సమతా మూర్తి - శ్రీ భగవద్రామానుజాచార్యులు - కొమ్మలూరు హరి మధుసూదన రావు

సమతా మూర్తి  - శ్రీ భగవద్రామానుజాచార్యులు

శ్రీ భగవద్రామానుజాచార్యులు

‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే’ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నేను అవతరిస్తానని సాక్షాత్తూ భగవంతుడే చెప్పాడు. ఒక ప్రక్క జైన, బౌద్ధ, ముస్లిం మతాల దాడి, మరోప్రక్క హిందూ మతంలోనే అంటరానితనం, జంతుబలులు వంటి మూఢాచారాలు విలయ తాండవం సృష్టిస్తున్న వేళ భగవంతుడే ఆచార్యునిగా అవతరించి సనాతన హిందూ మతాన్ని సంస్కరించి, సముద్ధరించారు. వారే శ్రీ శ్రీ శ్రీ భగవద్రామానుజాచార్యులు.

అవతరించుట :

ఆదిశేషుడు శ్రీరామునికి సోదరునిగా త్రేతాయుగంలో అవతరించగా, కలియుగంలో అదే అంశతో రామానుజులు గా అవతరించారు. తమిళనాడు లోని చెన్నపట్టణం దగ్గరిలోని శ్రీపెరంబదూరు లో క్రీ.శ.1017 చైత్ర శుద్ధ పంచమి నాడు కేశవసూరి మరియు కాంతిమతి పుణ్యదంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డే యతి రాజు గా ప్రసిద్ధిగాంచిన రామానుజులు. ఒక రోజు పూజకోసం తులసి కోట వద్దకు కేశవసూరి వచ్చాడు. తన కుమారునికి సూర్యతాపం తగలకుండా ఒక సర్పం పడగ విప్పి ఉండటం చూసి నిశ్చేష్ఠుడయ్యాడు. కానీ అది ఏ హానీ చేయకుండా తులసి వనంలోనికి వెళ్లిపోవడంతో ఊపిరి తీసుకొని బిడ్డను గుండెలకు హత్తుకున్నాడు. ఎంతైనా రామానుజులు ఆదిశేషుడి అంశ కదా!

గురువు గారి అసూయ :

రామానుజుడు చిన్నతనంలోనే వేద విద్యలను త్వరగా పూర్తిచేశాడు. పదహారు సంవత్సరాల వయస్సులో తంజమాంబతో వివాహమయ్యింది. తిరుపుట్ కుళిలో యాదవ ప్రకాశుడు అనే అద్వైత గురువు వద్ద శిష్యునిగా చేరాడు. ఒకరోజు గురువు గారి కాళ్ళు పడుతూ చాంద్యోగపనిషత్ లోని ‘యథా కప్యాసం పుండరీక మేమ యక్షినో’ అనే శ్లోకాన్ని వల్లె వేస్తున్నాడు. దానికి యాదవ ప్రకాశులు అర్థం చెబుతూ ‘శ్రీ హరి కన్నులు కోతి పృష్ఠ భాగం వంటి ఎర్రని తామర పువుల్లా ఉన్నాయి’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యానానికి రామానుజుడు బాధపడటంతో కంటి నుంచి భాష్పజలం రాలి గురువు గారిపై పడింది. యాదవ ప్రకాశులు ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించాడు. ‘శంకరుల వంటి మహనీయులు ఇటువంటి అర్థంలో చెప్పలేదు’ అని రామానుజుడు అన్నాడు. సరే నీవు చెప్పగలవా? అని గద్దించాడు ప్రకాశులు. ‘కపి అంటే తామర తూడు, సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. క ప్యాసం అంటే నీటిపై తేలియాడే తామర పువ్వుల్లాంటి కన్నులు కలవాడు’ అని రామానుజుడు వివరించాడు. దీనితో తన కంటే గొప్ప వాడవుతాడన్న అసూయ బీజంలా గురువు గారి మనసులో నాటుకుంది.

కాంచీపుర రాజు కుమార్తెకు పట్టిన భూతాన్ని విడిపించడంలో యాదవ ప్రకాశుడు విఫలం కాగా, రామానుజుని ప్రయత్నం సఫలం కావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఎలాగైనా రామానుజుని అంతం చేయాలని కుట్ర పన్నాడు. కాశీ యాత్రకని చెప్పి బయలుదేరి మార్గమధ్యంలో వింధ్య పర్వతాల వద్ద అరణ్యంలో ఈ పని చేయాలని శిష్యులకు చెప్పటం రామానుజుని పిన్ని కుమారుడు గోవిందుడు విన్నాడు. ఈ విషయం రామానుజునికి చెప్పి అపాయం నుంచి తప్పించాడు. ఆ అరణ్యంలో తిరిగి తిరిగి అలసి పోయి ఎలా వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్న రామానుజునికి ఒక కోయ జంట కనబడింది. ‘ఈ అరణ్యాన్ని దాటించండి’ అని వారిని కోరాడు. కొంతదూరం వెళ్ళాక ఆ కోయ యువతి తన భర్తతో ‘నాకు దాహమేస్తోంది’ అని అడిగింది. ‘చీకటి పడింది కౄర మృగాలు నీటి కోసం వస్తుంటాయి. కాబట్టి విశ్రమించి ఉదయాన్నే నీరు తెస్తానని’ చెప్పి ఆమె భర్త చెబుతాడు. అందరూ నిద్రిస్తారు. రామానుజులు ఉదయాన్నే లేచి కోయ యువతికి నీరు తెద్దామని కొంతదూరం వెళ్ళగా బావి కనబడింది. నీరు తీసుకుని వచ్చి చూస్తే ఆ జంట కనబడలేదు. అటుగా వెళుతున్న కొందరిని ఇది ఏ గ్రామమని ప్రశ్నించగా కంచి అని చెబుతారు. ఎక్కడ వింధ్య పర్వతాలు ? ఎక్కడ కంచి ? ఇది ఎలా సాధ్యం ? అని ఆలోచిస్తుండగా తనకు సహాయం చేసింది సాక్షాత్తూ సీతా రాములని అప్పుడు రామానుజునికి అర్థమయ్యింది.. ఆ బావి నుంచే ప్రతి రోజు నీరు తెచ్చి వరదరాజ పెరుమాళ్ కి, పేరుందేవిత్తాయారికి అభిషేకం చేసేవాడు. శ్రీ యామునాచార్యుల వద్ద శిష్యునిగా చేరారలని శ్రీ రంగం కి రామానుజుడు చేరుకొన్నాడు. కానీ అప్పటికే గురుదేవులు అంతిమ శ్వాస విడిచారని తెలిసి ఎంతో బాధ పడ్డాడు. అంతిమ సంస్కారం చేసేటప్పుడు గురువు గారి మూడు వ్రేళ్ళు ముడుచుకొని ఉండటం చూసి వారి శిష్యులను విచారించగా, గురువు గారి అంతిమ కోరికలు మూడు ఉన్నాయని తెలిపారు. ఆ అంతిమ కోరికలైన బ్రహ్మ సూత్రాలకు శ్రీ భాష్యం వ్రాయడం, తమిళంలోని తిరువాయిమొళి ప్రబంధాన్ని సంస్కృతీకరించడం, విశిష్టాద్వైతాన్ని, వ్యాస, పరాశర గురు పరంపరను విస్తృతంగా ప్రచారం చేయడం తన అంతిమ లక్ష్యంగా చేసుకుంటున్నాను అని రామానుజులు అందరికీ వినబడేటట్లు శపధం చేయగానే శ్రీ యామనాచార్యుల చేతి వ్రేళ్ళు మామూలు స్థితికి వచ్చాయి.

సన్యాస స్వీకారం :

శ్రీకాంచీపూర్ణుల వద్దకు వచ్చి తనను శిష్యునిగా స్వీకరించవలసిందిగా రామానుజులు కోరాడు. తాను వైశ్యుడినని బ్రాహ్మణుడైన రామానుజునికి గురువుగా ఉండనని శ్రీకాంచీపూర్ణులు నిరాకరించాడు. ‘పుట్టుకతో బ్రాహ్మణత్వం రాదని మీరు చేసిన పుణ్య కర్మల వల్ల మీకు ఎప్పుడో బ్రాహ్మణత్వం లభించిందని తన గురువు మీరేనని’ రామానుజుడు అన్నాడు. కానీ ఇది రామానుజుని భార్య తంజమాంబకు నచ్చలేదు. ఒక రోజు రామానుజులు లేని సమయంలో ఇంటి బయట అరుగుమీద శ్రీకాంచీపూర్ణులకు భోజనం వడ్డించింది. భోజనానంతరం గోమూత్రంతో శుద్ధి చేస్తున్న తంజమాంబ చర్యను రామానుజుడు ఈసడించు కున్నాడు. తంజమాంబ పుట్టింటిలో వివాహానికి వెళదామని భర్తను కోరగా వరదరాజస్వామి సేవలో ఉన్నానని రాలేనని అన్నాడు. దాంతో తంజమాంబ కోపంతో ఇంతదానికి అసలు పెళ్ళెందుకు చేసుకున్నారు ? వెళ్లి సన్యాసుల్లో కలిసిపోండని అనగానే ఇదే అదనుగా శ్రీరంగంకి వెళ్లి మహాపూర్ణుల వద్ద కాషాయ వస్త్రాలు ధరించి త్రిదండంతో సన్యాసం స్వీకరించాడు.

సమతా మూర్తి :

తిరుక్కోటియూర్ లో ఉండే గోష్ఠీపూర్ణులనే గురువు వద్దకు వచ్చి రామానుజుడు తిరుమంత్ర రహస్యాన్ని ఉపదేశించమని ప్రాధేయపడ్డాడు. కొన్ని రోజులు శిష్యుడిని పరీక్షించి తగిన అర్హుడే అని భావించి తిరుమంత్ర రహస్యాన్ని గురువు బోధించాడు. తనకే ఇన్ని రోజులకు మంత్రోపదేశం కలిగితే ఇక సామాన్య జనులకు ఎలా లభిస్తుందని రామానుజుడు ఆలోచనలో పడ్డాడు. వెంటనే అక్కడి దేవాలయం గోపురం ఎక్కి తిరుమంత్ర రహస్యాన్ని పుర జనులందరికీ వినబడేలా రామానుజుడు చెబుతుండగా, గురువు వచ్చి ‘అతి రహస్యమైన ఈ తిరుమంత్రాన్ని బహిర్గతం చేసినందుకు నరకానికి పోతా’వని అంటాడు. ‘పది మందికి మంచి జరిగేటప్పుడు నాకు నరకం ప్రాప్తించినా ఆనందంగా స్వీకరిస్తా’నని రామానుజుడు అంటాడు. శిష్యుని ఆశయానికి గురువు సంతోషించి ‘నాయనా! నీవు సామాన్యుడవు కాదు’ ‘ఎంబెరు మానార్’ గా ప్రశంసిస్తాడు. ‘ఎంబెరుమానార్’ అంటే తనను మించిన వాడని అర్థం.

తిరుమల అతి పవిత్రమైనదని కాళ్ళతో ఎక్కకుండా మోకాలితో ఎక్కి అక్కడ వెలసిన వేంకటేశ్వరుడు సాక్షాత్తు విష్ణు రూపమని ఋజువు చేశాడు. జంతు బలులను నిషేధించాడు. గోవిందరాజ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయించాడు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజా విధానాన్ని నిర్ణయించాడు. వైష్ణవ ద్వేషి అయిన కుళోత్తుంగ చోళుడు రామానుజుడిని అంతం చేయాలని కుట్ర పన్నుతాడు. తన వద్దకు రావలసిందిగా ఆహ్వానం పంపుతాడు. కానీ ఈ విషయం రామానుజులకు తెలియకుండా చేసి కిడాంబి అచ్చన్ అనే శిష్యుడు కర్నాటక లోని హోయసాల రాజ్యం మేల్కోటే కు తీసికెళతాడు. కూరత్తాళ్వార్ అనే శిష్యునికి రామానుజుని వేషం వేసి మహాపుర్ణులు కుళోత్తుంగ చోళుడి వద్దకు వెళతారు. కానీ ఈ విషయం కుళోత్తుంగ చోళుడికి తెలిసి వారి కళ్ళను పీకించి వేస్తాడు. ఆ బాధ తట్టుకోలేక మహాపుర్ణులు పరమపదించాడు.

రామానుజులు మేల్కోటలో పిట్టిదేవుడనే జైన రాజును వైష్ణవుని చేసి విష్ణువర్ధనునిగా పేరు మార్చి దేవాలయాన్ని నిర్మించాడు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాడు. స్త్రీలకు సమాశ్రయం ఇచ్చి తిరునామాన్ని ఉపదేశించాడు. నారాయణుడికి కూడా సమాశ్రయం ఇచ్చి స్వామి చేతనే ‘ఉడయవర్’ గా పిలవబడ్డాడు. ‘ఉడయవర్’ అంటే ఈ లోకంలో ఊర్ధ్వ లోకంలో గురుత్వం సాధించినవాడు అని అర్థం. క్రీ.శ. 1137 లో మాఘ శుద్ధ దశమి నాడు బ్రహ్మైక్యం చెందారు. శ్రీరంగంలోని ఎప్పుడూ కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరంతో ఎర్రగా ఉండే విగ్రహం ‘తానన తిరుమేని’ రామానుజాచార్యుల పార్థివ దేహామేనని భక్తుల విశ్వాసం.

లక్ష్మీనాధ సమారంభాం నాథయామున మధ్యమామ్ I

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ II