సుశాస్త్రీయం - అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ దొర - టీవీయస్.శాస్త్రి

Arthur Cotton

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి ! తెలుగు వాడికి ఒక మంచి సుగుణం ఉంది.'అన్నదాత'ను మరచిపోడు. మరచిపోకపోవటమే కాదు,వీలున్నప్పుడల్లా స్మరించుకుంటాడు.పోయినసారి గోదావరీ పుష్కారాలకి వెళ్ళినపుడు,అక్కడి పురోహితులు,అర్ఘ్యాలు విడిపించేటప్పుడు --ఒక చక్కని శ్లోకం చెప్పి నా చేత  అర్ఘ్యం  విడిపించారు.ఆ శ్లోకం ఈ విధంగా ఉంది---
"నిత్య గోదావరీ స్నాన పుణ్యదో
యో మహామతిహి:
స్మరా మ్యాంగ్లేయ దేశీయం
స్మరామి ఆంగ్లేయ
కాటనుం తం  భగీరధం!
(మాకు గోదావరీ స్నాన పుణ్యాన్ని ప్రసాదించిన,అపర భగీరధుడు,ఆంగ్ల దేశానికి చెందిన కాటన్ గారికి నిత్యం స్మరించి తరిస్తున్నాము.)

ఈ శ్లోకం ప్రవచించిన మహానీయులెవరో ఇంతవరకు తెలియదు. కానీ,గోదావరీ నదీ వాసులు చాలామంది నేటికీ ఈ శ్లోకం చెప్పి కాటన్ దొరగారికి అర్ఘ్య ప్రధానం చేస్తూనే ఉన్నారు.ఒక సారి కాటన్ దొరగారు రాజమండ్రిలో పడవ ఎక్కుతుండగా,రేవులో ఈ శ్లోకం వినపడి--'కాటన్' అన్న మాట దొరగారి చెవిన పడిందట.దొరగారు,ఆయన అనువాదకుడి వైపు చూసి,పడవ దిగి సంకల్పం చెప్పుకుంటున్న ఆ బ్రాహ్మణుడిని--దాని అర్ధం గురించి అడిగి రమ్మని అన్నారట.ఆ బ్రాహ్మణుడు, అనువాదకునికి ఆ శ్లోకం అర్ధం వివరించి చెప్పి,అటువంటి భూసురిడిని (భూమి పై తిరిగే దేవుడు అనే అర్ధం)నిత్యం తలచుకుంటామని చెప్పాడట."ఆ దేవుడు మరెవరో కాదు,పడవలో ఉన్న ఆ కాటన్ దొరగారే!",అని ఆ అనువాదకుడు ఆ బ్రాహ్మణుడికి చెప్పగానే,ఆ  బ్రాహ్మణోత్తముడు రేవులోకి పోయి దొరగారికి వందనం చేసాడట.దొరగారు సంతోషించి,ఆ బ్రాహ్మణుడికి పది రూపాయలు దక్షిణగా ఇచ్చి సత్కరించారట.

ఆ రోజుల్లో పది రూపాయలు అంటే వందేళ్ళ నాటి ధరల ప్రకారం,ఒక కుటుంబానికి నాలుగు మాసాలు సరిపడే జీవనభృతి.శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు తమ ఆత్మకథలో కూడా కాటన్ దొరగారి విషయం ప్రస్తావించారు.అందులో,ఆయన ఈ విధంగా చెప్పారు.---బ్రాహ్మణులు గోదావరీ స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు,"కాటన్ దొర స్నాన మహం కరిష్యే" అని చెప్పుకునేవారట.

గోదావరీ నదికి ఆనకట్ట కట్టి ఆంద్ర దేశానికి 'అన్నదాత' గా ప్రసిద్ధి చెందిన కాటన్ దొరగారి పాలరాతి విగ్రహాన్నిఆ నదీ తీరాన్నే ప్రతిష్టించారు. స్నానపానాదులు,అర్ఘ్యప్రధానాలు ముగించుకొని,ఆ మహనీయుని విగ్రహానికి నమస్కరించి రావటం నేటికీ జరుగుతున్నది.అటువంటి మహనీయుడు,అపర భగీరధుడు అయిన కాటన్ దొరగారిని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 15 -05 -1803 న, Oxford లో జన్మించారు.బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరుగా పనిచేసేవారు.కాటన్ తన జీవితాన్ని భారతదేశంలో నీటిపారుదల,కాలువలు కట్టించడానికి ధారపోసాడు.ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే నెరవేరింది.

1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడయ్యాడు. ఆర్ధర్ కాటన్,1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ఒకడు.15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు.

ఈ కాలువల విభజన,అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చాయి.కాటన్ 1836- 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు.ఆ తర్వాత 1847- 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేసాడు.క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది.ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తిచేసాడు.కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దొరదే.ఇంతేకాక ఆయన బెంగాల్,ఒరిస్సా,బీహార్,మొదలైన ప్రాంతాల నదులను ప్రజలకు ఉపయోగ పడటానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసాడు.ఆ మనీయుడు, 25-07-1899న, డోర్కింగ్ లో  (బ్రిటన్) మరణించారు.

తెలుగు వారేకాదు తమిళులు,ఒరియాలు,బెంగాలీలు, బీహారీలు...మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.మూడున్నర ఏళ్ళ  క్రితం కాటన్ దొరగారి మునిమనవడు అయిన శ్రీ రాబర్ట్ కాటన్ గారు, ఆంధ్రదేశానికి వచ్చి,గోదావరీ తీరాన్నిమొత్తం తనివితీరా పరిశీలించి,ఆంద్రదేశ ప్రజలు,కాటన్ దొరగారిని స్మరించుకుంటున్నతీరుని చూసి ఆనందబాష్పాలు కార్చారు. ఆ మధ్య లండన్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో,తెలుగువారు శ్రీ రాబర్ట్ కాటన్ దంపతులను ఘనంగా సత్కరించారు. తెలుగువారి కృతజ్ఞతా భావానికి వారి కళ్ళు చెమ్మగిల్లాయి.‌

ఆ అపర భగీరదుడిని మనం కూడా స్మరించుకొని జీవితాన్ని ధన్యం చేసుకుందాం!.

(శ్రీ ముళ్ళపూడివారి 'కోతికొమ్మచ్చి' స్ఫూర్తితో...ముళ్ళపూడి వారికి  స్మృత్యంజలితో.....)

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.