Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

దృవ చిత్ర సమీక్ష

movie review

చిత్రం: ధృవ 
తారాగణం: రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అరవింద్‌ స్వామి, పోసాని కృష్ణమురళి, నవదీప్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: పిఎస్‌ వినోద్‌ 
నిర్మాణం: గీతా ఆర్ట్స్‌ 
నిర్మాత: అల్లు అరవింద్‌, ఎన్‌వి ప్రసాద్‌ 
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి 
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ 
విడుదల తేదీ: 9 డిసెంబర్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

చిన్న చిన్న నేరాలన్నిటి వెనుక పెద్దది వ్యవస్థీకృతమైనదీ అయిన ఓ నేరం ఉంటుందని భావించే ధృవ, ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో నేరాలపై పరిశోధన చేయడం మొదలు పెడ్తాడు. చిన్న చిన్న నేరాల అంతు చూసేందుకు ఐపీఎస్‌ ట్రెయినింగ్‌లో ఉన్నప్పుడే స్నేహితులతో కలిసి ప్రయత్నిస్తుంటాడు. ఒక నేరస్తుడ్ని కొడితే వంద మంది క్రిమినల్స్‌ అంతమవ్వాలన్నది ధృవ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఓ బలమైన శతృవుని ఎదుర్కొంటాడు. అతనే సిద్దార్ధ అభిమన్యు (అరవింద్‌ స్వామి). బలవతుడైన, తెలివైన విలన్‌, అంతే తెలివైన హీరో మధ్య పోరాటమే 'ధృవ'. ఈ పోరాటంలో ధృవ ఎదుర్కొనే సమస్యలేంటి? సమ ఉజ్జీలైన నేరస్తుడు, ఐపీఎస్‌ అధికారి తలపడే క్రమంలో ఎవరు పైచేయి సాధిస్తారు? అన్నది తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

రామ్‌చరణ్‌ కొత్తదనంతో సినిమాలు చేయాలనుకున్నా, కమర్షియల్‌ మాస్‌ హీరో అనే ఇమేజ్‌ ఆయన్ని అలాగే అంటిపెట్టుకుని ఉంది. ఆ ఇమేజ్‌ కారణంగా చరణ్‌ 'గిరి' దాటి బయటకు రావడం చాలా అరుదు. ఉన్నంతలోనే కొత్త తరహా సినిమాల్ని ఎంచుకుంటున్నాడు. ఈసారి గిరి నుంచి బయటకు వచ్చాడు. కథ, కథనం మీద ఫోకస్‌ పెట్టాడు. ఆ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు. సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్‌ మారిపోయింది. డైలాగ్‌ డెలివరీలో కొత్తదనం కనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమాలో కొత్త రామ్‌చరణ్‌ని చూస్తాం. సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో, మైండ్‌ గేమ్‌లో ఆరితేరినట్లు కనిపించిన చరణ్‌కి హేట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేం. డాన్స్‌లు, యాక్షన్‌లో చరణ్‌ ఎప్పుడూ సూపర్బే.

హీరోయిన్‌ విషయానికొస్తే, తనవరకూ తెరపై కనిపించేది తక్కువే అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆకట్టుకుంది. పాటల్లో అయితే రెచ్చిపోయింది. అందాల ప్రదర్శనతో హల్‌చల్‌ చేసింది. ఈ సినిమాకి గ్లామర్‌ పరంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందచందాలు అదనపు ఆకర్షణ అనడం నిస్సందేహం. 
హీరో తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విలన్‌ గురించే. తెలివైన, బలవంతుడైన విలన్‌ పాత్రలో అరవింద్‌ స్వామి ఒదిగిపోయాడు. అరవింద్‌ స్వామి కాకుండా ఇంకొకర్ని ఈ పాత్రలో ఊహించుకోలేం. 'తని ఒరువన్‌'లోనూ ఈయనే నటించడంతో, 'ధృవ'లో నటించడం నల్లేరు మీద నడకే అయిపోయింది. మిగతా పాత్రధారుల్లో పోసాని కృష్ణమురళి బాగా నవ్వులు పూయించాడు. మిగిలినవారంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.

కథ కంటే కథనమే ఈ సినిమాకి ఆయువు పట్టు. రీమేక్‌ సినిమా అయినా దర్శకుడు సురేందర్‌రెడ్డి తనదైన స్టైల్‌లో స్క్రీన్‌ప్లేని మరింత రేసీగా మార్చడంలో సఫలమయ్యాడు. రీమేక్‌ చేయడం అంత ఆషామాషీ కాదు, ఒరిజినల్‌కి ఏమాత్రం తగ్గకుండా తీయాలి, లేదంటే తేడా కొట్టేస్తుంది. అందుకే సురేందర్‌రెడ్డి చాలా జాగ్రత్తపడ్డాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరమనిపిస్తుందంటే దానికి కారణం కథ, స్క్రీన్‌ప్లే పరంగా ఉన్న 'నెమ్మది'. అది అర్థం చేసుకోదగ్గదే. పాటలు వినడానికన్నా, తెరపై చూడ్డానికి చాలా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అస్సెట్‌. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి బాగా హెల్పయ్యాయి. సినిమా రిచ్‌నెస్‌ నిర్మాణపు విలువల్ని చెప్పకనే చెబుతుంది.

ఫస్టాఫ్‌ చాలా ఫాస్ట్‌గా అయిపోతుందంటే స్క్రీన్‌ప్లే రేసీగా ఉన్నట్లే. ఎక్కడా బోర్‌ కొట్టించదు. సీన్‌ సీన్‌కీ సినిమాపై ఆసక్తి రేగుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కి వచ్చేసరికి సినిమాపై ఆసక్తి రెట్టింపవుతుంది. సెకెండాఫ్‌లో హీరో - విలన్‌ మధ్య ఎత్తులకు పై ఎత్తులు ప్రేక్షకుడ్ని సినిమాలో మరింతగా లీనం చేసేస్తాయి. సెకెండాఫ్‌లో అక్కడక్కడా స్లో అయినట్లు అనిపించినా ఓవరాల్‌గా ప్రేక్షకుడు సినిమా మూడ్‌ నుంచి బయటకు రాలేడు. థ్రిల్లింగ్‌ సీన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకుల్ని దర్శకుడు కట్టి పడేస్తే, ఆయా పాత్రల్లో హీరో, విలన్‌, ఇతర పాత్రధారులు ఒదిగిపోవడం ముచ్చటేస్తుంది. స్టైలిష్‌ మేకింగ్‌, చరణ్‌ స్టైలిష్‌ పెర్ఫామెన్స్‌, విలన్‌గా అరవింద్‌ స్వామి ఫ్రెష్‌నెస్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌ ఇవన్నీ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్స్‌. ఓవరాల్‌గా మాంఛి యాక్షన్‌ థ్రిల్లర్‌ని చూసిన ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమాకి జరిగిన ప్రమోషన్‌, ఏర్పడ్డ హైప్‌ నేపథ్యంలో సినిమా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే
'ధృవ' ఇంటెల్లిజెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with ramcharan