నువ్వంటే నాకిష్టం ! - తోట సాంబశివరావు

Nuvvante Naakishtam


"ఇష్టం" అనే పదం తెలియనివారెవరైనా ఉంటారా ? ఉండనే ఉండరు !
ఇష్టం...అనేది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది . కొంతమందికి పర్వతాలంటే ఇష్టం , కొంతమందికి అరణ్యాలంటే , కొంతమందికి సముద్రాలంటే, కొంతమందికి దేవాలయాలంటే, కొంతమందికి పర్యాటక ప్రదేశాలంటే , కొంతమందికి జంతువులంటే , కొంతమందికి పక్షులంటే , కొంతమందికి కొన్ని వస్తువులంటే , కొంతమందికి కొందరంటే ఇష్టం . ఇలా చెప్పుకుంటూ పోతే ...ఈ జాబితా చాంతాడంత అవుతుంది , తడిసి మోపెడవుతుంది .
అందుకే , ప్రస్తుతం మనం , కొంతమందికి కొందరంటే ఇష్టం , అనే విషయానికి పరిమితమవుదాం . మరి , ఒక వ్యక్తి. ఇంకో వ్యక్తిని ఇష్టపడటానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం .
సాధారణంగా , ఒక వ్యక్తికి , తన ప్రాంతం వారంటే ఇష్టం , తన కులం వారంటే ఇష్టం , తన మతం వారంటే ఇష్టం , తన వృత్తి వారంటే ఇష్టం .
ఇంకొంచెం దగ్గరగా చూస్తే , అందంగా ఉంటే ఇష్టం , బాగా మాట్లాడుతుంటే ఇష్టం , బాగా పాడుతుంటే ఇష్టం , బాగా నృత్యం చేస్తుంటే ఇష్టం , బాగా ఆడుతుంటే ఇష్టం , సత్ప్రవర్తన ఉంటే ఇష్టం , మంచి నడవడిక ఉంటే ఇష్టం , మంచి అలవాట్లు ఉంటే ఇష్టం , మంచి ఆలోచనా విధానం ఉంటే ఇష్టం .
మరికొంచెం దగ్గరగా చూస్తే , కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు ఇష్టం , సమస్యల్లో చిక్కుకున్నప్పడు గట్టెక్కించినవాడు ఇష్టం , ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేసినవాడు ఇష్టం , శుభాశుభ కార్యాలలో తోడుగా నిలబడ్డవాడు ఇష్టం , ఎట్టి పరిస్థితుల్లోనైనా ..."నీకు నేనున్నానంటూ "... భరోసా ఇచ్చేవాడు ఇష్టం .
ఇక , నవతరంలోని , యువతరం లో ఉండే ఇష్టం , దాని పర్యవసానం గురించి తెలుసుకుందాం !
యువతీ యువకుల మధ్య చిగురించే ఇష్టం , స్నేహానికి దారితీస్తుంది . స్నేహంలో ఒకరినొకరు తెలుకుంటారు . అటు పిమ్మట , ప్రేమలో పడతారు . ఆ ప్రేమే వాళ్ళిద్దర్నీ , పెళ్లి వరకు తీసుకెళ్తుంది . ప్రేమతో రెండు మనసులు కలిస్తే , పెళ్ళితో రెండు కుటుంబాలు కలుస్తాయి .
మన జీవితాల్లో , అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ " ఇష్టం " .

::::::::::::::