అనంత విశ్వంలో మనం - కందుల నాగేశ్వరరావు

అనంత విశ్వంలో మనం

అనంత విశ్వంలో మనం విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మానవులకు ఎన్నో శతాబ్దాల క్రితమే మొదలైంది. అసలు విశ్వం అంటే ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? పుట్టటానికి కారణం ఏమిటి? విశ్వం పుట్టక ముందు ఏమి ఉంది? అనే ప్రశ్నలు మన మనస్సులో ఉదయిస్తాయి. మానవ చరిత్రలో మనిషి బుద్ధి వికాశంతోబాటు తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరుగుతానే వచ్చింది. విశ్వం అంటే ఏమిటి ? మనం, మన భూగోళం, సూర్య మండలం మొదలుకొని, ఆకాశంలో మనకు కనిపించే పాలపుంతలు, అందులో ఉండే కోటాను కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, తోక చుక్కలు, కాలబిలాలు, నెబ్యులాలు, క్వాజర్లు, పల్సర్లు, సౌర మండలాలు, వాటి మధ్య ఉండే వాయువులు, గ్రహ ధూళి, ఖాళీ ప్రదేశం మొదలైన అంతరిక్ష పదార్థాల సముదాయమునే విశ్వం అంటాము. విశ్వంలోకి ప్రతీ అణువు మూల కణాలు (Sub-Atomic Particles) మరియు శక్తుల (Different Forms of Energy) సమ్మేళనంతో ఏర్పడింది. మొత్తం స్థలము, పదార్ధము, శక్తి, కాలము అన్నీ కలిసినదే విశ్వం. విశ్వంలోని పదార్థ రూపాలు - అణువులు, కణాలు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఫోటాన్, కేంద్రకం, న్యూట్రినో, క్వార్కులు మొదలైనవి. శక్తి రూపాలు- గురుత్వాకర్షణ శక్తి, కేంద్రక శక్తి, విద్యుదయస్కాంత శక్తి, అనంత గురుత్వాకర్షణ శక్తి మొదలైనవి. మొదట మానవుని ఆలోచనలు తను నివసిస్తున్న భూగ్రహం గురించి, మనకి రోజూ దర్శనమిచ్చే సూర్యచంద్రుల గురించి, తర్వాత మన సూర్య కుటుంబంలోకి మిగతా గ్రహాల గురించి, దూరంగా మిణుకు మిణుకుమని మెరిసే నక్షత్రాల గురించి ఉండేవి. ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించి పోయే తోకచుక్కలకు మనిషి బయపడేవాడు. తరువాత రోజుల్లో ఖగోళశాస్త్రంలో జరిగిన పరిశోధనల ఫలితంగా విశ్వం గురించి మనిషి ఆలోచనలకు హద్దులు పెరుగుతూ వచ్చాయి. సౌర కుటుంబం ఈ అనంత విశ్వంలో ఉన్న లెక్కలేనన్ని గెలాక్సీలలో ‘పాలపుంత’ (Milky Way) అనే ఒక గెలాక్సీ ఉంది. అందులో కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం ‘సూర్యుడు’ అని పిలిచే నక్షత్రం (Sun) అందులో ఒక్కటి. ఆ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది మన ‘భూగ్రహం’ (Planet Earth). మనతోబాటు అంగారక (Mars), బుధ (Mercury), గురు (Jupiter), శుక్ర (Venus), శని (Saturn), యురేనస్ (Uranus), నెప్ట్యూన్ (Neptune) గ్రహాలు సూర్యుడి చుట్టూ తమతమ కక్ష్యలలో తిరుగుతున్నాయి. ఈ గ్రహాలతో బాటుగా ప్లూటో (Pluto) లాంటి ఒక చిన్న గ్రహం, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు కూడా మన సౌర కుటుంబంలో ఉన్నాయి. మన భూగ్రహం మన భూగ్రహం సూర్యుడికి 15కోట్ల కి.మీ. దూరంలో, 6371 కి.మీ వ్యాసార్థం (Radius) వృత్తాకారంలో ఉంది. 450 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి సూర్యుని చుట్టూ తిరిగే వాయు వలయం నుండి విడివడి ప్రత్యేక గ్రహంగా తయారయ్యింది. ఆకాశవీధిలో మనకి కనపడే గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు మొదలైన ఖగోళ విశేషాలు అన్నిటికంటే మన భూగోళం ఒక అద్భుతం. భూగోళంచుట్టూ ఆవరించి, వేల కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపించిన వాతావరణ వలయం ఉండడం అనేది మన గ్రహానికి ప్రత్యేక లక్షణం. మన భూగ్రహాన్ని ఒక ఆపిల్ (Apple) తో పోల్చితే దాని చుట్టూ ఉండే వాతావరణ వలయం, ఆపిల్ పైనున్న చర్మం మందంలో ఉంటుంది. ఈ వలయం మన భూమిపై ఉష్ణోగ్రతను నియంత్రించి, సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ని, గ్రహశకలాలను ఆపే రక్షణకవచంలా పనిచేస్తుంది. ఇది మన సౌరకుటుంబంలో ఉపరితలంపై నీరున్న ఏకైక గ్రహం. సమృద్ధిగా నీరు, సరియైన వాతావరణం ఉండడం వలన, 380 కోట్ల సంవత్సరాల క్రితం జీవం మొదలవడానికి పరిస్థితులు ఆనుకూలించాయి. భూగ్రహం చుట్టూ తిరిగే చంద్రుడు (Moon) ఒక ఉపగ్రహం. చంద్రుడుమన భూగ్రహం పైన వాతావరణ సమతుల్యతకు, భూగ్రహం చలనంలో స్థిరత్వానికి సహాయపడుతుంది. భూమి పుట్టిన కొత్తలో అంటే సుమారు 50 లక్షల సంవత్సరాల తర్వాత, భూమికి అతి దగ్గరగా, పరిమాణంలో కుజగ్రహం అంత ఉండే, థీయా (Theia) అనే ఒక చిన్న గ్రహం భూమిని గ్రుద్దుకోవడం వలన చంద్ర గ్రహం తయారయ్యి మనకి ఉపగ్రహంగా మారింది. మన గ్రహంపై జీవం ఎలా పుట్టింది అనేదాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సైంటిస్ట్లు కూడా ఖచ్చితంగా చెప్పలేని విషయం. భూమిపైన, భూమిలోపల, గాలిలో, నీటిలో ఎక్కడ చూసినా పలురకాల క్రిములు, కీటకాలు, జలచరాలు, పక్షులు, జంతువులు, మహావృక్షాలు లాంటి అనేక జీవరాశులతో నిండి ఉంది. భూమిలోపల చాలా కిలోమీటర్ల లోతువరకూ జీవాల్ని గుర్తించారు. సముద్రాల అడుగున ఉన్న వేడినీట గుంటలు (Hot water fountains) లో జీవం పుట్టి ఉండవచ్చని ఎక్కువమంది శాస్త్రవేత్తల అభిప్రాయం. జీవానికి కావలసిన ముడి పదార్థం రోదసీ నుండి గ్రహశకలాల ద్వారా భూమిపైకి చేరిందని, సూర్యుడి నుండి వచ్చే అతినీల కిరణాల (Ultraviolet rays) వలన హైడ్రోజన్ వాయువు చేధింపబడి, రసాయనిక మార్పులు చెంది జీవానికి ఆధారమైన మూల పధార్ధము; ఆ వేడినీటిలో రసాయనిక సంయోగానికి కావలసిన శక్తి లభించి ఉంటాయని; దీని వలన ప్రాణానికి పనికి వచ్చే జావ (Soup) తయారయ్యిందని, పరిస్థితులు అనుకూలించినపుడు ఆ జావలోని మూలకణాలు సంయోగం చెంది జీవం పుట్టిందని ఊహ. మన పూర్వీకులైన ‘హోమోసెపియన్స్’ అనే ఆదిమానవులు ఆప్రికా ఖండంలో 2,50,000 సం. క్రితమే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 50,000 సం. క్రితం వారు ఆప్రికా నుండి వలస వెళ్ళి ప్రపంచమంతా వ్యాపించినట్లుగా తెలుస్తోంది. భూగ్రహం మీద బ్రతికే, లక్షల కోట్ల జీవరాశులతో కలిసి మనం నివసిస్తున్నాము. బుద్ధిలో మిగతా అన్ని జీవుల కంటే చాలా అభివృద్ధి చెందామని, చాలా తెలివైనవాళ్ళమని మన అభిప్రాయం. మన సౌర కుటుంబంలో (Solar System) కాని, మనకి దగ్గరగా ఉన్న వేరే నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలలో గాని ఎక్కడా కూడా ప్రాణమున్న జీవులని కాని, జీవోత్పత్తికి సరిపడే వాతావరణాన్ని కాని ఇప్పటి వరకు మనం కనిపెట్టలేక పోయాం. 1959లో నాసా (NASA) ప్రయోగించిన ఎక్స్ ప్లోరర్ I ఉపగ్రహం మొదటిసారిగా అంతరిక్షం నుండి భూగోళం చిత్రాలను తీసింది. దీని వలన మన భూగోళం అందం చూసే అవకాశం మనకి దొరికింది. అందంలో మన గ్రహానికి సరిపోయిన గ్రహం ఇంకొకటి లేదు. మన గ్రహంపై మహా సముద్రాలు, పర్వత శ్రేణులు, లోయలు, నదులు, అడవులు, పచ్చిక బయళ్ళు, సాగు పొలాలు, ఎడారులు, మంచుతో నిండిన దృవప్రాంతాలు ఏర్పడి అందమైన రంగురంగుల ప్రకృతితో నిండి ఉంటుంది. ఖగోళశాస్త్ర వికాసంలో కొన్ని మైలురాళ్ళు: ఈ ఆధునిక యుగంలో, ముఖ్యంగా ఈ శతాబ్దంలో, విజ్ఞానం ఆధారంగా చేసిన పరిశోధనల ఫలితంగా, ఇప్పటి వరకు విశ్వం గురించి పరిశోధించి శాస్త్రజ్ఞులు వెల్లడించిన అభిప్రాయాలను తెలుసుకుందాం. ప్రపంచంలోని పరిణితి చెందిన అన్ని నాగరికతలలో విశ్వం గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రాచీన భారతీయ, ఈజిప్టు , గ్రీకు, చైనా, అరబ్ దేశాలవారు అందరూ భూమి బల్లపరుపుగా (Flat Earth) ఉందని; గ్రహాలు, నక్షత్రాలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని నమ్మారు. 2400 సంవత్సరాల క్రిందట గ్రీకు వైజ్ఞానికుడు ఆరిస్టోటిల్ (Aristotle) భూమి గోళాకారంలో ఉంటుందని నిరూపించాడు. కాని భూమిని కేంద్రంగా చేసుకొని మిగతా గ్రహాలు, నక్షత్రాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయని భావించాడు (Geocentric). కోపర్నికస్ (Copernicus) క్రీస్తు శకం 1510 సం॥ లో భూమితో బాటుగా మిగతా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అని (Heliocentric) సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది ఆయన మరణం తరువాత 1543లో బయట పడింది. 17వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం చాలా పురోగతి చెందింది. 1609-18 మధ్య కెప్లర్ (Kepler) గ్రహాల మూడు గమన సూత్రాలు (Laws of Planetary motion) తయారు చేసారు. దాని ప్రకారం గ్రహాలు సూర్యుని ఒక కేంద్ర బిందువు గా చేసుకొని దాని చుట్టూ అండాకారంలో తిరుగుతాయని ప్రతిపాదించాడు. 1610 లో గెలీలియో టెలిస్కోపును ఉపయోగించి చంద్ర గురు గ్రహాలను, పాలపుంతను విస్తృతంగా గమనించాడు. మన పాలపుంత ఎన్నో నక్షత్రాలతో నిండి ఉందని వెల్లడించాడు. 1755లో కాంత్ (Kant) మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల మధ్య గురుత్వాకర్షణశక్తి వల్ల డిస్క్ ఆకారంలో అన్నీ కలిసి పరిభ్రమిస్తూ (Galaxy centric) ఉంటాయని తెలిపాడు. అలాగే దూరంగా ఉన్న నెబ్యులాలన్నీ కూడా ఇటువంటి సముదాయాలే అని చెప్పాడు. ఆయన వాటికి ‘దీవి విశ్వాలు’ (Island Universe) అని పేరు పెట్టాడు. హెర్స్చెల్ (William Herschel) అనే బ్రిటిష్ ఖగోళ శాస్తజ్ఞుడు యురేనస్ (Uranus) గ్రహాన్ని గుర్తించాడు. 1802 లో ఆయన అంతరిక్షంలో 2500 గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు మొదలైన వాటిని తన టెలిస్కోపుతో గుర్తించి వాటి కేటలాగ్ తయారుచేసాడు. నక్షత్రాలు ఇష్టమైన రీతిలోకాక ఒక క్రమ పద్ధతిలో కొన్ని సముదాయాలుగా ఉన్నట్లు గుర్తించాడు. ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానం ఆధునిక శాస్త్ర విజ్ఞానం ముఖ్యంగా ఖగోళ, అంతరిక్ష శాస్త్రాలలో గణనీయమైన అభివృద్ధి గత 100 సంవత్సరాల్లోనే జరిగింది. 1923 లో ఎడ్విన్ హబుల్ (Edwin Hubble) మన గెలాక్సీ తో బాటు మరెన్నో గెలాక్సీలు ఉన్న సంగతిని నిరూపించాడు. మన పొరుగున ఉన్న ఎండ్రోమెడాని (Andromeda galaxy) మన పాలపుంతలో భాగం కాదని వేరే గెలాక్సీ అని నిర్ధారించాడు. 1927లో జార్జెస్ లెమైట్రె (Georges LeMaitre) అనే వైజ్ఞానికుడు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని (Big Bang Theory) ప్రతిపాదించాడు. దీనిని తెలుగులో ‘మహా విస్ఫోటం’అంటారు. 1929లో ఎడ్విన్ హబుల్ (Edwin Hubble) 100 అంగుళాల స్పేస్ టెలిస్కోపుతో మన గెలాక్సీని పరిశీలించి కోట్ల కొద్ది నక్షత్రాలు గుంపులుగా దూరంగా వెళ్తున్నట్లుగా గుర్తించాడు. దీనిని బట్టి విశ్వం ఇప్పటికీ విస్తరిస్తోందని తెలుస్తోంది. 1957లో రష్యా ‘స్పుత్నిక్’ ను, 1958లో అమెరికా ‘ఎక్సప్లోరర్ I’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించాయి. దానితో అంతరిక్ష అన్వేషణ మొదలైంది. దీని వలన మన భూగ్రహం యొక్క అద్భుతమైన అందాన్ని మొట్టమొదట సారిగా అంతరిక్షం నుండి చూడగలిగాము. 1965లో ప్రెడ్ హోయల్ (Fred Hoyle) విశ్వం విస్తరిస్తోందనే విషయాన్ని దృవీకరించాడు. 1990లో హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ (Hubble Space Telescope) ను మన భూమి వాతావరణం బయట అంతరిక్షంలో ప్రయోగించడం జరిగింది. దీనితో మనం ఉత్త కంటితో చూడగలిగిన దానికంటె 1000కోట్లు వంతు భాగం ఉన్న అత్యంత చిన్న వస్తువును కూడా చూడగలము. అందువలన దూరంగా ఉన్న గెలాక్సీలను, గెలాక్సీల మధ్యలో ఉన్న కాల బిలాలను, నెబ్యులాలో నక్షత్రాల పుట్టుకను, అంతకు ముందు చూడలేకపోయిన విశ్వాన్ని మనం పరిశోధించ గలుగుతున్నాము. విశ్వంలో లేనిది ఏమీ లేదు. విశ్వం బయట ఏమీ ఉండదు. విశ్వం పుట్టుక ముందు కాలం లేదు. ‘కాలం’ లేని చోట ‘కారణం’ ‘ప్రభావం’ (Cause and effect) ఉండవు. అందుచేత విశ్వం పుట్టుకకు కారణం లేదు. విశ్వం పుట్టడం అంటే ఏమిటి? విశ్వం పుట్టక ముందు ఏముంది? విశ్వం పుట్టుక, దాని తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి అనే దానిని వివరించే సిద్ధాంతాలలో ఒకటి ‘బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం’ (Big Bang Theory). ఈ సిద్ధాంతం ప్రకారం బిగ్ బ్యాంగ్ కు ముందు విశ్వం లోని పదార్ధం, స్థలం, శక్తి, కాలం అంతా సూది మొనంత కూడా లేని ఒక బిందువులో నిక్షిప్తమై ఉంది. అది మహా ద్రవ్యరాశి (Very High Density) మహా ఉష్ణ స్థాయి (Extremely High Temperature Levels) ఉన్న స్థితి. ఒకానొక సమయంలో ఆ బిందువు నుండి లెక్క కట్టలేనంత శక్తి వెలువడి వ్యాకోచించడం మొదలు పెట్టింది. మహా విస్ఫోటం జరిగిన కొద్ది నిముషాలలోనే ఆ బిందువులో ఉన్న శక్తిలో 95% బయటకు వ్యాప్తి చెందినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ప్రకారం బిగ్ బ్యాంగ్ తర్వాత ‘కాలంతో’ బాటు ‘విశ్వం’ కూడా విస్తరిస్తూ వచ్చి ఇప్పటి రూపం తయారయ్యిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే విశ్వం గెలాక్సీలను మోస్తూ తనంతట తాను వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఒకప్పుడు ఒక్క బిందువులో ఉన్న విశ్వం తనలో తాను వ్యాకోచం చెందుతూ ప్రస్తుత పరిమాణానికి పెరిగింది. మహా విస్ఫోటం జరిగిన నాటి నుండి విశ్వం వయస్సును 13.8 బిలియన్ (1380 కోట్ల) సంవత్సరాలుగా నిర్ణయించారు. మన ఊహకి అందనంత అత్యంత అల్పమైన పరిమాణంతో, ఊహించలేనంత అత్యధికమైన ఉష్ణోగ్రతతో, అంతులేనంత ద్రవ్యరాశితో ఉన్న విశ్వం అనుకోకుండా ఒక్క లిప్తలో విస్పోటం జరిగినట్లుగా, స్థలము, కాలము, ద్రవ్యము ఒక సెకండ్‌లో లక్షోవంతు సమయంలోనే, అత్యంత వేగంగా వ్యాకోచించడం మొదలు పెట్టింది. ఆ వ్యాకోచం వలన మూల కణాలు, శక్తి తయారయ్యాయి. అప్పుడు విశ్వం తాలూకు ఉష్ష్ణోగ్రత 10 కోట్ల డిగ్రీ సెం. (1 billion deg C) కి తగ్గి ఉంటుందని అంచనా. ఆ ఉష్ణోగ్రత ఇంకా బాగా తగ్గి 1650 deg C తగ్గిన తర్వాత మొట్టమొదటి హైడ్రొజన్ (Hydrogen), హీలియమ్ (Helium) అణువులు తయారవడానిక పరిస్థితులు అనుకూలించి ఉంటాయి. తాజాగా 2020 భౌతిక శాస్త్రంలో నోబుల్ పురస్కార విజేత రేజర్ ఫెన్రోజ కృష్ణబిలాలుపై (Black Holes) చేసిన పరిశోధనలకు నోబెల్ పురస్కారం లభించింది. ఆయన సిద్ధాంతం ప్రకారం బిగ్ బ్యాంగ్ ఏర్పడక ముందే విశ్వం ఉంది. విశ్వంలో జరిగిన చివరి మార్పు లేదా చివరి అంశమే బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ కు ముందు ఉన్న పదార్థం అంతా అనంతమైన (Infinite), ఏకరీతి (Uniform), సాంద్రత (Density) కలిగి, విపరీతమైన (Extremely High) ఉష్ణోగ్రతతో ఉండవచ్చునని ఊహ. ఆ పరిస్థితులలో కణాలు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఏవీ తయారయ్యే అవకాశంలేదు. అందుకనే పదార్థం తయారు కాలేదు అనేది ఆయన సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం చెప్పిన కాలానికి ఆ ఉష్ణోగ్రత తగ్గి పదార్ధము ఏర్పడటానికి కావలసిన పరిస్థితులు అనుకూలించాయి. అప్పుడు పదార్థం తయారీకి అవసరమైన మూల కణాలు, అణువులు తయారవడం మొదలై క్రమేపీ అనంత విశ్వంలో నీటి బుడగల్లాగా దూర దూరంగా నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలు, గెలాక్సీలు, గ్రహాలు మిగిలిన అంతరిక్ష పదార్థాలు తయారయ్యి, విస్తరిస్తూ వచ్చాయి. అంటే విశ్వానికి పుట్టుక అనేది ఉందా? లేదా? పుడితే ఎప్పుడు పుట్టింది? అనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు. విశ్వం పరిమాణం : అంతరిక్షంలోని నక్షత్రాల మధ్య దూరం చాలా ఎక్కువ. అందుకని ఆ దూరాన్ని కొలవడానికి ‘కాంతి సంవత్సరం’ ( Light Year) అనే పరిమాణం (Unit) ఉపయోగిస్తారు. కాంతి ఒక సెకండ్‌కు 3,00,000 కిలో మీటర్లు వేగంతో ప్రయాణం చేస్తుంది (3,00,000 KM/Sec). ఆ వేగంతో కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణం చేయగల దూరం ఒక కాంతి సంవత్సరం. ఈ విధంగా ఒక కాంతి సంవత్సరం అనగా 9.5 ట్రిలియన్ (Trillion) కిలో మీటర్లు లేదా 950 కోట్ల కిలో మీటర్లు. మన భూగ్రహానికి అతి దగ్గర నక్షత్రమైన సూర్యుని దూరం 15.9 కోట్ల కిలోమీటర్లు. సూర్యుని కాంతి మన దగ్గరకు చేర్చడానికి సుమారు 8 నిముషములు పడుతుంది. మన పాలపుంత గెలాక్సీ వ్యాసం 90,000 కాంతి సంవత్సరాలు. ఈ గెలాక్సీలో10,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయని అంచనా. మన గెలాక్సీ తాలూకు కేంద్ర బిందువు మన సూర్యునికి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఆ బిందువును కేంద్రంగా చేసుకొని మన గెలాక్సీ కూడా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇటువంటి గెలాక్సీలు మన విశ్వంలో లెక్కలేనన్ని ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మనం ఇప్పుడు గెలాక్సీ అని పిలిచే నక్షత్ర సముదాయాలను పూర్వం ‘నెబ్యులాలు’ (Nebula) అనేవారు. మన గ్రహకూటమికి ఆవతల ఉన్న ‘ఆల్ఫా సెంచూరియన్’ (Alpha Centurion) అనే నక్షత్రం మనకి 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఆనక్షత్రం 4.3 సంవత్సరాల క్రితం విడుదల చేసిన కాంతి ఇప్పుడు మన దగ్గరకు చేరుతుంది. మన పొరుగున ఉన్న ‘ఏండ్రోమెడా’ (Andromeda) అనే గెలాక్సీ మనకి 24,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అది 24 లక్షల సంవత్సరాల క్రితం ఎలాగుండేదో ఇప్పుడు చూస్తున్నాము. అది ప్రస్తుతం ఎలాగ ఉందో మనకి తెలియదు. విశ్వంలో మనకి చాలా దూరంగా ఉన్న నక్షత్రమండలాలు పరిశీలిస్తున్నామంటే, గడచిపోయిన కాలంలోకి చూస్తున్నట్లు. విశ్వంలో గెలాక్సీలు గుంపులు గుంపులుగా, ఉంటాయి. 3నుండి 20 గెలాక్సీల వరకు ఉన్న చిన్న గుంపులను గెలాక్సీ గ్రూపులు (Galaxy Groups) అని వందల కొద్ది గెలాక్సీలు గుంపులుగా ఉంటే వాటిని గెలాక్సీ క్లస్టర్ (Galaxy Cluster) అని పిలుస్తారు. అలాగే ఎక్కువ గెలాక్సీ క్లస్టర్స్ గుంపుగా ఉంటే దానిని సూపర్ క్లస్టర్ (Super Cluster) అంటాము. 2017 లో మన భారతీయ వైజ్ఞానిక బృందం బగ్చి (Bagchi) అనే సైంటిస్ట్ నాయకత్వంలో విశ్వంలో ఒక అతిపెద్ద సూపర్ క్లస్టర్ ని కనుగొని దానికి ‘సరస్వతి’ అని నామకరణం చేసారు. అది మనకి 400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే 400 కోట్ల సంవత్సరాల క్రితం దాని నుండి వెలువడిన కాంతిని ఇప్పుడు మనం చూస్తున్నాము. దాని వ్యాసం పొడవు 65 కోట్ల కాంతి సంవత్సరాలు ఉంటుందని అంచనా. అందులో 43 గెలాక్సీ క్లస్టర్లు ఉన్నట్టుగా గుర్తించారు. మనం ఉన్న పాలపుంత గెలాక్సీ వ్యాసం పొడవు 1,50,000 కాంతి సంవత్సరాలు ఉంటే, సరస్వతి సూపర్ క్లస్టర్ వ్యాసం పొడవు 65 కోట్ల కాంతి సంవత్సరాలు. అనగా మన పాలపుంత గెలాక్సీ కన్న 4000 రెట్లు కంటె పెద్దది. విశ్వం అంతటా ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. మన భూమి నుండి గాని అంతరిక్షంలోని మన కృత్రిమ ఉపగ్రహాల నుండిగాని మనం గమనించ గలిగిన విశ్వం (Observable Universe) అన్ని దిశలలో 46.5 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు [(46.5 billion x 9.5 trillion)Kilo Meters =4.4175e20 KM] ఉందని అంచనా. అనగా మన లెక్కలో మనం ఎటువైపు చూసినా విశ్వం 44175000000000 కోట్ల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలుసుకో గలిగాము. ఆపైన ఎంత వరకు వ్యాపించి ఉందో మనకి తెలియదు. అంతకంటే దూరం నుండి వచ్చే కాంతి మన దగ్గరకు చేరదు. అంటే విశ్వం అనంతం. ఇప్పటి వరకూ గ్రహించిన పరిజ్ఞానంతో విశ్వం ఎప్పుడు పుట్టిందనేది ఖచ్చితంగా చెప్పలేం. అలాగే విశ్వం పరిమాణం కూడా చెప్పలేం. విశ్వం కొన్నాళ్ళు వ్యాకోచిస్తూ (Expansion) మరికొన్నాళ్ళు సంకోచిస్తూ (Compression) అనంతంగా ఉయ్యాలలాగ ఊగుతూ ఉంటుందా? మన భూగ్రహం మీద కాక మరెక్కడైనా జీవం ఉందా అనేదానికి కూడా సమాధానం తెలియదు. ప్రపంచంలో ఎందరో శాస్త్రజ్ఞులు ఈ సృష్టి రహస్యం తెలుసుకోవడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. విశ్వంలోని వింతలు ఆధునిక యుగంలో మన పరిశోధనా సామర్థ్యం పెరిగిన కొద్ది విశ్వం గురించిన అవగాహన మారుతూనే ఉంది. ప్రపంచంలో ఎందరో వైజ్ఞానికులు నిర్విరామంగా విశ్వంలోకి రహస్యాలను తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారు. 1. విశ్వం పరిమాణం (Size of the Universe) విశ్వం పరిమాణం మహా విస్ఫోటనం జరిగిన దగ్గర నుండి విస్తరిస్తూనే ఉంది. విస్తరించే వేగం కూడా పెరుగుతానే ఉంది. ఈ పెరుగుదల ఎక్కడైనా ఆగుతుందా? ఆగితే ఎక్కడ ఆగుతుంది? ఆగకపోతే ఏమవుతుంది? మనం ఎటువైపు చూసినా విశ్వం 44175000000000 కోట్ల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని (Observable Universe) తెలుసుకో గలిగాము. ఆపైన ఎంత వరకు వ్యాపించి ఉందో తెలుసుకోగలిగే సాధనాలు లేవు. 2. విశ్వంలో దూరము-కాలము (Distance-Time) అంతరిక్ష శరీరాల మధ్య దూరాలు చాలా ఎక్కువ. మన భూగ్రహానికి సూర్యుడికి మధ్య దూరం 15.9 కోట్ల కిలో మీటర్లు. సూర్యుడి కాంతి మనకి చేర్చడానికి 8 నిముషాల కాలం పడుతుంది.మన సూర్యుడికి మనకు అతి దగ్గరాఉన్న ఆల్ఫా సెంటేరియన్ అనే నక్షత్ర్రం దూరం 4.3 కాంతి సంవత్సరాలు. అంటే ఆ నక్షత్రం నుండి వచ్చే కాంతి మన దగ్గరకి చేరడానికి 4.3 సంవత్సరాలు పడుతుంది. మన పొరుగున ఉన్న ‘ఏండ్రోమెడా’ (Andromeda) అనే గెలాక్సీ మనకి 24,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అది 24 లక్షల సంవత్సరాల క్రితం ఎలాగుండేదో ఇప్పుడు చూస్తున్నాము. అది ప్రస్తుతం ఎలాగ ఉందో మనకి తెలియదు. విశ్వంలో మనకి చాలా దూరంగా ఉన్న నక్షత్రమండలాలను చూస్తున్నామంటే, మనం భూతకాలంలోనికి చూస్తున్నట్లు లెక్క. 3. కాల బిలాలు (Black Holes) కాలబిలాలలో చాలా తక్కువ పరిమాణంలో (size) ఎక్కువ పదార్ధము (matter) ఉంటుంది. కావున వాటికి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి ఉంది. అందువలన అంతరిక్షంలో ఏదైనా ఖగోళ శరీరం కాలబిలాలకు సమీపంగా వచ్చిందంటే దానిని లోపలకు లాక్కుంటుంది. చివరలకి కాంతి కూడా వీటి ఆకర్షణశక్తి నుండి తప్పించుకోలేదు. రెండు రకాల కాలబిలాలు ఉన్నాయి. చిన్న కాలబిలాలు మన సూర్యుడి కంటె ద్రవ్యరాశిలో (mass)మూడు నుండి నాలుగు రెట్లు ఉంటాయి. వీటిన స్టెల్లార్ కాలబిలాలు అని పిలుస్తారు. ఇలాంటి ఎన్నో స్టెల్లార్ కాలబిలాలు కలసి చాలా పెద్ద కాలబిలంగా రూపు దిద్దుకుంటాయి. వాటిని సూపర్ మాస్సివ్ బ్లాక్ హోల్స్ అని పిలుస్తారు (Super massive Blackholes). ఇవి మన సూర్యునికంటె కోట్ల రెట్లు వరకు ద్రవ్యరాశి కలిగి ఉంటాయి. ఇవి మన గెలాక్సీలకు మధ్యలో ఉంటాయి. అవి దాని దగ్గరగా ఉండే అంతరిక్షవాయువును, శక్తి తగ్గిన ఎర్ర నక్షత్రాలను (red stars), చనిపోయిన నక్షత్రాలను (dead stars) మింగి పెరుగుతూ ఉంటాయి. 4. చీకటి పదార్థం (DarkMatter) విశ్వంలో గెలాక్సీలలో మనకు కనపడకుండా ఉన్న పదార్థంను చీకటి పదార్థంగా పిలుస్తాము. ఆ పదార్థానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాని అందులో మనకి తెలిసిన ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, లాంటివి లేవు. 1933లో ప్రిట్జ్ జ్వికి (Fritz Zwicky) అనే సైంటిస్ట్ ఒక గెలాక్సీలో ఉన్న మొత్తం ద్రవ్యరాశిని లెక్క కడితే, అది ఆగెలాక్సీలోని నక్షత్రాల మొత్తం ద్రవ్యరాశి కంటె 400 రెట్లు ఎక్కువ ఉందని కనుగొన్నాడు. అంటే ఎక్కువ భాగం మనకి తెలియని, కనపడని పదార్థంతో నిండి ఉంది. తరువాత 1960లోను మరల 1970లోను చేసిన కొలతల ప్రకారం కూడా ఈ చీకటి పదార్థం ఉన్న సంగతి నిరూపణ అయ్యింది. 5. చీకటి శక్తి (Dark Energy) గెలాక్సీల ద్రవ్యరాశి పెరిగితే గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే గెలాక్సీల మధ్య దూరం తగ్గుతూ ఉండాలి. కాని గెలాక్సీల మధ్య దూరం పెరుగుతూ కాలంతోబాటు విశ్వం విస్తరిస్తోంది. మనకి తెలియని శక్తి ఏదో గెలాక్సీలను దూరంగా నెట్టుతుందని దీనివల్ల తెలుస్తుంది. మనకు తెలిసిన వాటికంటె భిన్నమైన ఈ శక్తికి డార్క్ ఎనర్జీ అని పేరు పెట్టారు. దీనికి డార్క మీటర్‌కి సంబంధం లేదు. మొత్తం విశ్వంలో తెలిసిన పదార్థం , తెలిసిన శక్తి 5% మాత్రమే. అనగా 95% విశ్వంలోకి పదార్థం, శక్తుల గురించి ఈనాటి వరకు మనకి తెలియదు. ఆలోచించి చూస్తే, మనం ఎంత అదృష్టవంతులం అనేది అర్థమవుతుంది. మన భూగ్రహం సరియైన పరిమాణంలో, మనకు శక్తినిచ్చే సూర్యుడికి సరియైన దూరంలో ఉంది. ఈ భూగోళం మీద వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఉద్భవించింది జీవం. దాని నుండి వేల సంవత్సరాల తరువాత, పరిణామ క్రమంలో సరియైన సమయంలో మనం మేధస్సుతో కూడిన జీవులైన మానవులుగా జన్మనెత్తాము. ఈ సృష్టిలోని అనంతమైన విశ్వం పరిమాణంతో గాని, విశ్వం జీవితకాలంతో గాని పోలిస్తే మానవుడి 100 సంవత్సరాల జీవితకాలం అత్యల్పం. అటువంటప్పుడు ఇంత అల్పులమైన మనలో స్వార్థం, క్రోధం, ద్వేషం, అసూయ, అహంకారం, పగ, ప్రతీకారం, ఉండటం అవసరమా? తోటి మానవులపై ప్రేమ, దయ, కరుణ లాంటి మంచి లక్షణాలను ఎందుకు అలవర్చుకోకూడదు? ఆలోచించండి!