ఈ వారం ( 1/3 – 7/3 ) మహానుభావులు...
మార్చ్ 1
శ్రీ ఖండవిల్లి లక్ష్మీరంజనం : వీరు మార్చ్1, 1908 న పెదపాడు గ్రామంలో జన్మించారు. సుప్రసిధ్ధ సాహితీ వేత్త, పరిశోధకులు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక విద్యాసంస్థను ప్రారంభించి బాలబాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను, ఒక సంగీత పాఠశాలను నెలకొల్పి, వాటికి విశాలమైన భవనాలు కట్టించారు. తన ఇంటిలోనే వేదపాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖాధిపతిగా, ఆంధ్రమహాభారతం పరిశోధనా ప్రతిని ఎనిమిది భాగాలుగా ప్రచురించారు.
మార్ఛ్ 3
1..శ్రీ ఆచంట లక్ష్మీపతి : వీరు మార్చ్ 3, 1880 న మాధవవరంలో జన్మించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. మద్రాసులోని ఆయుర్వేద వైద్య కళాశాలకు , 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులుగా పనిచేసారు. ఈయన 63 పుస్తకాలను భారతీయ వైద్యం పై అనగా దర్శనములు, ఆయుర్వేద విజ్ఞానం, ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము, భారతీయ విజ్ఞానము వంటివి వ్రాశారు.
2. శ్రీ సత్యం శంకరమంచి : వీరు, మార్చ్ 3 , 1937 న అమరావతి లో జన్మించారు. ప్రముఖ రచయిత. వీరు రచించిన : అమరావతి కథలు “ పుస్తకానికి 1979 లో రాష్ట్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం పొందారు.
మార్చ్ 4
శ్రీ బులుసు సాంబమూర్తి : వీరు మార్చ్ 4, 1880 న దుళ్ళ గ్రామంలో జన్మించారు. దేశభక్తుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశ స్వాతంత్ర్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు .తన సర్వస్వాన్నీ దేశోధ్ధరణకు ధారపోసిన త్యాగశీలి.
మార్చ్ 5
శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి : వీరు మార్చ్ 5, 1920 న ఐలండ్ పోలవరం గ్రామంలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు. “ ఆంధ్ర రచయితలు “ పేరన, తెలుగులో పేరెన్నిక కన్న నూరుగురు తెలుగు రచయితల గురించి సద్విమర్శతో రాయబడిన గ్రంధ రచయిత వీరు. అలాగే “ చరిత్ర ధన్యులు “ అనే గ్రంధం, వివిధరంగాలలో ప్రసిధ్ధిపొందిన వారి గురించి రాసారు..
మార్చ్ 7
శ్రీ మోపర్తి సీతారామారావు : ఎం.ఎస్. రామారావుగా ప్రసిధ్ధి చెందిన వీరు, మార్చ్ 7, 1921 న , మోపర్రు గ్రామంలో జన్మించారు. నేపథ్యగాయకుడిగా కొన్ని సినిమాల్లో పాడారు. తులసీదాసు విరచిత హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించారు. వీరు గానం చేసిన “ సుందర కాండ “ ఎంతో ప్రసిధ్ధి చెందింది.
వర్ధంతులు
మార్చ్ 5
1.శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు : వీరి అసలు పేరు పాతర్లగడ్డ నాగేశ్వరరావు. తన ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు. నాటకాల్లో పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. సుమారు పాతికేళ్ళు సినిమాల్లో పాటలు పాడి తమ సత్తా నిరూపించుకున్నారు. ఆయన పాడినవన్నీ దాదాపు హాస్యగీతాలే. ఈ నాటికీ వారు పాడిన పాటలు అందరి నోళ్ళలోనూ నానుతాయంటే అతిశయోక్తి కాదు.
వీరు మార్చ్ 5 , 1996 న స్వర్గస్థులయారు.
2. శ్రీ కొంగర జగ్గయ్య : ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటుసభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచారు.శ్రీ జగ్గయ్య గురించి చెప్పేటప్పుడు ఆయన కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠాన్ని ఎంతోమందికి అరువు ఇచ్చాడు. 100కు పైగా సినిమాలలో డబ్బింగు చేసారు.
వీరు మార్చ్ 5 , 2004 న స్వర్గస్థులయారు.
3. శ్రీమతి రాజసులోచన : అలనాటి తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి. . మద్రాసు నగరంలో 1962 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి.
వీరు మార్చ్ 5, 2013 న స్వర్గస్థులయారు.
మార్చ్ 7
శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య : గ్రంథాలయోద్యమకారుడు,ఆయుర్వేదం ,ప్రకృతి వైద్యం లో సిద్దహస్తులు మరియు పత్రికా సంపాదకుడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు.
వీరు మార్చ్ 7 , 1979 న స్వర్గస్థులయారు.
|