వినాయక చవితి కథ - Hithokthi

Vinayaka chaviti katha
వినాయక వ్రత కథ
 
సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆరోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించటం మొదలు పెట్టాడు.
ఒకప్పుడు గజ (ఏనుగు) రూపంలో వున్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమ శివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు.
అప్పుడు గజాసురుడు "స్వామీ, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే వుండాలి" అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే వుండటం మొదలు పెట్టాడు.
ఇదిలా వుంటే, కైలాసం (శివుడి ఇల్లు)లో వున్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో వున్నాడని తెలుసుకుంది. కానీ, శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి, చివరికి విష్ణుమూర్తిని ప్రార్ధించి, తన భర్త విషయం చెప్పింది.
"ఓ మహానుభావా, పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు” అని కన్నీళ్ళు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీ దేవిని ఓదార్చి పంపేశాడు.
అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చం పేందుకు గంగి రెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు.
శివుడి వాహనం నందిని ఒక గంగి రెద్దుగా చేసి, బ్రహ్మ మొదలైన దేవతల చేత తల కొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరు గంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు వుండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగి రెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, “మీకు ఏం కావాలో కోరుకోండి. నేను ఇస్తాను" అని చెప్పాడు.
అప్పుడు శ్రీహరి “ఇది శివుడి వాహనం నంది. శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు" అని కోరాడు.
 
ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగి రెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని, తనకు చావు తప్పదని అర్ధం చేసుకున్నాడు. అపుడు తన పొట్టలోపల వున్న శివుడిని “నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా వుండాలి. నా చర్మం నువ్వు ధరించాలి" అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా, లోపలనుంచి శివుడు బైటకు వచ్చాడు.
హరి శివుడితో "చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది” అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.
 
వినాయకుడి పుట్టుక
 
కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు వుంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.
ఇది ఇలా వుండగా, శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు.
లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి, కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో వున్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి, తాను తీసుకు వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి 'గజాననుడు' అనే పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించారు.
గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు. నెమలి అతని వాహనము.
 
విఘ్నేశాధిపత్యము
 
ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి, “విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి” అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే వుండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా వుంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి అధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు.
శివుడు వారితో “మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను" అని చెప్పాడు.
కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలూ తిరగటానికి వెళ్లిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి "అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడిని. నాయందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి" అని కోరుకున్నాడు.
శివుడు "నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్ధాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది" అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి మూడు కోట్ల ఏభై లక్షల నదులో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు.
ఇది చూసి ఆశ్చర్యపోయి, కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర వున్న అన్నను చూసి, నమస్కరించి, తన బలాన్ని తిట్టుకుని "తండ్రీ, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను. క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్ధించాడు.
భాద్రపద శుద్ధ చతుర్ధి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశములవాళ్ళూ విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటి పళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని, నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు.
తల్లి తండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ, చేతులు మాత్రం భూమిమీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆన్చినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద వున్న చంద్రుడు పగలబడి, ఎగతాళిగా నవ్వాడు. 'రాజదృష్టి సోకితే, రాళ్ళు కూడా నుగ్గవుతాయి' అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల వున్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు.
పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి "పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు" అని శపించింది.
 
ఋషిపత్నులకు నీలాపనిందలు
 
అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించి, మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకూ బలహీనంగా మారిపోవనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపం తప్ప, మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో వున్న స్వాహా దేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు.
శాపం పలితంగానే ఋషి పత్నులకు ఈ నిలాపనింద కలిగింది. దేవతులు, మునులు, ఋషి పత్నులు
ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్ని దేవుడి భార్యే ఋషి పత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామ హేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు.
అప్పుడు దేవతలు, మిగిలినవాళ్ళు "పార్వతీ, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో వున్న వారికి కీడు జరుగుతోంది. కాబట్టి దానిని ఉపసంహరించు” అని ప్రార్ధించారు. -
వారి ప్రార్ధనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి “ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ ఒక్క రోజు మాత్రము చంద్రుని చూడకూడదు” అని చెప్పింది.
అప్పుడు బ్రహ్మ, మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్ధిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా వున్నారు.
ఈ విధంగా కొంతకాలం గడిచింది.
 
శమంతకోపాఖ్యానము
 
ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, ప్రార్ధించి మాట్లాడుతూండగా “స్వామీ, సాయం కాలం అయింది. ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి" అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు.
అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీ కృష్ణుడు క్షీర ప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వేపు చూడకుండా పశువులశాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి “ఆహా! నాకు ఎలాంటి ఆపద రానుందో” అని అనుమానించటం ప్రారంభించాడు.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీ కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీ కృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు “ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివితక్కువవాడు ఇవ్వడు” అన్నాడు. శ్రీ కృష్ణుడు ఊరుకున్నాడు.
ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా, ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, ఆ మణిని తీసుకుని తాను వుండే కొండ బిలానికి వెళ్ళి, తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది.
 
మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని “నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీ కృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు” తన పట్టణంలో చాటింపు వేయించాడు.
శ్రీ కృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి, దానిని తొలగించుకొనేందుకు బంధు మిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలి జాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి, అక్కడ ఉయ్యాలకి కట్టబడి వున్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా, అది చూసి వింతమనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది.
అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి, అరుస్తూ, గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడి పై యుద్ధం ప్రారంభిచాడు. శ్రీ కృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణసంహారి అయిన శ్రీరామ చంద్రుడే అని అర్ధం చేసుకుని, నమస్కరించి "దేవాదిదేవా! ఆర్త జన రక్షకా! నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామ చంద్రుడని అర్ధం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది
మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్చ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు” అంటూ ప్రార్ధించాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు దయతో జాంబవంతుడి తన చేతితో నిమిరి “జాంబవంతా! శమంతక మణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు. నేను వెళ్ళిపోతాను” అని చెప్పాడు.
అప్పుడు జాంబవంతుడు శ్రీ కృష్ణునికి మణితో పాటు, తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి,
అందరిని పిలిచి జరిగినదంతా వివరించి, మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు “అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను” అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి, తన తప్పు క్షమించమని వేడుకున్నాడు.
శ్రీ కృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవతీ, సత్య భామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీ కృష్ణుడిని స్తుతించి “మీరు సమర్ధులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు. మాలాటి వారు ఏమి చేయగలరు?” అని ప్రార్థించారు.
అప్పుడు శ్రీ కృష్ణుడు “భాద్రపద శుద్ధ చతుర్ధిలో ప్రమాదవశాత్తూ చంద్రుని దర్శనమైతే, ఆరోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా వుంటారు” అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగువారు గణపతిని పూజించి, తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా వున్నారని - శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత, సూత - మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

మరిన్ని వ్యాసాలు