కమర్షియల్ సినిమాలకి రాఘవేంద్రరావు పెట్టింది పేరు. హీరోయిన్లను అందంగా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన దర్శకేంద్రుడు అయ్యారు. వయసుతోపాటే దర్శకేంద్రుడి ఆలోచనలూ మారాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను గతంలోనే రూపొందించిన దర్శకేంద్రుడు, ఇప్పుడు ఆధ్మాత్మిక అద్భుతాలపై దృష్టిపెట్టాడు. అలా ఆయన్నుంచి 'అన్నమయ్య' వచ్చింది, 'శ్రీరామదాసు' వచ్చింది. 'ఓం నమో వెంకటేశాయ' రాబోతోంది.
నాగార్జున, అనుష్క ముఖ్య పాత్రల్లో రూపొందుతోన్న ఈ 'ఓం నమో వెంకటేశాయ' నిజంగానే ఓ ఆధ్మాత్మిక అద్భుతం. ఆ అద్భుతానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆ ఆధ్యాత్మిక వెండితెర అద్భుతం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హథీరామ్‌బాబాగా నాగార్జున ఈ చిత్రంలో నటించనున్నాడు. ఇంకో వైపున ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ మరో ముఖ్యమైన పాత్రలో కన్పించనుంది. నాగార్జున, ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్‌లో ఓ సూపర్బ్ స్టిల్‌ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే, అనుష్కతో రాఘవేంద్రరావు దిగిన ఫొటోని కూడా విడుదల చేశారు. ఇప్పటిదాకా విడుదలైన ప్రతి ఫొటోకీ మంచి స్పందన లభించింది. ఫొటోలతోనే సంచలనాలు సృష్టించేస్తున్న దర్శకేంద్రుడు, సినిమాతో ఇంకెంత సంచలనానికి తెరలేపుతాడోనని యావత్ సినీ పరిశ్రమ ఎదురుచూస్తోంది.
|