ది రోడ్ లెస్ ట్రావెల్డ్ - రాపాక కామేశ్వర రావు

The roadless travelled

“అమ్మా, మీది సోంపేట కదా?” విశాఖ ఎక్స్ ప్రెస్

లో విశాఖ నుండి సోంపేట వెళ్తున్న నేను ఎదురుగా బెర్త్ పై కూర్చున్న ఆవిడను చూసి అడిగాను.

“అవునండి, మీది కూడ….?“ అని ప్రశ్నార్థకముగా నా వైపు చూసింది.

“అవునమ్మా మాది కూడ సోంపేటే. నా పేరు

మోహన రావు, ఇప్పుడు వెళుతున్నది కూడ అక్కడికే.”

“నేను సోంపేట విడిచి చాలా ఏళ్ళయ్యింది. మీకెలా గుర్తున్నాను?”

"మీ పేరు అమల, సోంపేట గర్ల్స్ హై స్కూల్ లో విమల మీకు బెస్ట్ ఫ్రండ్ కదా?"

"అవునండి, ఈ విషయం మీకెలా తెలుసు?"

"నా ఫ్రండ్ నేతాజీ వాళ్ళ అన్నయ్య కూతురు విమల. మీరిద్దరు స్కూల్ విడిచిపెట్టాక ప్రతి రోజు కలిసి వచ్చేవారు. మేము అప్పుడు పని పాటా లేని నిరుద్యోగులం. రోడ్డుపైన వచ్చే పోయే వారిని గమనించే వాళ్ళం. ఆ తరువాత ఉద్యోగ నిమిత్తం సోంపేట విడిచి వెళ్ళిపోయాం"

"ఇంకొక సారి విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మిమ్మల్ని చూసాను"

"ఇప్పుడు ఎక్కడికెళ్తున్నావమ్మా?"

"నేను కూడ సోంపేట వెళ్తున్నానండి"

“మంచిదమ్మా” అంటు నేను నా వెంట తీసుకెళ్ళిన న్యూస్ పేపర్ చదవడంలో మునిగి పోయాను. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించినా బాగుండదనిపించి ఊరుకున్నాను.

——-/////——-

సోంపేట ఊరి మధ్యలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్నా, ఆ వీధిలోకి ఎక్కువ మంది వెళ్ళేవారు కాదు, కారణం అది ఒక వెలివాడ. అక్కడ నివసించే వారంతా చాల ఏళ్ళ క్రితం ఒడిస్సా నుండి వలస వచ్చిన సంచార జీవులు. పందులను పెంచుకుంటూ జీవితం సాగించేవారు. వాళ్ళు మాట్లాడే భాష ఒడియా, తెలుగు కలగలిపిన సంకర భాషలా అనిపించేది. జన జీవన స్రవంతిలో వాళ్ళు ఉన్నా లేనట్టే. వారినెవ్వరు పట్టించుకునే వారు కాదు.

ఆ వీధిలో అన్నీ పూరిగుడిసెలే, ఐదు పెంకుటిళ్ళు తప్ప. అలాంటి వీధిలో గోప్యంగాఉంటుందని ఏమో, ఆ పెంకుటిళ్ళలో భోగం వాళ్ళు ఉండే వారు.

పూర్వం రాజులు, భూస్వాములు వారి విలాసాల కోసం వ్యభిచారాన్ని ప్రోత్సహించే వారు. పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత, తలిదండ్రుల నిర్లక్ష్యం మొదలగు కారణాలతో కొంత మంది స్త్రీలు ఈ వృత్తిలోకి లాగబడ్డారు. వ్యభిచారం చేసే వారిని భోగం వాళ్ళు అనే వారు. మన రాష్ట్రం లో కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి సంఘ సంస్కర్తలు దీన్ని వ్యతిరేకించారు. భోగం వీధుల్ని నిర్మూలించారు. అయినా ఈ సామాజిక జాడ్యం పూర్తిగా సమసిపోలేదు. అక్కడక్కడ కొంత మంది ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారు. అలాంటి వారి ఇళ్ళల్లో ఒక ఇంటి అమ్మాయి అమల.

నా చిన్న తనములో ఆ వీధిని ఆనుకుని మెయిన్ రోడ్డులో "విజయ శంకర్ కాఫీ విలాస్” పేరుతో ఒక ఫలహార శాల ఉండేది. మా నాన్నగారితో వెళ్ళి చాల సార్లు అక్కడ టిఫిన్ తినేవాడిని.

“ఈ వీధి పేరేమిటి నాన్న?” అని ఎన్ని సార్లు అడిగినా చెప్పకుండా మాట మార్చేవారు మా నాన్న.

అలాంటి వీధిలో ఇప్పుడు సత్యసాయి మందిరం కట్టారు. మా స్నేహితుడు ఆనందరావు అందులో యోగా శిక్షణ తరగతులు కూడ నిర్వహిస్తున్నాడు.

ఆ మందిరం దశమ వార్షికోత్సవానికి రమ్మన్న ఆనందరావు ఆహ్వానం మేరకు వెళ్తున్నాను

ఆనందరావుతో పాటు కొంతమంది సత్యసాయి భక్తులు పదేళ్ళ క్రితం మందిర నిర్మాణం చేసారు. అప్పుడు నేను ఉద్యోగం లో ఉండడం వలన సెలవు దొరక్క వెళ్ళలేదు. ఆ తరువాత కూడ ఆనందరావు ఎన్ని సార్లు పిలిచినా సెలవులు లేవని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు రిటైర్ అయిపోవడం వలన సాకులు చెప్పలేక మరియు ఆ వీధి ఎలా ఉంటుందో అన్న కుతుహలంతో బయలుదేరాను.

ఎందుకంటె ఆ ఊరిలోనే పుట్టి పాతికేళ్ళ వరకు ఉన్నా ఆ వీధిలోకి ఎన్నడు నేను వెళ్ళలేదు.

-----/////-----

సాయంత్రం సాయి మందిరానికి చేరుకున్న నేను

అక్కడ స్వాగతం పలికే ఫ్లెక్స్ బేనర్ చూసి ఆశ్చర్యపోయాను. ఆమె ఫోటోతో బాటు “పద్మశ్రీ డాక్టర్ అమల, చీఫ్ మెటర్నిటీ డాక్టర్, శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్, ప్రశాంతి నిలయం” అని రాయించారు.

అవును! ఆమే!! ఉదయం నాతో ట్రైన్ లో వచ్చిన ఆమె. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు చూసాను. ఆ తరువాత విశాఖపట్నం కె జి హెచ్ లో ట్రైనీ నర్సుగా ఉండగా చూసాను.

"ఇది సాధ్యమేనా???" అని నాలో నేను సతమతమయ్యాను. ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను.

ఈ విషయం ఆనంద్ తో ప్రస్తావించాను. “అవును నిజమే, ఆమె సాధించింది, ‘కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు’ అని మరో సారి ఋజువు చేసింది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమెకు “పద్మశ్రీ" పురస్కారం బహూకరించింది. ఆ సందర్భముగా ఇప్పుడు పౌర సన్మానం కూడ చేస్తున్నాం” అన్నాడు.

ఆనంద్ అన్న మాటలకు మంత్రముగ్ధుడనయ్యాను. ట్రైన్ లో ఆమెను ఏదో అడగాలని అనిపించినా అడగలేదు. ఇప్పుడు ఆమె ఈ స్థాయికి ఎలా చేరిందో తెలుసుకోవాలన్న కోరిక నాలో ఇంకా పెరిగింది.

సత్య సాయి మందిరం దశమ వార్షికోత్సవమునకు పుర ప్రముఖులంతావచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ డా. అమల గారి జ్యోతి ప్రజ్వలనతో ఆ ఉత్సవం అట్టహాసముగా జరిగింది.

తదుపరి పౌర సన్మాన కార్యక్రమములో ఆమె గురించి ఊరిలోని ప్రముఖులంతా చాల గొప్పగా మాటలాడారు. మన ఊరిలో పద్మశ్రీ సాధించిన మొదటి వ్యక్తి అని, అందునా ఒక స్త్రీ, అట్టడుగు స్థాయి నుండి వచ్చి విజయ శిఖరాలను చేరుకుంది అని, పలు విధముల కొనియాడారు.

చివరిగా ఆమె ప్రతి స్పందన కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటె నాలాంటి కొందరికే తెలుసు ఆమె ఏ స్థాయి నుండి ఎదిగింది అన్న విషయం. కాని నాలాంటి వారికి కూడ తెలియని ఎన్నో మలుపులు ఆమె జీవితంలో ఉన్నాయన్నది నిజం.

-----/////-----

ఆమె లేచి మైకు అందుకుంది. "అందరికి నమస్కారం. నాపై మీరు కురిపించిన వాత్సల్యానికి నేను ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను.

నేను నడక నేర్చిన ఈ వీధి, ఇప్పుడు బాబా గారి మందిరం నిర్మాణముతో ఒక ఆధ్యాత్మిక కేంద్రముగా మారింది. ఇందులో సత్యసాయి సేవా సంస్థ నిర్వాహకుల కృషి అభినందనీయం.

ఇకపోతే మీలో చాల మందికి నా గురించి తెలుసుకోవాలనే కోరిక ఉందన్నది నాకర్థమైంది. ఇక్కడ ఉన్నవారిలో ఆనందరావు గారు మరియు ఉదయం నాకు ట్రైన్ లో కనిపించిన మోహన రావు గారి లాంటి కొద్ది మందికి తెలుసు నా ప్రస్థానం ఎక్కడ మొదలయ్యిందో.

అలనాటి త్రేతాయుగం నుండి నేటి వరకు అనూచానంగా అబలల శీలానికి అగ్ని పరీక్ష పెడుతున్న ఈ సమాజం లో ఆడదానిగా పుట్టడమే పాపం.

సహజముగా మనమందరం అమ్మా నాన్నల ప్రేమానురాగాల నుండి మొగ్గ తొడిగిన వారి కోరికల ఫలితముగా ఈ భూమి పై ఉద్భవిస్తాము. కాని నేను మాత్రం ఎవ్వరు అనుకోకుండా ఈ భూమి పైకి వచ్చాను. ఈ సమాజముచే వంచింపబడ్డ ఓ అనాథ మహిళ, నాకు జన్మనిచ్చింది. తరువాత ఆమె దిక్కుతోచని స్థితిలో ఉండగా ఓ మగాడు ఆమెను ఉంచుకున్నాడట. మొదట్లో మా ఇంట్లో మాతో పాటు ఉండే వాడు. కొన్నాళ్ళు పోయాక అప్పుడప్పుడు కనిపిస్తుండే వాడు.

ఇక్కడ ఒక మొరటు సామెత గుర్తొస్తుంది ఏమి అనుకోకండి. "తాటి చెట్టు నీడ నీడా కాదు తగులుకున్నోడు మొగుడూ కాదు" అన్న విషయం మా అమ్మకు మెల్లగా తెలిసొచ్చింది. నాకు ఊహ వచ్చే వరకు ఆ మగాడే నా తండ్రి అనుకునే దాన్ని. కాని నా తండ్రి ఎవరో మా అమ్మకు కూడ తెలియదట. మా అమ్మను ఉంచుకున్న ఆ మగ మహారాజు అందుకు ప్రతిఫలముగా నన్ను మా అమ్మను పోషించేవాడు

ఆ రోజుల్లో మీలాంటి వారెవ్వరు నడవడానికి ఇష్టపడని ఈ వీధిలో నేను బాల్యములో తప్పటడుగులు వేస్తు నడకనేర్చుకున్నాను.

రాత్రి అయితే చాలు ఫుల్లుగా తాగీసి వచ్చి మా పక్కనున్న ఆ నాలుగు ఇళ్ళ మాదిరిగానే మా ఇంటి తలుపు కూడ కొట్టే వారు. తలుపు చప్పుడైతె నాకు చెమటలు పట్టేవి. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. బితుకు బితుకు మంటు గడిపేదాన్ని. ఎలాగైతేనేం హైస్కూల్ చదువు పూర్తి చేసాను. నా హైస్కూల్ చదువు పూర్తైన తరువాత ఈ వీధిలో నా వయసు పిల్లలను ఏ వృత్తిలోకి దించేవారో నన్ను కూడ ఆ వృత్తిలోకి దించమని మా అమ్మకు చాల మంది సలహాలిచ్చారు. మా అమ్మ కూడ నన్ను బలవంత పెట్టింది. కాని నేను ప్రతిఘటించాను.

"తాడూ బొంగరమూ లేని జీవితాలు మనవి. మనకి సదువులెందుకే" అని మా అమ్మ వాదించింది. కాని నేను మాత్రం నా చదువు కొన సాగించి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నర్స్ ట్రైనింగ్ లో చేరాను.

-----/////-----

నిత్యము కె జి హెచ్ లోని డాక్టర్లను చూస్తుండడం వలన నాలో డాక్టర్ అవ్వాలన్న కోరిక కలిగింది.

నర్స్ ట్రైనింగ్ పూర్తైన వెంటనే కె జి హెచ్ లోనే జాబ్ రావడముతో నా ఆలోచనకు రూపమివ్వాలని తలచి ఎంసెట్ కోచింగ్ తీసుకున్నాను. నా జీవితములో కూడ అదృష్టం అనే ఒక అంకము ఉంది కాబోలు, ఆంధ్ర మెడికల్ కాలేజి లో ఎంబిబిఎస్ లో సీటు వచ్చింది. దానితో నర్స్ ఉద్యోగం నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

ఎంబిబిఎస్ లో చేరిన తరువాత నా జీవనోపాధి కోసమై కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో రాత్రి పూట నర్స్ ఉద్యోగం చేసాను. ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. దానితో నేను ఒంటరినయ్యాను.

అలా ఎంబిబిఎస్ పూర్తి చేసిన నేను ఒక పల్లెటూరిలో ప్రాథమిక వైద్య కేంద్రం లో ప్రభుత్వ వైద్యాధికారిణిగా నియమింపబడ్డాను.

మనం ఏ ఊరికి ఉద్యోగ నిమిత్తం వెళ్ళినా మన కంటె ముందుగా మన పుట్టు పూర్వొత్తరాలు అక్కడికి చేరుకుంటాయన్నది ఎంత సత్యమో మీ అందరికి తెలుసు. నా విషయములో కూడ అదే జరిగింది. నా పుట్టుకకు నేను బాధ్యురాలిని కాదు కదా అలాగే నా పుట్టుకను ఇప్పుడు నేను మార్చుకోలేను. ఆ స్థాయిలో కూడ అది నన్ను వెంటాడుతూనే వచ్చింది. అవహేళనకు గురి చేసింది. మేక వన్నె పులులు, గోముఖ వ్యాఘ్రాలతో నిండిన ఈ సమాజములో ఒంటరి మహిళ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని నేను కూడ చవి చూసాను.

బెల్లం ఉన్న చోట ఈగలుండడం సహజం కదా. అందువలన ఎన్నో ఆటుపోట్లను, అవరోధాలను ఎదుర్కొంటు ముందుకు సాగాను.

నా జీవన యానములో క్రమశిక్షణ, ప్రేమ, దయ అను మూడు సూత్రాల ఆధారముగా అడుగడునా ఎదురైన ఎన్నో ముళ్ళని ఒక్కొక్కటిగా ఏరి పారేస్తు పూల బాటను ఏర్పరచుకున్నాను. కొంత మంది మిత్రుల సహకారంతో అక్కడ ఉండగానే గైనకాలజీలో నా పి జి విద్యను పూర్తి చేసాను.

ఆ ఊరిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక స్వఛ్చంద సేవా సంస్థ సహాయం తో చుట్టు పక్కల గ్రామాలలో మెడికల్ కేంపులు నిర్వహించాను. నాకు వీలైనంతలో సామాన్య ప్రజలకు అంకిత భావముతో సేవ చేస్తు నా ధర్మాన్ని నిర్వర్తించాను.

తరువాత కొన్నాళ్ళకు ప్రశాంతి నిలయం సత్యసాయి జనరల్ హాస్పిటల్, మెటర్నిటీ విభాగములో ఖాళీ ఉందని తెలిసి దరఖాస్తు పెట్టుకున్నాను. అదృష్టవశాత్తు అక్కడ చేరాను. దానితో నా ఆశలకు ఆయుష్షు పోసినట్టనిపించింది. గత అయిదేళ్ళలో అక్కడ మెటర్నిటీ విభాగములో అయిదు వేల కాన్పులు చేసి రికార్డు సృష్టించాము. ఆ తరువాత ఆసుపత్రివారు నన్ను మెటర్నిటీ చీఫ్ గా నియమించారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వారు నా సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ నిచ్చి సత్కరించారు.

తెలిసిన గమ్యానికి గమనము తేలిక. కాని విధిచే లిఖించబడ్డ ఆ గమ్యం ఏదో ఎవరికి ఎరుక?

నా ఈ జీవన గమనం హైవే జర్నీ కాదు. అనూహ్యమైన ఎన్నో మలుపులు తిరుగుతూ సాగింది. రాళ్లు ముళ్ళు తో నిండి ఎవ్వరు కూడ నడవడానికి ఇష్ట పడని "ది రోడ్ లెస్ ట్రావెల్డ్".

అని ప్రసంగించి ఆమె ముగించారు. సభ చప్పట్లతో మార్మ్రోగింది. అందరు ఆమెను అభినందనలతో ముంచెత్తారు.

మరిన్ని కథలు

Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ
mabbuteralu
మబ్బుతెరలు
- ప్రభావతి పూసపాటి