపోని వాడు. ఏ కులములో పుడితే ఏమి? ఎవరైతే ఏమి?

ఈ ప్రపంచములో ఇతరులకు మేలు చేస్తూ తిరిగేవాడు, ఆలోచనలో కూడా ఇతరుల మీద పగ లేక బతికేవాడు, తామరాకు మీద నీటి బొట్టులా, అన్నింటితో కలిసి ఉంటూ కూడా అన్నింటితో కలవనివాడు, ప్రతి విషయము ఆత్మకు సంబంధించినదని తెలిసినవాడు, వేంక టేశ్వర స్వామికి ఆసక్తితో దాసుడైనవాడు ఏ కులములో పుడితే ఏమి? ఎవరైతే ఏమి?

 

విశేషాలు

ఏ కులజుడేమి యెవ్వడైననేమి
శ్రీ హరిని అంతరాత్మలో సంపూర్ణముగా తెలుసుకొన్నవానికి కులమతాలతో సంబంధము లేదు. అతడు ఏకులములో పుట్టినా పూజనీయుడు. శ్రీ హరిని రామునిగా భావించి అతనిని గురించి సంపూర్ణముగా తెలుసుకొని రామాయణము రచించిన వాల్మీకిది బోయ కులము . అద్భుతమైన పద్యాలు రచించి చిరస్థాయిగా రామాయణాన్ని రచించిన మొల్లది కుమ్మరి కులము. హరి భక్తి ఉన్నవారు కులమతాలతో సంబంధము లేకుండా పూజనీయులు.

"రామనామపఠన మహిమచే వాల్మీకి
పరగ బోయ యయ్యు బాపఁడయ్యె
కులము ఘనము గాదు గుణము ఘనంబురా
విశ్వదాభిరామ వినర వేమ!" అని వేమన్న అన్నాడు . ఆగుణమే భక్తి అని అన్నమయ్య తీర్పు. భక్తి కులము కంటే గొప్పది.

పరగిన సత్యసంపన్నుడైన వాడే
సత్యము, అమృతము భారతానికి శరీరంగా చెబుతారు. సత్యము, ఋతము అని రెండు మాటలున్నాయి. సత్యము కంటే ఋతము కొంచెం పెద్ద మాట. ఋతము అంటే పరమ సత్యమును తెలియజేయు విజ్ఞానం. పరమసత్యము శ్రీ హరి. ఆ శ్రీ హరి భక్తి సంపదలలో కెల్లా గొప్ప సంపద. ఆ సంపద కలిగి ఉండటమే అన్నమయ్య పంక్తిలోని సత్య సంపన్నత.

పరనిందసేయ తత్పరుడు కాని వాడు
నడిచే దేవుడు, జగద్గురువులు, చంద్ర శేఖర సరస్వతీ స్వామివారు గ్రంథరచన గురించి ఒకసారి ప్రస్తావిస్తూ "1. గ్రంథ రచన అహంకారాన్ని పెంచకూడదు. 2. పరనింద చేయ కూడదు.3. గ్రంథ రచనతో ధనార్జన చేయకూడదు" అని మూడు నియమాలు చెప్పారు. (మా స్వామి- 10వ అధ్యాయము).దేవతలలో కూడా ఈ పరనింద జాడ్యం ఉందని కేనోపనిషత్ చెబుతోంది. ఆ జాడ్యాన్ని దుర్గమ్మ తొలగించిందట.
శరీరంలోని ఒక అవయవం ఇంకొక అవయవాన్ని అవయవాన్ని బాధించడం అసహజమైన చర్య. ఆ విధంగానే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి భగవంతుని అవయవాలు. ఒకరిని నిందించి బాధపెడితే తన శరీరంలోని ఒక అవయవం ఇంకో అవయవాన్ని బాధపెట్టినట్లే. కనుకనే అన్నమయ్య ఎట్టి పరిస్థితులలోనూ పరనింద చేయకూడదంటున్నాడు. హరి భక్తుని లక్షణాలలో పరనింద చేయకపోవటం కూడా ఒకటి.

పరులు తానేయని భావించువాడు
ఇది "ఆత్మవత్ సర్వ భూతాని, సర్వత్ర సమదర్శినః" అను గీతా వాక్యాలకు దగ్గరగా ఉన్న అన్నమయ్య అనువాదం. సమదృష్టితో అందరిని చూడటమనే వాక్యానికి రెండు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతరులు ఏవి చేస్తే నీ మనస్సుకు కష్టం కలుగుతుందో, అది ఇతరులకు నువ్వు చేయకు .ఎందుకంటే నీకు బాధ కలిగినట్లే పరులకు బాధ కలుగుతుంది కాబట్టి. కనుక పరనింద, హింస లాంటి చెడ్డ పనులు మానుకొని నీవలె ఇతరులను చూసుకొమ్మని ఇదే సమదర్శిత్వమని ఒక వాదన.

ఇక రెండో వాదన. సమదర్శి అంటే తనలో దేవుడిని, దేవుడిలో తనని, అన్ని జీవులలో దేవుడిని చూసేవాడని అర్థం. సమదర్శనుడంటే సమ వర్తనుడు కాదు. భార్య, తల్లి, కూతురు ముగ్గురూ స్త్రీలే. కాని ముగ్గురితో సమానంగా ఉండటం కష్టం. కంచి స్వామి భావాద్వైతం ఉండవచ్చు కాని, క్రియా ద్వైతం ఉండకూడదని హెచ్చరించారు.

కనుక మానవుడు సమదర్శి కావచ్చు. అన్ని భూతాలలో దేవుడున్నాడని భావించు. కాని అన్ని భూతాలయందు సమానంగా వర్తించకూడదు. అందుకే అన్నమయ్య చాలా జాగ్రత్తగా అన్నింటిలోను శ్రీహరి ఉన్నాడు కనుక పరులు తానే అని భావించమన్నాడు.

మర్మమై హరిభక్తి మఱవని వాడు
వనే చరామో వసు చాహరామో
నదీ స్తరామో న భయం స్మరామ:
ఇతీరయన్తో విపినే కిరాతా
ముక్తిం గతా రామపదానుషంగాత్|
అని ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. దీని అర్థం ఇది.

వనే చరామ :- మేము వనాలలో తిరుగుతాం.
వసు చాహరామ :- ధనాన్ని అపహరిస్తాం.
నదీ స్త రామ:- నదులను దాటుతాం
న భయం స్మరామ :- మాకు భయమంటూ ఏమీ లేదు

అని అడవులలో ఉండే ఆటవికులు ఆన్నారు. ఆ శ్లోకంలో ప్రతి పాదంలో "రామ" అనే పదం ఉంది.నాలుగు సార్లు రామ నామాన్ని తెలియకుండానే పలికినందుకు ఆ ఆటవికులకు ముక్తి లభించిందట. దేవుని నామాన్ని పలకటం వలన ఆ శక్తి లభిస్తుంది. తెలియక హరి నామము చేసిన ఆటవికులు తరించారు. తెలిసి హరి భక్తిని, హరి నామస్మరణను కాదనకూడదని అన్నమయ్య హితబోధ.

ఏకులములో పుట్టినా హరి భక్తి ఉన్నవాడు అందరి కంటే శ్రేష్ఠుడు అనే ఈ కీర్తన భావం శిరోధార్యం. స్వస్తి.

మరిన్ని శీర్షికలు
gurajaada apparao