కొల్హాపురి మహాలక్ష్శి. మనఆలయాలు-7. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కొల్హాపురి  మహాలక్ష్శి. మనఆలయాలు-7.
ఆలయ విశేషాలుసవరించు

పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు.[2] ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.

ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి, 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని, యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది.

అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.[3]

నిర్మాణ శైలిసవరించు

మహాలక్ష్మి దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

పూర్వకథసవరించు

అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.

శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది.[4]

సూర్యగ్రహణం రోజు స్నానం చేస్తేసవరించు

ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి.