నిజాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకోవడమే జగపతిబాబు ప్రత్యేకత. ఒకప్పుడు నటుడిగా క్షణం తీరిక లేనంత బిజీగా సినిమాలు చేసిన జగపతిబాబు, మధ్యలో చిన్న 'గ్యాప్' తీసుకున్నారు. అవకాశాల్లేని సమయమది. మామూలుగా అయితే ఈ విషయాన్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ ఆయన జగపతిబాబు కదా. అందుకే వాస్తవాల్ని వెల్లడించేశారు. మళ్ళీ క్షణం తీరిక లేనంత బిజీ అవుతానా? లేదా? అనుకునేవాడిననీ, ఆ రోజు రానే వచ్చిందని జగపతిబాబు అంటున్నారు.
నిజమే జగపతిబాబుకి ఇప్పుడు ఏమాత్రం తీరిక లేదు. తెలుగు సినిమాలతోనే కాదు, తమిళమూ మలయాళమూ ఆయన్ని ఆహ్వానించింది, అక్కున చేర్చుకుంది. ఇటీవల 'మన్యంపులి' సినిమాలో కన్పించారు జగపతిబాబు. మలయాళంలో ఆయన చేసిన సినిమా అది. దాన్ని తెలుగులోకి డబ్ చేశారు. స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అది తెలుగులో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇంకో వైపున ఒకే గెటప్ తనకూ బోర్ కొట్టేస్తోందనీ త్వరలో కొత్త గెటప్ ట్రై చేస్తానని జగపతిబాబు చెప్పారు. డిమాండ్ పెరిగితేనే రెమ్యునరేషన్ పెరుగుతుందని చెబుతూ అది నిర్మాతలు డిసైడ్ చేస్తారు తప్ప, తాను కాదని అన్నారు. కష్టాన్నీ, టైమ్‌నీ నమ్ముకోబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పే జగపతిబాబు, విలన్ పాత్రల నుంచి విరామం తీసుకునేంత తీరిక కనిపించడంలేదనీ, అయితే మళ్ళీ హీరోగా చేయాలని ఉందని అంటున్నారు. జగపతిబాబుకేంటి, విలన్‌గా అయినా హీరోగా అయినా ఆయన హ్యాండ్సమ్ లుక్‌లో ఏదో ఎట్రాక్షన్ ఉంటుంది. దటీజ్ వెరీ వెరీ స్పెషల్ జగపతి.
|