బ్రహ్మ ముహూర్తం - జంపని జయలక్ష్మి

Brahmee Muhurtham

బ్రహ్మ ముహూర్తం ఉదయం 3గంటల నుండి 6గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం. ఈ సమయం ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం.ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు,ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా  కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు, బాబాజీలు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తూ ఉంటారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది, ఎలాంటి శ్రమ లేకుండానే. కానీ చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

బ్రహ్మ ముహూర్తంలో సమయాన్ని ఎక్కువ వృధా చేయకూడదు. ఇది చాలా విలువైన కాలం. జపతపాదులకు,ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దానివలన మెదడు,కళ్లు చల్లగా ఉంటాయి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మంచి శక్తి వస్తుంది. ఒకవేళ చలికాలం ఏదేని ఆనారోగ్యం వలన తలస్నానం చేయలేకపోతే మానసిక స్నానం చాలా మంచిది. పవిత్ర గంగానదిలో తలారా స్నానం చేసినట్లు ఊహించుకుని దానిని మనసులోనే అనుభవించండి. నేను స్వచ్చమైన ఆత్మను అనుకుంటూ జ్ఞానగంగలో మునిగినట్లు ఊహించుకోండి. దీనివలన మనలో ఉన్న పాపాలన్నీ తొలగి మరింత స్వచ్ఛంగా ఉంటాము.

బ్రహ్మ ముహూర్తంలో చేసే ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది. జపతపాదులు మొదలుపెట్టే ముందు 12సార్లు ఓంకారం, 5నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మ ముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చెయ్యటం మొదలుపెడుతుంది. అపుడు ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మ లో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.