హీరోలు సినిమా నిర్మాణంలో బాగం పంచుకోవడం ఈ మధ్య విరివిగా కన్పిస్తోంది. తద్వారా నిర్మాతపై భారం తగ్గుతుంది. హీరోకీ బాధ్యత పెరుగుతుంది. మంచి మంచి సినిమాలు రావడానికి ఆస్కారముంటుంది కూడా. యంగ్ హీరో నారా రోహిత్ కూడా ఓ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. అదే 'అప్పట్లో ఒకడుండేవాడు'. ఇది ఓ విభిన్న కథాంశంతో రూపొందుతున్న సినిమా అట. నారా రోహిత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. 'నేను గర్వపడేలా, ప్రేక్షకులు మమ్మల్ని మెచ్చుకునేలా సినిమా రూపొందిస్తున్నాం.
నిర్మాతగా నా ఈ తొలి ప్రయత్నం విజయవంతమవుతుందని నమ్ముతున్నాను' అని సినిమా గురించి చెప్పాడు నారా రోహిత్. ఈ సినిమాలో నారా రోహిత్‌తోపాటు, శ్రీవిష్ణు, తాన్యా హోప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ సినిమా చేసినా నారా రోహిత్ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకే అతన్ని విలక్షణ చిత్రాల హీరోగా తెలుగు సినీ పరిశ్రమ గుర్తుపెట్టుకుంటోంది. రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌కి నారా రోహిత్ ఎప్పుడూ దూరంగా ఉంటాడు. జయాపజయాలు ఎలా ఉన్నా? మంచి ప్రయత్నం అయితే చేశాడన్న ప్రశంసలు దక్కించుకోవడం నారా రోహిత్‌కి మాత్రమే చెల్లిందేమో. 1992 - 96 మధ్యకాలంలో జరిగిన కథ కావడంతో 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే టైటిల్ పెట్టినట్లు చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. క్రికెట్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. హీరోగా, సమర్పకుడిగా నారా రోహిత్‌కి ఈ సినిమా మంచి విజయాన్నివ్వాలని ఆశిద్దాం.
|