అవనిలో సగం
‘న స్త్రీ రత్నం సమం రత్నం’ అంటే స్త్రీ తో సమానమైన ఆభరణం లేదు అని అర్ధం. సమస్త జగత్తుకు ఆధారం శక్తి. ఆ శక్తే ఆది పరాశక్తి గా వెలసింది. పరమేశ్వరుడు సైతం తన శరీరంలో సగ భాగం ఇచ్చి అర్థనారీశ్వరుడుగా అవతరించాడు. ఆడవారు అబల కాదు సబల అని ఎందరో మహిళా మూర్తులు నిరూపించారు. మరియా మాంటిస్సొరి విద్యావిధానంలో విప్లవాన్ని తీసుకు వచ్చింది. మేడం క్యూరి భౌతిక, రసాయన శాస్త్రాలలో నోబుల్ పురస్కారాన్ని అందుకొంది. యుద్ధాలలో గాయపడిన సైనికులకు సేవ చేసి ‘లేడి విత్ ది లాంప్’ గా పేరొందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎందరో నర్స్ లకు ఆదర్శంగా నిలిచింది. హెలెన్ కెల్లర్ మూగ, చెవిటి, అంధురాలైనా గొప్ప రచయితగా ప్రఖ్యాతిగాంచింది. మానవీయతకు నిలువెత్తు నిదర్శనంగా మదర్ థెరిస్సా నిలిచింది.
ప్రాచీన కాలంలో మహిళ :
ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకు సామాజిక అభివృద్ధిలో మహిళ పాత్ర ఎంతో ఉంది. వేటలో, ఆహార సేకరణలో, పశు పోషణలో, వ్యవసాయంలో పాలు పంచుకొనింది. లోపాముద్ర, యమి, ఘోష, అవపాత మొదలగు ఋషికలుగా పిలవబడ్డ వారు వేదాలలో ఋక్కులకు భాష్యం వ్రాశారు. మైత్రేయి, గార్గి, వాచక్నవి మొదలగు వారు వేద పండితులై చర్చలలో పాల్గొన్నారు. రామాయణంలో కైకేయి దశరథునికి యుద్ధంలో సహాయం చేసిందని, అందుకే వరాలు కోరుకుందని తెలుస్తోంది. నరకాసుని వధలో సత్యభామ పాత్ర కీలకం. మౌర్యుల కాలంలో అంగరక్షకులుగా మహిళలు ఉండేవారని మెగస్తనీస్ ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన శాతవాహనుల కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీ పుత్ర పులోమావి వారి తల్లులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కాకతీయ చరిత్రను ఇనుమడింపజేసిన రుద్రమదేవి శౌర్యానికి ప్రతీకగా నిలిచింది. సాహిత్యంలో పేరుగాంచిన రామాయాణాన్ని తెలుగులో వ్రాసిన మొల్ల, మధురా విజయం వ్రాసిన గంగాదేవి, సుభద్రా కల్యాణం వ్రాసిన తాళ్ళపాక తిమ్మక్క, వేంకటాచల మహాత్మ్యము వ్రాసిన తరిగొండ వెంగమాంబ, రఘునాధాభ్యుదయంమనే కావ్యాన్ని వ్రాసిన మధురవాణి మొదలగు మహిళా మణులు ఎందరో సాహిత్య జగత్తులో విరాజిల్లారు.
ఉద్యమ బాటలో మహిళ :
ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీలక్ష్మీ బాయి పోరాటం ఎందరికో ఆదర్శమయ్యింది. గాంధీజీ పిలుపుతో సరోజనీ నాయుడు, దుర్గాబాయి దేశ్ ముఖ్, దువ్వురి సుబ్బమ్మ, ఉన్నవ లక్ష్మీ బాయమ్మ మొదలగు వారు ఎందరో మహిళా నేతలు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. పట్వారీల పీటమణచిన చాకలి ఐలమ్మ తెలంగాణా వీర వనితగా నిలిచింది. నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ మొదలు పెట్టిన సారా వ్యతిరేకత అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుచే ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించేటట్లు చేసింది.
నేటి భారత మహిళ :
భారతదేశంలో నేడు మహిళలు అనేక రంగాలలో అడుగు పెట్టి అభివృద్ధిలో, దేశ ప్రగతిలో భాగస్వాములు అవుతున్నారు. భారత జాతీయ కాంగ్రేస్ కు మొదటి మహిళా అధ్యక్షురాలైన అనీబిసెంట్, మొదటి మహిళా ప్రధానమంత్రి గా పనిచేసిన ఇందిరాగాంధీ, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన బచేంద్రిపాల్, మొదటి ఐ.పి.యస్. అధికారి కిరణ్ బేడి, 1994 లో విశ్వ సుందరిగా ఎంపికైన సుష్మితాసేన్, సైన్యంలో మొదటి లుటినెంట్ జనరల్ గా చేసిన పునీత అరోరా, బ్యాట్మింటన్ లో పి.వి. సింధు, టెన్నిస్ లో సానియా మీర్జా, సైనా నెహ్వాల్, క్రికెట్ లో మిథాలి రాజ్, హార్మన్ ప్రీత్ కౌర్, చదరంగంలో కోనేరు హంపి, పరుగుల రాణి పి.టి. ఉష, సంగీతంలో ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి, లతామంగేష్కర్, వ్యాపార రంగంలో ఇంద్రనూయి, కిరణ్ మజుందార్ షా, ఫల్గుణి నాయక్, సుధా రామచంద్రన్ ఇలా ఎందరో మహిళా మణులు భారత దేశ ఔన్నత్యాన్ని విస్తరింప జేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం :
న్యూయార్క్ లో అమెరికన్ సోషలిస్టు పార్టీ నాయకురాలైన థెరిసా మల్కీల్ ఆధ్వర్యంలో అమెరికాలో 1909 లో జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. డెన్మార్క్ దేశంలోని కోపెన్ హాగెన్ నగరంలో క్లారా జెట్ కిన్ నాయకత్వంలో 1910 లో అంతర్జాతీయ సామ్యవాద మహిళా సమావేశం ఏర్పాటు చేశారు. మొదటి సారి 1857 మార్చి 8 న న్యూయార్క్ నగరంలో దుస్తులు తయారు చేసే కంపెనీలోని మహిళలు తమ హక్కులకై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇదే రోజున 1913 లో రష్యాలో, 1914 లో జర్మనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8 వ తేదీ నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నారు.
విద్య, స్వావలంబనలే మహిళా సాధికారతకు ఆధారాలు :
ప్రతి మహిళా చదువుకుని విద్యావంతురాలై నప్పుడే ఇతరుల మీద ఆధార పడకుండా బ్రతక గలుగుతుంది. రాజకీయ, ఆర్ధిక స్వేచ్ఛ లేనిదే మహిళా సాధికారత సాధ్యం కాదు. చలం గారు చెప్పినట్లు “స్త్రీకి కూడా శరీరం ఉంది - దానికి వ్యాయామం ఇవ్వాలి, ఆమెకు మెదడు ఉంది - దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది - దానికి అనుభవం ఇవ్వాలి”. అనే దానిని అందరూ గుర్తించాలి, ఆచరించాలి.

