Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సవ్యసాచి చిత్రసమీక్ష

savyasachi movie review

చిత్రం: సవ్యసాచి 
తారాగణం: నాగచైతన్య, నిధి అగర్వాల్‌, ఆర్‌.మాధవన్‌, భూమిక, వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేష్‌, హైపర్‌ ఆది తదితరులు. 
సంగీతం: ఎంఎం కీరవాణి 
సినిమాటోగ్రఫీ: యువరాజ్‌ 
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై, మోహన్‌ చెరుకూరి 
దర్శకత్వం: చందూ మొండేటి 
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌ 
విడుదల తేదీ: 2 నవంబర్‌ 2018 
కుప్లంగా చెప్పాలంటే.. 
కమర్షియల్‌ యాడ్స్‌ని చిత్రీకరిస్తుంటాడు దర్శకుడు విక్రమ్‌ ఆదిత్య (నాగచైతన్య). కొన్నేళ్ళ క్రితం కాలేజీలో చిత్ర (నిధి అగర్వాల్‌)ని ప్రేమిస్తాడు. కొన్ని కారణాలతో ఇద్దరూ ఒకరికొకరు దూరమవుతారు. మరోపక్క, విక్రమ్‌ ఆదిత్య వ్యానిషింగ్‌ సిండ్రోమ్‌తో పెట్టిన వ్యక్తి. అంటే, అతనిలో ఇంకో వ్యక్తి వుంటాడన్నమాట. ఆ ఇంకో వ్యక్తి, విక్రమ్‌ ఆదిత్య ఎడమ చేతిపై ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. అది ఆ రెండో వ్యక్తి ఆధీనంలో వుంటుంది. ఆ సంగతి పక్కన పెడితే, చిత్ర - విక్రమ్‌ ఆదిత్య మళ్ళీ కలుసుకుని ఒక్కటయ్యే క్రమంలో విక్రమ్‌ ఆదిత్య అనూహ్యమైన పరిణామాల్ని ఎదుర్కొంటాడు. అతని అక్క, బావతోపాటు.. మేనకోడలిపైనా దాడి జరుగుతుంది. ఈ దాడిలో బావ చనిపోతే, మేనకోడల్ని ఎవరో కిడ్నాప్‌ చేశారని తెలుసుకుంటాడు విక్రమ్‌ ఆదిత్య. ఆ 'ఎవరో' ఎవరన్నది మిగతా కథ. ఎందుకు ఆ వ్యక్తి, విక్రమ్‌ ఆదిత్య జీవితంలో 'తుఫాన్‌' సృష్టించాడన్నది తెరపై చూస్తేనే బావుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే.. 
అక్కినేని నాగచైతన్య తనకు దక్కిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రెండు రకాల వ్యక్తిత్వాల్ని పెర్‌ఫెక్ట్‌గా ప్రదర్శించాడు. ఈ క్రమంలో ఫన్‌ జనరేట్‌ అయ్యేందుకు తనవంతుగా కష్టపడ్డాడు. డాన్సుల్లోనూ ఈజ్‌ ప్రదర్శించడం ఈ సినిమాలో నాగచైతన్య గురించి చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం. పోరాట ఘట్టాల్లోనూ, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ నాగచైతన్య 'వావ్‌' అనిపిస్తాడు. 

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ అందంగా కన్పించింది. చలాకీగా ప్రేక్షకుల మనసుల్నీ దోచేసింది. డాన్సులతోనూ ఆకట్టుకుంది. నటన పరంగా ఓకే అన్పిస్తుంది. తొలిసారి తెలుగులో నటించిన మాధవన్‌, తన పాత్రకు అదనపు అడ్వాంటేజ్‌ అయ్యాడు. మాధవన్‌ కన్పించినంతసేపూ చూసే ప్రేక్షకుల్లోనూ జోష్‌ వస్తుంది. మిగతా పాత్రల్లో రావు రమేష్‌ మామూలే. కమెడియన్లు తమవంతుగా కామెడీ పండించడానికి ప్రయత్నించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. తాగుబోతు రమేష పాత్ర కాస్త కొత్తగా అన్పిస్తుంది. 

కథ పరంగా చూస్తే కొత్త పాయింట్‌తోనే రూపొందినా, సినిమాలో వుండాల్సింత వేగం లేకపోవడం పెద్ద లోపం. కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. డైలాగ్స్‌ ఓకే. ఎడిటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌లోనూ, సెకెండ్‌ హాఫ్‌లోనూ అవసరం అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. సంగీతం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పాటలు బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బావుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. 

'అపరిచితుడు' సినిమాలో ఒకే వ్యక్తి భిన్న రకాల వ్యక్తుల్లా ప్రవర్తించడం చూశాం. 'హలోబ్రదర్‌' సినిమాలో కవలల్లో ఒకరికి దెబ్బ తగిలితే, ఆ ప్రభావం ఇంకొకరిపై పడటాన్ని చూశాం. వాటితో పోల్చితే, ఈ 'సవ్యసాచి' కొంచెం కొత్త పాయింట్‌తో రూపొందినదే. నిజానికి, ఈ కథ నుంచి బోల్డంత ఫన్‌ జనరేట్‌ చేయొచ్చు. రేసీ స్క్రీన్‌ప్లేతో సూపర్బ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మార్చేయొచ్చు. హీరో - విలన్‌ మధ్య మైండ్‌ గేమ్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళొచ్చు. కానీ, ఆయా విషయాల్లో దర్శకుడు అలసత్వం ప్రదర్శించాడన్పిస్తుంది. పాత్రల పరిచయానికే ఫస్టాఫ్‌ వాడేసిన దర్శకుడు, సెకెండాఫ్‌లోనూ వేగం చూపించలేకపోవడం పెద్ద మైనస్‌. నాగచైతన్య కష్టపడినా, మాధవన్‌ తెలుగు తెరపైకి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చినా, నిధి అగర్వాల్‌ అందాల నిధితో హల్‌చల్‌ చేసినా.. 'సవ్యసాచి' జస్ట్‌ ఓకే అన్పిస్తుందంతే. విపరీతమైన హైప్‌ కారణంగా ఓపెనింగ్స్‌ బాగా వచ్చే అవకాశం వున్నా, సినిమా ఎంతవరకు నిలబడగలదన్నది వేచి చూడాలి. 

అంకెల్లో చెప్పాలంటే.. 
2.5/5 
ఒక్క మాటలో చెప్పాలంటే 
'సవ్యసాచి' జోరు సరిపోలేదోయీ.!

మరిన్ని సినిమా కబుర్లు
churaka