MUNNAR - ANUSHA BHADRIRAJU

MUNNAR

ప్రకృతి ప్రేమికుల స్వర్గ ధామం మున్నార్
కేరళ ప్రకృతి అందాల నిలయం . దేశ విదేశి పర్యాటకులను విశేషం గా ఆకర్షించే రాష్ట్రం .ఇక్కడ ఉండే బ్యాక్ వాటర్ అందాలు , బీచ్ లు ,హిల్ స్టేషన్ లు , అడువులు ఎంతో మంది ప్రకృతి ప్రేమికులను ఇక్కడకు రప్పిస్తున్నాయి . ఇక్కడ ఉన్న హిల్ స్టేషన్ లలో చెప్పుకోదగినది మున్నార్ .


మున్నార్ ఒక సుందర ప్రదేశం. చల్లటి వాతావరణం . ఎతైన జలపాతాలు , ఘాట్ రోడ్ లు , చేతికి తాకుతయానిపించే మేఘాలు , గిలిగింతలు పెట్టె పిల్ల గాలులు , పచ్చని చాప పరిచినట్టుండే తేయాకు తోటలు , అరుదు గా పుష్పించే నీల కురింజి పుష్పాలు ఒకటేమిటి ఎన్నో అందాలు . ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే ఇంతకన్నా మంచి ప్రదేశం ఇంకెక్కడా ఉండదేమో ! .

మున్నార్ అంటే మలయాళం లో మూడు నదులు అని అర్ధం . ముద్ర పూజ , నల్లతాని , కుందల అనే మూడు నదుల మధ్యన ఉన్న సుందర ప్రదేశమే మున్నార్ . సముద్రమట్టానికి 1600 కిలో మీటర్ల ఎత్తున ఉన్న మున్నార్ ఒకప్పటి బ్రిటిష్ పాలకుల వేసవి రిసార్ట్ .


ప్రకృతి మాత ఆకు పచ్చ చీర కట్టుకున్నట్టు మున్నార్ లో ఎటు చూసినా పచ్చదనమే . ఇక్కడ ఎన్నో చూడ తగిన ప్రదేశాలు ఉన్నాయి . మున్నార్ నుండి ఎర్నాకుళం వెళ్ళే వైపు కొన్ని ప్రదేశాలు ను , కొడైకెనాల్ వెళ్ళే వైపు కొన్ని ప్రదేశాలు ను , కోయంబత్తూర్ వెళ్ళే వైపు కొన్ని ప్రదేశాలు ను వీక్షించవచ్చు . మున్నార్ లో పచ్చదనానికి ముఖ్య కారణం కాఫీ మరియు తేయాకు తోటలు . వీటిలో ఎక్కువ శాతం టాటా కంపెని వారి నిర్వహణ లో ఉన్నాయి .

 

ఏరివికులం నేషనల్ పార్క్

మున్నార్ ప్రాంతం లో ప్రధాన ఆకర్షణ ఎరివికులం నేషనల్ పార్క్ . ఇది మున్నార్ నుండి సుమారు 15 కిలోమీటర్లు దూరం లో ఉంది . 97 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం లో విస్తరించి ఉంది ఈ పార్క్ . ఇక్కడ అరుదైన అరుదైన సీతా కోక చిలకలు ను , వివిధ రకాల పక్షులు ను , జంతువులు ను చూడవచ్చు . ఇక్కడ నుండి టీ తోటల అందాలు వీక్షించవచ్చు . ఇక్కడ పర్వతాలపై నీల కురింజి అనే పుష్పం ప్రతీ 12 ఏళ్ళ కు ఒకసారి పుష్పిస్తుంది . ఆ సమయం లో ఈ పర్వతాల అందాలు వీక్షించడానికి పర్యాటకులు తరలి వస్తారు .

 

అన్నముడి పర్వత శిఖరం

అన్నముడి పర్వత శిఖరం ఎరివికులం నేషనల్ పార్క్ లోపల ఉంది . ఇది దక్షిణ బారత దేశం లోనే అతి పెద్ద శిఖరం . ఈ శిఖరం ఎత్తు సుమారు 2700 మీటర్లు. ఈ పర్వత శిఖరం పై ట్రెక్కింగ్ చేయడానికి అటవీ శాఖ మరియు వన్యప్రాణి సంరక్షణ శాఖల అనుమతి తీసుకోవాలి .


మట్టుపెట్టి

మున్నార్ నుండి సుమారు 13 కిలో మీటర్లు దూరం లో ఉంది మట్టుపెట్టి . ఇది సముద్రమట్టానికి సుమారు 1700 మీటర్ల ఎత్తులో ఉంది . ఇక్కడ ఉన్న మట్టుపెట్టి రిజర్వాయర్ పర్యాటకులు ను ఆకర్షిస్తుంది . ఇక్కడ ఉన్న కొండలు , ల్యాండ్ స్కేప్ లను ఆస్వాదించవచ్చు .ఇక్కడ ఉన్న పచ్చటి తేయాకు తోటలు కూడా ఆకట్టుకుంటాయి .

చిన్నకనల్

చిన్న కనల్ మున్నార్ దగ్గర లోనే ఉన్న మరో ప్రాంతం . ఇక్కడ నుండి ఘాట్ రోడ్ అందాలు ఆస్వాదించవచ్చు . ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ను చుస్తే ఎవరైనా చిన్న పిల్లలు అయిపోవాల్సిందే. ఇక్కడ రాళ్లు నిట్ట నిలువు గా ఉండి మనల్ని ఆశ్చర్య పరుస్తాయి . ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2000మీటర్ల ఎత్తులో ఉంది .

మున్నార్ నుండి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో ఉండే అనియరంగల్ తేయాకు తోటలుకు ప్రసిద్ది . ఇక్కడ ఉన్న వాటర్ రిజర్వాయర్ , తేయాకు తోటలు లో పర్యటిస్తూ ఓ కొత్త అనుభూతిని పొందవచ్చు .

టాప్ స్టేషన్

మున్నార్ లో మరో ప్రదేశం టాప్ స్టేషన్ . ఇది అతి ఎత్తైన ప్రాంతం .సముద్ర మట్టానికి సుమారు 1700 మీటర్ల ఎత్తులో ఉంటుంది . ఇక్కడ మేఘాలు మనకంటే తక్కువ ఎత్తులో నుండి వెళ్తూ కనువిందు చేస్తుంటాయి . మబ్బుల్లో మనం తేలుతున్నట్టు గా అనుభూతిని పొందుతాము . మున్నార్ ను చూడడానికి వచ్చే వారు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ టాప్ స్టేషన్ .

టీ మ్యూజియం

తేయాకు తోటల ఆవిర్భావం మరుయు అభివృద్ధి కి సభందించి మున్నార్ కు ఘనమైన చరిత్ర ఉంది . ఈ చరిత్ర ను భావి తరాలకు తెలియచేయడానికి ఇక్కడ టాటా కంపెనీ టీ మ్యుజియం ను నిర్వహిస్తుంది . ఈ మ్యజియం లో అనేక రకాల చిత్రాలు , వస్తువులు , యంత్రాలు మనం తిలకించవచ్చు . మున్నార్ ప్రాంతం లో టీ తోటల అభివృద్దికి సంభందించిన ఎన్నో అంశాలు వీటి ద్వారా తెలుసుకోవచ్చు. .

 

ఎలా చేరుకోవచ్చు

మున్నార్ కు దగ్గరలోని రైల్వే స్టేషన్ తేని (తమిళనాడు) సుమారు 60 కిలోమీటర్లు దూరం లో ఉంది . చెంగనచెర్రి రైల్వే స్టేషన్ సుమారు 90 కిలోమీటర్లు దూరం లో ఉంది . దర్గ్గర లోని విమానాశ్రయం మదురై (తమిళనాడు) సుమారు 140 కిలోమీటర్లు దూరం లో ఉంది . కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సుమారు 190 కిలోమీటర్లు దూరం లో ఉంది . కొచ్చిన్ నుండి మున్నార్ కు కేరళ రోడ్ రవాణా సంస్థ వారి బస్సులు ఉంటాయి . ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి .

 

పిల్లలు ను పెద్దలను ఆకట్టుకునే పర్యాటక ప్రదేశం మున్నార్ , ఒక్క సారి చుస్తే మళ్లీ మళ్లీ తన దగ్గరకు రప్పించు కుంటుంది అనడం లో సందేహం లేదు .