Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

Raja Music Muchchatlu

జూలై 26 న చెన్నై లో జరిగిన రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డులలో కొన్ని హైలైట్స్ :
చెన్నై ట్రేడింగ్ సెంటర్ లో జరిగిన ఈ అవార్డుల ప్రాంగణంలోకి ఎస్పీ బాలు అడుగుపెట్టగానే వచ్చిన అప్లాజ్ అంతా ఇంతా కాదు. చిన్న గాయనీ గాయకుల దగ్గర్నుంచి ఇతర భాషల గాయనీ గాయకులు, వాద్య బృందం ఇలా పాటను అభిమానించే ప్రతి ఒక్కరూ ఆయనకి నమస్కరించే వారు, కరచాలనం చేసేవారు, వారి కళ్ళలో తొంగి చూసిన ఆనందం గమనిస్తే - మన ఆంధ్రదేశంలో బాలూ గారికిస్తున్న గౌరవం ఏమాత్రం అని ఆత్మవిమర్శ చేసుకోకతప్పదు. మన తెలుగువాడైనందుకు చిన్నచూపా, మనవాడే కదా అన్న తేలిక భావనా, ఏమిటొ తెలియని అర్ధం కాని అయోమయంలో పడిపోయాను.

ఇక ప్రోగ్రామ్ లో బాలూ గారు తెలుగు సెక్షన్ కి సంబంధించి 'వస్తున్నా బాబా వస్తున్నా' (షిరిడీ సాయి) పాటకి ఉత్తమ గాయకుడిగా అవార్డుని అందుకోవాలి. అందుకే వచ్చారు కూడా. ఇంతలో తమిళ సెక్షన్ నుండి 'సంగీత సామ్రాట్ ' అవార్డ్ ని అనౌన్స్ చేశారు. బాలూ గారు ఓ రకమైన తీపి ఇబ్బంది (స్వీట్ ఎంబరాసింగ్ పొజిషన్) లో పడిపోయారు. తను ఏ పని మీద వచ్చానో చెప్పి తన అర్హత తనకు తెలుసంటూ ఈ 'సంగీత సమ్రాట్' అవార్డ్ ని మృదువుగా తిరస్కరించడానికి ప్రయత్నించారు. కనీసం అవార్డ్ పేరుని 'సంగీత సేవక్ ' అనైనా మార్చడంటూ బ్రతిమాలినంత పని చేశారు.

ఆ రోజు - యాంకర్ గా వ్యవహరించిన దివ్య దర్శిని గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. షార్ట్ కట్ లో ఆమె ని ' డి.డి.' అని అంటారుట.

ఆమె యాంకరింగ్ చేసే తీరు, ఎంత వేగంగా పలికినా ఎక్కడా గతి తప్పని ఆ మాట స్పష్టత, అచ్చమైన తమిళాన్ని ఉచ్చరించే తీరు చూస్తే తమిళం రాని వాళ్ళక్కూడా ఆ  భాష పట్ల గౌరవం , మక్కువ కలిగేలా వుంది. ఒక విధంగా ఆమెని చూసి మన యాంకర్లు నేర్చుకోవలసింది చాలా వుందనిపించించింది.

అప్పుడు ఆమె అందుకుంది. బాలూ గారికి 'సంగీత సమ్రాట్' అవార్డ్ ఎంత కరెక్టో ఆమె చెప్తున్న తీరుకి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు ప్రేక్షకులు. 'మా జీవితాల్లో మీ పాటకి ఎంత గొప్ప స్థానం వుందో మీరు ఊహించలేరు సార్' అంటూ ఆర్ద్రత తో కూడిన  కళ్ళలో సన్నటి కన్నీటి పొర తొణికిసలాడుతుండగా చేతులు జోడించి మరీ చెప్తుంటే  బాలూ గారు కూడా కదిలిపోయారు. ఆ అవార్డ్ ని తీసేసుకున్నారు.

ఆ తర్వాత ఏ.ఆర్. రెహమాన్ కి గ్లోబల్ పీస్ అవార్డ్ ని ప్రకటించారు. ఆయన ఆ అవార్డ్ ని కోటి గారి చేతుల మీదుగా అందుకోవడం రెహమాన్ వినమ్రత కి నిద్దర్శనం. రెహమాన్ 'దిలీప్' గా వున్న తొలి రోజుల్లో  కోటి దగ్గర పని చేశాడన్న విషయం ఈ తరంలో చాలా మందికి తెలియదు.

ఈ అవార్డులు కాక చెప్పుకోదగ్గవి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు. మన తెలుగు సెక్షన్ కి సంబందించి అలనాటి గాయని కె. జమునారాణి గారికి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆవిడ పాటల్ని పాప్ గాయని ఉషా ఉతుప్  పాడి వినిపించారు.

ఈ ఆవార్డుల కార్యక్రమం తెలుగు  వెర్షన్ లో యాంకర్ గా ఉదయభాను కనిపిస్తుంది. ఆ వెర్షన్ మా టీవీలో ఈ నెల 18 న సాయంత్రం 4 తర్వాత  ప్రసారమవుతుంది.  దివ్య  దర్శిని యాంకర్ గా కనిపించే తమిళ వెర్షన్ 25  సాయంత్రం  విజయ్  టీవీ  లో  ప్రసారమవుతుంది.


రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam