చిత్రం: జై లవకుశ
తారాగణం: ఎన్టీయార్, రాశి ఖన్నా, నివేదా థామస్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, సాయికుమార్, ప్రదీప్ రావత్, జయప్రకాష్‌రెడ్డి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
విడుదల తేదీ: 21 సెప్టెంబర్ 2017
క్లుప్తంగా చెప్పాలంటే
జై, లవ, కుశ (ఎన్టీయార్ త్రిపాత్రాభినయం) కవలలు. జైకి నత్తి, సరిగ్గా మాట్లాడలేని కారణంగా మిగిలిన ఇద్దరు సోదరులు లవ, కుశలతో కలవడానికి ఇబ్బంది పడ్తుంటాడు. లవ, కుశ కూడా జైకి నత్తి కావడంతో అతన్ని చిన్నచూపు చూస్తారు. దాంతో చిన్నప్పుడే జైకి లవ, కుశ అంటే గిట్టదు. ఓ అనుకోని ఘటన ఈ అన్నదమ్ముల్ని విడదీస్తుంది. ముగ్గురూ వేర్వేరు చోట్ల పెరిగి పెద్దవారవుతారు. లవకుమార్ బ్యాంకు ఉద్యోగి అయితే, కుశ ఎలాగోలా మాయ చేసి అమెరికా వెళ్ళి, గ్రీన్ కార్డ్ సంపాదించేసి, అక్కడే సెటిలైపోవాలనుకుంటాడు. కొన్ని అనూహ్య సంఘటనలతో ఈ ముగ్గురూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, కలుస్తారు. మరి, జై - లవ, కుశలపై పగ ప్రతీకారం అలాగే కొనసాగిస్తాడా? కుశ, అమెరికా కల ఏమయ్యింది? వంటి ప్రశ్నలకు తెరపైనే సమాధానం దొరుకుతుంది.
మొత్తంగా చెప్పాలంటే
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది? తెరపై చెలరేగిపోయాడంతే. ఓ పాత్రను మించి ఇంకో పాత్ర అన్నట్లుగా ఎన్టీయార్ నట విశ్వరూపాన్ని మూడు పాత్రల్లో చూసేస్తాం. ఈ మూడు పాత్రల్లోకీ జై పాత్ర ఎన్టీయార్‌కి చాలా కొత్తది. ఆ పాత్రలో అయితే న భూతో న భవిష్యతి అనేలా సత్తా చాటాడు. నట విశ్వరూపం అనేది చిన్న మాట 'జై' పాత్రలో ఎన్టీయార్ చూపిన నటనా ప్రతిభకి. మూడు పాత్రల్లో సత్తా చాటడం, ఒక పాత్రకీ ఇంకో పాత్రకీ వేరియేషన్ చూపడమంటే చిన్న విషయం కాదు. డాన్సుల్లోనూ అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్‌లో దుమ్ము రేపేశాడు. ఓవరాల్‌గా ఇది ఎన్టీయార్ షో.
రాశి ఖన్నా గ్లామరస్‌గా కన్పిస్తే, నివేదా థామస్ తన ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇద్దరి పాత్రలకీ స్కోప్ తక్కువే ఉంది. దానిక్కారణం మూడు పాత్రల్లో ఎన్టీయార్ కన్పించడమే కావొచ్చు. ఉన్నంతలో హీరోయిన్లు అలరించారు. ఐటమ్ సాంగ్‌లో తమన్నా గ్లామర్ తళుకులు అదుర్స్ అనిపిస్తాయి. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.
ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చాయి గనుక, కథ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. అయితే కథనం ఆకట్టుకుంటుంది. మాటలు బాగా పేలాయి. ఎడిటింగ్ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఆర్ట్, కాస్ట్యూమ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.
త్రిపాత్రాభినయం చేసే సినిమాల్లో ఇతర పాత్రలకు స్కోప్ తక్కువగా ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే పరిస్థితి కన్పించింది. ఎన్టీయార్ వన్ మ్యాన్ షో అనే మాట చాలా సినిమాలకు చెప్పుకున్నాం. ఇందులో ముగ్గురు ఎన్టీయార్‌లు సత్తా చాటారు. అందరిలోకీ జై పాత్ర మరీ ప్రత్యేకం. దర్శకుడు ఈ పాత్ర మీద చాలా ఫోకస్ పెట్టడం, ఆ పాత్రని హీరో ఛాలెంజింగ్‌గా తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టే ఆ పాత్ర కూడా బాగా పండింది. కవలల్లో ఒకడు, మిగతా ఇద్దరిపై కోపం పెంచుకోవడం అనేది కొత్త కాన్సెప్ట్. ఎన్టీఆర్ మీద ఈ తరహా ప్రయోగం చేయడం అభినందించదగ్గ విషయం. సినిమా స్లోగా సాగడం వీక్ పాయింట్‌గా చెప్పవచ్చేమో. ఓవరాల్‌గా ఇది ఎన్టీయార్ ఎన్టీయార్ ఎన్టీయార్ డామినేటెడ్ షో. అభిమానులకు ఇంతకన్నా కావాల్సిందేముంది? మాస్‌కి అయితే పండగే. ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్‌ని సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే
ఎన్టీయార్ ఎన్టీయార్ ఎన్టీయార్ - ట్రిపుల్ థమాకా
అంకెల్లో చెప్పాలంటే: 3/5
|