Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

మనసు చివుక్కుమనిపించే మనసున మనసై

మంచి తెలుగు సినిమా పాటల లిస్ట్ అంటూ తయారు చేస్తే 'డాక్టర్ చక్రవర్తి ' (1963 )సినిమాలోని 'మనసున మనసై - బ్రతుకున బ్రతుకై ' పాటని ఉదహరించకుండా ముందుకెళ్ళడం కష్టం. శ్రీశ్రీ పేరిట హెచ్.ఎమ్.వి. వారు విడుదల చేసిన ఓ క్యాసెట్ కి 'మనసున మనసై ' అనే పేరు పెట్టుకున్నారంటే తెలుగు సంగీత ప్రియుల హృదయాలలో ఆ పాట ఎంతగా హత్తుకుపోయిందో ఊహించుకోవచ్చు.

అందుకు కారణం సాహిత్యం కావొచ్చు, సంగీతం కావొచ్చు, గానం కావొచ్చు, నటన కావొచ్చు, చిత్రీకరణ కావొచ్చు .... ఇవన్నీ మనవే అన్న ఫీలింగ్ కూడా కావొచ్చు. కాకపోతే ఈ పాట ట్యూన్ కి ఒరిజినల్ ట్యూన్ బెంగాలీ లో వుందంటే నమ్మబుద్దెయ్యదు. మనసు చివుక్కు మంటుంది .... కానీ ఇది పచ్చి నిజం.

1955 లో బెంగాలీ లో 'శాప్ మోచన్' అనే చిత్రం వచ్చింది. అందులో హీరో ఉత్తమ్ కుమార్ కి సంగీత దర్శకుడు, గాయకుడు హేమంత్ కుమార్ స్వరపరిచి పాడిన 'బోషె ఆచి' అనే పాట మన 'మనసున మనసై' పాటకి మూలం. యూ ట్యూబ్ లో shaap mochan - Boshe achi అని వెతికి చూడండి. మీకే తెలుస్తుంది.

పకడో పకడో

ఈ 'బండరాముడు' కవర్ మీద వున్న ఎన్టీయార్ ఫోటో 'శభాష్ రాముడు' సినిమాలోనిది. సావిత్రి ఫోటో ఎందులోనిదో పోల్చుకోవడం కష్టం.

'బండరాముడు' సినిమాలో సావిత్రి, ఎన్టీయార్ గెటప్పులు ఎలా వుంటాయో దిగువన జత పరిచిన ఫొటోలు చూడండి. అర్ధమైపోతుంది.

పేరు పడని రచయితలు

వెంకటేశ్ హీరోగా దర్శకుడు ఎన్. శంకర్ రూపొందించిన జయం మనదేరా సినిమాలో సంగీతానికి సంబంధించి ఓ రెండు విషయాల గురించి చెప్పుకోవాలి. ’హిందుస్తాన్ లో అందరికంటే అందం నీదేలే' పాటొకటి వుంది. ఆడియో క్యాసెట్ కవర్ మీద ఆ పాటను రాసిన రచయిత పేరు వుండదు. ఆ ఇన్ లే కవర్ మీద గల పాటలన్నిటికీ రచయితల పేర్లు వుంటాయి.  ఈ ఒక్క పాటకే వుండదు. ఈ పాటను రాసింది చంద్రబోస్.

మరొక విషయం ఏమిటంటే ఆడియో క్యాసెట్ మీద వున్న పాటలే కాక ఆ సినిమాలో మరొక పాట కూడా వుంది.  'చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసెనే' అనే పల్లవి తో మొదలయ్యే ఆ పాట వివరాలు ఆడియో క్యాసెట్ మీదే కాదు సినిమా టైటిల్స్ లో కూడా కనిపించవు.  ఆ పాటను రాసింది లెల్లె సురేష్.  పాడింది, స్వర పరిచింది వందేమాతరం శ్రీనివాస్.
 

మరిన్ని సినిమా కబుర్లు
Nayanatara is not a Pregnant