Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అవార్డులంటే అస‌హ్యం : విశాల్

Interview with Hero Vishal

రంగు నలుపు... బెరుకు చూపులు. పక్కింటి కుర్రాడు అని చెప్పుకోలేం. అలాగని హీరో అంటే ఒప్పుకోలేం. జాతకం బాగుండి హీరో అయిపోయాడేమో..!  కానీ తెరపై అతన్ని చూస్తే - ఇంకాస్త రంగు పూస్తే ఎక్కడ ఉండేవాడో అనిపిస్తుంది. వాడు - వీడులో అతని నటన చూస్తే.. మన తెలుగబ్బాయి వీడు అని గర్వంగా చెప్పుకోవాలని అనిపిస్తుంది. ఆ వాడు.. విశాల్. పందెం కోడి, పొగరు. శాల్యుట్ - ఈ సినిమా ఫలితాలను పక్కన పెడితే, ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనే తపన తప్పకుండా కనిపిస్తుంది. అదే విశాల్ కి ఓ ప్రత్యేక మైన స్థానాన్ని కల్పించింది. ఇప్పుడు పల్నాడు ప్రచార చిత్రం చూసినా అదే భావన. పల్నాడు నవంబరు 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మన తెలుగు అబ్బాయి విశాల్ తో ముఖాముఖి ఇది...
 

దీపావళికి సందడి చేయబోతున్నారన్నమాట..
- (నవ్వుతూ) అవునుండీ. పండగ పూట అందరూ కలసి చూడాల్సిన సినిమా ఇది. వినోదానికి వినోదం, యాక్షన్ కి యాక్షన్... దేనికీ ఢోకా ఉండదు.
 
పల్నాడు అంటే కక్షలూ కార్పణ్యాలు చూపిస్తున్నారా?
- ఇదో మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. మధురై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు వారికి అనుగుణంగా పల్నాడు అని పెట్టాం. యాక్షన్ ఉంటుంది. అలాగని కత్తులతో నరుక్కోవడాలూ, బాంబు బ్లాస్టులూ కనిపించవు. చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశాడు దర్శకుడు.
 
ఇంతకీ ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
-  ఇందులో నా పేరు శివ కుమార్. ఇది వరకు సినిమాల్లో నన్ను ధైర్యవంతుడిగా, ధీశాలిగా, వందమందిని ఒక్కడే ఎదుర్కొనే శక్తిమంతుడిగా చూపించారు. కానీ ఈ సినిమాలో నేనో పిరికివాడిని. చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటాను. పైగా నత్తి కూడా. వీటి మధ్య నా పాత్ర ఎలా మౌల్డ్ అయ్యింది అనేది చాలా ఆసక్తికరం. 
 
నత్తి.. పిరికివాడు - కమర్షియల్ హీరోయిజానికి చాలా దూరంగా ఉన్న పాత్రలా ఉంది...?
- సినిమాలో హీరో ఇలాగే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది..?  ప్రేక్షకులకు ఏదో  విషయంలో థ్రిల్ కి గురి చేయాలి. ఒక్కడే వందమందిని కొట్టేశాడంటే ఎవ్వరూ నమ్మడం లేదిప్పుడు సరైన రీజనింగ్ చూపించాలి. కొత్తగా ట్రై చేయాల్సివచ్చినప్పుడు కొన్ని సాహసాలు చేయాల్సిందే. అలాంటి సినిమానే ఇది. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఇలాంటిసీన్ ఎప్పుడో ఎక్కడో చూశాను అనిపిస్తుంటుంది. కానీ పల్నాడు సినిమాలో అలాంటి ఒక్క సీన్ కూడా నాకు ఎదురవ్వలేదు. ప్రతీ రోజూ సెట్లో కొత్త ఉత్సాహంతో పనిచేసేవాడిని. కొత్త కథల్లో నటిస్తున్నప్పుడే అలాంటి ఉత్సాహం వేస్తుంది.
 
మరీ కొత్తదనం కోరుకొంటే ఫలితం వాడు వీడులా తయారవుతుందేమో..?
- అలాంటి సినిమా నా కెరీర్ లో ఒకటుంది అని గర్వంగా ఇప్పటికీ చెప్పుకొంటుంటా. నాకు అన్నివిధాలా సంతృప్తి ఇచ్చిన సినిమా అది. డబ్బులు తీసుకొచ్చే సినిమాలు చాలా ఉంటాయి. కానీ మానసిక సంతృప్తి ఇచ్చేవి కూడా కావాలి కదా.?
 
వాడు వీడు సినిమాకి అవార్డులు రాలేదని ఎప్పుడైనా బాధ పడ్డారా?
- ఛ... ఛ.. అలాంటిదేం లేదు. నిజానికి నాకు అవార్డులన్నా, అవార్డు కార్యక్రమాలన్నా అసహ్యం. నలుగురు కూర్చుని అవార్డుని ఎలా నిర్ణయిస్తారు?  థియేటర్లో వేలాది ప్రేక్షకులు కొట్టే చప్పట్లే నాకు ముఖ్యం.
 
ఇన్నాళ్ల కెరీర్ మీకు ఏం నేర్పింది?
- నేనేం నేర్చుకోలేదు. ఇంకా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నా.
 
నిర్మాతగా ఎందుకు మారాల్సివచ్చింది?
- ఏ వ్యాపారానికైనా ప్లానింగ్ కావాలి. ముఖ్యంగా సినిమావాళ్లకు మరీనూ. సినిమా ఎప్పుడు విడుదల చేయాలి?  ఎన్ని థియేటర్లలో విడుదల చేయాలి అనే విషయాలపై నిర్మాతలకు ఓ అవగాహన ఉండాలి. కథ బాలేనప్పుడో, మేమంతా సరిగా పనిచేయనప్పుడో సినిమా సరిగా ఆడకపోతే.. ఓకే. కానీ సరైన సమయంలో సినిమా విడుదల చేయకపోవడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయితే..?  అది ఎంత మందికి నష్టం?  నేను  చేయని తప్పుకు ఫలితం అనుభవించాలా?  నా విషయంలో అలాంటి పొరపాట్లు జరిగాయి. పల్నాడు కథ ఓ నిర్మాతకు వినిపించాం. తీద్దాం, తీద్దాం అని వాయిదా వేస్తూ వచ్చాడు. నాకు కోపం వచ్చి నిర్మాత అయ్యాను. తెరపై నిర్మాతగా నా పేరు చూసుకొని చాలా సంతోషపడ్డా.
 
మరి దర్శకత్వం ఎప్పుడు?
- దర్శకుడిని కావాలన్నది నా కల. అనుకోకుండా హీరో అయ్యాను. కానీ ఏదో ఒక రోజు మెగాఫోన్ పట్టుకొని తీరతా.
 
మరి కథలు సిద్ధం చేసుకొన్నారా?  అందులో హీరో ఎవరు?
- కథలు ఉన్నాయి. వాటికి నేను సరిపోతానా, లేదా అనేది చూసుకోవాలి.
 
తెలుగులో సినిమా ఎందుకు చేయడం లేదు?
- చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. కానీ కుదరడం లేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. శశి నాకోసం ఓ కథ రెడీ చేశాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
 
తెలుగు సినిమాలు చూస్తున్నారా?
- సినిమా నా ప్రాణమండీ. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక్కడి కథానాయకుల్లో అందరూ నాకు ఇష్టమే.
 
పెళ్లెప్పుడు..?
- అప్పుడే కాదు. ప్రస్తుతం సినిమాలపైనే ధ్యాస. అలాగని ఎవరినీ ప్రేమించడం లేదు. నా వృత్తి, ప్రవుర్తి రెండూ సినిమాలే.

- కాత్యాయని దేవి
మరిన్ని సినిమా కబుర్లు
cinichuraka by bannu