Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రయోజనం ఉండేలా కొత్తగా చెప్పడం - ..

 
చక్కటి కవితలు కథలు సీరియల్స్ నవలలు  అందించి పాఠకులను అలరిస్తున్నవారి అంతరంగాన్ని ఆవిష్కరించే ఇంటర్వ్యూలతో పాఠకులకు వారిని మరింత చేరువచేయాలనేది మా సంకల్పంతో అందిస్తున్నవి ఈ ఇంటర్వ్యూలు.. ఔత్సాహికులకు స్ఫూర్తిగా... లబ్దప్రతిష్టులను సైతం ఆకర్షించేలా పాఠకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయేలా ప్రతిష్టాత్మకంగా అందించడం గోతెలుగు ప్రధానోద్దేశం...ఈ క్రమంలో మార్చ్ 8 వ తేదీ న పుట్టిన రోజు పురస్కరించుకుని ఈవారం మనముందుకొచ్చిన ప్రముఖ రచయిత కవి వారణాసి రామకృష్ణ గారితో  ఇంటర్వ్యూ ఈ వారం మీ కోసం ప్రత్యేకం....)
 


గోతెలుగు: మీ జన్మస్థలం, బాల్యం, చదువు, అమ్మానాన్నల గురించి....
వారణాసి రామకృష్ణ : జన్మస్థలం కడప జిల్లా రాజంపేట , ఉద్యోగం కోసం చదివిన చదువు ఎలక్ట్రికల్ ఇంగినీరింగ్ లో డిప్లొమా. సాహిత్యo కోసం B.A తెలుగు లిటరేచర్, ఉద్యోగ జీవితం లో మెట్లు ఎక్కేందుకు మానేజ్ మెంట్ లో పోస్టుడిప్లమా, ఢిల్లీ ఐఐపిఎం నుండి డైరెక్ట్ ట్రైనర్ స్కిల్ల్స్ లో డిప్లొమా, ఆరోగ్య సంబంధిత విజ్ఞానం కోసం 3 ఏళ్ల హోమియోపతి కోర్సు. ECIL లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. మా  అమ్మగారు స్వర్గీయ రామలక్ష్మి వయోలిన్ విద్వాంసురాలు. బరంపురం లో ఆమె ద్వారం వెంకటస్వామి నాయుడుగారి శిష్యురాలు. తండ్రి గారు స్వర్గీయ మోహన్ రావు గారు నేత్ర చికిత్సా వైద్యనిపుణులు. కడప జిల్లా లో ఆస్పత్రి పెట్టడం తో మేము అక్కడికి వెళ్ళాము.

గోతెలుగు: మిమ్మల్ని కవితాప్రపంచం వైపు నడిపించిన స్పూర్థిప్రదాతలు....
వారణాసి రామకృష్ణ : నేను చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి రాసేవాడిని.  ప్రముఖ రచయిత్రి చిట్టా రెడ్డి సూర్య కుమారి గారు మా వూళ్ళోనే వుండేవారు వారి ఇంట్లో వున్న మొత్తం తెలుగు సాహిత్యం అంతా 8 వ తరగతి వచ్చేసరికి చదివాను. ఇక 1980 లో హైదరాబాద్ వచ్చేసాక  శ్రీ శ్రీ, రాచకొండ  గారి దగ్గరినుంచి వడ్డెర చండి దాస్, యండమూరిల దాకా అందరి రచనలు చదివాను. అవే నన్ను రచనల  వైపు నడిపించాయి. ప్రతిరోజూ నేను కోటి లో ఉండే  శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం కి వెళ్లి అక్కడ అన్ని పత్రికలూ పుస్తకాలూ చదవటమే కాక అక్కడికి వచ్చే దాశరధి, దేవులపల్లి రామానుజం గార్లని కలిసి అనేక విషయాలు మాట్లాడే వాడ్ని. సాహితీ సభలకి వెళ్ళే వాడ్ని. నా రచనలకు మెరుగులు దిద్దినది రాచమల్లు రామచంద్ర రెడ్డి గారు అయితే కథకి ఒడుపు నేర్పింది విపుల చతుర సంపాదకులు శ్రీ చలసాని ప్రసాద రావు గారు, నవలలు రాయడం (ఏకలవ్య శిష్యరికం పద్ధతి లో) మాత్రం యండమూరి గారి నుంచి నేర్చుకున్నాను.

గోతెలుగు: మీ తొలి కవితను ప్రోత్సహించిన పత్రిక, సంపాదకులు..ఆనాటి అనుభూతి...
వారణాసి రామకృష్ణ : కవితలు రాయడం నా పదవ యేటనె ప్రారంభించినా....  వాటి  ప్రచురణ, అసలు  పత్రికలకు ఎలా పంపాలి అర్ధమైంది  మాత్రం 1980 తర్వాతే! తోలి రోజుల్లో నా బాధ ప్రపంచం బాధగా ఆ తర్వాత ప్రపంచం బాధ నా బాధ గా రాసినా అసలు ఏ బాధని సాహితీ అంశం గాఒక  హృదయ అనుభూతిగా రాయాలో నేర్చుకున్నది పది సంవత్సరాలు దాటినా తర్వాతే! ఇక మొదట ఆంధ్ర భూమి వార పత్రిక లో భావ చిత్రాలు పేరిట 6 కవితలు ఒకే పేజి లో నా అనుభూతి సహితంగా ప్రచురించారు. దానికి చాలా స్పందన వచ్చింది ఎంత స్పందన అంటే గుట్టల కొద్దీ ఉత్తరాలు వచ్చాయి వాటిని చూసి (అప్పటి) సంపాదకులు కనకాంబరరాజు గారు ఏమిటీ గుట్టలు అని అసిస్టెంట్ ఎడిటర్ ని అడిగితే వాళ్ళు రెండువారాల   క్రితం మనం ప్రచురించిన భావ చిత్రాల కవితలకి వచ్చిన రెస్పాన్స్ అని చెప్పారట. రాసింది ఎవరు అంటే నా పేరు చెప్పారట. ఆయనా నా కవితలు చదివి వచ్చి కలవమని చెప్పి పంపించారు. వెళితే ఇంత చిన్న పిల్లడివే, నేను ఎవరో పెద్దాయన అనుకున్నా అని నవ్వి రాస్తూ వుండండి అని చెప్పారు. తర్వాత పరిచయం అయిన శ్రీవిక్రం గారు  పల్లక పత్రిక కి ఎడిటర్ గా వుండే వారు.  పల్లకి లో కొన్ని కథలు, టెన్స్ ఆఫ్ ది టైమ్స్ అనే శీర్షికతో రాజకీయ కవితలు రాశాను.  ఇక ఆ తర్వాత అన్ని వార మాస పత్రికల్లో కథలు కవితలు వస్తుండేవి అయితే 1989 లో కార్టూనిస్ట్   శ్రీధర్ గారి పరిచయం నా సాహితీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన ప్రోత్సాహం తో ఈనాడు దిన పత్రికలో పార్ట్ టైం ఉద్యోగం చేరి అనేక అంశాల మీద బోలెడన్ని వ్యాసాలు రాశాను. చాలా విషయాల్ని ఈనాడు లో ప్రముఖ పాత్రికేయులు, కవి హెచ్ ఆర్కే గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత విపుల చతుర లో కథలు అనువాద కథలు రాశాను. ఈనాడు ఆదివారం లో ఈవారం ప్రత్యేకం పేజీలో క్రీడలు, సైన్సు టెక్నోలజీ లాంటి విషయాల మీద వ్యాసాలు రాశాను. ఆంధ్ర భూమి కి కూడా ఆదివారం నాటి సంచికలో  హ్యుమ రిజం పేరిట హాస్య వ్యాసాలు రాశాను. తెలుగులో వచ్చిన వస్తున్నా అన్ని దిన వార మాస పత్రికల్లో ఏదో ఒక రచన చేశాను. ప్రస్తుతం  సుకథ , గోతెలుగు ,ప్రతిలిపి లాంటి అంతర్జాల పత్రికలలో నా రచనలు వస్తున్నాయి. ఇటీవల సుకథ వెబ్ మ్యాగ జైన్ లో వచ్చిన మార్కెట్, మరకలు అన్న కథలు ప్రాచుర్యం పొందాయి.”మరకలు”  కథ ప్రచురణ అయిన పది రోజుల్లో 5 వేల మంది పాఠకులు చదివారు.

గోతెలుగు: మీరు హాస్య రచనలు చాలా చేసారు ..
వారణాసి రామకృష్ణ : అవునండి, ఏదైనా ఒక సీరియస్ విషయాన్నీ కామెడీగా చెప్తే బాగుంటుంది అని నా అబిప్రాయం. మీరు గమనించండి, ఎంతో లోతైన విషయాన్ని ప్రతి రోజు ఒక గొప్ప కార్టూన్ రూపం లో ఈనాడు శ్రీధర్ గారు అందిస్తారు. నిజానికి ఆ విషయం గాని సీరియస్ గా చెప్తే వేరేగా ఉంటుంది. స్వీకరించాల్సిన వ్యక్తీ కూడా ఇర్రిటేట్ అయి ఇంకోలా స్పందించే ప్రమాదం ఉంది.  భావం ఎంత శక్తిమంతమైనా
                                      భాషా పాటవం లోపిస్తే ఫలితం
                                        -మృగ్యం !
                                       మెదడును కదిలించే
                                         పదునైన ప్రక్రియ
                                             -వ్యంగ్యం!!
అందుకని కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో రాశాను. కొన్నాళ్ళ తర్వాత శ్రీరమణ గారి సునిశిత హాస్య వ్యాసాలు చదివాను అవి నన్ను చాలా ప్రభావితం చేసాయి. వాటి ప్రభావం తో హ్యుమరసం పేరిట ఆంధ్ర భూమి లో, ప్రభాతహాస్యం పేరిట సుప్రభాతం లో ఆనందలహరి పేరిట విపులలో, హ్యుమరిజం పేరిట చతుర లో అనేక అంశాల మీద హాస్యoగా రాశాను.


గోతెలుగు: కవి హృదయం, స్పందనలు ఎలా ఉండాలని మీరు భావిస్తారు .
వారణాసి రామకృష్ణ : కవి మొదట్లో తన బాధ చెప్పాలనుకుంటాడు. తర్వాత ప్రపంచం బాధ అర్ధం చేసుకోవాలని అర్ధమతుంది. అయితే ఊహ వచ్చిందే తడవుగా రాయకుండా అది ఎంత మందికి అనుభూతి కలిగిస్తుంది  అని అలోచించి దాన్ని సాహితీ అంశం లా మార్చాలా వద్దా అని ఆలోచించాలని నేను భావిస్తాను. అంతేకానీ వచ్చిన ప్రతి ఊహా ని అక్షరాల్లోకి మార్చను. అనుభూతి ప్రధానం గా స్పందనలు వుండాలి, రచనకి ప్రయోజనం సిద్దించాలి అని నా ఉద్దేశ్యం.

గోతెలుగు: ఆధునిక కవితా ప్రపంచం ఎట్లా ఉంది ..ఎటువైపు వెళ్తోంది...
వారణాసి రామకృష్ణ : పిచ్చి పిచ్చిగా తయారవుతోంది . తోచిన ఆలోచన తోచిన విధంగా టైపు చేసేసి (తప్పులతో సహా )  అంతర్జాలం లో పెట్టేయ్యటం.. అది గొప్ప కథ, కవిత గా ఎవరికీ వారు అనేసుకోవటం తో చెత్త పోగయి, ఏది సాహిత్యం కాదో అదే ఎక్కువ చెలామణి అవుతోంది. అయితే అక్కడక్కడా మంచి కవిత్వం, కథలు రాసే వాళ్ళు లేకపోలేదు అలాంటి వారికీ సరైన వేదిక లేదు. ఈ సందర్భంగా నేను ఎప్పుడో రాసిన కవిత ఉటంకిస్తాను :
తెలివి తెలివి లేకుండా పడుండడంతో
 చెత్త పెత్తనం చెలాయిస్తోంది!
 కళ లో సృజనాత్మకత  లోపించి
 తతంగం తన్మయీభావం ప్రదర్శిస్తోంది !
 ప్రతిభకి తగ్గ ప్రచారం
 ప్రచారానికి తగిన ప్రతిభ
 ప్రతి రంగం లోనూ కొరవడి
 ప్రతి పనీ గంటుపడుతోంది!
 ప్రగతి కుంటుపడుతోంది!!


గోతెలుగు: సాహిత్య లోకంలో మీరెక్కడున్నారు..
వారణాసి రామకృష్ణ : రచనా లోకం లోనే ఉన్నాను. ఈ లోకం లో దశలు అనేవి ఉండవు. స్థాయి వుంటుంది అంతే, బాగా రాసిన కవికి ఉన్నత స్థానం రాయలేని వారికీ ఇంకో స్థానం అయితే దాన్ని డిసైడ్ చేసేది పాఠకులు.అది వాళ్ళ మనస్సులో వుండే స్థానం తప్ప పైకి కనిపించేది కాదు.

గోతెలుగు: సినీ రంగం లో ఏమైనా కృషి చేశారా?
వారణాసి రామకృష్ణ : విఫల ప్రయత్నాలు చేశాను. అవకాశాలు కొద్దిలో తప్పిపోయాయి. నీలాంబరి నిర్మాత వంశీ దర్సకత్వం లో ఒకటి ప్లాన్ చేసారు కానీ కుదరలేదు. కాట్రగడ్డ ప్రసాద్ గారికి ఒక కథ చెప్తే ఓకే చేశారు కానీ అప్పుడు ఆయ తీస్తున్న సింగన్న చిత్రం ఫ్లాప్ అయ్యేసరికి ఈ ప్రాజెక్ట్ అవలేదు. రామానాయుడు గారికి చెప్పిన కథ నచ్చి ముందుకు వెళ్తున్న టైం కి సరిగ్గా ఆయన్ని మొదటిసారిగా ఎన్నికల్లో ఎం పీ గా నిలబెట్టారు. ఆయన గెలవటం ఢిల్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ గారు నేను ఎన్నో కథలు చర్చించుకుని ఒకటి ఫైనల్ చేసుకున్నాక రాఘవ గారు కొడుకు ప్రతాప్ ని నిర్మాణ బాధ్యతలు తీసుకొమ్మని చెప్పారు కానీ ఆ కుర్రాడికి ఇతర వ్యవహారాల్లో ఉన్న ఆసక్తి సినిమాల మీద లేకపొయ్యేసరికి రాఘవ గారు నొచ్చుకున్నారు.దాంతో ఇదీ పక్కకే పోయింది. ఇన్నిటినీ తట్టుకోవటం చాలా కష్టం అయ్యి ఉద్యోగం, పత్రికల్లో రచనలు వీటికే పరిమితం కావాలని నిశ్చయించుకున్నాను.
 

గోతెలుగు: భావుకత, వాస్తవికత ఈ రెండింట్లో దేనిపై మీ మక్కువ?
వారణాసి రామకృష్ణ : వాస్తవికత నింపుకున్న భావుకత్వం , భావుకత ఇమిడిన వాస్తవికత  ఉన్నప్పుడే సాహిత్యానికి విలువ ఉండేది.

గోతెలుగు: కవిత్వానికి ప్రాస ఎంతవరకు అవసరం?
వారణాసి రామకృష్ణ : కాలువ గట్టున నడవటం, ముళ్ళ కంపల్లో నడవటం ,మంచి రోడ్డు మీద నడవటం అన్నీ ఎలాగైతే ఒకటి కావో రచనా ప్రక్రియ లో ప్రాసలూ అంతే!  కవిత్వపు అంశం మీద ఆధారపడి ఒక్కోసారి ప్రాస కి  ప్రాధాన్య0 ఉంటుంది ఒక్కోసారి ఇదే ప్రాస కవిత కాళ్ళకి అడ్డం పడుతుంది.అంచేత ప్రాస కోసం కవిత్వం కాదు. చెప్పాల్సిన విషయం ఏ నడక లో చెప్పాలో అది ముఖ్యం. నా అనుభవం లో కవి కి అది సహజంగా వచ్చే నైపుణ్యం అనిపిస్తుంది .

గోతెలుగు: ఊహల్లో తేలిపోతూ అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేదీ కవులే, వాస్తవాన్ని మరింత భయంకరంగా చూపిస్తూ పాఠకులను భయభ్రాంతులకు గురిచేసేదీ కవులే....ఏది కవి బాధ్యత?
వారణాసి రామకృష్ణ : నేను ఒకసారి ఇలా రాశాను:
        అదిగదిగో ఉషోదయం !
      ఆశావాదం లో అభ్యుదయ కవి!
     ఇదంతా ట్రాష్ !
     నిరాశ నిద్దట్లో నిషా కవి!
    భావాలకతీతంగా
    రెండు రెక్కలు సాచి
    ఉత్పత్తులు చేస్తున్న సు
    కష్ట జీవి!!
    ఇప్పుడు మీకు అర్ధమై వుండాలి సుకవి ఎవరో .. కవి బాధ్యత ఏమిటో!

 

గోతెలుగు: కవితా ప్రపంచం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు, అందుకున్న పురస్కారాలు....
వారణాసి రామకృష్ణ : ఏది రాసిన అందరికీ చేరువ కావాలని రాస్తాను.కథా పోటీల్లో బహుమతులు చాలానే వచ్చాయి . పురస్కారాలు వాటి ప్రదర్శన ఇష్టం లేదు ఎందుకంటే రాసింది వాటికోసం కాదు.

గోతెలుగు: మీ ధ్యేయం, లక్ష్యం...ఏమిటి? ఎటువైపు మీ పయనం...
వారణాసి రామకృష్ణ :
అంశం, సంఘటన, విషయం  ఏదైనా మనుషులు అందరూ మూలం లోని  భావం సరిగ్గా ఒక్కటిగా అర్ధం  చేసుకుని ఏకాభిప్రాయం తో దగ్గరకావాలన్నదే!

గోతెలుగు: మీ గమ్యానికి మీరెంత చేరువలో ఉన్నారు?
వారణాసి రామకృష్ణ : సాహిత్యం లో గమ్యం ఉండదు కేవలం ప్రయాణం మాత్రమె!

గోతెలుగు: కలమే శక్తివంతమైన ఆయుధం..మీ ఆలోచనలతో, అక్షరాలతో మీరేం సాధించారు? ఇంకా ఏమేం సాధించాలనుకొంటున్నారు?
వారణాసి రామకృష్ణ : పైన చెప్పాను కదా- అంశం, సంఘటన, విషయం  ఏదైనా మనుషులు అందరూ మూలం లోని  భావం సరిగ్గా ఒక్కటిగా అర్ధం  చేసుకుంటే చాలా వరకు సమస్యలు పుట్టవు. సమాజం ఆరోగ్యకరం గా ఉంటుంది. ఎంత వీలయితే అంత దగ్గరిగా మనుషులు వచ్చే విధం గా వుండే సాహితీ సృష్టి చేశాను. అదే రచయిత గా సాధించటం అంటే!

గోతెలుగు: కొత్త విషయాన్ని చెప్పడం, విషయాన్ని కొత్తగా చెప్పడం...ఏది కవిత పరమార్థం?
వారణాసి రామకృష్ణ : విషయానికి ప్రయోజనం ఉండేలా కొత్తగా చెప్పడం!
 

గోతెలుగు: ఇప్పటి పరిస్టితులు ఎలా ఉన్నాయంటారు?
వారణాసి రామకృష్ణ :
     “ పక్కవాడిని పక్కకినెడితే గానీ
      పట్టుబడని విజయం!
    ఎదుటివాడిని ఎక్కి తొక్కితే గానీ
     అందని సాఫీ జీవనం!
   కంతల సామాజిక ఛట్రం లో
   కపట సిద్ధాంతాలు కొలమానం!
  వింత కదూ రాజ్యాంగ చట్టాల్లో
   ద్వంద్వ విధానాలు ప్రామాణికం !!”   --  ఎప్పుడో రాశా...ఇప్పటికీ ఇలాగే వున్నాయి పరిస్థితులు!


గోతెలుగు: గోతెలుగు పత్రిక పై ...మీ అభిప్రాయం
వారణాసి రామకృష్ణ : అంతర్జాల పత్రికల్లో మన గోతెలుగు పత్రిక బాగుంది. మంచి విషయాలతో బాటు సత్కాలక్షేపం ఇస్తోంది. ఇది చాలా ముఖ్యం. చెత్త పాఠకుల మెదళ్ల లోకి వంపి సమాజాన్ని భ్రస్టు పట్టించే కంటే నాలుగు మంచి విషయాలు ఆరోగ్యకర సంగతులుచెప్పి నలుగురి మెప్పు  పొందటం నిజంగా గొప్పే! అందుకు  గో తెలుగు పత్రికని అబినందించాల్సిందే!   
  
       
       
     

 

మరిన్ని శీర్షికలు
jayaho veerapatnuloo jayaho