
పంతులు గారు మార్నింగ్ ఎయిట్ కి వచ్చేస్తారు అత్తా, ముందు గణపతి పూజ, వ్రతం, తరువాత హోమం. వన్ కి పూర్తి అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని ఈవెనింగ్ అందరం హోటల్ కి వెళ్దాం. అక్కడ హాల్ బుక్ చేసాం. కేక్ కటింగ్ పార్టీ అక్కడే. మార్నింగ్ మాత్రం ఓన్లీ ఇంట్లో మనమే చేసుకుందామని అమ్మ నాన్న ఇద్దరి కోరిక. అందుకే నిన్ను, బాబాయ్ ని,అటు అమ్మ వైపు మామయ్య, పిన్ని తప్ప ఇంకెవరికి చెప్పలేదు.' ప్రోగ్రాం అంతా వివరించాడు గౌతమ్. 'నిజమే లే పొద్దున్న నుంచి అందరు అంటే అందరం అలిసిపోతాం, అమ్మా వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఏదన్న కానీ బాగుందిరా, వీళ్ళ యాభై వ పెళ్లిరోజు సందర్భం గా మళ్ళీ అందరం కలిసాం, లేకపోతె ఫోన్ లలో తప్ప అందరం ఒక దగ్గర, ఒకే సారి కలవడమే అవ్వట్లేదు.' సంతోషం గా అంది సరోజ. 'మరి ముందే రావొచ్చు గా అత్తా, అందరు వచ్చేసాక, రేపు ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడా రావడం, అసలు సందడి నువ్వొస్తే కానీ మొదలవ్వదు అని తెలుసుగా, అయినా సరే ఇన్ని కాల్స్ చేసాక ఇప్పుడొచ్చావు' కినుక గా అంది కావ్య. 'ఏం చెయ్యమంటావే, అనుకోకుండా మీ మామయ్య కి అర్జెంటు పని వచ్చి బయలుదేరిన వాళ్ళం కూడా ఆగిపోయాం. ఈ ఏజ్ లో ఆయన్ని వదిలేసి ఒక్కదాన్ని రాలేక... తన పని అవగానే వచ్చేసాం. ఇంకా వచ్చేసాగా చెప్పు ఎంత కావాలంటే అంత సందడి చేద్దాం. చూడు మీ అమ్మా నాన్న లని, యాభై పెళ్లి రోజంటే ఎవరన్నా నమ్ముతారా, వాళ్ళ మొహాలు చూడు ఎలా వెలిగిపోతున్నాయో, ఇప్ప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంట లాగ ఉన్నారు' నవ్వుతూ ఆట పట్టించింది అన్న వదినలని సరోజ. 'నిజం గానే వెలిగిపోతున్నాయి మా మొహాలు సరోజ, ఈ సందడి చూస్తుంటే, అందరం ఇలా కలిసి ఎన్నాళ్ళు అయింది. మా ముగ్గురు పిల్లలు కూడా ఒక్కసారే రావట్లేదు. ఎప్పుడు ఎవరికి వీలయితే వాళ్ళు వచ్చి వెళ్తారు. అందుకే ఈ ఫంక్షన్ చేద్దామనగానే ఒప్పుకున్నాను. ఇలా ఇల్లంతా పిల్లలు, వాళ్ళ పిల్లల్తో కళకళలాడుతుంటే చూడాలని' ఆనందం గా అంది భార్గవి. 'నిజమే కదా వదినా, అందరం కలిస్తే అదే పండగ రోజు మరి, సరే కానీ రేపటి కి అన్ని ఏర్పాట్లు అయ్యాయా, ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఎమన్నా ఉంటె చెప్పండి. చేసేద్దాం, రేపటికి హడావుడి లేకుండా', అడిగింది సరోజ. 'అన్ని అయిపోయాయి అత్తా, కేటరింగ్ వాళ్ళకి చెప్పేశాం, పూజ కి కావాల్సిన సామాగ్రి అంతా పంతులు గారే తెస్తారు. మనమంతా పొద్దున్నే లేచి ఆ టైం కి రెడీ అవ్వడమొక్కటే చెయ్యాలి. పిల్లలూ, మీరంతా రేపు వేసుకోవాల్సిన బట్టలు అవి ముందే చూసి పెట్టుకోండి. పొద్దున్న మళ్ళీ టెన్షన్ లేకుండా, అప్పుడు మళ్ళీ మీరు కంగారు పడి, మమ్మల్ని కంగారు పెట్టి లేట్ చేస్తే కుదరదు, ముందే చెప్తున్నా' శ్రావ్య సీరియస్ గా పిల్లలు అందరికి వార్నింగ్ ఇచ్చింది. 'వాళ్ళు రెడీ అవుతారు లే కానీ మన పెళ్లికూతురు, పెళ్ళికొడుకు సంగతి ఏమిటి, వాళ్ళకి కలర్ కోఆర్డినేషన్ అవి ప్లాన్ చేసారా మరి' నవ్వుతూ అంది సరోజ. 'మార్నింగ్ ఏ ప్లాన్ లేదు అత్తా, ఈవెనింగ్ కి వాళ్ళిద్దరికీ నువ్వన్నట్టే డ్రెస్ కో ఆర్డినేట్ చేసాం. నాన్న ఎలానో పూజ కి పట్టు పంచ నే కట్టుకోవాలి. ఆయనకి ఆప్షన్ లేదు ఎలానూ, అమ్మా నువ్వేం కట్టుకుంటావో చెప్తే ఇప్పుడే బయట తీసి పెట్టేస్తాం, లేదా మేము తెచ్చిన లైట్ వెయిట్ పట్టు చీరలు ఉన్నాయి. అవి కట్టుకుంటావా' కావ్య అడిగింది. 'వదినా, నీకు ఇష్టమని నేను పోచంపల్లి చీర తెచ్చాను. అది కట్టుకుంటావా' సరోజ మాటలకి నవ్వుతూ అడ్డం గా తలూపింది భార్గవి. 'రేపు పొద్దున్న పూజ లో మాత్రం నేనేం కట్టుకోవాలో ఎప్పుడో సెలెక్ట్ చేసి ఉంచుకున్నా సాయంత్రం మీ ఇష్టం మీ అందరు ఏం చెప్తే అదే కట్టుకుంటా'. అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. 'అవునా, అమ్మమ్మ, చూపించు అంత ముందే ఏం సెలెక్ట్ చేసావో' కుతూహలం గా అడిగిన మనవరాలి మాటలకి లొపలకి వెళ్లి బీరువా లో బట్టల అడుగున భద్రం గా దాచిన చీర బయటకి తీసింది భార్గవి. గులాబీ, కనకాంబరం కలనేత లో ఉన్న వేంకటగిరి చీర అది. ఆ చీర ని అపురూపం గా తడిమి అందరికి చూపించింది భార్గవి. 'అదేమిటి, అన్ని మంచి మంచి చీరలంచుకుని ఇంత ఓల్డ్ ఆర్డినరీ శారీ తీసావు,' అందరి మొహం లో కూడా అదే ప్రశ్న, మనవరాలు బయటకి అడిగేసింది. 'వదినా, ఇది నీ వెయ్యి రూపాయిల జరీ చీర కదూ' ఆశ్చర్యం గా అడిగింది సరోజ. 'అవును సరూ, కరెక్ట్ గానే గుర్తు పెట్టావు.' 'ఇంకా ఉందా ఇది, ఎప్పటి చీర, నలభై సంవత్సరాలైంది కదా' 'అవును, పదో పెళ్లి రోజు అప్పుడు కొన్నాను. నీకు బానే గుర్తు ఉంది'. 'మరి అంత పాత చీర ఎందుకు అత్తయ్య గారు, మీ దగ్గర ఇన్ని మంచి చీరలున్నాయి, లేదా మేమందరం ఇప్పుడు తెచ్చిన చీరలున్నాయి, అదే ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నారు, ఏదన్న ప్రత్యేకం గా కారణం ఉందా' కోడలు అడిగింది. 'పెద్ద కధే ఉందమ్మా ఈ చీర కి, మీ అత్తగారెందుకు ఇది కట్టుకుంటా అన్నదో నాకు అర్ధమైంది. వదినా నువ్వే చెప్పు నీ పిల్లలకి ఆ చీర కథ, వాళ్ళు దాని విలువ తెలుసుకుంటారు' సరోజ మాటలకి భార్గవి మనసు నలభయ్ సంవత్సరాల వెనక్కి పరుగు తీసింది. ******** 'కొత్తగా దిగినట్టున్నారు ఇంట్లోకి' చిరునవ్వు తో పలకరించింది పక్కింటి వసంత. 'అవునండి, వారం అయింది, పక్క ఇల్లు ఖాళీ ఏమో అనుకున్నాం, ఎవరూ కనపడకపోతే'. బదులిచ్చింది వసంత. 'మేము పిల్లలకి సెలవులు అని వూరెళ్ళాం అండి, నిన్న రాత్రే వచ్చాం. రేపటి నుంచి స్కూల్స్ మొదలు, మీకు ఎంతమంది పిల్లలు'. 'ముగ్గురు అండి. పెద్దవాడు బాబు, తరువాత ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పిల్లలిద్దరి స్కూల్ ఇక్కడికి దగ్గర అనే ఇల్లు మారాము. వచ్చే ఏడూ దీన్ని పంపాలి, దగ్గరగా ఉంటె మంచిది కదా'. ఎత్తుకుని ఉన్న శ్రావ్య ని చూపిస్తూ చెప్పింది. 'మంచి పని చేసారు. ఈ కాలనీ కూడా బాగుంటుంది లెండి. దగ్గర్లోనే స్కూల్స్ ఉండడం వల్ల ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్నవాళ్లే ఉంటారు. వీళ్ళకి ఆడుకోడానికి బాగుంటుంది.' చనువు గా మాట్లాడుతున్న వసంత ని చూసి ధైర్యం గా అనిపించింది భార్గవికి. 'ఇవాళ మా ఇంటికి చీరల అతను వస్తాడు. అతను ప్రతి నెలా వస్తాడు. మన వీధి లో అందరం అతని దగ్గరే తీసుకుంటాం చీరలు. మీరు కూడా రండి. అందరితో పరిచయం కూడా అయినట్టు ఉంటుంది. నచ్చితే చీరలు తీసుకోవచ్చు'. స్నేహపూర్వకం గా చెప్తున్న వసంత మాట కాదనలేకపోయింది భార్గవి. 'ఇంట్లో అత్తయ్య ఉన్నారు, ఆవిడకి ఒక మాట చెప్పి వస్తాలెండి'. అంగీకరించింది. ********** 'అత్తయ్య గారు, పక్క ఇంటి ఆవిడ ఇందాక మంచి నీళ్లు పట్టుకుంటే కనిపించి మాట్లాడారు. వాళ్ల ఇంటికి ఇవాళ చీరలు అమ్మే అతను వస్తాడట. చూడడానికి రమ్మంటున్నారు, మీరూ వస్తారా' అత్తగారికి కాఫీ ఇస్తూ అడిగింది భార్గవి. ' నాకు ఈ రోజు ఓపిక లేదు నువ్వెళ్లిరా ఒకసారి, ఇరుగు పొరుగు పరిచయాలుండాలి కదా, మీ పెళ్లి రోజు ఎలానూ వస్తోంది. చీర కొనుక్కోవాలిగా, ఏదన్నా నచ్చితే కొనుక్కో'. 'మనం ఎప్పుడూ మన పాత ఇంటి దగ్గర బట్టల కొట్లోనే కొంటాం కదా, అక్కడ అయితే తెలిసిన షాప్ కాబట్టి తక్కువ కి వస్తాయి అంటారు ఈయన. వేరే దగ్గర అంటే నాకేం తెలీదు కదా అని ' సంశయం గా అండి భార్గవి. 'నీది మరీ చోద్యమే, పెళ్లి అయి పదేళ్ళయింది. చీర కొనడం రాదంటే ఎవరన్నా వింటే నవ్వుతారు. వెళ్లి చూడు. అదే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్లి కొనడం అవుతుందో లేదో, ఒకసారి చూడు. ఏవన్నా నచ్చితే కొనుక్కో, లేకపోతె మానెయ్'. అత్తగారి మాటలకి తలూపింది భార్గవి. ********* 'రండి రండి, మీ కోసమే చూస్తున్నా, వీళ్లంతా మన వీధి లో వాళ్ళే, ఈవిడ భార్గవి అని పక్క ఇంట్లో కి కొత్తగా వచ్చారు'. అందరికి పరిచయం చేసింది వసంత. అప్పటికే చీరలు అందరూ చూడడం మొదలెట్టేశారు. కళ్ళు చెదిరిపోతున్నాయి భార్గవికి. రంగు రంగుల చీరలు, అందమైన అంచులు. చాలా బాగున్నాయి. ఏది ఎంచుకోవాలో తెలీనట్టు గా ఉంది. 'అమ్మగారు ఈ చీర చూడండి. మీ రంగు కి బాగా నప్పుతుంది మీకు'. అంటూ రమణయ్య అడుగు నుంచి ఒక చీర తీసాడు. గులాబీ, కనకాంబరం కలనేత తో, చీరంతా జరీ బుటా ఉండి, రెండు పైపుల అరచేతి వెడల్పున కడ్డీ అంచు తో అద్భుతం గా ఉన్న ఆ చీర ని చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయింది భార్గవి. 'మీకు బాగా నచ్చినట్టుంది భార్గవి గారు ఈ చీర' వసంత మాటలకి తలూపింది. 'మరి రమణయ్య గారు, ఏంత చెప్పండి చీర, మొదటిసారి తీసుకుంటున్నారు ఈవిడ, చూసి రేటు చెప్పండి'. 'అదేం మాట వసంతమ్మ, నేనెప్పుడన్నా మనిషి ని బట్టి వెల చెప్పానా, మీకు తెలుసు గా నా సంగతి, వంద నూర్లు'. 'ఆమ్మో, వెయ్యి రూపాయిలా' ఒళ్ళో ఉన్న చీర తీసి పక్కన పెట్టేసింది భార్గవి. 'అది వెండి జరీ చీర అమ్మా, వేంకటగిరి, అది కరిగిస్తే మీకే వెండి వస్తుంది, ఆ నేత పని కె ఇవ్వొచ్చు చూడండి ఎంత నాజూకుగా నేశారో' రమణయ్య చీర అంతా విప్పి చూపించాడు. 'మనం డబ్బులు ఒక్కసారే ఇవ్వక్కర్లేదు భార్గవి. నెలకి ఇంత అని ఇవ్వొచ్చు. ప్రతి నెల వచ్చి తీసుకెళ్తాడు. నీకు నచ్చితే కొనుక్కో, నెలకి ఒక వందో, లేకపోతె యాభై ఇస్తే సరిపోతుంది. మేమందరం అలానే తీసుకుంటాం, ఒక్కసారే అంతంత పెట్టి మన మధ్య తరగతి వాళ్ళం కొనలేం, ఈ వాయిదాల పద్దతి లో తెలీకుండానే అమిరిపోతాయి చీరలు.' మిగిలిన అందరూ కూడా వసంత మాట ని బలపరిచారు. ప్రతి నెల డెబ్భై రూపాయిలు చెల్లిస్తానని ఒప్పుకుని కొంచం భయం భయం గానే తీసుకుంది చీర భార్గవి. ********** 'ఏమిటి వెయ్యి రూపాయిలా.............'. దుర్గమ్మ, ముకుందం ఇద్దరూ ఆశ్చర్యం తో నోరు తెరిచారు. 'అంటే మొత్తం ఒక్కసారి ఇవ్వక్కర్లేదట అండి. నెలకో డెబ్భై రూపాయిలు ఇస్తే చాలు. ఒక పద్నాలుగు పదిహేను నెలలో తీర్చొచ్చు. అందరూ అలానే తీసుకుంటున్నారు, నాకు ఈ చీర చాలా నచ్చింది. అందుకే...' లోగొంతుక తో అండి భార్గవి. 'చీర కి వెయ్యి రూపాయిలా, మూడు తులాల బంగారం వస్తుంది వెయ్యి రూపాయిలు పెడితే, పెరట్లో చెట్లకి డబ్బులేమన్న కాస్తున్నాయనుకున్నావా, లేదా నీ పుట్టింటి నుంచి బస్తాలతో రూపాయిలు వస్తున్నాయా, ఏమనుకొని కొన్నావు ఇంత పెట్టి చీర', దుర్గమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది. 'అమ్మా, నువ్వుండు, తను భయపడుతోంది నేను మాట్లాడతా కదా', కన్నీళ్ల పర్యంతం అవుతున్న భార్య ని చూసి ముకుందం తేరుకుని తల్లి ని మందలించాడు. 'చేసిందంతా చేసి ఇప్పుడు భయం అందుకు, నీ దగ్గర నాటకాలు కాపోతే, అయినా నువ్వే మొన్న నీ మేనల్లుడి అన్నప్రాసన కి వెండి గిన్నె కొనాలంటే డబ్బులు కష్టం గా ఉన్నాయి కుదరదన్నావు. ఇప్పుడు నీ పెళ్ళానికి అనేసరికి వచ్చాయా డబ్బులు, ఎక్కడ నుంచి తెస్తావు'. ఆపకుండా అరుస్తూనే ఉన్న అత్తగారి మాటలకి వస్తున్నా దుఃఖాన్ని ఆపుకుంటూ గది లోకి పరిగెత్తింది భార్గవి. 'ముందు ఈ నీళ్లు తాగు. చిన్న పిల్ల లాగా ఏడుస్తారా ఎవరన్నా, ఆమ్మ కి నేను నెమ్మదిగా చెప్తా లే, కాసేపు తనని వదిలేస్తే మామూలు అయిపోతుంది.' ముకుందం అనునయించాడు భార్యని. 'నెల కి కొంచమే కదా కట్టడం అంటే సరే అనుకుని తీసుకున్నా అండి. మనకి ఇబ్బంది గా ఉందని నాతో మీరెప్పుడూ అనలేదు. నాకు తెలిసి ఉంటె అసలు అక్కడికి వెళ్లేదాన్ని కాదు. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను. మన తాహతు కి ఆ చీర చాలా ఎక్కువే అని. కానీ ఎందుకో ఎప్పుడూ లేనిది ఆ చీర మీద అంత మోజు పడ్డాను. నాకే చాలా సిగ్గు అనిపిస్తోంది'. తల దించుకుని మాట్లాడుతున్న భార్యని చూసి జాలి వేసింది ముకుందానికి. భార్గవి సంగతి బాగా తెలుసు అతనికి. పెళ్లి అయినా ఈ పధి సంవత్సరాలలో ఎప్పుడు ఏది కొనిస్తే అదే ఆనందం గా కట్టుకునేది తప్ప ఏ రోజు ఇది కావాలి అని అడగలేదు. ఉన్నంత లో సర్దుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉండే భార్య అలా తప్పు చేసినట్టు తల దించుకోడం కష్టం గా అనిపించింది. 'ఛా.. అలా బాధ పడకు, ఎదో ఒక మార్గం ఆలోచిద్దాం లే, డబ్బు ఇబ్బంది అంటే చెల్లెలి పెళ్లి కి పెట్టిన లోన్ ఇంకా తీరలేదు కదా, ఇంకో రెండేళ్లు పడుతుంది. ఈలోపు తన డెలివరీ, మనం ఇల్లు మారాల్సి రావడం, పిల్లలు స్కూల్ లో చేరడం అన్ని ఒకదాని మీద ఒకటి అవ్వడం తో కొంచం కష్టం గా వుంది. ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేద్దామా అనుకుంటున్నాను నేను చూసుకుంటా లే, నువ్వు ఈ విషయం వదిలేయ్, ఏదొ ఒకటి చేద్దాం'. 'ఏదొ ఒకటి అంటే ఎం చేద్దాం' 'అబ్బా నీకెందుకు ఈ విషయాలన్నీ, నేను అలోచించి ఎలానో ఒకలాగా తెస్తా అన్నాగా, నువ్వనవసరం గా ఇవన్నీ తలకి ఎక్కించుకోకు. నువ్వు ఇల్లు, పిల్లల్ని చూసుకో చాలు' కాస్త విసుగొచ్చింది ముకుందానికి. 'అదే ఆ తప్పే ఇన్నాళ్లు చేశాను, దాని పర్యవసానమే ఈ చీర కొనడం, మీరు ఏ రోజు మనకి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత చెప్పలేదు. నేను అడగలేదు. మా అమ్మ, అత్తగారు అందరు ఇలానే ఉండడం వలన ఇదే కరెక్ట్ ఏమో అన్నట్టు నేను అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్ధమైంది. మన ఆర్ధిక పరిస్థితి నాకు తెలీక పొతే ఎలా, నాకు మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను, జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపు చెయ్యాలో, ఎక్కడ ఆదాయం పెంచగలమో నేను నేర్చుకుంటాను. బరువు ఆంతా మీ భుజాల మీదే వేసుకుంటా అంటే ఎలా, దాంపత్యం లో మన ఇద్దరం అన్ని సమానం గా మొయ్యాలి'. దృఢం గా చెప్పింది భార్గవి. ******* గవర్నమెంట్ ఆఫీస్ లో యూడీసీ గా పని చేస్తున్న ముకుందం జీతం మరీ తక్కువ ఏం కాకపోయినా, ఇంటి బాధ్యతలు, వెనక ఆస్తిపాస్తులు లేకపోవడం వలన ఎప్పటికప్పుడు లోన్ పెట్టాల్సి రావడం తో బొటాబొటిగా సరిపోతోంది. ఒక్కసారి ఇంటి ఖర్చు ఆంతా సరి చూసుకున్నాక భార్గవి కి అర్ధమైంది. అందులో తగ్గించడానికి ఏం లేదని. ఇంక ఆదాయం పెంచుకునే మార్గమే వెతుక్కోవాలని కూడా అర్ధమై ఆ దిశగా ఆలోచించడం మొదటిసారి మొదలుపెట్టింది. ********** 'నా ఫ్రెండ్ దగ్గర వంద రూపాయిలు చేబదులు తీసుకున్నాను. ఈ నెల కి నీ చీర కి డబ్బులు ఇచ్చేయ్. వచ్చే నెల లోపు నాకు సాయంత్రాలు ఒక పార్ట్ టైం జాబ్ వెతుకుతాను. ఒక రెండు మూడు చోట్ల మాట్లాడి ఉంచాను'. ముకుందం ఇంట్లోకి వస్తూనే చెప్పాడు. 'ఆ చీర వెనక్కి ఇచ్చేద్దామని వసంత ని అడిగాను. అయితే రెండు మూడు సార్లు మడత విప్పి పెట్టడం తో దాని మడత పోయింది. వాళ్ళు వెనక్కి తీసుకోరు అంది తను. ఏమిటో అన్ని పిచ్చి పనులే చేశాను'. విచారం గా అంది భార్గవి. 'అయితే ఇవాళ వసంత దగ్గరికి వెళ్ళినప్పుడే ఇంకో విషయం జరిగింది. వాళ్ళ పిల్లలని ముగ్గురిని తను ప్రైవేట్ కి పంపుతుందిట. ఇన్నాళ్లు ప్రైవేట్ చెప్పే ఆ అమ్మాయి కి పెళ్లి అయి వెళ్ళిపోతోందిట. రోజు నా దగ్గరకి పంపమని చెప్పను. ముగ్గురు పిల్లలకి కలిపి నెల కి పది రూపాయిలు ఇస్తా అంది' భార్గవి చెప్పిన మాటలకి సర్రు మని కోపం వచ్చింది ముకుందానికి. 'అంటే ఏమిటి నీ చీర కి డబ్బులు సంపాదించంలేనంత చేతగాని వాడి లాగా కనపడుతున్ననా, ఏదొ రకం గా నేను చూసుకుంటా నువ్వు వదిలేయ్ అని ఎన్నిసార్లు చెప్పాను. ఆ పది రూపాయిల తో ఏం చేసేద్దామని' భార్గవి ఎప్పుడూ చూడలేదు భర్త లో అంత కోపం. 'మీరు ఈ చీర డబ్బులు ఇవ్వలేరని కాదండీ. మీరే కదా ఇన్నేళ్లు ఈ కాపురం ఈదింది. అసలు ఈ డెబ్భై రుపాయిల గురించి కాదు. ఇదేలాగో ఆలా తీరుస్తాము. కానీ పిల్లలు ఎదుగుతున్నారు. ఖర్చులు, అవసరాలు పెరిగేవే తప్ప తగ్గేవి కాదు. మన పరిస్థితి మెరుగు పరుచుకోడానికి మీరు చేసేది ఎలానూ చేస్తారు. కానీ నన్ను ఒక ప్రయత్నం చెయ్యనివ్వండి. అనుకోకుండా వచ్చిన అవకాశం. నా తృప్తి కోసం ఒప్పుకోండి'. అనునయం గా చెప్పిన భార్గవి మాటలకి చల్లబడ్డాడు ముకుందం. 'అది కాదు రా, నీకైనా ఇంటి పని తో సరిపోతుంది కదా , మళ్ళీ ఈ ప్రైవేట్లు అంటే నీకు శ్రమే కదా, పైగా నువ్వు చదివింది మెట్రిక్ దాకానే, చెప్పగలవా మరి' ,సాయంత్రాలు రోజు ఖాళీ ఏ నాకు. మన పిల్లలని కూర్చోపెట్టి చదివిస్తాను రోజు నాలుగు నుంచి ఆరు దాకా, వాళ్ళకి అదే టైం చెప్పాను. అందరూ ఒకేసారి చదువుకుంటారు. పెళ్లి కి ముందు మా తమ్ముళ్ళకి చెప్పడం నాకు అలవాటే అండి. సెవెంత్ క్లాస్ దాకా ఈజీ గా చెప్పేయగలను. ఆ లోపు పిల్లలే వీళ్ళు కూడా, చూద్దాం ఒక నెల, వాళ్ళకి మనకి కూడా కుదిరితే నే, లేకపోతె మానేస్తాను'. భార్గవి మాటలకి అయిష్టం గానే తలూపాడు. ********** ముగ్గురి తో మొదలైన భార్గవి ప్రైవేట్లు మూడు నెలలు తిరగకుండానే పాతిక మంది పిల్లలు అయ్యారు. పిల్లల మీద తీసుకునే శ్రద్ద, మృదువు గా వాళ్ళకి చెప్పే తీరు నచ్చి ఆ కాలనీ లో చాలామంది పిల్లలని జాయిన్ చేసారు. ముకుందానికి పార్ట్ టైం జాబ్ దొరకడం తో చీర అమౌంట్ సులభం గానే తీర్చేసారు. కానీ ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఇద్దరు గుర్తించడం తో భార్గవి ప్రైవేట్లు మానలేదు. డిగ్రీ కరెస్పాండెన్స్ కోర్స్ కూడా జాయిన్ అయింది. ముకుందం ప్రమోషన్ టెస్ట్ లకి శ్రద్ద గా చదవడం మొదలెట్టాడు.. తల్లి తండ్రి చదువు మీద శ్రద్ద చూసి పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు. భార్గవి డిగ్రీ పూర్తి చేసి తరువాత ఏం. ఏ తెలుగు లిటరేచర్ తో మాస్టర్స్ కూడా చేసి ప్రైవేట్ కాలేజీ లో జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయింది. ముకుందం కి వరుసగా ప్రొమోషన్స్ తో ఉన్నతస్థాయి కి చేరుకొని రిటైర్ అయ్యాడు. పిల్లలు మంచి అభివృద్ధి లోకి వచ్చారు. ******** 'ఇది ఈ వెయ్యి రూపాయిల జరీ చీర కథ. ఇదే కొనకపోయి ఉంటె బహుశా మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో, మనం ఈ రోజు ఇంత ఉన్నత స్థాయి లో ఉన్నామంటే ఈ చీరె కారణం అని నాకు అనిపిస్తుంటుంది. తరువాత ఎంత ఖరీదైన చీరలు కొన్నా కూడా ఈ చీర విలువ దేనికి లేదు. అందుకే ఈ చీర ఎప్పుడన్నా కట్టిన వెంటనే మార్చేస్తాను. ఏదన్పా మీదపడి పాడైపోతుందేమో అని భయం కొద్దీ. కానీ రేపు మాత్రం నా మనసు తీరా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ చీరే కట్టుకుంటా. ఎందుకుంటే ఈ చీర కట్టుకుంటే ఇన్నేళ్ల జ్ఞాపకాలు చుట్టుకున్నట్టు ఉంటుంది నాకు'. ఆప్యాయం గా వెయ్యి రూపాయిల జరీ చీర ని గుండెలకి హత్తుకుంది భార్గవి. ******************