Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాలాన్నే జయించిన మార్కండేయుడి కథ..!! - ..

markandeya story

మార్కండేయుడి తల్లితండ్రులు, అతడు పుట్టకముందే ఒక ఎంపిక చేసుకోవలసి వచ్చింది. ఒక మూర్ఖుడిలా నూరేళ్ళు జీవించే పుత్రుడు లేదా అద్భుతమైన మేధస్సుతో ప్రకాశిస్తూ పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే పుత్రుడు - ఈ రెండిటిల్లో ఒక ఎంపిక. ఆ తల్లితండ్రులు ఎంతో వివేకవంతులు కాబట్టి, వాళ్ళు రెండో దానిని కోరుకున్నారు. వాళ్ళుకు ఎంతో మేధస్సు కలిగిన ప్రకాశవంతమైన కొడుకు కలిగాడు. ఇతనికి ఎన్నో సామర్థ్యాలు ఉండేవి. రోజులు గడుస్తున్నకొద్దీ, వాళ్ళకు వాళ్ళ పిల్లాడి గురించిన బాధ ఎక్కువయ్యింది. ఎందుకంటే, ఆ పిల్లాడి మరణ సమయం ఆసన్నమౌతోంది. వాళ్ళకు ఇలా రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన అవసరం వచ్చిందన్న విషయాన్ని వాళ్ళు, మార్కండేయుడికి వివరించి చెప్పారు. మార్కండేయుడు అఖండమైన జ్ఞానం, వివేకం కలిగినవాడు. అతనికి జీవిత విధానాలు తెలుసు.

అందుచేత, మరణ సమయం ఆసన్నమైనప్పుడు, ఎప్పుడైతే మృత్యుదేవత అయిన యముడు అతని ప్రాణం తీసుకోడానికి వచ్చాడో అప్పుడు మార్కండేయుడు ఒక చిన్న సరళమైన పని చేశాడు. అదేమిటంటే, అక్కడ కాలభైరవుడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన ఒక లింగాన్ని హత్తుకున్నాడు. ఏక్షణంలో అయితే అతడు ఆ లింగాన్ని హత్తుకున్నాడో.. ఆ క్షణంలో.. సమయం స్తంభించింది. మృత్యువు అతనిని చేరుకోలేకపోయింది. యముడు అక్కడే బంధించివేయబడ్డాడు.  మార్కండేయుని చైతన్యంలోని ఒక పార్శ్వం తెరుచుకుంది. అదేమిటంటే, ఇక అతను సమయానికి లోబడవలసిన అవసరం లేదు. ఇతను పదిహేను ఏళ్ల కుర్రవాడిగానే ఉండిపోయాడని చెబుతారు.

 

మీరు జీవితాన్ని అతి తక్కువ భౌతిక గుర్తింపులతో అనుభూతి చెందినట్లయితే ఇక కాలం అన్నది మీకు సమస్యే కానేకాదు.

 

ఇతనికి ఎప్పుడూ పదహారవ సంవత్సరం రానేలేదు. ఎందుకంటే, ఇతను చైతన్యంలోని ఆ పార్శ్వాన్ని స్పృశించగలిగాడు - మనం దేనినైతే కాలభైరవుడు అని అంటామో ఆ పార్శ్వాన్ని స్పృశించగలిగాడు. కాలం ఉంది కాబట్టే మరణం అనేది ఉంటుంది. చైతన్యంలోని ఏ పార్శ్వం అయితే కాలానికి అతీతమో - దానిని మనం కాలభైరవుడు అంటాం. యోగాలో ఒక అంశం ఏమిటంటే మీరు మీ భౌతిక తత్వాన్ని దాటి వెళ్లగలరు. మీరు జీవితాన్ని అతి తక్కువ భౌతిక గుర్తింపులతో అనుభూతి చెందినట్లయితే ఇక కాలం అన్నది మీకు సమస్యే కానేకాదు. ఒకసారి మీకూ మీ భౌతికతత్వానికి కొంత దూరం ఏర్పడ్డ తరువాత,  సమయానికి మీ మీద ప్రభావం ఉండదు. కాలభైరవుడు అంటే - సమయం మీద ఆధిపత్యం సాధించిన వాడు లేదా సమయాన్ని హరించిన వాడని అర్థం. కాలం ఉన్నది భౌతిక తత్వం ఉండడంవల్లే. 

అలాగే భౌతిక తత్వం అనేది ఉండడం కాలం ఉండడంవల్లే. ఇది, రెండు విధాలా నిజమే. ఎందుకంటే ఈ సృష్టిలో భౌతికమైన ప్రతీదీ కూడా చక్ర గతుల్లో తిరుగుతూ ఉంటుంది. అది ఒక అణువు అవ్వవచ్చు లేదా ఒక బ్రహ్మాండం అవ్వవచ్చు, అన్నీ చక్ర గతుల్లోనే ఉన్నాయి. ఇవి ఇలా వృత్తాలుగా తిరుగుతూ లేకపోతే, అసలు భౌతికత్వానికి ఆవశ్యకతే లేదు. కానీ, మీరు మీ దేహాన్ని హాయిగా ఉన్న స్థితిలోనికి తీసుకువచ్చినప్పుడు, మీకు  కాలం మీద ఆధిపత్యం లభిస్తుంది. మీరు మీకూ - మీ భౌతిక స్వభావానీకీ మధ్య కొంత దూరం ఏర్పరచుకోగలిగితే, అంటే భౌతిక స్వభావాన్ని ప్రక్కన పెట్టగలిగినప్పుడు, మీకిక కాలం అనేది ఉండదు. ఒకసారి ఈ దూరం ఏర్పడిన తరువాత మీ అనుభూతిలో కాలం అనేది ఉండనే ఉండదు. అలాంటి స్థితిలో మిమ్మల్ని కాలభైరవుడని అంటాం.

మరిన్ని శీర్షికలు
avineeti cartoons