చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఈ Debit Cardలూ, Credit Card లూ రాకపూర్వంకూడా మనుషులు బతికేవారు.. పైగా ఒకరకమైన క్రమశిక్షణ ఉండేది. నెలజీతం తీసికుని, ఇవ్వాల్సిన పాలవాడకం, చాకలీ, పనిమనిషీ లకు , కిరాణాకొట్టువాడికీ ఇచ్చేసి, ఏ పోస్టాఫీసులోనైనా తెరిచిన RD కో ఇంకోదానికో కట్టేసి. ఆ మిగిలిన డబ్బుతో నెలంతా గడిచేది. నెలాఖరుకి, ఏమైనా మిగిలాయీ అంటే ఓ సినిమా. హొటళ్ళ కెళ్ళేముందర , జేబులోనో, పర్సులోనో డబ్బులెన్నునాయో చూసుకుని మరీ అడుగెట్టేవారు. పండగ బట్టలకి, పుట్టినరోజులకీ ఓ ఏడాది ముందరనుండీ ప్లానింగు. మధ్యలో ఏ అనారోగ్య మైనా ( అదీ చిన్నపాటి నలతలు) ఫామిలీ డాక్టరు గారి దగ్గరకే. పాపం ఆ డాక్టర్లుకూడా, మరీ డబ్బుకోసం ఒత్తిడి తెచ్చేవారు కాదు. ఏడాదికోసారి ఏ సత్యన్నారయణ వ్రతమో చేసుకుని, తన పేషంటులందరినీ ఆహ్వానించేవారు. ఆ టైములోనే ఏడాదికింతా అని ఏదో తాంబూలంలోనో, కవరులోనో పెట్టి ఇచ్చేవారు.ఏడాదంతా చిన్నా చితుకూ నలతల కి చెల్లూ.. ఇల్లు కట్టుకోడాలూ, పెళ్ళిళ్ళు చేయడాలకీ అయితే, ఓ ” దశవర్ష ప్రణాలికలు ” . చెప్పొచ్చేదేమిటంటే, జేబులో ఉన్న డబ్బులకి సరిపడేటంతే ఖర్చులు ఉండేవి. అసలు అప్పులే లేవా అంటే అదీకాదూ… ఏ వస్తువో తాకట్టు పెట్టో, ఏ నోటు రాసో తెచ్చుకునేవారు. సామాన్య మధ్యతరగతి మనుషులందరూ చాలా మట్టుకు ఇలా సంసారాలు చేసినవారే.అసలు బ్యాంకుల మొహం చూసిందెవడూ? ఒకటో తారీకున ఓ రెవెన్యూ స్టాంపుమీద సంతకం పెడితే చాలు, జీతాలొచ్చేసేవి. ప్రాణానికి హాయిగా ఉండేది.
90 వ దశకం ప్రారభం అయిందీ, కార్డుల గోల మొదలయింది. ఇదివరకటి రోజుల్లో ఊళ్ళోవాళ్ళదగ్గర అప్పులు చేసేవాళ్ళం, ఈ క్రెడిట్ కార్డులు వచ్చిన తరవాత , వీళ్ళకి కడుతున్నాము. Pouch నిండా నాలుగు Credit Card లూ, నాలుగు Debit Card లూ వేసుకోడం. కన్నూ మిన్నూ ఎరక్కుండా ఖర్చుచేసేయడం. పైగా క్రెడిట్ కార్డు వాడేటప్పుడు, తోడొచ్చిన ఇంటి ఇల్లాలు ” ఎందుకండీ అంత ఖర్చూ… ” అని అన్నా, ” ఫరవాలేదోయ్.. 45 రోజులదాకా వడ్డీ ఉండదూ.. ” అని ఓ వెర్రి సమర్ధింపోటీ..అక్కడకి పాత Dues ని clear చేసినట్టు. అన్ని ఖర్చులూ పోనూ, ఎప్పుడూ ఆ Credit Card వాడికి Minimum amounటే. ఆమాట చెప్పడు…
కార్డులుండడం ఓ పెద్ద Status Symbol అయిపోయింది. ఎన్ని కార్డులుంటే అంత గొప్పేకదా మరి…నా అనుభవం చెప్తాను– ఎన్నెన్ని అనవసర ఖర్చులు చేశానో… అదేదో mall లోకి వెళ్ళగానే, వాడెవడో వచ్చి అదేదో ఫారం మీద నా నెంబరు తీసికుని, మీరు Lucky Winner అయితే ఓ SMS వస్తుందీ, etc..etc.. మర్నాటికల్లా ఓ smఎస్సూ, అది చాలదన్నట్టు ఫోనూ.. ఫలానా హొటల్లో ఓ చిన్న get together ఉందీ, మీరేమీ కొనక్కర్లేదూ, just మేం చెప్పేది వినడమే, ఒక్క నయాపైసా ఖర్చుండదూ, పైగా మీరు వెళ్ళేటప్పుడు ఓ Surprise gift కూడా తీసికోవచ్చూ… blah..blaah.. ఇంకేముందీ,,, నెత్తిమీద శని ప్రభావం ధర్మమా అని, ఇల్లాలిని తీసికుని ఎగేసుకుపోవడం. అప్పటికే అక్కడ మనలాటి Retire అయినవాళ్ళందరూ భార్యా సమేతులై కూర్చునుంటారు, ఒక్కో టేబుల్ దగ్గరా…ఓ పిల్లదో, పిల్లాడో మననీ తగులుకుంటాడు. అదేదో Tour అంటాడు, మూడేళ్ళకి ప్లానంటాడు. ఏవేవో 5 Star Hotel stay అంటాడు, Package కి ఇంకేమీ కట్టక్కర్లేదంటాడు. ఎంత కట్టాలిరా అని అడిగితే చల్లగా చెప్తాడు , మనం తీసికునే plan బట్టి లక్షో, రెండు లక్షలో చెప్తాడు.పైగా ఇప్పటికిప్పుడు ఏమీ కట్టక్కర్లేదూ, Just Credit Card ఉంటే చాలూ, Interest free EMI లుకూడానూ అని ఊరిస్తాడు. పోనీ ఆ పిల్లేదో మరీ అంతలా ఊరిస్తోందీ, ఒప్పేసుకుందామా , జేబులో కార్డెలాగూ ఉందీ, అని అనుకున్నట్టు మన ముఖకవళికలు మారడం ఏమిటీ, పక్కనే ఉన్న ఇంటి ఇల్లాలు, కింద మన కాలు తొక్కుతుంది..
” బడుధ్ధాయీ ..దేశంలో ఉన్నవి ఇంకా పూర్తవలేదూ.. ఇప్పుడు ఈ పాకేజీలూ సింగినాదాలూ అంత అవసరమా.. ” అని.. నిజమే కదూ అనుకుని, వద్దనేస్తాం.. అసలు కిటుకంతా ఆవిడన్నమాటనుకుని, ఆవిడకి మస్కా కొట్టడం మొదలెడతారు.మొత్తానికి వాడు చూపించిన త్రైవార్షిక, ద్వైవార్షిక , ప్లానులన్నీ వద్దనుకోవడం తరవాయి, చివరకి ఓ వార్షిక ప్లాను చెప్తాడు. just 15000 అంటాడు. ఓస్ ఇంతేనా అనుకుని, మాస్టారి ముఖంలో మళ్ళీ కళొస్తుంది. ఏదో ఒకటి తీసికోకుండా వెళ్ళేటట్టు లేడూ ఈయనా, అని పాపం ఆ వెర్రి ఇల్లాలు మెత్తబడుతుంది.. ఆ మెత్తపడ్డమే అసలు గొడవంతా.. ఏదో ఇంటికెళ్ళి ఆలోచిద్దామనుకున్నా, అబ్బే అలా కుదరదూ.. ఇప్పటికిప్పుడే కట్టాలంటాడు రేపటికి తిరిగి ఇంత చవకలో ఇవ్వలేకపోవచ్చూ అని ఊరిస్తాడు. జేబులో కార్డుందిగా, స్టైలుగా దాన్ని తీసి వాడికివ్వడం, 15 వేలూ చేతులు మారడం. ఏల్నాటి శని సమయంలో ఇలాగే జరుగుతుంది మరి. దానికి సాయం ఈ Cashless ఓటీ…పెద్ద Gift pack చేసి ఓ ప్లాస్టిక్ డిన్నరు సెట్టూ, .. తిన్న తిండరక్క చేసే పనులంటే ఇవే మరి.బహుశా నగదు సహిత లావాదేవీ అయితే , మరీ ఇలా ఉండేది కాదేమో… పెన్షనులో మిగిలేదెంతా… ఇంటి ఇల్లాలి మాట విన్నా ఈ ఖర్చుండేది కాదు.. జేబులో కార్డు ఉండడం చాలు ఒళ్ళు తెలియదు…
Moral of the Story…. మనుషుల్లో ” కొవ్వు ” పెరగాలంటే Cashless… ఆరోగ్యంగా ఉండాలంటే Good old Cash Transactioన్సే శ్రేష్ఠం……
“ నగదు రహిత “ కంటే “ Credit Card రహిత “ జీవితం సుఖంగా ఉంటుందని నా అనుభవం…
సర్వేజనా సుఖినోభవంతూ
|