Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sri satya sai baba birthday

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - ...

tamilnadu

 కుంభకోణం , పట్టీశ్వరం )

కుంభకోణం లో వున్న మరో కోవెల రామస్వామి కోవెల . సారంగపాణి కోవెలకి ఓ ఫర్లాంగు దూరంలో వుంటుంది . సారంగపాణి కోవెలతోపోలిస్తే కాస్త చిన్న మందిరమనే చెప్పుకోవాలి . 16 వ శతాబ్దంలో నాయకరాజుల మంత్రి ‘ గోవింద దీక్షితుల ‘ ఆధ్వైర్యంలో నిర్మింప బడింది . అయిదంతస్తుల రాజగోపురం మందిరంచుట్టూర కట్టిన రాతి ప్రహారీ గోడ , లోపల పుష్కరిణితో వున్న మందిరం , యీ మందిరం లోని 64 స్థంబాల మంటపం చూడదగ్గది , యీ 64స్థంభాల  ఏకశిల నిర్మితాలు , వాటిమీద చెక్కిన రామాయణ శిల్పాలు సజీవంగా వున్నట్లు భ్రమిస్తాయి . మండపం గోడలమీద రామాయణఘట్టాలను చిత్రీకరించేరు , గర్భగుడిలో రాముడు సీత సింహాసనం మీద కూర్చున వుండగా సింహాసనం వెనకాల లక్ష్మణ , భరత ,సతృఘ్నులు నిలుచొన , ఆంజనేయుడు ముకుళిత హస్తాలతో క్రిందన కూర్చొని వుంటాడు . కోవెలలో వ్యాకరణ ముద్రలో వున్న రాముడు , గ్రంథాలను చేతిలో పట్టుకొని వున్న హనుమ , విభీషణ పట్టాభిషేకం , సుగ్రీవపట్టాభిషేకం విగ్రహాలు చూడదగ్గవి . ప్రదక్షిణ చేసుకుంటూ రామాయణ చిత్రాలను చూడడం చాలా బాగుంటుంది , సీతారామ దర్శనమేకాకుండా రామాయణ స్మరణ చేసుకోడం  కూడా మనసుకి హాయినిస్తుంది .

అక్కడ నుంచి మందిరంలోంచి నడుస్తూ వెడితే మరో మందిరం లోకి ప్రవేశిస్తాం , ఈ నడక దారిని కూడా ‘ గోవింద దీక్షితులు ‘కట్టించినట్లు చెప్తారు . ఈ మందిరాన్ని ‘ చక్రపాణి ‘మందిరం అంటారు .

ఈ మందిరం అయిదంతస్థల రాజ గోపురంతో రాతి ప్రహారీ గోడతో వుంటుంది . ఈ మందిర నిర్మాణం యెప్పుడు జరిగినదీ తెలియకపోయినా నాయకరాజుల కాలంలో  పునః నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది . గర్భగుడిలోని విష్ణుమూర్తి సుదర్శన చక్రరూపంలో  పూజింపబడుతున్నాడు . మూల విరాట్టు 8 చేతులతో ప్రతీ చేతిలోని ఆయుధంధరించి , నుదుటన మూడవ కంటితో వుండి పూజలందుకుంటున్నాడు . మూడవకంటి తో వున్న విష్ణుమూర్తి గురించి యెప్పుడూవినలేదు , ఏ పురాణం ఆధారంగా యీ విగ్రహాన్ని మలిచారో తెలియరాలేదు . పాతాళంలో దాగిన దానవులను సంహరించేందుకు ప్రయోగించిన సుదర్శన చక్రం దానవులను సంహరించి వస్తూ కావేరినదిలోవుండగా బ్రహ్మ సుదర్శన చక్ర కాంతిని చూసి సుదర్శన చక్రాన్ని బయటకు తీసి పూజలు చేసిన ప్రదేశమే యిది . అలాగే సూర్యుడుప్రచండ కాంతితో గర్వంతో ఆకాశయానం చేస్తూ వుంటే సూర్యుని గర్వమణచడానికి చక్రం తన పూర్తి కాంతిని వెలువరించిందట ,ఆకాంతిని చూచిన సూర్యుడు  సిగ్గు పడి గర్వాన్ని వదిలి పెట్టి విష్ణుమూర్తిని పరిపరి విధాల స్తోత్రించి , క్షమార్పణ కోరేడట .

బ్రహ్మ కోరిక మేరకు విష్ణుమూర్తి చక్రపాణిగా వెలసి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు . ఈ రెండు మందిరాలు కూడా కుంభేశ్వరాలయానికి నడక దూరంలో వుంటాయి , అందుకే నగరంలో వున్న మందిరాలు ఓ రోజులోపూర్తిచేసుకొని మిగతావి టాక్సీగాని ఆటో లోగాని వెళ్లి చూసుకోవచ్చు . ఇవి కాక వరాహస్వామి కోవెల , సోమేశ్వర మందిరం కూడాచూడదగ్గవే , స్థానిక పూజారుల ప్రకారం  కుంభకోణం లోని పైన నేను రాసిన మందిరాలన్నింటిలోను అమృతం చుక్కలు పడ్డాయట .

పట్టీశ్వరం ————-

కుంభ కోణానికి సుమారు 7 కిలో మీటర్ల దూరంలో వున్న పట్టీశ్వరం లోని ‘ థేనుపురీశ్వరుడు ‘ శివాలయం గురించి తెలుసుకుందాం. ఈ కోవెలలో మహాశివుడు భక్తునికోసం యెదురుచూసి అతని స్వాగతం కోసం ముత్యాల మండపాలు నిర్మించి దర్శనమిచ్చేడట .కుంభకోణం - ఆవూరు రోడ్డుమీద 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి పట్టీశ్వరం చేరుకోవచ్చు , లేదా ‘ దరసురాం ‘ రైల్వే స్టేషను నుంచి 3కిలోమీటర్లు ఆటో లో ప్రయాణించి చేరుకోవచ్చు . కుంభకోణం నుంచి బస్సు సర్వీసుకూడా వుంది బస్సు కూడా మందిరానికి యెదురుగానిలుపుతారు .

ఈ మందిరం 7 వ శతాబ్దంలో చోళరాజులు చేసిన నిర్మాణానికి నాయకరాజుల కాలంలో గోవింద దీక్షితులు ‘ చే పునః నిర్మించబడింది . ఈ మందిరానికి చోళులు , పల్లవులు , విజయనగరరాజులు నాయకర్లు యెన్నో వందల యెకరాల గుడి మాన్యం యిచ్చినట్లు ,యెన్నో ఆభరణాలు , బహుమతులు యిచ్చినట్లుగా శిలాశాసనాలద్వారా తెలుస్తోంది , ఆశిలాశాసనాలను యివాళ కూడా చూడొచ్చు .

ఈ మందిరం 5 గోపురాలు , మూడు ప్రాకారాలతో నిర్మింపబడింది . ఈ మందిరం కూడా చాలా పెద్దదే . మూడు ప్రాకారాలు తిరిగి చూసేసరికి కాళ్ల నొప్పులు ఖాయం . మూడు ప్రాకారాలలోనూ మూడు నామాలతో వినాయకుడుపూజింపబడుతున్నాడు , మొదటి ప్రాకారంలో అమలైత పిళియార్ , రెండో ప్రాకారంలో మాధవర్ణ పిళియార్ , మూడో ప్రాకారంలో స్వర్ణపిళియార్ గా పిలువబడుతున్నాడు . మొదటి ప్రాకారంలో పార్వతీదేవి ‘ జ్ఞానాంబిక ‘ గా పూజలందుకుంటోంది . ఇక్కడ తపస్సుచేసుకుంటున్న పార్వతి విగ్రహం కూడా వుంది .

నాలుగు అయిదంతస్థుల గోపురాలు , ఒకటి ఏడంతస్థుల గోపురం . సాధారణంగా అన్ని మందిరాలలోనూ ద్వజస్థంబం , నందిగర్భగుడిలోని మూలవిరాట్టుకి యెదురుగా వుంటాయి , కాని యీ మందిరంలో నంది గర్భగుడిలోని శివలింగానికి యెదురుగా కాక పక్కగావుంటుంది . మూలవిరాట్టు ‘ థేనుపురీశ్వరుడు ‘ అని అంటారు . ముఖమండపం , అర్ధమండపం ముఖ్యగోపురానికి ఉత్తరం వైపున వేరేప్రాకారంలో దుర్గా దేవి విగ్రహం సర్వాలంకారలతో వుంటుంది . ఈ దుర్గాదేవికి అనేక శక్తులు వున్నాయని యిక్కడి భక్తుల నమ్మకం  ,విగ్రహం పసుపు కుంకాలతో , ఎరుపురంగు పట్టుచీర లో చాలా భీకరంగా వుంటుంది , యీ అమ్మవారిని బయట రహదారి వైపునుంచికూడా దర్శించుకోవచ్చు . దక్షిణం వైపున పుష్కరిణి మూతవర్ణ వినాయకుని మందిరం వుంటాయి . గర్భగుడిలో శివుని విగ్రహం , శివలింగం రెండూ వుంటాయి . సోమస్కంద మందిరంలో కూడా రాతివిగ్రహమేకాకుండా లోహపు విగ్రహం కూడా వుంటుంది .

గర్భగుడి చుట్టూరా లింగోద్భవం , దుర్గాదేవి , దక్షిణామూర్తి , నవగ్రహాలు వుంటాయి . అయితే యిక్కడ నవగ్రహాలు మిగతామందిరాలలోవలె కాకుండా సూర్యగ్రహం చుట్టూ మిగతా గ్రహాలు వున్నట్లుగా నిర్మింపబడింది . అమ్మవారి కోవెలలో ‘ గోవింద దీక్షితులు ,అతని భార్యల విగ్రహాలను చూడొచ్చు . మందిరంలోని స్థంభాలపై మందిరానికి సంభందించిన వ్యక్తుల , దేవీదేవతల విగ్రహాలుచెక్కబడి వున్నాయి . నటరాజు , కుమారస్వామి , లక్ష్మి లోహపు విగ్రహాలు వున్నాయి . ఈ కోవెలలో మూడు కొలనులు , ఒక బావి వున్నాయి.

ఈ మందిరం కావేరీనదీ తీరాన వున్న 275 పాదల్ పేత్ర స్థలాలలో ఒకటిగా నాయనార్ల చే స్తుతించబడింది . ఈ మందిరానికి సంబంధించిన స్థలపురాణం గురించి వచ్చే సంచికలో చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam