ఆవేదన - మద్దూరి నరసింహమూర్తి

ఆవేదన

ఈ విశాల భూప్రపంచంలో -- భారతీయ యువతి ఒక విలక్షణ శైలితో, అత్యుత్తమైన నాగరిక ప్రమాణాలతో, ఎన్నో శతాబ్దాలుగా అందరి గౌరవ ప్రణామాలు అందుకుంటూ ఎదిగింది. కానీ, సుమారు ఒక దశాబ్దానికి పైగా, ఆమెలో భౌతికంగా పారదర్శకంగా వస్తున్న మార్పులు -- నా మనసులో, ఎనలేని ఆందోళనతో కూడిన ఆవేదన కలగచేస్తున్నాయి.

ఈ రోజుల్లో వస్తున్న చలనచిత్రాలు, టీవీలో కనిపిస్తున్న దృశ్యాలు, పాశ్చాత్య దేశాలనించి దిగుమతి చేసుకుంటున్న ఫాషన్ జిలుగుల ప్రభావంతో --- అలా ఉండడానికి ఉవ్విళూరుతూ --- అనుకరిస్తున్న భారతీయ యువతి గమనం ఎటు పోతోంది, ఏ దిశగా పరిగెడుతోంది, ఆ పరిణామం ఎలా ఉండబోతోంది --- అని కొన్నాళ్లుగా నా మదిలో ఆందోళన-ఆవేదన.

- - నా కళ్ళలో పడ్డ ఒక్కొక్క అంశం ---

అన్ని జీవరాశులకు ఇచ్చినట్లే, భగవానుడు స్త్రీకి కూడా రెండు కళ్ళు ఇచ్చేడు.

కవుల కవిత్వానికి ఆలవాలమైన ఆ రెండు కళ్ళలో -- ఒక కన్ను -- ముప్పావు వంతు వరకు -- ఫాషన్ / అందం / అధునాతనం / నవనాగరీకం పేర్లతో -- నేటి యువతులు తమ కేశాలతో కోరి కోరి కప్పుకుంటున్నారు.

-- ఇది గమనిస్తున్న ఆ పరమాత్ముడు, భవిష్యత్తులో పుట్టబోయే ఆడపిల్లలకి ఒక కన్ను మాత్రమే ఇస్తే చాలనుకుంటాడేమో, అని, భయం వేస్తోంది. ఆ ఆలోచనే గగుర్పాటు పుట్టిస్తోంది.

పాపట తిన్నగా ఉంటే జీవన గమనం తిన్నగా ఉంటుందని ఆర్యోక్తి.

కానీ, ఫాషన్ పేరుతో, పాపట కోరి వంకర టింకరగా తీసుకుంటున్నారు. అందుకే కాబోలు, చాలా జీవితాలు ‘దారి తప్పుతున్నాయి’ అన్న వార్తలు విరివిగా వినవలసివస్తోంది.

ఆడపిల్ల అందం ఇనుమడింపచేసేది కేశసంపద అన్నది జగద్విదితం.

చిత్రకారుని కుంచెకు కులుకులు దిద్దే కేశాలు కురచైపోతోన్నాయి; పొడుగాటి వాల్జెడ కనుమరుగైపోతోంది; అందులో ఊగిసలాడే జడగంటలు జగతిలో కలిసిపోయాయి.

-2-

జడలో తురుముకొనే పూల సోయగం, అందానికే అందం.

కానీ, ఇప్పుడు పూలకి ఆ నెలవే లేదు. ప్రస్తుతం ఘంటసాలగారు జీవించివుంటే -- "తలనిండ పూదండ దాల్చిన రాణీ " అని తప్పుగా పాడేనా, అని ఆలోచించకుండా ఉండలేరు.

నుదిటిమీద కుంకుమ బొట్టు శుభ సూచకం, మంగళప్రదం.

ఆ బొట్టు కి కాలం చెల్లిపోయి – ఒక రకమైన చుక్కలు, బొట్టు బిళ్ళలు కొన్నేళ్లు తళతళలాడేయి. క్రమంగా, అవికూడా ఎందుకు అని, బోడి నుదురుతో కనపడుతున్నారు. చిన్న పిల్లలు, పెళ్లికాని పిల్లల విషయంలో మనసుని కాస్త సరిపెట్టుకుందామన్నా -- విచారమేంటంటే, వివాహితులు కూడా ఫాషన్ పేరుతో అలాగే ఉంటున్నారు. దాంతో, మనకి ఎదురుగా వచ్చే ఆధునిక వనితామణి -- పెళ్లి కాని కన్యయో, వివాహితయో, లేక ...... (అమంగళం ప్రతిహతమగుగాక) తెలిసే వీలు లేకుండాపోతోంది.

వేడుకలు వినోదాలలో, యువతులు నృత్యగానాలతో ఆనందిస్తూ అలరించడం సర్వసాధారణం.

కానీ, ఆ సందర్భాలలో - ఆఖరికి గణేశ/దేవీ నవరాత్రి సందర్భాలలో కూడా, ఆ దేవతామూర్తుల ఎదురుగా ఉన్న మండపాలలో -- అర్ధనగ్న శరీరాలతో అశ్లీలంగా వారు చేసే నృత్యాలు ఎంతో జుగుప్సాకరంగా ఉంటున్నాయి. శోచనీయమేమిటంటే, అవి చూస్తున్న చిన్నపిల్లలు వాటిని నేర్చుకొని తమ భవిష్యత్తుని ఆ నృత్య రీతులలో తీర్చిదిద్దుకుంటున్నారు.

వస్త్రధారణ విషయానికి వస్తే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

భారతదేశంలో మునుపు స్త్రీలు వాడే చీర-జాకెట్టు, పరికిణీ-వాణీ, చుడీదార్-కుర్తా ఇవే అని, ప్రద్రర్శనశాలలో చూడవలసి వచ్చేటట్టుగా, అవి కనుమరుగైపోయాయి. పైట, వాణీ, దుపట్టాలు ఎలా ఉంటాయో మరచిపోయి చాలా ఏళ్లయింది. కొన్నాళ్ళు ప్యాంటు చొక్కా -- ఆ తరువాత, తరచుగా ఉతుకుడు అవసరంలేని జీన్స్ బట్టలు వేసుకొనేవాళ్ళు.

పోనీ అలాగేనా సరిపెట్టుకుందామంటే - అవి ఇప్పుడు ఎంత కురచగానో మారిపోయి, దేహంలో ముప్పావు భాగం నగ్నంగా కనపడే స్థితికి ఎ(దిగి)పోయేయి. అక్కడితో ఆగకుండా, అవి చిన్న పెద్ద కన్నాలతో వెలవెల పోతున్నాయి. ఇంకొన్నాళ్ళకి, ఆ కన్నాలకి ఎటువంటి రసరమ్య భాగ్యం కలగబోతోందో కాలమే చెప్పాలి.

-3-

పోల్చడానికి జుగుప్సాకరంగా ఉన్నా -- వాస్తవానికి, రోడ్డుమీద అడుక్కునే ముష్టిది కూడా తన ఒంటి మీద ఉన్న కాసింత బట్టతోనే తన శరీరం వీలైనంతగా కప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది.

తన శరీరాన్ని ఎంతమేర తప్పనిసరిగా బహిర్గతం కాకుండా చూసుకుంటూ ఉండాలో ఉండి తిరిగినా కూడా, ఈ (అ)సభ్య సమాజంలో స్త్రీ లైంగిక దాడులు ఎదుర్కోక తప్పడంలేదు. (అంతర్జాలంలో సమాచారం ప్రకారం, మన దేశంలో గత ఐదేళ్ళలో స్త్రీలపైన రెండున్నర లక్షలకు పైగా లైంగిక దాడులు జరిగేయి). అలాంటప్పుడు, తమ తమ అంగాంగ ప్రదర్శన, పోటాపోటీగా మోతాదుమించి కోరి బహిర్గతం చేస్తూ తిరిగితే, స్త్రీలకు రక్షణ రమ్మంటే, ఎక్కడనుంచి వస్తుంది ?

చేతులు కాలిన తరువాత – కాదు -- చేతులు కాల్చుకొని, ఆకులు పట్టుకుంటానంటే లాభం ఏమేనా ఉంటుందా ?

పెళ్లికాని యువతీ యువకులు ‘ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్న తరువాత వివాహం చేసుకుంటాము’ అన్న నెపంతో, కొన్నాళ్ళు సహజీవనం చేస్తుండడం ఎంతవరకు సమంజసం ?

పరువంలోకి వచ్చిన వారి వయసు, ఆ వయసు వేడి, సర్వసాధారణంగా ఉండే తొందరపాటు, ‘ఏమీ కాదులే’ అని సరిపెట్టుకోవడం, ఒకరిపట్ల ఒకరికి ప్రకృతి సహజమైన శారీరక ఆకర్షణ వలన -- ఆ ‘సహజీవనం’ లో వారు లైంగిక సంబంధం లేకుండా ఎలా ఉండగలరు ? ‘సహజీవనం’ పేరుతో వివాహం కాకుండా శారీరక సుఖాలు అనుభవించడం అనైతికమే కదా. అనుకున్న సహజీవన కాలం ముగిసిన తదుపరి కానీ, లేక ముందుగానే కానీ, ఒకరి సహచర్యం మరొకరు నచ్చుకోక విడిపోతే, అంతవరకూ వారు గడిపిన జీవనం 'అశ్లీల జీవనం' కాదా ?

విజ్ఞానపరంగా మానవులు ఎంత పురోగమించినా, గర్భం రాకుండా ఉండడానికి మందులతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అదృష్టం అరకొరైతే, ’అరటిఆకు ముల్లు’ సామెత నిత్య నూతనమే అన్నది నిర్వివాదాంశం కదా.

చలనచిత్రాలు, టీవీలో అనైతికంగా అశ్లీలంగా నటించే నటీమణులకు ఆ జీవనం వారి వారి వృత్తి. పైగా, అలా నటించడానికి పుష్కలంగా పారితోషికం దొరుకుతోంది. కానీ, వారిని గుడ్డిగా అనుకరించి, అదే నవ్య నాగరికం అని భేషజాలకిపోయే మన భారతీయ యువతికి దొరికేది అపనిందలు, అంతకుమించి ఆపదలు.

ఎదురుగా వచ్చే వనిత గురించి సంబోధించవలసి వస్తే గౌరవం ఉట్టిపడేటట్లుగా 'ఆమె' అనగలగాలి. అలా కాకుండా, అగౌరవంగా 'అది' అనిపించుకుంటే - ఎంత విచారకరమో, అంతకుమించి ప్రమాదకరం కూడా.

-4-

పిల్లల అనైతికత ప్రవర్తనకు అడ్డు వేసే హక్కు, వారి తల్లి తండ్రులుకి మాత్రమే ఉంది. కానీ, వారు ఏమీ చెప్పలేకపోతున్నారు.

ఎందుకంటే - చెప్తే వినేవారు లేరు.

పైగా, మా ‘వ్యక్తి స్వాతంత్రంకి’ అడ్డు చెప్పడానికి మీరెవరు, అని తల్లి తండ్రుల మీదే ఎదురుదాడులు. లేదంటే, నన్ను ‘ఇలా ఉండు అలా ఉండు అని శాసిస్తే, ఆత్మహత్య చేసుకుంటాము’ అని బెదిరింపులు.

 

నాకైతే, ఈ సమస్యకి సమాధానం ప్రస్తుతానికి అగమ్యగోచరం.

కాలమే సమాధానం చెప్పాలి, తప్పక చెప్తుంది అని ఒక నమ్మకం మాత్రం, మనసులో ఎదో మూల మిణుకుమిణుకుమంటోంది.

అంతవరకూ ఈ ఆవేదన తప్పదు.

*****

తుది పలుకులు : 1.పైన నేను వాపోయినది ఎంతమాత్రమూ స్త్రీ ద్వేషిగా కాదు. పైగా, స్త్రీ పైన నాకుండే నిండు గౌరవంతోనే అని గ్రహించమని -- సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

2. ఈ వ్యాసం చదివి, మన సమాజంలో కొంతేనా మార్పు రావాలని, వస్తే సంతోషించే వారిలో నేను ప్రధముడిని అని కూడా -- సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

3. నా ఈ వ్యాసంతో, అన్యాపదేశంగానేనా, పాఠకుల మనసు కించిత్తేనా నొప్పిస్తే - - క్షంతవ్యడిని.

 

--- మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు. Mob:9164543253.

మరిన్ని వ్యాసాలు

Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు