ప్రపంచ వాతావరణ దినోత్సవం - భారతుల శ్రీవాణి

ప్రపంచ వాతావరణ దినోత్సవం

కన్నడంలో ‘మళె మారు మరణ యారు అరియరు’ అనే సామెత ఒకటి ఉంది. అంటే వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు అని అర్థం. ఒక చోట ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతోంది. అక్కడికి వచ్చిన రైతు ‘ఏంటి స్వామీ! పోయిన సంవత్సరం మీరు చెప్పినట్లు వర్షాలు వస్తాయనుకొంటే ఒక్క చినుకు కూడా పడలేదు’ అని పురోహితునితో అన్నాడు. ‘గత సంవత్సరం ఏం చెప్పానోయ్?’ అని అడిగాడు పురోహితుడు. ‘వానలు ముంచుతవోయ్, ముంచుతవోయ్! అన్నారు స్వామీ!’ ‘అదే మరి, వానలు పడకుండా నీ కొంప ముంచుతాయని చెప్పా!’ అని ఆ జ్యోతిష్యుడు అనగానే ఔరా! అని నోరు తెరుచుకొని ఎగ్గొట్టినా ముంచుటే, ఎక్కువైనా ముంచుటే అంటే ఇదే కదా! అని అనుకున్నాడు ఆ రైతు.

చాలా కాలం క్రితమే మన పంచాంగ కర్తలు రాబోయే శతాబ్దాలలో ఎప్పుడెప్పుడు గ్రహణాలు వస్తాయో సవివరంగా వ్రాసారు. నేడు ఆధునిక వాతావరణ శాస్త్రవేత్తలు రూపొందించే వాతావరణ నివేదికలు దాదాపు ఖచ్చితత్వంతో ఉంటున్నాయి. నేడు సూపర్ కంప్యూటర్స్ ద్వారా నమూనాలను సేకరించడం, విశ్లేషించడం ద్వారా ఇది సాధ్యమవుతోంది. వరదలే కాకుండా కరువులను కూడా ముందే పసిగట్టగలుగుతున్నాము. భారత రిమోట్ సెన్సింగ్ ద్వారా మన దేశానికే గాక ఇరుగుపొరుగు దేశాలకు కూడా వాతావరణ నివేదికలను అందించగలుగుతున్నాము.

ప్రపంచ వాతావరణ సంస్థ :

వివిధ దేశాలమధ్య వాతావరణ సమాచారాన్ని పంచుకొనేందుకు అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఏర్పడింది. పవనము, పీడనము, ఉష్ణోగ్రత, అవపాతం మొదలుగునవి దేశ సరిహద్దులను దాటి విస్తరించేవి. ఎక్కడో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఉష్ణోగ్రతలలో మార్పులకు భారతదేశం ప్రభావిత మవుతోంది. అందుకే ప్రపంచ దేశాలు సహకరించుకోవలసిన అవసరం ఎంతో ఉంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1845 లో ఏర్పాటు చేసిన సమావేశంలో వాతావరణ అంశాలను కొలవడానికి అంతర్జాతీయ ప్రమాణాలను సూచించారు. 1853 లో బ్రెసెల్స్ లో వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ సమావేశం జరిగింది. 1873 లో వియన్నాలో జరిగిన సమావేశంలో ఒక అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఏర్పాటు కావాలని ప్రతిపాదించారు. ఇదే 1950 మార్చి 23 వ తేదీన ప్రపంచ వాతావరణ సంస్థ గా మారింది. ఈ సంస్థ 1951 నుంచి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా అయ్యింది. ఇందులో ప్రస్తుతం 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. జర్మనీకి చెందిన గెర్హార్డ్ అడ్రియన్ ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు.

వాతావరణ ప్రాముఖ్యత :

వాతావరణం మానవుని జీవితంలో ప్రధానమైనది. ఉదయాన్నే నిద్ర లేచి, వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది అంటాము. వివాహం, వేడుక, సమావేశం, ఆట మొదలగునవి ఏ కార్యక్రమైనా నిర్వహించే ముందు కార్యక్రమం జరిగే రోజు వాతావరణం ఎలా ఉంటుందో అని ముందస్తు సమాచారం కోసం చూస్తాం. ఋతువుల మీద వ్యవసాయం తద్వారా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అందుకనే ఋతువులను భారతదేశానికి ప్రాణ ప్రదమైనదిగా భావిస్తారు. ముందస్తు వాతావరణ నివేదికల ద్వారా ప్రకృతి విపత్తులైన అధిక వర్షపాతం, వరదలు, కరువు కాటకాలు, తుఫానులు మొదలగు వాటి ద్వారా ప్రాణ నష్టం తగ్గించగలిగాం కానీ ఆస్తి నష్టం పెరుగుతోంది. 2020 లో హైదరాబాద్ లో, 2021 లో రాయలసీమ జిల్లాలలో జరిగిన వరదల వల్ల ప్రాణ నష్టం తగ్గినా ఆస్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది.

ప్రపంచ వాతావరణ సంస్థ 1961 నుండి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ని ప్రకటిస్తూ వస్తోంది. గత సంవత్సరం సముద్రం, శీతోష్ణస్థితి, వాతావరణం అనే థీమ్ ని ప్రకటించింది. 2020 లో శీతోష్ణస్థితి, నీరు అనే థీమ్ ని ప్రకటించింది. ఈ సంవత్సరం ‘ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య’ అనే దానిని థీమ్ గా నిర్ణయించారు. విపత్తుల ప్రమాదాలను తగ్గించడానికి వాతావరణ సమాచారాన్ని సత్వరం అందించటం దీని లక్ష్యం. నిశిత పరిశీలన, పర్యవేక్షణ, విశ్లేషణ, నమూనా, అంచనా వేయడం మొదలగు కార్యక్రమాల ద్వారా వాతావరణ శాఖ వాతావరణంలో జరిగే మార్పులను ప్రజలకు తెలియజేస్తూ ప్రకృతి విపత్తుల నుండి కాపాడుతోంది. ఋతుపవనాల రాక, అల్ప పీడన వ్యవస్థ ఏర్పడటం, పిడుగులు పడే అవకాశం వంటి వాటిపై ముందస్తు సమాచారాన్ని అందిస్తూ మనకు ఎంతో సహాయం చేస్తున్న వాతారణ శాస్త్రవేత్తలకు మనమెంతో ఋణపడి ఉన్నాము.