స్నేహ ని చూస్తే.. తెలుగింటి అమ్మాయేమో అనే భ్రమల్లో ఉండిపోతాం!
ఆమె కట్టూ, బొట్టూ
మాటా.. తీరు..
అన్నీ అలానే ఉంటాయి. తెరపై అడుగుపెట్టిన దగ్గర నుంచీ ఇప్పటి వరకూ.. పద్ధతి పాటించిన కథానాయిక స్నేహ మాత్రమేనేమో..? మనది గ్లామర్ ప్రపంచం అని చెప్తుంటారు. కథానాయికలంతా ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని నడుచుకోవాల్సిందే అంటుంటారు. కానీ స్నేహ మాత్రం ఇవేం పట్టించుకోలేదు. సినిమాలొచ్చినా, రాకపోయినా ఒకే తీరున తన ప్రయాణం సాగించింది. అందుకే స్నేహ అంటే ఇప్పటికీ ఆ అభిమానం చెక్కు చెదరలేదు. ఉలవచారు బిరియానీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి... తన దైన శైలిలో ఆకట్టుకొంది. ఉలవ చారు రుచి ఎవ్వరినీ మెప్పించలేక పోయినా... ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సందర్భంగా స్నేహతో స్పెషల్ చిట్ చాట్ ఇది.
* చాలా రోజుల తరవాత కెమెరా ముందుకొచ్చారు ఎలా ఉంది ఆ అనుభవం?
- ఇది స్నేహ రీ ఎంట్రీ అని అంటున్నారు. అయితే... నేనేం సినిమాలకు దూరం కాలేదు. కాస్త విరామం వచ్చిందంతే. పెళ్లయినా సినిమాలపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. మా వారూ సినిమా రంగానికి చెందిన వారే కావడం కలిసొచ్చింది. ఇంట్లో ఎప్పుడూ సినిమా కబుర్లే. అందుకే పరిశ్రమకు దూరమయ్యాననే బాధ నాకెప్పుడూ లేదు. కానీ మళ్లీ ఇలా అందరి మధ్యకీ రావడం, డైలాగులు వల్లివేసుకోవడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం - చాలా చాలా బాగుంది. ఇలాంటి వాతావరణానికి దూరమయ్యానా..? అన్న ఫీలింగ్ వస్తోంది.
* గౌరి పాత్ర కోసం కసరత్తేమైనా చేశారా?
- అలాంటిదేం లేదు. దానికి కారణం ప్రకాష్ రాజ్ గారే. ఆయనేం చెబితే నేను అదే చేశా. నేను చేయాల్సిన హోం వర్క్ కూడా ఆయనే చేసేశారు (నవ్వుతూ) డబ్బింగ్ కళాకారుల పని తీరు ఎలా ఉంటుందో ఈ పాత్రతో నాకు ఓ అవగాహన వచ్చింది. తెరపై సన్నివేశం జరుగుతుంటే.. నటిస్తూ డైలాగులు చెప్పడం.. చాలా కష్టం. సునీత నాకు ఎలా డ బ్బింగ్ చెప్పేదో అనిపించింది.
* వయసుకు మించిన పాత్ర పోషించడం ఇబ్బంది అనిపించలేదా?
- అదేంటో నాకన్నీ అలాంటి పాత్రలే దక్కాయి. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. స్నేహ ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోగలదు అన్న భరోసా పరిశ్రమకు కలిగింది. గౌరీ పాత్ర కూడా ఓ ఛాలెంజ్ గానే స్వీకరించా.
* సినిమా చూసి మీ ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
- ప్రసన్న అయితే చాలా హ్యాపీ. స్నేహ లాంటి నటి నాకు భార్య కావడం గర్వంగా ఉంది అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తనకి నచ్చిదంటే అంత కంటే కావల్సింది ఏముంది?
* ఈ సినిమా విషయంలో ప్రసన్న ఏమైనా సలహాలిచ్చారా?
- ఈ పాత్ర నీకు బాగుంటుంది. నువ్వే చేయగలవ్ .. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు.. అన్నారు. దాంతో నాకూ నమ్మకం వచ్చింది. నాకు ఎలాంటి పాత్రలు న ప్పుతాయో నాకంటే తనకే బాగా తెలుసు అనిపించింది. తన దగ్గర నాకు నచ్చే విషయం ఏమిటంటే... ఎక్కువగా సలహాలివ్వడు. నీకు ఏది మంచిదో నువ్వే ఆలోచించుకో అంటాడు. నా పాత్రల విష యంలోనూ అంతే.
* గౌరీ మంచి భోజన ప్రియురాలు. మరి మీరూ అంతేనా?
- నేనే కాదు. మావారూ అంతే. కొత్త ప్రదేశానికి వెళ్తే.. అక్కడ ఫేమస్ రెస్టారెంట్లు ఏమున్నాయో ఆరా తీస్తాం. కొత్త కొత్త వంట కాలు రుచి చూస్తాం.
* కథానాయిక పాత్రలకు దూరమయినట్టేనా?
- నేను కథానాయికను కాదు అని ఎవరు చెప్పారు. గౌరీ పాత్ర అలా కనిపించలేదా..? (నవ్వుతూ)
* మరి పాటలూ.. డాన్సులూ లేవు క దా..?
- నేను ముందు నుంచీ వాటికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడూ అంతే. పెళ్లయ్యింది, వయసు పెరుగుతోంది.. ఈవిషయాల్నీ దృష్టిలో ఉంచుకొని పాత్రలు ఎంచుకొంటా.
* మీవారితో కలసి నటిస్తారా?
- నేనూ అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా. అదెప్పుడు కుదురుతుందో చూడాలి.
* ఇన్నేళ్లపాటు గ్లామర్ ని నమ్ముకోకుండా సంప్రదాయబ ద్దంగా కనిపించడం కష్టం అనిపించలేదా?
-కష్టం ఏముంది..? నా పాలసీ అంతే. నా దగ్గరకు వచ్చిన దర్శకులు కూడా నాకు అలాంటి కథలే చెప్పారు. నన్ను ప్రేక్షకులూ అలానే చూడాలనుకొన్నారు. నా ఇంట్లో వాళ్లు, స్నేహితులు నా సినిమా చూసి 'ఇదేంటి స్నేహ ఇలాంటి పాత్ర ఎంచుకొంది..?' అని అనుకోకూడదు. ముందు నుంచీ ఇదే పద్ధతి పాటిస్తున్నాను. అలాంటి పాత్రలనే ఎంచుకొన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
* ఏ భాషలో నటించడం సులభం?
- అదేం లేదు. నటికి ఎక్కడైనా ఒక్కటే. మంచి పాత్రలు ఎక్కడొస్తే అక్కడ చేస్తా. తెలుగులో కమర్షియల్ వాతావరణం ఉంటుంది. తమిళంలో కాస్త ఆర్ట్ సినిమాల వాతావరణం కనిపిస్తుంది. కన్నడ లో మరీ ఎక్కువ . అయితే ఎక్కడైనా సరే.. న టించే పద్ధతులో మార్పుల్లేవు.
* నటన ఒక్కటేనా? కొత్తగా ఏమైనా ప్రయత్నించాలని లేదా?
- చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథలు వింటున్నాం. త్వరలోనే ఆ సంగతులు చెబుతా.
* నిర్మాత గానూ మీ ప్రయత్నం విజ యవంతమవ్వాలి.. ఆల్ ది బెస్ట్
- ధ్యాంక్యూ
-కాత్యాయని
|