Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మెంటల్‌ మదిలో చిత్ర సమీక్ష

mental madilo movie review

చిత్రం: మెంటల్‌ మదిలో 
తారాగణం: శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్‌, శివాజీ రాజా, అమృత, అనిత తదితరులు. 
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి 
సినిమాటోగ్రఫీ: వేద రామన్‌ 
దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ 
నిర్మాత: రాజ్‌ కందుకూరి 
నిర్మాణం: ధర్మపథ క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 28 నవంబర్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
తనకేం కావాలో తనకే స్పష్టత లేని కన్‌ఫ్యూజన్‌ మైండెడ్‌ వ్యక్తి అరవింద్‌ కృష్ణ (శ్రీవిష్ణు). అమ్మాయిలంటే అరవింద్‌కి మహా సిగ్గు. అలాంటి అరవింద్‌, స్వేచ్ఛ (నివేతా పేతురాజ్‌)తో పెళ్ళి కుదురుతుంది. స్వేచ్ఛ పూర్తిగా అరవింద్‌ క్యారెక్టర్‌కి వ్యతిరేకం. తనకేం కావాలో ఆమెకు బాగా తెలుసు. అరవింద్‌ని కూడా బాగా ఇష్టపడుతుంది. అందుకే అరవింద్‌ మైండ్‌సెట్‌ మార్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. నిశ్చితార్ధానికి ముహూర్తం కూడా పెట్టుకుంటారుగానీ, ఇంతలోనే అరవింద్‌కి ముంబై ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడే అరవింద్‌లో చాలా మార్పులొస్తాయి. అక్కడతనికి రేణు పరిచయమవుతుంది. రేణు ఎవరు? రేణుతో పరిచయం కారణంగా అరవింద్‌ ఎలా మారాడు? అరవింద్‌ - స్వేచ్ఛల కథ సుఖాంతమయ్యిందా? లేదా? అనేది తెరపై చూడాల్సిన అంశం. 

మొత్తంగా చెప్పాలంటే 
హీరో శ్రీవిష్ణులో మంచి నటుడున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో నటుడిగా మరిన్ని మంచి మార్కులు అతనికి పడతాయి. క్లిష్టతరమైన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలకు బెస్ట్‌ ఆప్షన్‌ అనిపించేలా చేశాడు. స్వేచ్ఛ పాత్రలో నివేదా థామస్‌ బాగా చేసింది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. సహజమైన నటనతో తన పాత్రలో జీవించేసిందామె. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు తెలుగులో వస్తాయి. 

శ్రీవిష్ణు, నివేతా తర్వాత మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా రేణు పాత్ర గురించే. ఆ పాత్రలో అమృత బాగా చేసింది. శివాజీ రాజా ఓ మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. సీనియర్‌ నటుడిగా తన అనుభవాన్నంతా రంగరించారాయన. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

ఇలాంటి కథతో తెలుగు తెరపై గతంలోనూ కొన్ని సినిమాలొచ్చాయి. అయితే దర్శకుడు తెరపై సినిమాని నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. స్టార్స్‌ లేకపోయినా అనుకున్న కథని అనుకున్నట్టుగా దర్శకుడు తెరకెక్కించగలిగాడు. కథ, కథనం బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు తెరపై వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. అక్కడక్కడా ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువల పరంగా రాజీ పడని వైనం కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ సినిమాకి అవసరమైన మేర ఉపయోగపడ్డాయి. 

కొత్తదనంతో కూడిన ఆలోచనలతోపాటుగా సాధారణ కథాంశాల్నే నేర్పుగా చెప్పగలడం ఓ కళ. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పక తప్పదు. దర్శకుడి పనితనం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుందన్నమాటే దర్శకుడికి బిగ్గెస్ట్‌ అఛీవ్‌మెంట్‌. సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా దర్శకుడు పూర్తి కమాండ్‌తో వ్యవహరించాడు. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇంకాస్త ఎమోషన్‌, వీటికి తోడు సినిమాని సహజంగా తీర్చిదిద్దడం ఇవన్నీ సినిమాకి ప్లస్‌పాయింట్స్‌. నాటకీయత అనేది దాదాపుగా కనిపించదు. మన చుట్టూ ఉన్న పాత్రలు, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు వెరసి మనల్ని పూర్తిగా ఆ కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకుడు పొందగలుగుతాడు. మౌత్‌ టాక్‌ సినిమాకి కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందించే అవకాశముంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
మెంటల్‌ మదిలో - కూల్‌ ఎంటర్‌టైనర్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka