Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope march1st to march 7th

ఈ సంచికలో >> శీర్షికలు >>

దేశభక్తి ఇంకా బతికే ఉంది - ఆదూరి.హైమావతి

Patriotism is still alive.

శరీరం వడలి , నడుం వంగి నడవలేక నడవలేక , భుజమ్మీద బుట్టతో అడుగులో అడుగేసుకుంటూ నడిచి అడవిచేరింది  ఆదెమ్మ.  ఒక చెట్టుక్రిందకూర్చుని ఆకాశం కేసి చూసింది.

"ఏం ముసలమ్మా! అడవికొచ్చావ్! నడవలేకపోతు న్నావే!  ఏంపనిక్కడం?" అన్న స్వరం విని తలపైకెత్తి చూసింది.ఆమె కంటికి ఎవ్వరూకనిపించలేదు. చూపుసరిగా ఉంటేగా కనిపించను.

ఐనా సమాధానం చెప్పింది."  వాననక , వంగడనక ,చలనక , చావనక మంచు కొండల్లో మనకోసం , సుఖాన్ని వదిలేసి కాపుకాచే జవాన్లను పొట్టన పెట్టుకున్నారు కదా ద్రోహులు! వాళ్ళకుటుంబాలకు ఏదైనా సాయం చేయాలని ,పండ్లు దొరికితే అమ్మిసొమ్ము వాళ్ళకు పంపుతాను."

ఫక్కున నవ్వు."సరే నీకీ వయస్సులో ఇంత దేశభక్తి ఉంటే నేనూ సాయం అంది స్తాను ,నాపండ్లు రాలుస్తాను పట్టుకెళ్ళి అమ్ముకో"అంటూ సపోటా చెట్టు జలజలా అరమాగిన పండ్లు అరచేతిలోపట్టేంత పెద్ద వాటిని రాల్చింది.ఆదెమ్మ గబగబా అన్నీఏరుకుని బుట్టనింపుకుంది."ధన్యవాదాలువృక్షరాజమా!"అని చెప్పి బయ ల్దేరింది.

బుట్ట తలకెత్తు కోను ఎంతోకష్టపడి ,వాటినిమోసుకుంటూ నాలుగురోడ్లకూడల్లో కూర్చుంది. బడిముందు నుంచీవెళుతూ పిల్లగాళ్ళ నడిగి ఒక సుద్దముక్క తెచ్చు కుని కూడలి మధ్యలో ఉన్న దీపస్తంభం గోడమీద ఇలావ్రాసింది.

" మన దేశ రక్షణకోసం ముష్కరుల క్రూరచర్యలకు బలైన వారికుటుంబాలకు నిధి" ఆమెను చూసి నాలుగు రోడ్లలో వెళ్ళేవాళ్ళంతా వచ్చి అంతపెద్ద సపోటా లను మర్కెట్లో ఎక్కడా చూడనందున ఆమెచెప్పిన రేటు కు కొని ,ఒక డబ్బాకు పెట్టిన కన్నంద్వారా సొమ్ము దాన్లోవేసి పోయారు. ఒక్క గంటలోనే ఆమె బుట్ట ఖాళీ ఐంది.

మరునాడు మళ్ళా అడవికొచ్చిన ఆదెమ్మను చూసి "ఏం మళ్ళావచ్చావ్? నిన్నటి పళ్ళేమయ్యాయి?" అనేస్వరంవిని, "అన్నీ అమ్మి దాచాను. ఇంకా డబ్బానిండాల, అవన్నీ వాళ్ళకు పంపాల.గంజిత్రాగి వచ్చాను." అంది ఆదెమ్మ.

"సరే ఇవాళ నా నారింజలు ఏరుకో." అని కొమ్మలు కదపగానే ఎర్రబారుతున్న పెద్ద సైజు నారింజలు గలగలా రాలాయి. ఆదెమ్మ అన్నీఏరుకుని బుట్ట ఎత్తుకుని ఈ మారు మరోకూడల్లో కూర్చుని నిన్నటిలాగే అమ్ముకుంది. డబ్బా ఇంకా నిండలేదు. మరునాడు మామిడిపండ్లు, ఆమరునాడు  జామపండ్లు ,ఇంకో రోజు కమలా పండ్లూ ఇలా ఒకవారంపాటు అమ్ముకున్నాక డబ్బానిండవచ్చింది.

ఆ రోజున దానిమ్మలు తెచ్చి కలెక్టరాఫీసు ముందుకూర్చుంది .కలెక్టరు గారు లోని కెళుతూ ముసలి ఆదెమ్మను చూసి కారాపి క్రిందకు దిగాడు. ప్రతినెలా వృధ్ధాప్య పెన్షన్ కోసం వచ్చి తనకోసం కాచుక్కూర్చుని , సగం మాత్రమే తీసుకుని మిగతా సగం దేశ సరిహద్దుల్లో కాపలాకాసే జవాన్లకొసం ఇచ్చే ఆమెను కలెక్టర్ సులువుగా గుర్తుపట్టాడు. ఆదెమ్మ ఎవ్వరికీ ఇవ్వక తనకు మాత్రమే నమ్మకంతో ఇచ్చే సొమ్ము దాచి ఆయన  జవాన్ల సంక్షేమ నిధికి పంపుతుంటాడు.

"ఏం!ఆదెమ్మవ్వా!ఏంటీ బుట్ట!"అన్నాడు .

"అయ్యా! కాశ్మీరు ప్రాంతలో ముష్కరుల చేతుల్లో మరణించిన జవాన్లకోసం ఈ పండ్లు అమ్ముకుంటు న్నాను."అంది

"ఇంతపెద్ద పండ్లు ఎక్కడా చూడనేలేదు .ఎక్కడివి?"

"అడవితల్లి ఇచ్చిందయ్యా!"

"అడవితల్లా!" నవ్వాడు కలెక్టర్ ."ఔన్నాయనా! బుధ్ధుడు మరణించేముందు ప్రకృతి శోభించి ఎండు చెట్లు చిగురించి నీడనిచ్చి, ఆచెట్ల పుష్పాలు బుధ్ధుని పడకపై రాలలేదా! మురికినీరు స్వఛ్ఛ జలంలా మారలేదా!"

"ఓహో నీకు బుధ్ధుడంత ప్రేమ ఉందా!"

"ఉందోలేదో అడవిలో పండ్లవృక్షాలనడుగు నాయనా!. "

"అదిసరే ఆదెమ్మవా! నీకు ఆజవాన్లమీద అంత ప్రేమ ఎందుకూ!" 

"అదే నా జీవితం కనక. నా ఐదో ఏట  గాంధీ  తాత మాఊరొచ్చి చెప్పిన ఉపన్యా సానికి దేశభక్తి అబ్బింది.బళ్ళోపంతుళ్ళు బోధించిన పాఠాలకు అది పెరిగింది. దేశంకోసం  తెల్లవాళ్ల చేతుల్లో మరణించిన దేశభక్తులగురించీ విన్నరోజు అది బలపడింది.అందుకే మావాళ్ళంతా వద్దన్నా సైకుడిని పెళ్ళిచేసు కున్నాను. ఆయన కాడ్గిల్ యుధ్ధంలో మరణించాడు.అప్పటికి నా కొక కొడుకు. వాడినీ చది వించి దేశానికే ఇచ్చేశాను. ఇప్పుడు వాడు కాశ్మీర్ సరిహద్దుల్లో కాపలాకాస్తున్నాడు. నేడో రేపో వాడినీ దుర్మార్గులు పొట్టన పెట్టుకోవచ్చు. నాదేశాన్నీ, నా దేశప్రజలనూ కాపాడను ప్రాణత్యాగం చేస్తేనేం? నేను వీరమాత నవనూ!" అంటూండగా ఆమె రొంటినదోపుకున్న మొబైల్ ఫోను మోగింది.

"నాయనా అదుగో ! నాబిడ్డ అసువులు బాశాడు. ఈ సొమ్ము వీరజవాన్ల కుటుంబా లకు పంపు నాయనా! " అంటూ క్రిందపడి, ప్రాణాలు విడించింది ఆదెమ్మ.

కలెక్టర్ ఆఫోన్ అందుకుని వినగా నిజంగానే ఆమె కుమారుడు పటేల్ కుమార్ అసువులు బాసిన వార్త విని కలెక్టర్ ఆశ్చర్యపోయాడు.ఆమె కడుపుతీపికీ,దేశభక్తికీ , దేశంపై ఉన్న ప్రేమకు అచ్చెరువందాడు.ఆ వీర మాతకు ప్రణమిల్లి ఆపై చర్యలు చేపట్టాడు.

మరిన్ని శీర్షికలు
pratapabhavalu