Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Patriotism is still alive.

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

జై (హింద్) జవాన్!

పుల్వామా దాడిలో నలభై మంది సైనికులను తీవ్రవాదులను పొట్టన పెట్టుకున్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల వేదన చూస్తూ, రోదన వింటుంటే ప్రతి మనసు చెమ్మగిల్లుతోంది. అందరి రక్తం సల సల మరుగుతోంది. ఎదురు దాడికి దిగి గట్టిగా బుద్ధి చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ దేశంలో సైనికులంటే ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యులే.

సరిహద్దు ప్రాంతంలో అహర్నిశలూ మన సైనికులను రెచ్చగొడుతూ, కయ్యానికి కాలుదువ్వుతూ, రహస్య దాడులు చేస్తూ మన పక్కలో బల్లెంలా ఉంటోంది పాక్. వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్టు మన హిత వచనాలను బే ఖాతరు చేస్తోంది.

మొన్ననే నేను ఉరిమి సినిమా చూశాను. నిజానికి  ఈవారం నేను దానిమీద సమీక్ష రాద్దామనుకున్నాను. ప్రతి భారతీయుడూ చూడాల్సిన గొప్ప సినిమా అది. పాక్ చర్యని తిప్పికొట్టలేని అసమర్థులం కాదు మనం. మన సైనిక పటాలం, యుద్ధ వ్యూహాలు, పరికరాలు, టాంకులు, విమానాలు ఇంకా తదితర సామాగ్రిలో మనం పాక్ కన్నా ఎన్నో రెట్లు అధిక శక్తిని కలిగి ఉన్నాం. ఆ విషయం దానికీ తెలుసు. అయినా కుక్క తోకర వంకర కదా!మనది శాంతి కాముక దేశం. అనుక్షణం శాంతినే కోరుకుంటాం. పంచశీల సూత్రల్లో మనం శాంతిని పొందుపరచాం. ప్రజాస్వామ్యానికి ఎంతటి గౌరవాన్ని, విలువనూ ఇస్తామో అంతటి విలువను శాంతికీ ఇస్తాము. అందుకే మనం చర్చలతో వాళ్లలో మార్పును ఆశిస్తాం. వాళ్లలో మన సోదరులను చూస్తాం. సంఝోతా ఎక్ప్రెస్ లు వేసి వాళ్లని అక్కున చేర్చుకోవాలనుకుంటాం. కాని దాయాదుల తగాదాల్లా మన ఓరిమిని చేతకానితనంగా భావిస్తూ, పాక్ మన దేశాన్ని రావణకాష్ఠంగా మార్చాలని చూస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కాశ్మీర్. అక్కడెప్పుడూ బాంబుల విస్ఫోటనలే, నడివీధుల్లో మృత్యుదేవత కరాళ నృత్యమే! ఇంతే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాలు, దేవాలయలు, జనసమ్మర్ధ ప్రాంతాలు పాక్ చొరబాటుదారుల దాడులు, ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిపోతున్నాయి. అసలు ఈ తీవ్రవాదులవల్లే మనం స్వేచ్ఛ కోల్పోయి ఎక్కడికెళ్లినా చెకింగ్ లు, వెరిఫికేషన్లు. మనిషిని మనిషి నమ్మకపోవడం. అనుక్షణం పడగనీడలో ఉంటున్న భయం.

పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధం, సర్జికల్ స్ట్రైక్ లతో మనమేంటో, మన సత్తా ఏంటో ఇప్పటికే పాక్ కు రుచి చూపించాం. పదే పదే ఓడినా బుద్ధిరాని నైజం పాక్ ది.

ఇప్పటికే పాక్ కు మనమిచ్చిన ప్రాముఖ్యత గల దేశ హోదాను ఉపహరించుకుంది మన దేశ ప్రభుత్వం. అలాగే దిగుబడి సుంకాన్నీ బాగా పెంచింది. కేవలం ఈ తరహా చర్యలు సరిపోవు. ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా’ అని దేశ స్వాతంత్ర్య సముపార్జన సమయంలో నినదించిన గడ్డ మనది. శత్రువుకు కోలుకోలేని ఒక గట్టి దెబ్బను ప్రతీకార కానుకగా అందించాలని దేశం యావత్తూ మనః పూర్వకంగా కోరుకుంటోంది. ఈ విషయంలో ఏ వర్గ విబేధాలు, వైషమ్యాలు లేకుండా జనమంతా ఒక్క తాటిపై నిలబడడం మన బలాన్ని రెట్టింపుచేసింది. నాయకులు సైతం తమ రాజకీయాలని పక్కన పెట్టి రచ్చ గెలవడానికి ఏకమవడం ముదావహం.

ఒక చిన్న పుండు వల్ల నొప్పి కలిగితే వెంటనే ఉపశమనం కోసం వైద్యుడిని సంప్రదిస్తాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమనేది నానుడి. శత్రుశేషం, రుణశేషం ఉంచుకోకూడదంటారు. ఇంకా ఎన్నేళ్లు పాక్ ఆగడాలని మనం ఉపేక్షించాలి?. కాశ్మీర్, పాక్ సమస్యలు లేకపోతే మనదేశం ఇంకింత సుభిక్షంగా, సౌభాగ్యవంతంగా ఉండేది.

అంతర్జాతీయ సమాజంలో పాక్ దురాగతాల్ని ఎండగడుతూ అందరినీ, అన్ని దేశాలనీ  సమైఖ్య పరచి, పాక్ పై సామూహిక చర్యకి పాల్పడవలసిన అవసరం ఎంతైనా ఊంది. తన అండదండల్ని అందిస్తూ పాక్ ను కాపాడుతున్న చైనా దురాగతాల్ని విశ్వవీధిలో టముకెయ్యాలి. ఎందుకంటే ఉగ్రవాదం ఏ ఒక్క దేశం సమస్యనో కాదు. అంతటా చేప కింద నీరులా విస్తరించే ఆసిడ్ అది. ఆ విషవృక్షాన్ని కూకటి వేళ్లతొ సహా పెకిళిస్తేనే అందరూ, అన్ని దేశాలు తమ కార్యకలాపాలపై సంపూర్ణ దృష్టిని పెట్టగలుగుతాయి. అభివృద్ధి పథంలో నడవగలుగుతాయి. అలాంటి రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.

దేశ సేవలో అసువులు బాసిన వీర సైనికులకు వినమ్రంగా అశ్రు నివాళి అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.

మేరా భారత్ మహాన్! జైహింద్!!

మరిన్ని శీర్షికలు
dondakaya masala