'తస్మాత్ జాగ్రత జాగ్రత' - మద్దూరి నరసింహమూర్తి

Tasmat jagrata jagrata

ప్రతీ వ్యక్తీ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం : బాల్యం బాగా గడిచినా, పరువం పసందుగా పయనించినా,

మలి వయసులో మలుపులే ముఖ్యం.

ఎందుకంటే -

బాల్యంలో తల్లి తండ్రులు, స్నేహితులు అంతో ఇంతో తోడు, ఆసరాగా ఉంటారు. కాబట్టి ఆట పాటలతో బాగానే గడిచిపోతుంది.

పరువంలో పతి పత్నులు ఒకరినొకరు పట్టించుకుంటారు, చేదోడు వాదోడుగా ఉంటారు కాబట్టి, వయసులో పసందుగా కాలం పరిగెడుతుంది.

ఆ పరుగులో అలసి సొలసిన తదుపరి వచ్చే మలి వయసు, తాపీగా భారంగా గడవలేక గడపలేక తలకు మించిన భారంగా తోస్తుంది.

ఆ మార్పు ఆ పరిణామం : తప్పనిసరి; అవ్హానించినా మానినా, తప్పక జీవితం తలుపు తడుతుంది.

అవ్హానించని ఆ అతిథి, ఎన్నాళ్లుంటారో, చెప్పా పెట్టకుండా ఎప్పుడు మనతోబాటే మాయమైపోతారో ఆ ముహూర్తం వరకు తెలీదు. అందుకే, ఆ అతిథిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గౌరవించాలి.

అంతవరూ పాటించకపోయినా, చాలా నియమ నిష్టలు మలి వయసులో తప్పక పాటించాలి.

ఆ నియమ నిష్టలు బాల్యంలోనే - కనీసం పరువంలోనేనా - అలవాటు చేసుకున్నవాళ్ళకి మలి వయసులో పాటించడం పెద్ద కష్టమనిపించవు.

ముందుగా అలవరచుకోనివాళ్ళు, మలి వయసులో కొత్తలో కొంచెం కష్టమనిపించినా, అలవాటు చేసుకోవాలి, ఆచరించాలి.

అనుక్షణం మరపు రాకుండా మననం చేసుకుంటూ ఆ దైవాన్ని కోరుకోవలసినది –

‘అనాయాసేన మరణం’ & ‘వినా దైన్యేన జీవనం’.

అలా జరగనప్పుడు 'ఎందుకు బ్రతికున్నానురా భగవంతుడా' అనుకోవలసి వస్తుంది. బ్రతుకు భారమై బాధిస్తుంది.

కాబట్టి ఎలా జాగ్రత్త పడాలంటే --

ప్రతీ రోజూ -- బద్ధకం పడకుండా వేకువనే లేవాలి;

అరగంటేనా, చేయగలిగిన వ్యాయామం చేసి తీరాలి;

యోగ, భగవత్ ధ్యానంలో కొంత సమయం వెచ్చించాలి.

-2-

మితమైన ఆహరం తినాలి.

ద్రవ పదార్ధాలు ఎక్కువగా సేవించాలి (-- అలాగని మధిర మద్యం సేవించడం కాదు.

ఆ అలవాటుంటే, వదులుకోవాలి).

సత్సాంగత్యం సమకూర్చుకోవాలి. తెలిసిన మంచి నలుగురికి పంచాలి.

కొత్తగా ఏమేనా తెలుసుకోవాలిపించినా, నేర్చుకోవాలనిపించినా, ఆ ముచ్చట తప్పక తీర్చుకోవాలి –

అంతేగానీ, ఈ వయసులో ఇప్పుడెందుకులే అని నిరుత్సాహపడనేకూడదు.

హాస్యరస జీవనం సాగించాలి - అంతేకానీ, అపహాస్యం చేయకూడదు, అంతకుమించి, అపహాస్యంపాలు కాకూడదు.

మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకోవాలి.

ఇంత (ఎక్కువ) వయసు అని తెలిస్తే ఎవరేమనుకుంటారో అన్న భావంతో ఉండకుండా – --ఎంత అనుభవం అలవడిందో అని, ఆనందంగా ఉండాలి. --పైగా, వయసుకి తగ్గట్టుగా పెద్దమనిషి తరహాగా వ్యవహిరిస్తేనే నలుగురిలో గారవప్రదంగా ఉంటుంది.

మలి వయసుకు ముందరే, సంసార బాధ్యతలు వదిలించుకుంటే మంచిది –

--లేకపోతె, ఎంత త్వరగా ఆ బాధ్యతల బరువు దింపుకుంటే అంత శ్రేయస్కరం.

సాధ్యమైనంతవరకూ ఒంటరిగా ఉండకుండా, ఒంటరితనం దరికి రాకుండా చూసుకోవాలి.

జీవన సహచరులు ఇద్దరూ కలిసే ఉండడం ఉత్తమం. పిల్లలు వారి సులువుకోసం ఇద్దరినీ వేరు చేయకుండా జాగ్రత్తపడాలి.

అతి ముఖ్యమైనది - ఆర్ధికంగా ఒకరిమీదా (పిల్లలైనా) ఆధారపడకుండా ఉండడంలో, ప్రశాంత జీవనం ఉంది అని ఎప్పుడూ మరువకూడదు.

'ఒకరికి ఇచ్చుటలోనే ఆనందముంది' అని ఒక మహానుభావుని కలం కదిలింది.

అంతేకాదు, ఆ ఆచరణతోనే మన పునర్జన్మ ముడి పది ఉందని గ్రహించాలి.

పైన చెప్పినవేవీ ఎవరికీ తెలియదనికాదు. ఉదయం ఐదో గంటకి లేవాలి అని తెలిసి పడు కున్నా - ఆ సమయానికి అలారం మ్రోగకపోతే, లేచేది ఈ ఏడు గంటలకో ఎప్పుడో.

ఈ నా పలుకులు అలంటి అలారం అనుకోండి. ఆచరించి తరించండి.

అందుకే - 'తస్మాత్ జాగ్రత జాగ్రత' అని పరమగురు శ్రీ శంకరాచార్యులవారు ఎప్పుడో జాగ్రత్తలు చెప్పేరు.

******************************

మరిన్ని వ్యాసాలు