Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrydayam by VN adtitya

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు హీరోలకు అచ్చిరాని రీమేకులు!

remakes are not suitable for telugu heros

'తుఫాన్' పేరుతో తెలుగులో, 'జంజీర్' పేరుతో హిందీలో ఈ మధ్యనే విడుదలయిన రామ్ చరణ్ సినిమా అపజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 1973లో విడుదలయి సూపర్ హిట్టయ్యి అమితాబ్ బచ్చన్ కు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన 'జంజీర్' సినిమాకు రీమేక్. ఈ మధ్యన తెలుగు హీరోలు చేస్తున్న రీమేక్ చిత్రాలు ఏమాత్రం అచ్చిరావడం లేదు. ఒకసారి ఈ మధ్యకాలంలో వచ్చిన రీమేక్ సినిమాల ఫలితాలు చూస్తే తెలుస్తుంది. తెలుగు హీరోలకు రీమేకులు అచ్చిరావనే సంగతి...

వెంకటేష్
విక్రమ్ నటించగా సూపర్ హిట్టయిన తమిళ 'జెమిని' ని అదే పేరుతో  తెలుగులో రీమేక్ చేస్తే సినిమా ఫ్లాప్. సూర్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'కాక కాక' ను తెలుగులో 'ఘర్షణ' పేరుతో రీమేక్ అయితే ఆడియో సూపర్ హిట్, సినిమా మాత్రం ఫ్లాప్. మళయాళంలో, హిందీలో, తమిళంలో విజయం సాధించిన 'బాడీ గార్డ్' ను అదేపేరుతో తెలుగులో తీస్తే సినిమా అట్టర్ ఫ్లాప్. కన్నడలో విష్ణువర్ధన్, సంధ్య, విమలారామన్ లతో పి. వాసు తీసిన 'ఆప్తరక్షక' ఘనవిజయం సాధించింది. దీన్నే 'నాగవల్లి' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తే సినిమా అపజయం పొందింది. ఒక్క 'సంక్రాంతి' పేరుతో వచ్చిన రీమేక్ సినిమా మాత్రమే విజయం సాధించింది వెంకటేష్ కు.

బాలకృష్ణ
తమిళంలో విక్రమ్ నటించిన 'సామి' విజయం సాధించింది. దీన్నే 'లక్ష్మీ నరసింహ' గా రీమేక్ చేస్తే సినిమా విజయం సాధించింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టీ.ఆర్, బి. సరోజాదేవి ల కాంబినేషన్ లో వచ్చిన 'పాండు రంగ మహాత్యం' అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమానే మళ్ళీ రీమేక్ చేయగా వచ్చిన 'పాండురంగడు' అట్టర్ ఫ్లాపయ్యింది. ఇక 'లవకుశ' అప్పట్లో సూపర్ హిట్టయ్యి భారీ కలెక్షన్స్ సాధించింది. దీన్నే మళ్ళీ బాపు దర్శకత్వంలో 'శ్రీ రామరాజ్యం' గా రీమేక్ చేస్తే నిర్మాతకు నష్టాలను తెప్పించింది.

రవితేజ
కన్నడంలో సూపర్ హిట్టయిన 'అప్పు రాజా' ను తెలుగులో 'ఇడియట్' గా రీమేక్ చేస్తే సినిమా ఘనవిజయం సాధించి రవితేజకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మళయాళంలో ఓ మాదిరి విజయం సాధించిన 'మీసమాధవన్' తెలుగులో 'దొంగోడు' గా, తమిళంలో విక్రమ్ నటించిన 'ధూల్' సూపర్ హిట్ కాగా దీన్నే 'వీడే' గా తెలుగు రీమేక్ కాగా, చేరన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తమిళ 'ఆటోగ్రాఫ్' ను 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' గా తెలుగులో వచ్చిన సినిమా. తమిళంలో విజయం సాధించిన 'నడోడిగల్' ను 'శంబో శివ శంబో' గా రీమేక్ గా వచ్చిన సినిమా అన్నింటి ఫలితాలు అపజయాలే.

తరుణ్
తమిళంలో తరుణ్ హీరోగానే వచ్చి విజయం సాధించిన ఓ చిత్రాన్ని 'ప్రియమైన నీకు' గా తెలుగులో రీమేకై విజయం సాధించింది. తమిళంలో వచ్చిన ఓ సినిమాను 'నవవసంతం' గా రీమేక్ చేస్తే సినిమా ఫ్లాప్. హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీల కాంబినేషన్ లో వచ్చిన 'బంటీ అవుర్ బబ్లూ' సినిమా సూపర్ హిట్టయితే తెలుగులో ఈ సినిమా రీమేక్ గా వచ్చిన 'భలే దొంగలు' అట్టర్ ఫ్లాపయింది.

పవన్ కళ్యాణ్
తమిళంలో హిట్టయిన ఓ సినిమాను 'అన్నవరం' గా తెలుగులో వస్తే సినిమా అపజయం పొందింది. హిందీలో సైఫ్ ఆలీఖాన్, దీపికా పదుకొనే ల కాంబినేషన్ లో హిట్టయిన 'లవ్ ఆజ్ కల్' ను 'తీన్ మార్ ' గా రీమేక్ చేస్తే, సినిమా పరమబోర్ గా ఉండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇక సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాలతో వచ్చిన హిందీ 'దబాంగ్' సూపర్ హిట్టయ్యితే దీన్నే 'గబ్బర్ సింగ్' గా రీమేక్ చేస్తే సినిమా ఘనవిజయం సాధించి పవన్ కళ్యాణ్ కు పూర్వ వైభవం సంపాదించింది.

నాగార్జున
తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రాన్ని 'స్నేహమంటే ఇదేరా' పేరుతో నాగార్జున, సుమంత్, భూమికలతో తెలుగులో వస్తే సినిమా అట్టర్ ఫ్లాప్. విజయచందర్ తో వచ్చిన 'శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్యం' సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమానే కె. రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో మళ్ళీ తీస్తే సినిమా తీవ్ర విమర్శలపాలయింది. అపజయం పొందింది.

వేణు
మలయాళంలో ఓ మాదిరి హిట్టయిన 'కళ్యాణ రామన్' ను తెలుగులో 'కళ్యాణ రాముడు'గా రీమేకై సినిమా పరాజయం పొందింది. తమిళంలో సూపర్ హిట్టయ్యిన ఓ సినిమాను వేణు, జగపతిబాబు, అర్జున్ లతో 'హనుమాన్ అంక్షన్' గా రీమేకై ఘనవిజయం సాధించింది.

అల్లరి నరేష్
ధనుష్ హీరోగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'కాదల్ కొండేన్' ను తెలుగులో 'నేను'గా వచ్చి సినిమా ఫ్లాపయ్యింది. తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రాన్ని భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 'సుడిగాడు' గా వచ్చి విజయం సాధించింది. 'పెళ్లయింది కానీ' పేరుతో అల్లరినరేష్, కమలినీ ముఖర్జీ లతో వచ్చిన ఫ్లాపయిన సినిమా కూడా తమిళ రీమేక్ సినిమానే.

ప్రభాస్
తమిళంలో సూపర్ హిట్టయ్యిన అజిత్, నయనతారల 'బిల్లా' ను తెలుగులో అదే పేరుతో తీస్తే సినిమా ఫ్లాపయ్యింది. కన్నడంలో సూపర్ హిట్టయ్యిన 'జోగి' ని వి.వి. వినాయక్ దర్శకత్వంలో 'యోగి' గా వస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.

చిరంజీవి
హిందీలో విజయం సాధించిన 'మున్నాభాయ్ M.B.B.S' ను తెలుగులో 'శంకర్ దాదా M.B.B.S' గా వచ్చి సూపర్ హిట్టయ్యింది. అలాగే ఎ.ఆర్. మురుగదాస్, విజయకాంత్ ల కాంబినేషన్ లో హిట్టయ్యిన 'రమణ' ను 'ఠాగూర్' గా తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడా హిట్టయ్యింది. కానీ హిందీలో సూపర్ డూపర్ హిట్టయ్యిన సంజయ్ దత్, రాజు హిర్వాణీల 'లగేరహో మున్నాభాయ్' సినిమా తెలుగులో 'శంకర్ దాదా జిందాబాద్' గా రీమేకై అట్టర్ ఫ్లాపయ్యింది.

మరికొన్ని...
రాజశేఖర్, సీనియర్ నరేష్ ల కాంబినేషన్ లో వచ్చిన 'విలన్' ఫ్లాపయ్యింది. ఇది కూడా ఓ తమిళ రీమేక్ సినిమానే. కన్నడంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయ్యిన 'ముంగార మలై' సినిమాను తెలుగులో 'వాన్' పేరుతో రీమేక్ చేస్తే ఆడియో హిట్ సినిమా ఫ్లాప్. మహేష్ బాబు, అమీషా పటేల్ లతో యస్.జె. సూర్య తీసిన 'నాని' అట్టర్ ఫ్లాప్. ఇది 'న్యూ' పేరుతో తమిళంలో సూపర్ హిట్టయ్యిన సినిమాకు రీమేక్. మలయాళంలో హిట్టయ్యిన 'క్లాస్ మేట్స్' తెలుగులో ఇదే పేరుతో రీమేక్ అయి అపజయం పొందింది. మలయాళంలో హిట్టయ్యిన 'ఫర్ ది పీఫుల్' సినిమా తెలుగులో 'యువసేన' గా రీమేకై 'నో లాస్ నో ఫ్రాపిట్' గా అయ్యింది. విక్రమ్ నటించగా సూపర్ హిట్టయ్యిన తమిళ 'దిల్' ను ఉదయకిరణ్ తో 'శ్రీ రామ్' గా తెలుగులో తీస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.

ఇంకా 'భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందారు, దమ్ము, మరో చరిత్ర, కృష్ణార్జున, పొలిటికల్ రౌడీ, హిందీ 'వెడ్నస్ డే' ఆధారంగా వచ్చిన 'ఈనాడు', శివాజీ స్వీయ నిర్మాణంలో వచ్చిన 'తాజ్ మహాల్' (కన్నడ 'తాజ్ మహాల్' రీమేకు), జబర్దస్త్ (హిందీ 'బ్యాండ్ బాజా' రీమేకు), హిందీలో హిట్టయ్యిన 'తను వెడ్స్ మను' ను తెలుగులో సునీల్ తో తీసిన 'మిస్టర్ పెళ్ళికొడుకు', ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు రీమేకై అపజయాలు పొందాయి. ఏవో కొన్ని రీమేక్ సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. మిగతావన్నీ బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి. అయినా కానీ మన తెలుగు హీరోలు కనువిప్పు చెందరు. రీమేక్ లు తీస్తూ నిర్మాతలకు కనీళ్ళు తెప్పిస్తున్నారు. ఎప్పుడు బాగుపడుతుందో ఏమో తెలుగు చిత్ర పరిశ్రమ!

-- కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
cinema title by lyricist ramajogayya shastry