అంత తేలిక కాదు ఒక సైనికుడిగా బ్రతకడం! అంత తేలిక కాదు మృత్యువుతో సహజీవనం చెయ్యడం! అంత తేలిక కాదు మాతృ దేశానికి శత్రువుల తూటాకీ మధ్య చాతిని ధైర్యంగా నిలపడం. సైనికుడంటే ఎవరనే ప్రశ్నకి “దేశ రక్షణకోసం సంతోషంగా ప్రాణాలు అర్పించేవాడు” అని ఒక్క వాక్యంలో సమాధానం చెప్పచ్చు. "జాతస్యహి దృవో మృత్యు..." పుట్టిన వాడు గిట్టక తప్పదు! నిజమే కానీ, ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ముందడుగు వెయ్యడం అంత తేలిక కాదు. ఎటువైపు నుంచి దూసుకువస్తుందో తెలియని చావుని లెక్క చెయ్యకుండా, సుఖం అనే మాటని కలలోనైనా తలవకుండా, ఇంటికి, అయినవాళ్ళకి దూరంగా వుంటూ అణువణువులో దేశ భక్తిని నింపుకుని బ్రతకడం అంత తేలిక కాదు.
సైనికుడిగా బ్రతకడానికి చాలా సాహసం కావాలి. అలాగే సైనికుడి భార్యగా బ్రతకడానికి కూడా. ఏ స్త్రీ అయినా తన భర్తా బిడ్డలతో సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటుంది. కానీ సైనికుడిని భర్తగా అంగీకరించిన స్త్రీమూర్తులు మాత్రం ముందు దేశం తరువాతే తన మాంగల్యం అనుకుంటారు. భర్తలు దేశ రక్షణా భారాన్ని తన భుజస్కందాలపై మోస్తుంటే, భార్యలు సంసారాన్ని తమ భుజాలపై మోస్తుంటారు. పిల్లల పట్ల తల్లి బాధ్యతతోపాటు తండ్రి బాధ్యత కూడా తామే తీసుకుని ద్విపాత్రాభినయం చేస్తుంటారు. పిల్లల ఆలనా పాలనలతో పాటు అత్తమామల సంరక్షణా బాధ్యతని కూడా స్వీకరిస్తారు. ఏడాదికి ఒకసారో, రెండు సార్లో వచ్చే (అసలు వస్తాడో రాడో కూడా తెలియని) భర్త కోసం సంవత్సరమంతా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంటారు.
సరిహద్దులో పేలుళ్లు మొదలైతే ఆ పేలుళ్ల సైనుకుల భార్యల గుండెల్లో ప్రతిధ్వనిస్తాయి. భరిచలేని అలజడితో వారి గుండెలు బిగుసుకుపోతాయి. ఆ సమయంలో ఇంట్లో ఫోన్‌మోగినా నట్టింట్లో ఒక శతఘ్ని పేలినట్టుగా వణికిపోతారు. ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని బయపడిపోతుంటారు. అంతటి సంఘర్షణలో కూడా తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉంటారు. పిల్లలకీ, అత్తమామలకీ ధైర్యం చెపుతుంటారు. భయం వారి గుండెల్ని మెలేస్తున్నా కళ్ళలో ధైర్యాన్ని మాత్రం చెక్కు చెదరనివ్వరు. భర్త విజయుడై తిరిగి రావాలని కోటి దేవుళ్ళకి మొక్కుకుంటారు. తిరిగొస్తే వారి ఆనందానికి అవధులుండవు. భర్త ఇంట్లో అడుగు పెట్టిన దగ్గరి నుండి అనుక్షణం అతనిని సంతోషపరచడం కోసం హడావిడి పడిపోతారు. సకల సపర్యలూ చేస్తారు. ఇంటి గురించీ, పిల్లల గురించి దిగులు పడద్దని వాళ్లని చూసుకోడానికి నేనున్నాను అని భర్తలకి హామీ ఇస్తారు. అతను తిరిగి విధులకి వెళ్ళాల్సిన రోజున పొంగుకొస్తున్న దుఃఖాన్ని చిరునవ్వు వెనక సమాధి చేసి, గుండె రాయి చేసుకుని సాగనంపుతారు. భర్త కనుమరుగయ్యేంత వరకూ గుమ్మంలో నిలబడి చూస్తూ సముద్రమంత బాధని రెండు కన్నీటి బొట్లుగా రాల్చి, రాలిన ఆ కన్నీళ్లని ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడుతూ దినచర్యలో పడిపోతారు. భర్త యుధ్ధంలో అమరుడైతే దేశ సౌభాగ్యానికి తన సౌభాగ్యాన్ని అర్పించానని గర్విస్తారు. అంతటి త్యాగాన్ని వాళ్లు త్యాగంగా భావించరు! దేశం పట్ల తమ బాధ్యతగా భావిస్తారు. ఒక సైనికుడి భార్యగా కొద్ది కాలమైనా బ్రతికే అవకాశం తమకి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతఙ్ఞతలు తెలుపుకుంటారు.
చావుకన్నా భయంకరమైనది ఏంటో తెలుసా? "మన ప్రియమైన వారి మరణ వార్త వినడం." ఆ భయంకరమైన బాధని భరించడానికి ఆ స్త్రీమూర్తులు అనుక్షణం సిధ్ధంగా ఉంటారు. సైన్యంలో చేరడం అంటే దేశం కోసం ప్రాణ త్యాగానికి సిధ్ధపడదమే! ఒక సైనికుడిని భర్తగా అంగీకరించడం అంటే దేశం కోసం తన నూరేళ్ళ జీవితాన్ని అర్పించడమే. కాళ్ళ పారాణైనా ఆరకుండానే వైధవ్యాన్ని పొందిన ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. తమ తొలుచూరు బిడ్డను భర్త చేతికి అందించేలోపే జాతీయ జెండాని కప్పుకున్న భర్త శవంపై పడి బోరున రోదించాల్సిన విషాదకరమైన పరిస్థితి ఎంతోమందికి కలిగింది. అంత విషాదాన్ని అనుభవించి కూడా భర్త వీరగాధలని పిల్లలకి వినిపిస్తూ వారికి దేశభక్తిని నూరిపోసి వాళ్ళని కూడా సైనికులుగా మార్చిన వీరపత్నులు ఎంతో మంది ఉన్నారు.
కొన్ని సినిమాలలో రిటైరైన సైనికులని కామెడీ పీసులుగాను, భర్తలకి దూరంగా బ్రతుకుతున్న సైనికుల భార్యలని వ్యక్తిత్వం లేని ఆడవారిగానూ చూపించారు. అలా చూపించడం క్షమించరాని తప్పు. దానివల్ల తెలిసీ తెలియని వయసులో ఉన్న కుర్రకారుపై చెడు ప్రభావం పడుతుంది. సమాజానికి సైనికులపై చిన్న చూపు ఏర్పడే అవకాశం ఉంది. సైన్యంలో చేరేందుకు మొగ్గు చూపే యువత తగ్గిపోతారు. పోకిరీల వల్ల తమ భర్తలని, సుఖ సౌఖ్యాలని దేశం కోసం త్యాగం చేసిన పుణ్యవతులు రకరకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సైనికుడంటే దేశానికి రక్షణ కవచం. సైనికుల సతీమణులంటే దేశానికి సోదరీమణులనే విషయం విస్మరించకండి. వారికి మనం అందించాల్సింది వెకిలి చూపులు, సానుభూతులూ కాదు గౌరవం. దేశ జాతీయ జెండాని ఎంత గౌరవంతో చూస్తామో ఆ సోదరీమణులని కూడా అంతే గౌరవంగా చూడాలి. మనని, మన దేశాన్ని రక్షించే సైనిక దేవుళ్ళ పడతులని రక్షించడం మన భాద్యతగా, వీరపత్నిల మర్యాదే దేశ మర్యాదగా భావించాలి. సోదరులమై అండగా నిలబడాలి. ఇంకా చెప్పాలంటే శత్రుదేశ సైనికుల భార్యలని కూడా మన అక్క చెల్లెళ్లుగా భావించాలి. ఎందుకంటే వారు కూడా మన దేశ వీరపత్నులలాగే త్యాగధనులు.
|