రెండవ ప్రపంచ యుద్ధం -రహస్యాలు - శ్యామకుమార్ చాగల్

రెండవ ప్రపంచ యుద్ధం -రహస్యాలు

రెండవ ప్రపంచ యుద్ధం - రహస్యాలు / విశేషాలు

రెండవ ప్రపంచయుద్ధం అనేది చరిత్ర లో రెండు వర్గాల మధ్య జరిగిన అత్యంత వినాశకరమైన పెద్ద సంఘర్షణ. ఒక వేపు జర్మనీ తో కలిసి ఇటలీ,జపాన్ వర్గాన్ని ఆక్సిస్ అని, అమెరికా ,ఫ్రాన్స్, బిటిష్ మిత్ర రాజ్యాలు మరొక వేపు కలిసి.ఆలిస్ అనబడే కూటమి మధ్య సాగించిన మరణ కాండ లో కోట్ల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.
ఆ సమయం లో నియంత ల పరిపాలన లో జర్మనీ, ఇటలీ, పాక్షికంగా జపాన్ ఉండేవి.
సెప్టెంబర్ 1939 లో మొదలైన ఈ యుద్ధం ఏక బిగిన సెప్టెంబర్ 1945 నాడు జపాన్ మీద వేసిన అణు బాంబు తో ఆగింది..

మాగినోట్ లైన్ అనబడే ఫ్రాన్స్ , జర్మనీ ల మధ్య వుండే అత్యంత దృఢ మైన 140 కిలోమీటర్ ల పొడవైన సరిహద్దు ఉండేది. ఫ్రాన్స్ వేపు భూగర్బంలో లెక్క లేనన్ని సైనిక సాయుధ స్థావరాలు ఉండేవి. అవి జర్మనీ సైన్యానికి గట్టి పోటీనివ్వగలవు, వాటిని దాటి జర్మన్ సైన్యం రాలేదు అని ఫ్రాన్స్
ధీమాగా ఉండేది. అయితే దాని నమ్మకాన్ని వమ్ము చేస్తూ హిట్లర్ సేనలు తెలివి గా వాటి వేపు వెళ్లకుండా ఇంకో వేపు వుండే
లక్సన్బ్ర్గ్ ,బెల్జియం ద్వారా ఫ్రాన్స్ లోకి దురాక్రమణ చేశాయి.
జర్మన్ దేశం లో రేడియో , వార్త పత్రికలూ ,సినిమా , లాంటి ప్రతి మీడియా కూడా నాజి పార్టీ యొక్క భావ జాలాన్ని ప్రజలలో పూర్తిగా నింపేసింది. దానిలో ప్రత్యేకంగా విద్వేష పూరితమైన మూడు సూత్రాలు ప్రజలను యుద్దానికి సన్నద్ధం చేశాయి. వాటిలో మొదటిది , జర్మన్ ల ది ప్రత్యేకమైన ,విలువైన ఆర్యన్ జాతి. ప్రపంచాన్ని ఏలే శక్తి వారిది మాత్రమే.
రెండవది, జ్యుఇష్ జాతి ప్రజలు జర్మన్ లకు శత్రువులు. వారిని మొత్తంగా భూమి మీద నుండీ రూపు మాపాలి.
మూడవది కమ్యూనిజం .దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండనీయ రాదు.

జెర్మనీ దేశం లో నిరుద్యోగం రూపు మాప బడింది. దేశం లో పెద్ద ఎత్తున రహదారులు, పెద్ద కర్మాగారాలు, సైనిక సామాగ్రి ఉత్పత్తి లో ప్రజలు మమేకమై పోయారు. అంతిమంగా 1939 నాటికి ఆ దేశం సైనికంగా ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించింది. దీనికి కారణం హిట్లర్ సారథ్యం లోని నాజీ పార్టీ అనే చెప్పాలి.
స్కూల్ లో వున్న లేత ప్రాయం పిల్లలకు కూడా పైన చెప్ప బడిన విద్వేష పూరితమైన భావ జాలాన్ని నేర్పించేవారు.

మొదటగా 1931 లో ముందుగా జపాన్ తన పక్కన గల చైనా దేశం మీద దురాక్రమణ చేసి మంచురియా అనబడే ప్రాంతాన్ని కైవసం చేసుకుంది.
అప్పుడు లీగ్ అఫ్ నేషన్స్ అన బడే ప్రపంచ సంస్థ ఖండించింది కానీ అంతకంటే ఏమి చేయలేక పోయింది. అసమయం లో జపాన్ ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభానికి ఇదొక ఒక కారణం అని చెప్తారు.
ఇదే రకంగా ఇటలీ 1935 లో తన పొరుగు దేశమైన ఇథియోపియా ను ఆక్రమించింది. అక్కడ వుండే అడవి ప్రజలు కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా ఎనిమిది నెలలు పోరాడి ఓడిపోయారు. ఎప్పటిలాగే లీగ్ అఫ్ నేషన్స్ ఏమీ చేయలేక పోయింది.
అక్టోబర్ 1936 లో జపాన్ ,జర్మనీ,ఇటలీ దేశాలు కలిసి " ఆక్సిస్ " అనబడే కమ్యూనిస్ట్ వ్యతీరేక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇది రాబోయే రెండవ ప్రపంచ యుద్దానికి నాంది అని చెప్పవచ్చు.

చైనా మీద జపాన్ జరిపిన దురాక్రమణ లో నాన్జింగ్ పట్టణం లో ప్రజలపైన , చైనా సైన్యం మీద జపాన్ అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్ర లో లేదనే చెప్పాలి.
ముందుగా 1939 లో హిట్లర్ పోలాండ్ ను ఆక్రమించినప్పుడు జర్మన్ సైన్యాధికారులు ఖంగారు పడి భయపడ్డారు.
వారి అధ్యక్షుడు హిట్లర్ అనవసరమైన యుద్దాన్ని ప్రారంభించి దేశాన్ని తీసుకెళ్లి గెలవలేని యుద్ధం లోకి నెట్టేస్తున్నాడు అని సైన్యాధికారులు అప్రమత్తమై పోయారు. అయితే అలాంటిదేమీ జరగదని, పోలాండ్ ను ఆక్రమించిన తర్వాత
బ్రిటిష్,ఫ్రాన్స్ దేశాలు భయపడి పోయి సంధి చేసుకుంటాయని వారికి భరోసా ఇచ్చాడు హిట్లర్ .
కానీ హిట్లర్ అంచనాలు తప్పాయి. రెండవ ప్రపంచ యుద్దానికి భయపడకుండా బ్రిటిష్, ఫ్రాన్స్ రెండు దేశాలు హిట్లర్ సైన్యాన్ని ఎదిరించటానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆ విధంగా జెర్మనీను యుద్ధం లోకి నెట్టేశాడు హిట్లర్.