జలం లేనిదే జీవం లేదు - కొమ్మలూరు హరి మధుసూదన రావు

జలం లేనిదే జీవం లేదు

మార్చి 22 - ప్రపంచ జల దినోత్సవం

పంచభూతాలు అనగా నీరు, నేల, నిప్పు, గాలి, ఆకాశం. ప్రపంచంలో ప్రతి జీవి ఈ పంచ భూతాల నిర్మితమే. ప్రతి జీవి చివరికి ఈ పంచభూతాలలోనే ఐక్యం కావాల్సిందే. సౌర కుటుంబంలోని భూమి మీద మాత్రమే నీరు ఉంది. అందుకే భూమిని జలయుత గ్రహము అని అంటారు. భూమిపై 71 శాతం నీరు ఆక్రమించి ఉంది. అందులో 97.5 శాతం నీరు సముద్రాలలో ఉంది. 2.5 శాతం నీరు మంచి నీరు. ఈ మంచి నీటిలో ధ్రువ ప్రాంతాలలో గడ్డకట్టిన మంచు గ్లేసియర్స్ రూపంలో 69.5 శాతం ఉంది. 30.1 శాతం భూగర్భ జలం. అంటే కేవలం 0.4 శాతం మాత్రమే సరస్సుల్లో, నదుల్లో, భూమి ఉపరితలంలో ఉంది.

ప్రాణాధారం :

‘ఆపోవా ఇదగం సర్వం’ అని వేదం చెబుతుంది. అంటే నీళ్ళే సర్వస్వము. నీటికి ఈశ్వరుడని పేరు. నీరే ఈశ్వరుడు. అందుకే కలశం లోని నీటిని గంగాజలంగా భావించి అందులోకి భగవంతుడిని ఆవాహన చేస్తాము. నీటికి ప్రాణ శక్తి ఉంది. అందుకనే ‘అమృతంవా ఆపః – ఆపః ప్రణయతి’ అంటాము. అంటే అమృత స్వరూపమే నీరు. కాబట్టి దానికి నమస్కారం తెలుపుతున్నాం. సమస్త భూతములు పుట్టడానికి కారణం నీరు. ఆ నీటి వలననే సమస్త ప్రాణులు జీవిస్తున్నాయి. చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు నీటిపై ఆధారపడ్డారు. నీటి వల్లే పంటలు పండుతాయి. వ్యవసాయానికి భూగర్భ జలం ద్వారా 43 శాతం, కాలువల ద్వారా 37 శాతం, చెఱువుల ద్వారా 15 శాతం, వర్షాధారంగా 5 శాతం ఉపయోగిస్తున్నారు. బోర్ల ద్వారా నీరు ఎక్కువగా ఉపయోగించడం ద్వారా గత ఇరవై సంవత్సరాలలో భూగర్భ జలం మూడు మీటర్లు తగ్గింది. గృహ సంబంధ కార్యక్రమాలలో స్నానానికి 35 శాతం, టాయిలెట్ కు 20 శాతం, పాత్రలు శుభ్ర పరచటానికి 21 శాతం, బట్టలు ఉతకడానికి 14 శాతం, మొక్కల పెంపకానికి 6 శాతం, వంటకు 3 శాతం త్రాగునీటికి కేవలం 1 శాతం మాత్రమే సగటున ఖర్చు చేస్తున్నాము. కొరతగా ఉన్న ఈ మంచి నీటిని వృధా చేయరాదు. సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ జల వనరుల శాఖ నివేదిక ప్రకారం మన దేశంలో 1951 సంవత్సరం లో 5177 ఘన మీటర్లు ఉన్న తలసరి లభ్యత 2011 సంవత్సరం నాటికి 1545 ఘన మీటర్లకు పడిపోయింది.

నీటి కాలుష్యం :

నీరు మంచి ద్రావణి. అంటే చాలా లవణాలు నీటిలో కరుగుతాయి. ఈ లవణాలు ఎక్కువయినా నష్టమే, తక్కువయినా నష్టమే. ఉదాహరణకు సాధారణంగా మంచి నీటిలో ఒక లీటరు నీటిలో 4 మిల్లీ గ్రాముల ఫ్లోరిన్ ఉంటే మంచిది. అంతకన్నా ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి సంభవిస్తుంది. ఎముకలు పెళుసు అవుతాయి. అనేక ప్రాంతాలలో నీటిలో ఉండవలసిన లవణాల కంటే ఎక్కువ శాతం ఉండటం వల్ల మూత్ర పిండాల వ్యాధులు వస్తున్నాయి. మంచి నీటిలో కలుషిత నీరు కలవడం వల్ల అనేక హానికారక బ్యాక్టీరియాలు చేరి కలరా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ నీటిపై దోమలుచేరి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సంభవిస్తాయి. పంట పొలాల్లో అధికంగా వాడే క్రిమి సంహారక మందులు నీటిలో కలిసి ప్రవహించి నదులలో చెఱువులలో కలిసివాటిని కలుషితం చేస్తున్నాయి. పరిశ్రమలలో వాడిన తరువాత వచ్చే కలుషిత జలం నదులల్లోనూ, సముద్రాలలో కలవడం వల్ల నీటిలోని చేపలు చనిపోతున్నాయి. నీటిని కలుషితం చేయడం నేరంతో సమానం.

నీటి వృధాను అరికట్టాలి :

మూడింట ఒక వంతు జనాభాకు నీటి కొరత ఉంది. కాబట్టి నీటిని వృధా చేయరాదు. మహారాష్ట్ర లోని హివారే బజార్ లో నీటి సంరక్షణా పద్దతులను పాటించడం వల్లే ఆ గ్రామం అభివృద్ధి పధంలోకి నడిచింది. ఇంటి పైన, పరిసరాల్లో పడే వాన నీటిని, ఇంటిలో ఉపయోగించిన తరువాత వృధాగా అయ్యే నీటిని ఇంకుడు గుంతలలోకి పంపించడం ద్వారా భూగర్భ జలాన్ని పెంచవచ్చు. చాలా కాలం క్రితమే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలలో వెదురు బొంగుల ద్వారా కొండకోనల్లో పడే నీటిని ఒక చోటికి తెచ్చి వేసవిలో వాడుకొనేవారు. కాంటూర్ బండింగ్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ వంటి పద్ధతుల ద్వారా వ్యవసాయంలో నీటిని ఆదా చేయవచ్చు. కొండ ప్రాంతాలలోని పొలాలలో కందకాలను త్రవ్వడం ద్వారా వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవచ్చు. గ్లైరీసిడియా వంటి మొక్కలను పొలాల గట్లపై పెంచడం ద్వారా అవి నేలలో నీటిని పట్టి ఉంచడమే కాక నత్రజనిని కూడా మొక్కలకు అందిస్థాయి. 3 R పద్దతి అయిన Reduce, Recharge, Reuse ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చు.

మన ఇంటి నుంచే నీటిని ఆదా చేయడం మొదలు పెట్టాలి :

ఒక సర్వేలో పళ్ళు తోముకునేటప్పుడు కుళాయి నుండి సరాసరి నాలుగు గాలన్ల నీరు వృధాగా పోతున్నదని తేలింది. షేవింగ్ చేసుకొనేటప్పుడు కొళాయిని ఆపి, మగ్గులో నీటిని తీసుకోవాలి. కూరగాయలను, ఆకు కూరలను కొళాయి క్రింద కాకుండా ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో కడగటం ద్వారా నీరు ఆదా చేయవచ్చు. R.O సిస్టం లో వృధా నీటిని వాషింగ్ మిషన్ కు, చిన్న టబ్ లో పట్టి పాత్రలను తోముకోవడానికి ఉపయోగించవచ్చు. ఎనర్జీని ఆదా చేస్తే ఉత్పత్తి చేసినట్లే అన్నట్లు గానే నీరును వృధా చేయకపోతే నీటిని ఉత్పత్తి చేసినట్లే.

ఎక్కడో కొండల్లో, కోనల్లో పుట్టిన జలపాతం వాగై, వంకై, సెలయేరై, నదై చెట్టూ, పుట్టా అనే తేడాలు లేకుండా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతమూ, ఈ రాష్ట్రమూ అనే భేద భావం లేదు. అందుకే నీరు అందరి సొత్తు. దాహార్తులందరిదీ. నీటి తగాదాలు పెట్టుకోకుండా వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ప్రక్క వృధాగా నీరు సముద్రం పాలు అవుతుంటే మరో ప్రక్క త్రాగు నీటి కోసం కిలో మీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించ డానికి నదుల అనుసంధానం జరగాలి. పోలవరం వంటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలి. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలోని చెఱువులకు మరమ్మత్తులు చేసి, పూడిక తీయించే మిషన్ కాకతీయ వంటి కార్యక్రమం ఇతర రాష్ట్రాలలో కూడా చేపట్టాలి. పాడి పంటలు పొంగి పొర్లాలి. దేశం సస్యశ్యామలం కావాలి. నీరే జీవం, నీరే మన జీవనం, నీరే మానవ మనుగడకాసారం.