కవన మంజరి - రాము కోలా.దెందుకూరు.

కవన మంజరి కవన మంజరి కవితా సంకలనం కవయిత్రి. మంజుల సూర్య గారు హైదరాబాద్. పుస్తక పరిచయం కర్త రాము కోలా.దెందుకూరు. కవిత్వం,మనిషి మస్తిష్కంలో అనేక ప్రశ్నలకు సమాధానం ,లేదా పరిష్కారంకు ప్రేరణగా నిలవాలి,అనేది సాహిత్యాభిమానులు కోరిక. చదివిన ప్రతి పాఠకుడు వ్యవస్థను నిలదీయాలనే ఆలోచనకు బీజం నాటాలి. ప్రశ్నించే తత్వంతో.ఆత్మీయతలు,అనుబంధాలను నిలుపుకుంటూ,కలుపుకుంటూ ముందుకు సాగాలి. పొట్ట కూటి కోసం ఎండను కూడా లెక్కచేయకుండా శ్రమించే శ్రామికుడికి గొడుగు పట్టాలనిపించాలి. ఆకలితో అలమటించే వృద్దులకు ,నీ ఇంట పస్తులు ఉన్నా,ఉన్నంతలో వారి ఆకలి తీర్చాలనే మానవత్వంను నిద్రలేపాలి. నింగి నుండి జారుతున్న చినుకులు థాత్రిపై చేసే చిరు సవ్వడి వినిపించాలి. కర్షకుడి సేద్యానికి చిందులు తొక్కె గోమాత గిట్టల శబ్దం వినిపించాలి. సంక్రాంతి పండుగకు పల్లెపడుచులు చేసే అల్లరి వినిపించాలి, అనుకునే సాహిత్య ఆస్వాదకులకు షడ్రుచులతో అందించిన విందు భోజనం ఈ "కవన మంజరి" అనవచ్చును. కవయిత్రి అన్ని వర్గాల పాఠకులు మనస్సును అర్థం చేసుకుని . తాను అక్షర భావాలతో... పేదవారి ఆకలి కేకలు, కిలోమిటర్లు నడకలో అలసిన తనువులు. దిశానిర్దేశం లేక సాగిపోతున్న వలస జీవులు. పూట గడవడం కోసం పస్తులతో! మరో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న సామాన్యూని కన్నీళ్లను ఆశల జ్యోతులు గా వెలిగించి. ఆవెలుగుల్లో పురుడు పోసుకున్న అక్షర సుమం ఈ "కవన మంజరి" కవితా సంకలనం ,అనేలా తీర్చిదిద్దారు. అందమైన ముఖ చిత్రంతో,నాణ్యమైన ముద్రణతో, మహనీయులు వ్రాసిన ముందు మాటల్తో, ముస్తాబైయిన కవిత్వాత్మకంగా రూపొందించ బడినన సంకలనం గురించి ,నా మనసు స్పందించిన నాలుగు మాటలు మీతో పంచుకోవాలనే చిరు ప్రయత్నంలో..... పాఠకునికి కావాల్సిన ప్రతి అంశము పైన , కావాల్సినంత చక్కనైన , స్వచ్చమైన,తెలుగు పదాల అల్లికతో కవితలను ఏర్చి కూర్చి, ప్రతి పాఠకుని మనస్సును సంతృప్తి పరిచేలా రచనలు నింపుకున్నది ఈ "కవన మంజరి". కవయిత్రిగా వారి పరిచయం లోనే తను కవిత్వం వైపు అడుగులు వేయడానికి కారణాలు వివరించారు. వాస్తవ సంఘటనలను చూసి స్పందించి,కవిత్వం వ్రాయాలనే మనసు ప్రయత్నమే‌, తను కవిత్వం వ్రాయాలని అనుకోవడానికి కారణమని తెలియచేసారు. ఇదే కవికి ఉండవలసిన ఉత్తమ లక్షణం. వాస్తవంలో నుండే అక్షరం పురుడు పోసుకుని కవిత్వంగా బయట ప్రపంచంలోకి దూసుకు రావాలి. అందుకే వాస్తవ సంఘటనలను మన ముందు అలా నడిచి వచ్చి పలుకరిస్తూ ఉంటాయి.తమ గురించి తెలియచేసి మరో శ్రామికుడికి, అవకాశం ఇస్తూ తప్పుకుంటుంటాయి కవితలోని పాత్రలు. ."సాగిపో" అనే కవితలో జీవితం వల కాదు అటు పొట్ల అల కాదు.. ...... ఇలలో ఒక పదిలమైన జ్ఞాపకంగా మిగిలిపో" అని జీవితం విలువలు తెలియచేస్తారు కవయిత్రి. కట్టూ,బొట్టూ మన సాంప్రదాయంలో ఎంతో విలువైనవి. వాటిని స్వాగతిస్తూ.. సాంప్రదాయాలు కాపాడవలసిన ఆవశ్యకతను వివరిస్తారు ఆ కవితలో. భేషజము లేని వేషమే కడు రమ్యము అదే కదా! మన ఆదర్శము అదే కదా! మన భారతీయము. వస్త్రాలంకరణ ప్రాముఖ్యతను వివరించిన పదాలు ఇవి. ఎంత గౌరవం ఇవ్వాలో తెలిసిన పదాలు కదా? కట్టూ,బొట్టూ పైన అనిపించక మానదు మన మనసుకు. "కార్ల్ మార్క్స్ చెప్పిన,మానవ సంబంధాలు అన్నీ! ఆర్థిక సంబంధాలు తోనే ముడిపడి ఉంటాయ్" అనే భావాన్ని తమ కవిత"మనస్సు"లో ఇలా అంటారూ కవయిత్రి "గజిబిజి మనస్సు చిక్కుముడుల మెస్సు సంబంధం గల సంబంధాలన్నీ ఆర్థికమాంద్యంతో నిండిపోయే అనుబంధాలన్నీ మనీపర్సు అయిపోయే" నిజమే కొందరు బంధాలను పదిలంగా దాచుకుంటారు., కొందరు ధనంతో కొని సొంతం చేసుకుంటూ,వాడుకుని వదిలేస్తుంటారు. ధనం ఉంటేనే బంధాలు,అనుబంధాలు అనే సున్నితమైన వివరణ అద్బుతంగా అమరింది .ఈ కవితలో. మనిషి మాటకు ఉన్న విలువను కవయిత్రి తన "మాటలు తూటా"కవితలో ఇలా అంటారు. పెదవి జారే పెళుసు మాట ముందు పోరులో తూటా కూడా బలాదూరే ........... తూటా తగిలితే రోదనే! మాట పేలితే వేదనే తూటా లైనా తూటాల్లాంటి మాటలైనా మిగిల్చేది శోకమే .మరి కప్పిపుచ్చలేని శూన్యమే! మాట విలువను మరే కవి ఇలా వివరించలేదెమో? అనే భావన కలుగుతుంది,చదివిన మరుక్షణం. మాటకు ఎంత గౌరవం ఇవ్వాలో ఈ కవిత వివరిస్తుంది. బహుషా ఇది కవయిత్రి మనసేనేమో? కన్నీటి చుక్క అనే మరో కవిత చుక్క పోడవంగానే చక్కా పోయి చుక్కేసి వచ్చే పెనిమిటిని చూసి.... ఇంటి చుక్క కార్చే కన్నీటి చుక్కలు... అటు ఇంటికి వెలుగులాంటి స్త్రీమూర్తి ,భర్త తాగుడుకు బానిసగా మారితే ?కంట కన్నీరు చిందించే భావం అద్బుతంగా పలికిస్తూ.. వ్రాసిన కవిత ఇది. మద్యం జీవితంలో, సుఖసంతోషాలను దూరం చేస్తూ,సమస్యలను సృష్టించే విషపు చుక్కలుగా అభివర్ణించారు ఈ కవితలో "చుక్కా"అనే పదానికి బహు భావాలు పలికించి కవయిత్రి తనలోని ప్రతిభను చాటుకున్నారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సోగకళ్ళు.. ఇంతికి అందం కన్నులే,అల్లరిగా,కవ్వింపుగా,క్రోధం గా,చిలిపిగా చూడగల నేర్పరితనం ప్రదర్శించేవి నయనాలే అంటు వంటి నయనాలకు చక్కటి కవనం ఇది. సోగకళ్ళు కలల సౌధాల్ని కన్నులారా వీక్శింపచేసే నిలువుటద్దాలు.. నన్ను నిలువు దోపిడి చేయించే కమనీయ గవాక్షాలు.. తృటిలో తనవైపు లాక్కునే అయస్కాంత క్షేత్రాలు.. నన్ను నేను చూసుకునే నా బింబం ప్రతిబింబాలు. ఎంత చక్కటి భావుకత దాగి ఉందో కదా ! ఈ కవనంలో. వహ్వా!కవయిత్రీ అనక మానదు ,మనసు ఈ భావం తలచిన ప్రతి సారి. ఛీత్కారాలు అనే కవితలో,నేటి సమాజంలో స్త్రీ గమనం అడుగడుగునా అవరోధాలతోనే, మానవ మృగాల చూపుల వేధింపులతోనే. అందుకే ప్రతిక్షణం తనతో ఉండవలసింది మనోధైర్యం, ఒంటరి ప్రయాణం అవసరమైన పరిస్థితిలో స్వీయ రక్షణ మరియూ,టోల్ ఫ్రీ నెంబర్లను.విధిగా చెంత ఉంచుకోవాలనే ఆవస్యకతను వివరించారు. ఇది నేటి యువతకు చాలా విలువైన వాక్యం. తప్పిన పట్టాలు అనే కవితలో నేటి సమాజంను చూస్తూ యువత వికృత చేష్టలను చూసి చలించిన మనసుతో వ్రాసిన విధానం, నేటి యువత చదివి తమని తామే సరిదిద్దుకోవాల నే సందేశంలో. మనసులోని ఆవేశంను అక్షరీకరించారు అనవచ్చు. కల'గంటి అనే కవితలో కలలకు వాస్తవానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేస్తూ.. జీవితం కలలతో గడిపేస్తుంటే,, కన్నులు తెరిస్తే అది అదృశ్యం అయిపోయే భ్రమ మాత్రమే. అవుతుంది. అందుకే కలలు కంటూ ఎంతో విలువైన కాలాన్ని చేజార్చుకోకు. జీవితం బహు విలువైనది నిదురించే కలలలో తారస్థపడే ప్రపంచ మేలుకొలుపు లోనే మాయమయ్యే మాయాజాలం ....... సోమరులకు దినమంతా పగటి కలలు ప్రపంచం ....... పగటి కలలు ప్రగతికి అవరోధం మని తెలుసుకో! చక్కటి హితభోదతో కూడిన దిశానిర్దేశం ఈ కవిత ద్వారా... ఓ కాంతామణి కథ కవిత నేటి సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు స్త్రీకి ఈ జనారణ్యంలో మృగాల నుండి రక్షణ మృగ్యమేనా? తాను సృష్టించిన సమాజంలో తనకు రక్షణ కరువా? ఇలా అయితే మనుగడే ప్రశ్నార్థకం కాదా? అంటూ సూటిగా ప్రశ్నలు సమాజంపై సంధిస్తున్నారు సమాధానం వెతకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే కవిత కు ముందు వ్రాసినటువంటి ప్రకృతి మాత అనే కవిత అమ్మ ఉండి కూడా నా దేశం అనాధలా ఉండాలా? జగజ్జనని ఉన్నా జగతికి రక్షణ లేకుండే పరిస్థితికి కారణం ఎవ్వరో? పసికూన లాంటి ప్రాపంచకం పట్టించుకునేవారు లేక కొట్టు మిట్టాడుతుంటే ? ఏమిటి దౌర్భాగ్యం అని ప్రశ్నిస్తున్న ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? ఉంటే చెప్పగల దైర్యం ఉందా? మనసును మధించుకుందాం!రండి సమిష్టిగా. చివరగా దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించినప్పుడు సుదూర ప్రాంతాల నుండి వలస కార్మికులు కాలి నడకన తమ స్వస్థలాలకు తిరిగి చేరుకోవాలని చేసిన కాలి నడకను, ఒక దృశ్య రూపంలా కన్నులకు చూపించిన కవిత ఇది.. నెత్తురుతో తడిసిన నేల ఆకలితో రోడ్డు పక్కన కుప్పకూలిన అన్నార్తుల వేదన గుక్కెడు మంచినీళ్లు కోసం,తమ స్వేదం పిండుకుని తాగిన విధానం, సొమ్మసిల్లి పోయిన చిన్నారుల ముఖచిత్రాలు. ..... ...... ఎన్నో వాస్తవం సంఘటనలను అక్షర రూపంలో కూర్చి ,కంటికి దృశ్యంలా చూపించి, ప్రతి ఎదను పిండేసి, కష్టజీవుల సజీవ చిత్రాలను చూపించి విధానం అనితర సాధ్యం అనక తప్పదు. ఇలా వివరిస్తూ సాగుతుంటే ఈ కవన సంకలనం పైన ఒక గ్రంథమే వ్రాయవచ్చు . చివరగా ఒక్క మాట. స్వలాభాపేక్ష లేకుండా ఈ కవన మంజరి ముద్రించిన కవయిత్రి, పుస్తకం ధర 150 రూపాయలు ఉన్నా!,నామమాత్రపు పోస్టల్ ఛార్జీలు పంపిన ప్రతి ఒక్కరికి తన పుస్తకం పంపించారు ,ఇది కదా కవి హృదయం అనిపించేలా. అందుకే ప్రతి ఒక్కరూ,కవయిత్రి వద్దనుండి పుస్తకం స్వీకరించి,చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు,స్పందన వారికి తెలియచేయండి. వారి గుగుల్ ఫేం నెంబర్. +91 97040 22244 వీరి నుండి మరెన్నో కవితా సంకలనాలు రావాలని మనసారా కోరుకుంటూ.. రాము కోలా.దెందుకూరు. ఖమ్మం.9849001201.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు