సినీ శృంగారం - మద్దూరి నరసింహమూర్తి

Cine srungaram

తొలిపలుకు : ఏదేనా చెడు విషయం గురించి మాట్లడేటప్పుడు అందరూ సాధారణంగా అనే మాట –

“దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది”.

కానీ, నా ఉద్దేశంలో -- దాని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది.

ఎందుకంటే, ఆ చెడు గురించి వివరంగా తెలుస్తే తప్పించి, ఆ విషయాన్ని దూరం పెట్టరు, కనీసం ఆలోచించరు.

 

దృష్టిలోపం అనే నింద ఎవరూ నాకు ఆపాదించకపోతే, 'సినీ శృంగారం' లో నాకు కనిపించిన 'చెడు' ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.

మీరు నాతో ఏకీభవించవచ్చు, కాకపోవచ్చు. ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిప్రాయం వారిది కదా.

 

'సినీ శృంగారం' గురించి నా అభిప్రాయం వెలిబుచ్చే ముందర --

మనుషులలో 'శృంగారం' , దాని పరిధి -- గురించి రెండు మాటలు.

 

పితృ ఋణం నించి విముక్తి కలిగించే సాధనలో, వివాహమైన పురుషుడు స్త్రీ ఒండొరులు ఆచరించే యజ్ఞ సమానమైన ధర్మ బద్ధమైన కామక్రియ అది.

నాలుగు గోడల మధ్య వారిరువురు తప్ప మూడో వ్యక్తి లేనప్పుడు మాత్రమే జరిగే ఆ క్రియ అతి రహస్యమైన పవిత్రమైన ధర్మాచరణం. ఆ క్రియకి సాక్షులు ఉండరు, ఉండక్కరలేదు, ఉండాలనుకోవడం అనైతికం కూడా.

కాముక క్రియలో పాల్గొనే పురుషుడు స్త్రీ - ఒండొరులను ఉద్రేకపరచుకొని, ఉత్తేజపరచుకొని, ప్రహృష్టమైన భావనతో, సృష్టి కార్యక్రమంలో పాల్గొనడానికి - కామశాస్త్ర పరంగా నిర్దేశించబడినవి అధర చుంబనం, ఆలింగనం, తదితర కాముక క్రియలు.

 

ఆ చర్య ఫలితంగా పుట్టిన బిడ్డ తల్లితో ఉండే స్పర్శ, సాన్నిహత్యం వలన - కొంత కాలం తరువాత ముందుగా గుర్తించేది అమ్మనే; తొలిసారిగా పలికే కమ్మని పలుకు కూడా 'అమ్మ' అనే.

 

ఆ బిడ్డకి తండ్రిని పరిచయం చేయగలిగేది, చేసేది అమ్మే. ఎందుకంటే, ఎవరితో ధర్మబద్ధమైన కామసుఖాన్ని అనుభవించడం వలన ఆ బిడ్డకి జన్మ ఇచ్చిందో ఆమెకు మాత్రమే తెలుసు.

అంతటి రహస్య ప్రక్రియ ఉంది ఆ శృంగారంలో.

-2-

అలాంటి పవిత్రమైన కార్యక్రమానికి దోహదపడే అధర చుంబనం, ఆలింగనం, తదితర కాముక క్రియలు -- సినీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులకి చూపించడం, ఎంతవరకూ సమంజసం అన్నది అందరూ ఆలోచించవలసిన అగత్యం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది.

ఎందుకంటే, ఆ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు ఉద్రేకపడితే ఎలాగా?

ముఖ్యంగా పెళ్లికాని యువతీ యువకులు ఆ సన్నివేశాలకి స్పందించి, ఉద్రేకపడి, అలాంటి అనుభవాలు కావాలనుకొని, తప్పు దారులు తొక్కితే ఆ యువతని నిందించడం ఎంతవరకూ సమంజసం?

సినీ ప్రాంగణంలో పెద్ద తెరమీద కానీ, ఇంట్లో చూసే దూరదర్శన/శ్రవణ మాధ్యమాలైన టీవీ, లాప్టాప్, టాబ్ మరియు మొబైల్ లో ఆ సన్నివేశాలు చూసిన పెళ్లికాని యువతీ యువకులు తప్పు త్రోవ పట్టరా ? వారి మనసు వారిని తప్పు త్రోవ పట్టమని ప్రేరేపింపదా ?

 

'కథాపరంగా ఆ సన్నివేశాలు అవసరమని' లేదా 'అటువంటి సన్నివేశాలతో తీసిన సినిమాలే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని' చాలా తేలికగా అంటూ ఉంటారు - అటువంటి సన్నివేశాలుతో సినిమాలు తీసే కొందరు ప్రముఖులు.

వాస్తవానికి, సినిమాలు తీయడం చేతకాని చవట దద్దమ్మలు చెప్పే మాటలు అవి.

ఎంతమంది ప్రేక్షకులని వారు సంప్రదించేరు ? ఎంతమంది ప్రేక్షకులు అలాంటి సినిమాలే కావాలని వారితో అన్నారు, ఆ వివరాలు ఒక్కరేనా చెప్పినట్టు, చెప్పగలిగినట్టు ఇంతవరకూ (నా ఎరుకలో) దాఖలాలు లేవు.

ఆ ప్రముఖులు ఈ ప్రశ్నలకి ఎటువంటి సహేతుకమైన జవాబు ఇవ్వలేరు అని మనందరికీ తెలుసు.

 

పాతకాలం సినిమాలలో నాయకా నాయికల మధ్య ప్రేమ సన్నివేశాలు లేవా ? ఆ సినిమాలు ఆ రోజుల్లో మాత్రమే ప్రజాదరణ పొందడమే కాక, ఇప్పటికీ ప్రజాదరణ ఎలా / ఎందుకు పొందుతున్నాయి ?

కారణం - పాటల ద్వారా మాటల ద్వారా మాత్రమే శృంగారాన్ని చూపి, ఆ సన్నివేశాలు మనో రంజకంగా ఎంతో హృద్యమంగా చిత్రీకరించే దర్శక మహాశయుల ప్రతిభ అది.

వారెవరూ సినిమా ఎలా తీయాలో చదువుకున్నవారు కారే.

ఇప్పుడు – సినిమా తీసే వారిలో ఎలా తీయాలో అన్న చదువులు చదువుకున్నవారు ఎక్కువమంది ఉన్నా, మనకి ఈ చేదు అనుభవాలు తప్పడం లేదు.

పైగా, మన సినిమాలకి సెన్సార్ తప్పనిసరిగా ఉన్నా - ఆ పెద్దమనుషులు కూడా ఈ దుస్థితికి ఇతోధికంగా సేవ చేస్తున్నారనే భావించవలసివస్తోంది.

-3-

శృంగార సన్నివేశాల చిత్రీకరణలో -- కొన్నాళ్లుగా వస్తున్న ‘OTT’ మాధ్యమం మరీ వెర్రి పుంతలు తొక్కుతూ ఉద్వేగ పూరిత ధ్వనులు, కేరింతలు, పులకింతలు కూడుకున్న రతి క్రీడలు కూడా విచ్చల విడిగా చూపిస్తున్నారు. ఎందుకంటే, ఆ మాధ్యమం లో తీసే/వచ్చే సినిమాలకు, సెన్సార్ పధ్ధతి లేకపోవడమే కారణం. అందుగురించి పట్టించుకోని ప్రభుత్వ పెద్దలనేమనాలి ?

 

ఈ విషయాన్ని (నిజానికి ఈ సమస్యని అనాలి. కానీ, సమస్యగా పరిగణించేవారు ఎంతమంది?) నటీమణుల వేపు నుంచి పరిశీలిస్తే - మరీ వింత పోకడలు వినిపిస్తున్నాయి.

ఒకామె అంటుంది - పాత్రానుగుణంగా అవసరమైన చోట బోల్డ్ గా నటించడానికి

ఏ నటికీ అభ్యంతరం ఉండకూడదు, నాకైతే అభ్యంతరం ఏమీ లేదు - అని.

ఇంకొకామె తెలివిగా అంటుంది - దర్శకులు చెప్పినట్టు చెయ్యాలి కదండీ - అని.

మరొకామె అతి తెలివిగా అంటుంది - అదంతా ఉత్తి నటనే కదండీ - అని.

 

ఇంకో ముఖ్య విషయం.

నేటి సినిమాలలో -- నాయికా నాయకుల ప్రేమ సన్నివేశాలలో మరీ జుగుప్సాకరమైనది ఏమిటంటే - ఆ సన్నివేశాలలో, వారి చుట్టూ తక్కువలో మరో పది మంది ఆడా మగా ఆనందంగా గెంతుతూ నాట్యం చేస్తుంటారు. ఈ అర్ధం పర్ధం లేని పాడు ఆలోచనతో చిత్రీకరణ ప్రారంభించిన ఆ ప్రబుద్దుడిని, అదేదో గొప్ప చిత్రీకరణ అన్నట్టుగా, అలాంటి చిత్రీకరణ కొనసాగిస్తున్న గొఱ్ఱెలమందని ఏమనాలి ?

అలాంటి సన్నివేశాల చిత్రీకరణతో జూనియర్ ఆర్టిస్టులకు మేము ఇచ్చే ప్రోత్సాహం, ఆర్ధిక సహాయం అని తమని తాము సమర్ధించుకుంటూ వెర్రి మొర్రి జవాబులిచ్చే నిర్మాతలు ఉండవచ్చు.

జూనియర్ ఆర్టిస్టులకు సహాయం చేసే చిత్తశుద్ద్ధి ఉంటే - మరో సరైన మార్గమే లేదా?

 

ఈ వినాశకాలే విపరీతబుద్ధి వలయాల నుంచి విముక్తి దొరికే సూచనలు నాకైతే కనుచూపుమేరలో కనబడడం లేదు----- మరి మీకో ?

*****