ఫోటోలు చెప్పిన మాటలు - దర్భశయనం శ్రీనివాసాచార్య కవి

ఫోటోలు  చెప్పిన మాటలు ఫోటోలు చెప్పిన మాటలు ! ఇది ఇరవై  పొట్టి కవితల సంపుటి. ఇరవై ఫోటోలు కూడా ఇందులో వున్నాయి కనుక  ఇది ఫోటోల సంపుటి కూడా. వెరసి ఫోటోల మాటల కూడలి ఇది. వీటిని రాసిన డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్ సహృదయ సాహిత్య ప్రియులు. విశేషమేంటంటే   తానే రాసినా వీటిని తన మనుమరాలి పలుకులుగా మనకందించారు. ఇదొక ప్రయోగం.  మనుమరాలి  ఇష్టాల్ని ఈ రూపంలో వ్యక్తపరిచారు . ఇందులోని  ఫోటోలు   బాల్యపు ఆనందానికీ  ,హుషారుకూ నమూనాలు. మాటలు రంగుల ఫోటోలకు భాష్యాలు.    ఈ మాటల్లో  బాల్యముంది . బాల్యపు లాలిత్యం వుంది . హాయీ వుంది. ఆటల పాటల పండుగల  ప్రస్తావనలున్నాయి. తెలుగు పట్ల డాక్టర్ ప్రసాద్ కున్న ప్రేమ ఈ మాటల్లో వ్యక్తమయింది.  వృత్తి రీత్యా వైద్యుడైన ఆయన ఈ మాటలకు  ఆరోగ్య గుణాన్ని అద్దారు. ఎవరైనా  ఆస్వాదించొచ్చు. తేటపడొచ్చు.  వీటిలో చాలా విషయాలను  తన మనుమరాలిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ ప్రసాద్ రాసినా,  అక్కడక్కడా అక్కడక్కడా  పిల్లలందరికీ వర్తించే విషయాల్ని చెప్పాడాయన. ఆ మేరకు వస్తు   పరిధి విస్తరించింది.  ఒక తాతకూ, మనుమరాలికీ నడుమ వున్న ఆత్మీయ సంబంధానికి  ఈ పుస్తకం ఒక దాఖలా.  తెలుగు అక్షర లోకానికి ఇదొక కొత్త చేర్పు.  చేర్చుతున్న డాక్టర్ ప్రసాద్ కు నా అభినందన.                                                                          దర్భశయనం శ్రీనివాసాచార్య  హైదరాబాద్,  ***