Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
'satyabhama' book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

దేశ భాషలందు తెలుగు లెస్స! - టీవీయస్.శాస్త్రి

deshabhashalandu thelugu lessa

మా మేనత్త నేను డాక్టర్ ని కావాలని తెగ ముచ్చటపడింది. "మన వంశంలోనే వైద్యముంది. మీ తాతయ్య పేరొందిన ఆయుర్వేద వైద్యుడు. నాడిని చూసి వ్యాధిని నిర్ధారించేటంతటి ప్రతిభావంతుడు ఆయన. నీవు కూడా డాక్టర్ అయి, ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలని" తెగ వాపోయింది. కానీ నేను డాక్టర్ ని కాలేకపోయాను. బ్యాంకులో చేరాను. మొదటినుండి నాకు తెలుగు భాష మీద అమితమైన అభిమానం, మక్కువ.

"ఎప్పుడూ ఏవో పుస్తకాలను చదవకపోతే, మన పిల్లలకే పాఠాలు చెప్పి, వాళ్ళను చదివించవచ్చు కదా!" అని నా భార్య హుకుం జారీ చేసేది. పిల్లలకు పాఠాలను చెప్పటానికోసం కాసేపు చండామార్కుడి అవతారమెత్తే వాడిని. వెంటనే పిల్లలను పిలిచి,"మీ తెలుగు వాచకాలను తెరచి, తెలుగు పాఠాలను చదవండని" పిల్లకు గట్టిగా చెప్పేవాడిని. "ఎప్పుడూ తెలుగు  పాఠాలేనా! మరేదైనా చెప్పండి" అని పిల్లలు బతిమాలేవారు. వారి బిక్క ముఖాలను చూసి జాలేసి మళ్ళీ మామూలు అవతారంలోకి వచ్చేవాడిని. పిల్లలు పక్కకుపోయి ఇలా అనుకోవటం "నాన్న తెలుగు మాస్టారు కావలసింది, పొరపాటున మన అదృష్టం బాగుండి, బ్యాంకు ఉద్యోగంలో చేరారు. పంతుళ్ళకు జీతాలు కూడా సరిగా రావు. మిగతా పంతుళ్ళు అయితే ట్యూషన్స్ చెప్పుకునేవారు. తెలుగు మాష్టారికి ఆ అవకాశం కూడా లేదు. నాన్న తెలుగు మాష్టరైతే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో!" అని వాళ్ళు అనుకోవటం నా చెవినపడింది. నిజమే మరి! తెలుగుదేశంలో తెలుగు పరిస్థితి అది. తెలుగు భాష దీనస్థితిని ఆ చిన్నవయసులోనే పసిగట్టిన ఆ పసివాళ్ళ దూరదృష్టి శ్లాఘనీయం.

ఆ తరువాత అనేకసార్లు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి, అకాడెమీలు వచ్చాయి, విశ్వవిద్యాలయాలు వచ్చాయి. అయినా సరే! ఈ తేనెలూరే తియ్యని భాషను ఆస్వాదించటానికి తల్లి తండ్రులు, వారి పిల్లలు ఏ మాత్రం ఆసక్తి చూపించకపోవటం బాధాకర విషయమే! మధుమేహ వ్యాధి ఎక్కువగా ఉండటం వలన తియ్యదనం పనికి రావటం లేదేమో! కాలగమనంలో మమ్మీ, డాడీ సంస్కృతి పూర్తిగా వచ్చింది. విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. చిన్నప్పుడు మేము చదువుకున్నాం, ఇప్పడు పిల్లలు చదువు'కొంటున్నారు'. కార్పొరేట్ విద్యాలయాలు వచ్చాయి. భవిష్యత్తులో మన పిల్లలు ఏమౌతారో కట్టుకథలు చెప్పి, తల్లితండ్రులను తమ మాయాజాలంలోకి లాగేసాయి అవి. స్కూల్ లో తెలుగు మాట్లాడితే టీచర్లు తంతారు. ఇంట్లో తెలుగు మాట్లాడితే తల్లితండ్రులు తంతారు. ఆఖరికి పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే, పూర్వం పిల్లలు అన్నం తినక మారం చేస్తే అన్నమయ్య కీర్తనైన 'చందమామ రావే, జాబిల్లి రావే' అని పాడుతూ పిల్లలకు గోరుముద్దలు పెట్టేవారు. ఆ పాటలోని మాధుర్యానికి వారు మైమరచి అన్నం తినేవారు. మరి నేటి పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. రోజు మొత్తం మీద కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ ప్రతి ఇంట్లో హోరెత్తిస్తుంది. అది చూస్తూనే అన్నం తింటారు, లేకపోతే తినరు. పిల్లలు అలా ఇంగ్లీష్ ఛానెల్ చూడటం తల్లితండ్రులకు కూడా ఆనందమే! తమ పిల్లలు ఆంగ్ల భాషలో ప్రవీణులౌతున్నారని వారి సంబరం.

ఈ తెగులు తెలుగు దేశమంతా వ్యాపించింది. ఈ తెగులును ఎలా నిర్మూలించాలి? పోనీ కనీసం సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగును ఎన్నుకుంటున్నారా, అంటే అదీ లేదు. CBSE విద్యావిధానం వారు హిందీని/సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్ గా నిర్బంధం చేసారనుకుంటాను. మరి మిగిలిన కార్పొరేట్ విద్యాలయాలు సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్ గా నేర్చుకోమని పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. వ్యాపార సంస్థలకు, సంస్కృతి, సంస్కృతం పట్ల వ్యామోహం కలగటం పట్ల కొంచెం ఆనందం కలిగి, ఒక కార్పొరేట్ విద్యాలయ అధికారిని అభినందించాను. అందుకు ఆయన స్పందించిన తీరు నన్ను అబ్బురపరచింది. "సంస్కృతి, సంస్కృతం మీద మాకెందుకు మోజు? ఆ సబ్జెక్ట్స్ తీసుకుంటే మార్కులు ఎక్కువ వస్తాయి. సంస్కృతం ప్రశ్నలకు తెలుగులో కూడా సమాధానాలు వ్రాసే వెసులుబాటుంది" అన్నాడు. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు దేశభాషలన్నిటిలోను భ్రష్టులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోనీ వారు మాట్లాడే ఇంగ్లీష్ భాష చూద్దామా! అది ఇంకా దారుణంగా ఉంటుంది. వారు మాట్లాడే సమయం, సందర్భాన్నిబట్టి వారి భావాలను మనం అర్ధం చేసుకోవాలి. అంతకన్నా గత్యంతరం లేదు. అధికార భాషా సంఘాలున్నాయి. తెలుగుభాషా ప్రేమికులనే అధ్యక్షులను చేస్తున్నారు. అయితే, ఆ సంఘానికి నిధులుండవు, అధికారాలు అసలుండవు! ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, కొంతకాలానికి మనం కూడా తెలుగు అక్షరాలను మరచిపోయి, తెలుగును ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో వ్రాయటం మొదలు పెడతామేమో! ఇప్పటికే చాలామంది దీనిని అనుసరిస్తున్నారు. ఈ దారుణ పరిస్థితి నుండి తెలుగు తల్లిని రక్షించుకోవటం ఎలా? ఏ ప్రభుత్వమో, అధికారో ఈ పనిని చేయలేరు. ICUలో ఉన్న మన అమ్మను మనమే రక్షించుకోవాలి!
 

సాధ్యమైనంత వరకూ తెలుగు వారందరం తెలుగులోనే మాట్లాడుదాం, తెలుగులోనే వ్రాద్దాం. దేశ భాషలందు తెలుగు లెస్స!

 

మరిన్ని శీర్షికలు
tappinchukoleni mohamaataalu