Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira chukkalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మృత్యుకేళి - లక్ష్మి పాల

ఈ రోజు ఉదయం గం.9.30ల నిమిషాలకు నా శ్వాస ఆగిపోయింది. జీవిత చరమాంకాన్ని ముగించుకున్న డెభ్భయ్యేళ్ళ నా శరీరం నుండి, నా ఆత్మ బయటకి వచ్చేసింది. నిశ్శబ్ధంగా లేచి నా శరీరానికి దూరంగా వచ్చి నిల్చున్నాను. నా శవాన్ని దించి బయట పడుకోబెట్టేశారు. నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు వస్తున్నారు. వెళ్ళే వాళ్ళు వెళుతున్నారు. బంధువులు బాధపడుతూ... నిలబడి ఉన్న నా కొడుకు అనిల్ ను, నా మంచం పట్టుకు కూర్చుని ఏడుస్తున్న నా కోడలు శ్రీలతను ఓదార్చుతున్నారు. వాడి స్నేహితులు అందరికి కబుర్లు పంపుతున్నారు. ఈ లోపు ఊళ్ళోనే ఉండే ఇద్దరు కూతుర్లు వచ్చేసారు. “నాన్నా...” బిగ్గరగా శోఖాలు పెడుతున్నారు. వాళ్ళ పిల్లలు... “తాతయ్యా..” అంటూ ఏడ్చేస్తున్నారు.  అందుకేనేమో కూతుర్లను కనాలి. నా పిల్లలకు నా మీద ఉన్న ప్రేమ చూస్తుంటే నేనెంత అదృష్టవంతుడినో నాకు తెలుస్తుంది.

 

చుట్టూ చూసాను. నా మూడవ కూతురు జాడ లేదు. “పాపం... చాలా దూరం నుండి రావాలి బిడ్డ...! ఇంతకూ వీడు కబురు పంపించాడో... ఈ హడావుడిలో మరచిపోయాడో...? ఇంతలో ఎవరో అడిగారు... “మీ చిన్నక్కకు ఫోన్ చేసావా అనిల్...?” ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టినవాడు అనిల్.

“చేసాను. ” అన్నట్లు తల ఊపాడు వాడు. తృప్తిగా అనిపించింది. నా చిన్నబిడ్డ లక్ష్మి కూడా వచ్చేస్తే... ఆ తరువాత అందరినీ వదలి శాశ్వతంగా  వెళ్ళిపోవచ్చు. నన్ను సాగనంపడానికి చాలా హడావుడి జరుగుతోంది. అన్నీ చూస్తూ నిలబడి ఉన్నాను.
మధ్యాహ్నమయింది. నా తల్లి ఇంకా రాలేదేంటీ...? టైమ్ గడుస్తున్నా కొద్దీ... నా చివరి చూపుకన్నా అందుకుంటుందా..? అందరికన్నా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. కళ్ళెదురుగా ఉండే పిల్లలకన్నా... దూరంగా ఉండే పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కువ అంటారు. అంతేకాదు, ఏ చీకు చింతా లేకుండా కాపురాలు చేసుకుంటున్న పిల్లలకన్నా... కష్టాల కడలిలో ఈదుతున్న పిల్లలపట్ల, వారి భవిష్యత్తు పట్ల పెద్దలకు అపేక్ష, ఆందోళన ఎక్కువ. భర్తనుండి వేరైపోయి, బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ లో ఓ ఉద్యోగం చేస్తూ, తన సంపాదనలో నా ఖర్చులకు కొంత పంపుతూ మా అందరికీ దూరంగా, ఒంటరిగా బ్రతుకుతోంది నా చిన్నబిడ్డ లక్ష్మి.

వచ్చినపుడల్లా... కళ్ళల్లో నా పట్ల, నా ఆరోగ్యం పట్ల ఆతృతను నింపుకుని వస్తుంది. నేను సంతోషంగా ఉన్నానని తెలుసుకుని, తృప్తిగా తిరిగి వెళుతుంది. నేను బాధపడతానని, తన కష్టాన్ని, కన్నీళ్ళనూ నాకెప్పుడూ తెలియనివ్వదు. ఆరోగ్యంగా ఉన్నరోజుల్లో  కొద్ది కాలం నా బిడ్డ దగ్గరకు వెళ్ళి తనకు తోడుగా ఉందామనుకున్నాను. నేనూ తనకు బారం కాకూడదని వెళ్ళలేకపోయాను.

“అనిల్.....మీ చిన్నక్క వచ్చేసిందిరా...!” క్రిందనుండి ఎవరో కేకేసారు.

ఆనందంగా అటుచూసాను. తట్టుకోలేనంత దు:ఖంతో గుమ్మంలో కనబడింది. నా శరీరాన్ని చూడగానే... ఒక్క ఉదుటున పరుగెత్తుకొచ్చి మీదపడి “నాన్నా... నాన్నా...!” అని బిగ్గరగా ఏడ్వసాగింది. దాన్ని పట్టి ఆపడం ఎవరి తరమూ కాలేదు. మొన్నీమధ్యే ఇంటికి వచ్చి... అనారోగ్యంతో మంచానికి అతుక్కుపోయి ఉన్న నన్ను చూసి, వెక్కి వెక్కి ఏడ్చింది. కళ్ళు తుడుచుకుని, చిన్నపిల్లాడిని బుజ్జగిస్తున్నట్లు... “నేను మళ్ళీ వస్తాను నాన్నా, ఆఫీసులో లీవు పెట్టి ఓ నాలుగురోజులు వచ్చి నీదగ్గరుంటాను...!” అని చెప్పి వదలలేక, వదలలేక వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ రావడం ఇలా అవుతుందని తను ఊహించి ఉండదు.

ఏమైతేనేం అందరి ఋణం ఈ రోజుతో తీరిపోయింది. ధీర్ఘంగా నిశ్వసిస్తూ, లక్ష్మి దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుని తన తల నిమరసాగాను. నా స్పర్శ తనకు తెలియదని తెలుసు. అయినా... బిడ్డను ఓదార్చాలనే ఏదో ఆశ...

ఎవరో అంటున్నారు... “అందరూ వచ్చేసినట్లేకదా...! ఇక మిగిలిన ఏర్పాట్లు చూడండి.”

నేను కూడా లేచి నిల్చున్నాను. అప్పుడు కనిపించిందది. నా ప్రాణాలు శరీరంనుండి బయటకు రావడానికి ఓ అయిదు నిమిషాలక్రితం నా కళ్ళకు కనిపించిన నల్లని పొగలాంటి ఒక చిత్రమైన మనిషి ఆకారం. ఏమిటది...? నాకు మళ్ళీ ఎందుకు కనబడుతుంది...? నా ఆలోచనలు పరిపరివిధాలా సాగుతున్నాయి.

*******

నా అంతిమయాత్ర ప్రారంభమైంది. నా కూతుళ్ళు, కోడలు... నాకు కుడివైపున ఉన్న బంధువులతో కలిసి నడుస్తున్నారు. నా కొడుకుతో పాటు నేనూ నా శవానికి ముందు నడుస్తున్నాను.

నా ఆలోచనలింకా ఇందాకటి ఆకారం చుట్టే ఉన్నాయి. నా మరణానికి కనీసం వారం రోజులనుండి నా గదిలో ఆ ఆకారం కనబడుతుంది. అది మృత్యువా...? లేదా ఎవరిదైనా ఆత్మా...? ఎందుకొచ్చినట్లు...?? నా ఊపిరి ఆగే ఆఖరి క్షణం... నా మంచానికి ఆనుకుని నావైపే చూస్తున్నట్లు అనిపించింది. సున్నితంగా నా చేయి అందుకుని, సునాయాసంగా నా శరీరం నుండి నా ఆత్మను వేరు చేసింది.
ఆ తరువాత మళ్ళీ అది కనబడలేదు. మరి ఇప్పుడేంటీ...? మళ్ళీ ఎవరికోసమైనా... ఇంక ఆలోచించలేకపోయాను. ఒకసారి... వెను తిరిగి, నా అంతిమయాత్రలో పాల్గొన్న ఆ జనంలోకి చూసాను. అప్పుడు కనబడింది ఆ ఆకారం... నా చిన్నకూతురు లక్ష్మిని అనుసరిస్తూ...
“అంటే... నా బిడ్డను... నా బిడ్డను కూడా...”

భయంతో నాకేం చేయాలో దిక్కు తోచలేదు. లేదు. నా బిడ్డను కాపాడుకోవాలి. “ఒరేయ్... చిన్నక్కా...” నా కొడుకుతో చెప్పాలనుకున్నాను. వాడు నన్ను పట్టించుకోకుండా సాగిపోతున్నాడు. పక్కనున్నవాళ్ళవైపు చూసాను. ఎవరూ నన్ను చూడటం లేదు... నా మాట వినడం లేదు. వెంటనే నా కూతురు దగ్గరకు పరుగెత్తుకెళ్ళాను. తను నన్ను దాటుతూ వెళ్ళిపోయింది. ఆ నల్లటి నీడ నా కూతురుతోపాటే వెళుతోంది. నాకు తెలుస్తోంది... నేను ఎవరికీ కనబడటం లేదు, ఎవరికీ వినబడటం లేదు. నేనేం చేయాలనుకున్నా... నాకేదీ సాధ్యం కావడం లేదు. అయ్యో... నా బిడ్డకు ఈ విషయం చెప్పాలి. కానీ ఎలా...? నిస్సహాయతతో విలవిల్లాడిపోతున్నాను.

నా బాధతో సంబంధం లేకుండా... కార్యక్రమం పూర్తయింది. మూడవరోజు లక్ష్మి హైదరాబాద్ బయలుదేరింది. ఇక్కడ ఉన్న రెండు రోజులూ ఆ నీడలాంటి ఆకారం... నా బిడ్డ చుట్టూ తిరగడం నాకు కనబడుతోంది. తెలిసీ తెలిసీ... తనని ఒంటరిగా పంపించలేకపోయాను. ఎవరినైనా తోడుగా పంపాలని ఉన్నా... నేను ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఎలాగైనా నా కూతురును మృత్యువునుండి రక్షించుకోవాలి. అందుకే, నా బిడ్డతో పాటు నేను బస్సెక్కేసాను.

హైదరాబాదులో దిగి, తన పక్కనే నడుస్తూ... తన ప్లాట్ కి వెళ్ళాను. నాకు అర్ధమవుతోంది. ఆ మృత్యువు కూడా మమ్మల్ని అనుసరిస్తుందని.

******

ఉదయాన్నే... ఎదురుగా ఉన్న ఓ ఫోటోను కళ్ళకద్దుకుంది లక్ష్మి. అందులో నేను, నా భార్య పుష్ప ఉన్నాము. అప్రయత్నంగానే దాని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మేమంటే... దానికెంత ప్రేమ...! కానీ, దానికోసం మేమే ఏమీ చేయలేకపోయాము. లక్ష్మి భర్తనుండి విడాకులు తీసుకుందని తెలిసి, దాని జీవితం పాడైపోయిందే అని బెంగపెట్టుకుంది వాళ్ళ అమ్మ. కొద్ది రోజుల్లోనే మమ్మల్నందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. అదే దిగులుతో పక్షవాతం వచ్చి నేనూ మంచం పట్టాను. ఈ లోపు నా కాలమూ తీరిపోయింది. “ఇప్పుడు నేను కూడా లేను”... అనే ఆలోచన, నా కూతురును ఎంత బాధిస్తుందో ఊహించగలను.

 కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ... మెడలోని మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుంది. భర్తనుండి విడాకులు తీసుకున్నా... అతను కట్టిన తాళి పట్ల తనకెంత గౌరవమో చూసి చలించిపోయాను. దానికి దాని భర్త అంటే చాలా ఇష్టం. అతని ఎడబాటుతో అది ఎంత కృంగిపోయిందో... కన్నతండ్రిగా నాకే తెలుసు. లక్ష్మి మంచం దిగి, వాష్ రూమ్ కి వెళ్ళి వచ్చింది. తడి ముఖాన్ని టవల్ తో తుడుచుకుంటూ... కిచెన్ వైపు నడిచింది. నేనూ తనని అనుసరించాను.

కిచెన్ లోని దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. అక్కడ మృత్యువు నిలబడి ఉంది. అంటే, నా బిడ్డకు ప్రమాదం కిచెన్ లో పొంచి ఉందన్నమాట. ఒక్క ఉదుటున కిచెన్ లోకి పరుగెత్తాను. చుట్టూ చూసాను. ముందు అనుమానించదగ్గవేమీ కనబడలేదు. మరోసారి పరిశీలించి చూసాను. అప్పుడు కనబడింది. గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది. కిచెన్ అంతా గ్యాస్ తో నిండిపోయి ఉంది. నాలో కంగారు మొదలైంది. భగవాన్....ఇప్పుడెలా...?

“లక్ష్మి ఆగవే తల్లీ... లోపలికి రాకు...!” గుమ్మానికి చేతులు అడ్డుపెట్టి అరుస్తున్నాను. లక్ష్మి లోపలికి వచ్చేసింది. లైటర్ తీసుకోబోతోంది. “లక్ష్మి... ఆగు బిడ్డా... నీ పుణ్యముంటుంది..! అంటించకు... క్రిందకి ఒక్కసారి చూడు...!” గోల గోలగా చెపుతున్నాను. నా అరుపులకు తను స్పందించడం లేదు. “భగవంతుడా... ఇప్పుడేం చేయాలి... నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి...” దేవుడిని తలచుకుంటూ ఆక్రోశిస్తున్నాను. ఇంతలో కనబడింది... స్టౌ ఉన్న షెల్ఫ్ మీద ఒక స్టీల్ గ్లాస్... ఓ క్షణం ఆలోచించాను. దాన్ని క్రిందపడేయగలిగితే... ?

నా శక్తినంతా ఉపయోగించాను. దాన్ని త్రోసేయడానికి ప్రయత్నిస్తున్నాను. గాలిలా ఉన్న నా చేయి గ్లాసులోంచి బయటకు వచ్చేసింది. లేదు... మళ్ళీ ప్రయత్నించాను. రెండోసారీ ఫలితం శూన్యం. లాభం లేదు. భగవంతుడిని తలచుకుంటూ మరొక్కసారి గట్టిగా ప్రయత్నించాను... గ్లాస్ ఎగిరి క్రిందపడింది.

లక్ష్మి ఉలిక్కిపడి, క్రిందకి చూసింది. లైటర్ పక్కన పెట్టి, గ్లాస్ తీయడానికి క్రిందకి వంగింది. అప్పుడు సోకింది ఆమె ముక్కుపుటాలకు గ్యాస్ వాసన. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి, గబ గబా కిటికీలు ఓపెన్ చేసి కిచెన్ లోంచి బయటకు వచ్చేసింది. “హమ్మయ్య” నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను.

******

సాయంత్రం లక్ష్మి ఆఫీసునుండి ఇంటికొచ్చింది. వస్తూనే... సోఫాలో అలసటగా కూర్చుండిపోయింది. ఉదయం తనతోపాటే ఆఫీసుకు వెళ్ళిన నేను, తను ఆఫీసులో ఎంత కష్టపడుతుందో చూసాను. అలసి ఇంటికొచ్చిన కూతురుకి నా చేతులతో కొన్ని మంచినీళ్ళు ఇచ్చే అదృష్టం కూడా లేకపోయింది నాకు. దూరంగా ఉన్నప్పుడు తెలియలేదు.  ఇన్నాళ్ళనుండీ... ఈ ఒంటరితనంతో నా బిడ్డ ఎంత ఆవేదన చెందుతుందో... ఇప్పుడు చూస్తున్నాను. 

భగవంతుడు ఒక్కసారి దయతలచి, నా చేతులకు ఆ రిఫ్రిజిరేటర్ ని తెరిచి, బాటిల్ పట్టుకునే శక్తినిస్తే ఎంత బాగుండు. నా తల్లి దాహాన్ని తీర్చి ఉండేవాడిని అనుకుంటూ యధాలాపంగా ఫ్రిడ్జ్ కేసి చూసిన నేను ఉలిక్కిపడ్డాను. అక్కడ ఆ ఆకారం... ! ఆ ఫ్రిజ్ దగ్గర  తనకోసం ప్రమాదం ఎదురుచూస్తుందని అర్ధమైంది. అక్కడికి పరుగెత్తుకెళ్ళాను. ప్రిజ్ ఆఫ్ అయిపోయినట్లుంది. ఫ్రిజ్ లోంచి కారిన వాటర్ అంతా అక్కడ ఫ్లోర్ మీద మడుగు కట్టి ఉంది. అంటే... లక్ష్మి ఈ నీళ్ళల్లో కాలు జారి నేలపై పడి చనిపోతుందా...? మళ్ళీ కంగారు మొదలైంది. అసలీ ఫ్రిజ్ ఎలా ఆగిపోయింది. దాని చుట్టూ చూసాను. క్షణం పాటు మ్రాన్పడిపోయాను. గోడకున్న స్విచ్ బోర్డునుండి రిఫ్రిజిరేటర్ లోకి విధ్యుత్తును  ప్రసరింపజేసే వైరు తెగిపోయింది. అందువలన ఫ్రిజ్జు ఆగిపోయింది. అయితే తెగిఉన్న ఆ వైరు చివర విధ్యుత్తును ప్రసరిస్తూ క్రింద ఉన్న నీటి మడుగులో పడి ఉంది.

అప్పుడర్ధమైంది. లక్ష్మికి మరణం ఏ విధంగా సంభవించనున్నదో...! ఇప్పుడెలా...? లక్ష్మి వైపు చూసాను. అప్పుడే లక్ష్మి సోఫాలోంచి లేచి, మంచినీళ్ళకోసం ఫ్రిజ్ వైపు వస్తోంది. ఈ సారి నేను ఆపలేనని అర్ధమైంది... ఎలా... ఎలా...? తనని ఇక్కడికి రానీయకుండా ఆపడం...?? దేవుడా... నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసం... ఈ తండ్రి పడుతున్న ఆవేదన ఎందుకు అర్ధం చేసుకోవడం లేదు. నా తల్లిని ఎందుకు ఆపదల పాలు చేస్తున్నావు...?? టెన్షన్ పడుతున్నాను. “రాకు తల్లీ... రాకు...!” ఆపాలని అరుస్తున్నాను.

లక్ష్మి... ప్రిజ్ దగ్గరకు వచ్చి, డోర్ తీసింది. అంతా అయిపోయింది అనుకుంటున్న నేను, ఏమీ జరుగకపోవడంతో ఆశ్చర్యపోతూ... క్రిందకి చూసాను. ఆమె కాళ్ళు నీటి మడుగులో ఉన్నాయి. ఏం జరిగింది...? చుట్టూ కలియచూసాను. అదృష్టం... సరిగ్గా అదే సమయానికి కరెంటు పోయింది. భగవంతుడా... నువ్వున్నావు. ఇంతకంటే సాక్ష్యం ఇంకేముంటుంది...? సంతోషపడిపోయాను. లక్ష్మి కరెంటు తీగ తెగి పడి ఉండడం చూసింది. వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, స్విచ్ బోర్డునుండి ప్లగ్ తొలగిస్తూ, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫోన్ చేసి కంప్లయింట్ చేసింది.
    భగవంతుడి దయవలన... రెండు సార్లు ప్రాణగండం తప్పింది. కానీ, మృత్యువు సమీపించినవారికి మూడు అవకాశాలుంటాయి. రెండుసార్లు తప్పితే సరిపోదు. మూడోసారి కూడా తప్పితేనే... వారు మృత్యుంజయులవుతారు. మరికొంత ఆయువు వారికి సమకూరుతుంది. కానీ, అది అసాధ్యం... నా కూతురుకి ఈ మూడవ గండం కూడా తప్పితే బాగుండు. కానీ, ఈ సారి వచ్చే ఆ ప్రమాదం ఇలా ఉంటుందని ఎలా తెలుస్తుంది...? తనని ఎలా కాపాడుకోగలను...? ఆ రాత్రంతా... బెడ్ రూమ్ లో నిద్రపోతున్న నా కూతురినే చూస్తూ కూర్చున్నాను.

******

ఉదయం నుండి అనుక్షణం నా కూతురు చుట్టే... తిరుగుతూ... మృత్యువు ఏ ప్రమాదం రూపంలో, ఏటువైపు నుండి వస్తుందా... అని దిక్కు దిక్కునూ పరిశీలిస్తూ ఉన్నాను. ఆ రోజు కూడా ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. తను ఇంటి తాళం తీయకుండానే ముందుగా ఇంటిలోకి ప్రవేశించి, ఇంట్లో మూలమూలనా పరిశీలించి చూసాను. ఆ ఆకారం జాడ గాని, మరే ప్రమాద సూచనా కనబడలేదు. “హమ్మయ్యా... ఈ రోజుకి ఏ ప్రమాదమూ లేదు”. మనసు కాస్త స్థిమితపడింది. ఎందుకో, అనిల్ ని ఇక్కడికి రప్పిస్తే బాగుండు అనిపించింది. వాడైనా కొన్నిరోజులు అక్కను కాచుకుని ఉంటాడు. కానీ, ఎలా...? వాడికెలా తెలియజెప్పేది...? ఇక్కడికి ఎలా రప్పించేది ?
రాత్రి పడుకోబోయే ముందు లక్ష్మికి ఎక్కడనుండో ఫోన్ కాల్ వచ్చింది. కారిడార్ లో కూర్చుని చాలాసేపు మాట్లాడింది. తరువాత... కళావిహీనమైన వదనంతో ఇంట్లోకి వచ్చేసింది. ఉండి... ఉండీ... లక్ష్మి కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. ఆ ఫోన్ లో ఏదో బాగా బాధ పెట్టే అంశమే అయ్యుంటుంది. అదేమై ఉంటుంది...??

లక్ష్మి బెడ్ రూమ్ లో కూర్చుని, ఇంకెవరికో ఫోన్ చేసింది. తన మాటలను బట్టి, అది తన స్నేహితురాలు జ్యోతికి అని అర్ధమైంది. అవతలనుండి... ఫోన్ లిఫ్ట్ చేసినా... లక్ష్మి చాలాసేపు మాట్లాడలేకపోయింది. లోపలనుండి తన్నుకు వస్తున్న దు:ఖాన్ని అదిమి పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. నేను అలాగే నిలబడిపోయి చూస్తున్నాను. పరిస్థితి చాలా తీవ్రమైనదేమో...తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. తన దు:ఖాన్ని చూసి విలవిల్లాడిపోయాను. దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చున్నాను. “ఏమైంది బిడ్డా...?” అడగాలని తాప్రత్రయపడుతున్నాను.

“లక్ష్మీ ఏమైందే...?” అవతలనుండి జ్యోతి అడుగుతుంది. ఆ ప్రశ్నతో... బిగపట్టి ఉన్న దు:ఖం ఒక్కసారిగా బయటకి పెళ్ళుబికింది. “జ్యోతి, ఆయన మరో పెళ్ళి చేసుకుంటున్నాడట...” వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

అవతలనుండి మౌనం...! నేనూ... విస్తుపోయి అలాగే చూస్తూ కూర్చుండిపోయాను. అయిదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నా... ఇన్నాళ్ళనుండీ ఇంకా భర్త తనకోసం వస్తాడని ఎదురుచూస్తుందా నా బిడ్డ...? ఒంటరిగానైనా... అతడిని మరచిపోయి ధైర్యంగా బ్రతికేస్తుందనుకున్నాను. నేనెంత పెద్ద తప్పు చేసానో నాకర్ధమైంది. ఆరోజే... పంతాలకు పోవద్దని ఇద్దరికీ నచ్చజెప్పి విడాకుల వరకూ పోనివ్వకుండా ఉండాల్సింది. ఒకవేళ విడాకులు తీసుకున్నా... కొన్నాళ్ళ తరువాతైనా... మరోసారి అతడిని కలిసి, అతడి మనసు మార్చుకునేలా ప్రయత్నించాల్సింది. భార్యాభర్తలమధ్య పొరపొచ్చాలతో విడిపోయేదాక తెచ్చుకుని వాళ్ళెంత తప్పు చేసారో... వాళ్ళిద్దరిమధ్య సయోధ్య కలపడం చేతకాక, మా పెద్దలమూ అంతే తప్పు చేసాం. దాని ఫలితం  నా బిడ్డ భవిష్యత్తును ఎంతటి అధోగతి పాలు చేసిందో... చేజేతులా దాని ఆశలను ఎలా నేలరాసేసిందో ఇప్పుడు తెలుస్తోంది.

“అయినా... ఏం పాపం చేసానే నేను...? ఆయనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. విడిపోయినంత మాత్రానా... విడాకులు తీసుకున్నంతమాత్రానా... ఇన్నాళ్ళు కాపురం చేసిన నన్ను ఎలా మరచిపోతాడే...? నేను ఆయనను అలా మరచిపోలేదే...? ఈ అయిదేళ్ళలో ఆయనను తలచుకోని రోజు లేదు. ఈ రోజుకీ ఆయన కట్టిన మంగళసూత్రం నా గుండెల మీదే ఉంది. ఇన్నాళ్ళబట్టి ఒక్క రోజు కూడా...నేను మరో మగాడి గురించి ఆలోచించలేదు. ఆయనకెలా... మరో ఆడది కావలసి వచ్చింది...?” వెక్కి వెక్కి ఏడుస్తూనే... ఆవేశంగా మాట్లాడుతోంది.

“ఊర్కో లక్ష్మీ... బాధపడకు...” జ్యోతి కూడా ఏం జవాబు చెప్పలేకపోతోంది.

“ఇన్నాళ్ళ ఆశ... అడియాస అయ్యింది. ఇంకెవరున్నారే నాకూ...? ఎవరికోసం బ్రతకాలి...? కన్న తల్లిదండ్రులూ నన్నొదిలేసి వెళ్ళిపోయారు. కట్టుకున్న భర్త... పూర్తిగా పరాయివాడయిపోయాడు. అక్కాతమ్ముళ్ళకు వారి కుటుంబాలు వారివే...! ఇంకెందుకే ఈ జీవితం...? చచ్చిపోయేవరకూ ఒంటరిగానే బ్రతికి ఎవరిని ఉద్దరించాలి...? బ్రతకాలని లేదే... ఈ క్షణమే... ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది.”
“ప్లీజ్... లక్ష్మి... అలా మాట్లాడకే...!” జ్యోతి అభ్యర్ధిస్తుంది.

కన్నీళ్ళు రావడానికి నాకు శరీరం లేదు గానీ, ఉండి ఉంటే... దగ్గరుండీ దాన్ని ఓదార్చలేని నా దుస్థితికి నేనెంత  రోధిస్తున్నానో తెలిసేది. అలా చాలా సేపు గడిచింది. ఫోన్ పెట్టేసిన తరువాత లక్ష్మి ఏడ్చి ఏడ్చి... సొమ్మసిల్లి పడుకుండి పోయింది.

దాన్నే చూస్తూ అలా కూర్చుండిపోయాను. మధ్యరాత్రి ఎప్పుడో... ఇంటిముందు కుక్కల ఏడ్పు వినిపిస్తుంది. గబ గబా... బయటకి వెళ్ళి చూసాను. నాలుగైదు కుక్కలు మోరలు చాపి ఈ ఇంటివైపే చూస్తూ ఏడుస్తున్నాయి.  ఏదో కీడు శంకించి, చుట్టూ చూసాను. ఏవో నల్లని ఆకారాలు కొన్ని కారిడార్ లో కనబడ్డాయి. అర్ధమైంది... ఇవి నా బిడ్డకోసమే వచ్చాయి. లేదు... లేదు... నా బిడ్డ చచ్చిపోకూడదు. నా బిడ్డ బ్రతకాలి. దేవుడా... నా కూతురుని బ్రతికించు...

వాటన్నింటినీ లోపలికి రానీయకుండా అడ్డుకుంటున్నాను. చేతులతో వాటిని కొడుతున్నాను. దూరంగా తోసేసే ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. వాటిని ఆపలేకపోతున్నాను. అవి నాలోనుండే... ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. పరుగు పరుగున లోపలికి వెళ్ళాను. లక్ష్మి బెడ్ చుట్టూ... మూగి ఉన్నాయా ఆకారాలు. నా బిడ్డనేం చేయొద్దు. మీకు దండం పెడతాను... చేతులు జోడించి... వేడుకుంటూ... ఆ గుంపును లాగేసే ప్రయత్నం చేస్తున్నాను.

“లక్ష్మీ... లక్ష్మీ... లే... లే... వచ్చి దేవుడి గదిలో కూర్చో...! ఏ శక్తులూ నిన్నేమీ చేయలేవు...” అంటూ వాటన్నంటినీ తొలగించి మంచం మీదకు చూసాను. అక్కడ బెడ్ మీద “లక్ష్మి” లేదు. ఏమైంది...? చుట్టూ మూగిన ఆ ఆకారలవైపు చూసాను. అవన్నీ తల పైకెత్తి అబగా చూస్తున్నాయి. నేనూ తల పైకెత్తి చూసాను. పైన ఫ్యాన్ కి విగతజీవిలా వ్రేళ్ళాడుతోంది లక్ష్మి శరీరం.

చేష్టలుడిగి చూస్తూ నిలబడిపోయాను. ఈ రెండు రోజులుగా... తనను కాపాడుకోవాలనే నా ప్రేమ, నా ఆరాటం, తపన... తనకి రక్షణకవచంగా నిలిచాయి. తనకు మరణం ఆసన్నమైన ఆ క్షణాలలో  మృత్యువు నన్ను తన దరిదాపుల్లో లేకుండా ఇలా తప్పించిందన్నమాట...! అయిపోయింది... అంతా అయిపోయింది. కమ్ముకొచ్చే మృత్యువును ఎవరూ ఆపలేరు. కాలం తీరిన మనుషులు ఏనాటికైనా
వెళ్ళిపోవలసిందే...! అది లేత అయినా, ముదురు అయినా... మృత్యువుకు సంబంధం లేదు. తన విధినిర్వహణలో... దయాదాక్షిణ్యాలకు తావు లేదు. ఎందరు అడ్డుకున్నా... ఎవరు ఎంత తాపత్రయపడినా... తన నిర్ణయంలో మార్పు లేదు. దీర్ఘంగా నిశ్వసించాను.
“నాన్నా... ఇంకా ఎందుకు ఇక్కడ...? వెళ్ళి పోదాం పద నాన్నా...!” వెనుక నుండి మాటలు వినిపించి, వెనుతిరిగి చూసాను.
లక్ష్మి.... నిండుగా నవ్వుతూ... నా వైపు చూస్తోంది. ఆమె వదనం ప్రశాంతంగా ఉంది. ఎలాంటి సమస్యా లేదన్నట్లు, అన్నీ తీరిపోయి... హాయిగా ఉన్నట్లు వెలిగిపోతోంది. “వెళదాం పద నాన్నా...!” బలవంతంగా నా చేయి పట్టుకుని బయటకు నడిచింది. నిశ్శబ్ధంగా నేనూ తనను అనుసరించాను.

********

 

 

మరిన్ని శీర్షికలు
poems