తెలుగులో హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు?- రామ్ చరణ్‌తో
స్టార్ హీరో అంటేనే సవాలక్ష ఒత్తిళ్లు. అభిమానుల్ని సంతృప్తి పరచుకొంటూ వెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఓ స్టార్ కుటుంబం నుంచి వచ్చి స్టార్ అయిన హీరోకు ఆ సవాళ్లు మరిన్ని ఎక్కువగా ఉంటాయి. తొలి సినిమా నుంచే సవాళ్లపై సవారీ చేస్తూ వస్తున్నాడు రామ్ చరణ్. మాస్‌ని మెప్పిస్తూ.. అభిమానుల్ని అలరిస్తూ స్టార్ హీరోగా తన స్థానాన్ని మరింత పదిల పరచుకొంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే గోవిందుడు అందరివాడేలే, జంజీర్, బ్రూస్లీ సినిమాలు చరణ్ కెరీర్‌ని కాస్త ట్రాక్ తప్పేలా చేశాయి. అందుకే ఈసారి రిస్క్ లేని ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్ ని నమ్ముకొన్నాడు. ధృవగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో గో తెలుగు చేసిన చిట్ చాట్.
* హాయ్ రామ్ చరణ్
- హాయ్...
* ధృవ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతున్నట్టుంది?
- అవునండీ. ప్రతీ సినిమాకీ ఇలాంటి ఒత్తిడి ఉండేదే. ఎంత నమ్మకంగా ఉంటామో.. అంతే.. కంగారు పడుతుంటాము. ఫైనల్ ప్రాజెక్ట్ ఆడియన్స్‌కి నచ్చుతుందా, లేదా? అనే భయం ఉంటుంది. ధృవ విషయానికొస్తే ఆ భయం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. కారణం ఏమిటంటే.. ఆల్రెడీ తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. తెలుగులో అదే ఫీట్ రిపీట్ కావాలనుకొంటారు. కథని పాడు చేయకుండా.. చాలా జాగ్రత్తగా చేయాలి.
* రీమేక్ కథనే ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
- రీమేక్ అయినా తీసేది సినిమానే కదండీ. మన కథలే చూపించాలి అనే స్వార్థం లేదు. కథ బాగుంటే ఈగోలకు పోకుండా ఎక్కడి నుంచైనా దాన్ని తీసుకోవొచ్చు.
* మాతృకతో పోలిస్తే ఎక్కువగా మార్పులు చేయకపోవడానికి కారణం ఏమిటి?
- కొన్ని కథల్ని మార్చలేం. ఏ సీన్ మార్చినా.. ఫ్లేవర్ దెబ్బతింటుంది. ఉన్నదాన్ని... ఇంకా ఎక్కువ ఎఫెక్టీవ్‌గా ఎలా తీయొచ్చో ఆలోచించాం.. అలానే తీశాం.
* రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదిది. మీకూ మీ బాడీ లాంగ్వేజీకీ సరిపోతుందని ఎలా డిసైడ్ అయ్యారు?
- ఈ సినిమా రైట్స్ తీసుకొన్నది ఎన్వీ ప్రసాద్‌గారు. ఆయనకు మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఈ పాత్ర నాకు మాత్రమే సరిపోతుందని నమ్మి నా దగ్గరకు తీసుకొచ్చారు. ఓ వ్యక్తి నన్ను నమ్మినప్పుడు నాపై నాకు నమ్మకం లేకపోతే ఎలా?
* సిక్స్ ప్యాక్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయా?
- ఈ సినిమాలో హీరో ఫిట్‌గా ఉండాలి. నిజంగానే ఐపీఎస్‌లా కనిపించాలి. లేదంటే.. హీరో, విలన్‌ల మధ్య జరిగే ఆ పోరు రక్తికట్టదు. అందుకే.. సిక్స్ ప్యాక్ చేశా.
* అందుకోసం చాలా కష్టపడినట్టున్నారు కదా?
- పెద్దగా ఏం లేదండీ. అందరూ పడే కష్టమే. సిక్స్ ప్యాక్ చేసినా నా రెగ్యులర్ డైట్ ఫాలో అయ్యాను. చిరుతిళ్లు అస్సలు వదల్లేదు.
* ఇది వరకు చేసిన జంజీర్ కూడా రీమేకే. అందులోనూ మీది పోలీస్ పాత్ర. జంజీర్ రిజల్ట్ మీ నిర్ణయంపై ఎఫెక్ట్ చూపించలేదా?
- జంజీర్ ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. కథ నచ్చకో.. తీసిన విధానం నచ్చకో ప్రేక్షకులు దాన్ని తిరస్కరించారు. ధృవ కథ బలంగా ఉంది. దాన్ని అంతకంటే బాగా తీశాం. పోలీస్ క్యారెక్టర్ అనగానే నాకు జంజీర్ గుర్తుకురాలేదు. ఈ పాత్రని ఎంత బాగా చేయాలి.. అనేదే ఆలోచించా.
* రకుల్ ప్రీత్ సింగ్‌ని వెంట వెంటనే రిపీట్ చేయడానికి కారణాలేమైనా ఉన్నాయా?
- మన తెలుగులో హీరోయిన్లు ఎక్కడ ఉన్నారండీ. మీరు చూస్తూనే ఉన్నారు కదా. పైగా రకుల్ చాలా మంచి నటి. బ్రూస్లీలోనూ చక్కగా నటించింది.
* బ్రూస్లీ రిజల్ట్‌తో ఏమైనా మారారా?
- కథల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నది అర్థమైంది. బ్రూస్లీ అనే కాదు.. ప్రతీ సినిమాకీ మారుతూనే ఉండాలి. ఏదోటి నేర్చుకొంటూనే ఉండాలి.
* పెద్ద నోట్ల రద్దు వసూళ్లపై ప్రభావం చూపిస్తుందనుకొంటున్నారా?
- ఆ ఎఫెక్ట్ ఉంఉటందండీ. అందుకే డిసెంబరు 2న విడుదల కావాల్సిన ఈ సినిమాని 9కి మార్చాం. నెల ప్రారంభంలో డబ్బులు సర్దుకోవడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. వారం గడిస్తే పరిస్థితుల్లో మార్పులు వస్తాయని భావించాం.
* సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- ఇది వరకటిలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఉండదు. అయితే... మెల్లమెల్లగా మనం కూడా అలవాటు పడతాం.
* మీ నాన్నగారి సినిమా ఎలా ఉండబోతోంది?
- అభిమానులకు పండగలా ఉంటుంది. వినాయక్ గారు పూర్తి బాధ్యతతో ఆ సినిమా చేస్తున్నారు. నేనూ ఓ పాటలో కనిపిస్తా.
* 9 మీ లక్కీ నెంబర్ అట కదా..? మీరు ఇలాంటివి నమ్ముతారా?
- లేదండీ.. సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదంతే.
* సుకుమార్ సినిమా ఎలా ఉండబోతోంది?
- ధృవకి పూర్తిగా వైవిధ్యంగా ఉంటుంది. సంక్రాంతి తరవాత షూటింగ్ ప్రారంభిస్తాం.
* ఓకే.. ఆల్ ద బెస్ట్
- థ్యాంక్యూ..
-కాత్యాయని