గడ్డి స్వగతం - NDSV నాగేశ్వరరావు

గడ్డి స్వగతం

గడ్డి అంటూ నన్ను చాలా తక్కువగా చూస్తుంటారు. దానికి ఒక కారణం, ఈ లోకంలో గడ్డి తినేవాళ్ళు ఎక్కువై పోవడం. అందులో కూడా చాలా రకాల వాళ్ళు ఉన్నారు. మొదటి రకం, అడ్డమైన గడ్డి తినేవాళ్లు. అంటే అది హోటళ్లలో కనిపించినదంతా కలియబడి తినేసేవాళ్ళు. అయితే తిన్నందుకు బిల్లు వాళ్లే కడితే, కొంతలో కొంత 'వాళ్ళ పొట్ట, వాళ్ళ ఇష్టం' అనుకుని వదిలేయవచ్చు. కానీ, పక్క వాడి పొట్ట కొట్టి, తమ పొట్ట నింపుకుంటే, అలా తినేవాళ్ళని జనం ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయి, గడ్డిని చెడుగా చెప్పడం చాలా బాధాకరం. ఇక మరో రకం గడ్డి తినేవాళ్లు, ఏ పని చేయాలన్నా ఎంతో కొంత చేతికి ఇవ్వాలని కోరుకునేవాళ్లు. వీళ్ళకి జీతం డబ్బులు కన్నా, ఈ గడ్డి అంటేనే చాలా ఇష్టం. అవినీతిని అంతమొందిస్తామని నాయకులు ఇన్నేళ్లుగా చెప్పినా, ఇలా గడ్డి తినే వాళ్ళని ఇంకా ఆపలేకపోతున్నారు. ఒకరకంగా ఇలా లంచాలు తీసుకునే వాళ్ళకి గడ్డి తింటారు అని ఆపాదించి, నాకున్న పేరు చెడగొడుతున్నారేమో అనిపిస్తుంది. గడ్డి స్కాములు చేసిన వాళ్ళు, వందల బస్తాల గడ్డిని లారీల మీద తీసుకు వెళ్లామని చెప్పి, బైకుల నెంబర్లను వేసి బిల్లులు తీసుకున్న పెద్ద మనుషులు, జనాలని గడ్డి పోచ కన్నా హీనంగా చూస్తూ, ఆ గడ్డితోనే తమ పొట్టలను నింపుకున్న బడా నాయకులు, 'కాదేదీ కవిత కనర్హం' అన్న మహాకవి మాటలను, 'కాదేది స్కాము కనర్హం', అది ఎండు గడ్డి అయినా, పచ్చ గడ్డి అయినా, దేనితోనైనా సంపాదనకి తిరుగు లేదని నిరూపించారు. నిజానికి గడ్డిని తిని జంతువులైన ఆవులు, గేదెలు దానిని చక్కని చిక్కని తెల్లని పాలగా మార్చి, జనాలు అందరికీ అందిస్తున్నాయి. అంటే గడ్డిని సక్రమంగా వాడుకుంటే ప్రజలకు ఎంత ప్రయోజనమో అందరూ తెలుసుకోవాలి. కానీ, ఆ విషయం మర్చిపోయి, జనాలు చేసే తప్పుడు పనులకు గడ్డిని నిందించడం ఎంతవరకు సబబు. అయినా గడ్డితో కూడా వ్యాపారం చేసే ఈ రోజుల్లో అంతగా ఆలోచించేవాళ్ళు ఎవరుంటారు. వరద నీళ్లలో కొట్టుకుపోయేవాడు గడ్డి పోచ దొరికినా దాన్ని ఆలంబనగా తీసుకొని, ఒడ్డుకు చేరాలని ప్రయత్నం చేస్తాడు. మరోపక్క చిన్నప్పుడు ఏనుగుని ఇనుప సంకెళ్లతో బంధించి, దానికి బంధం యొక్క బలాన్ని తెలియజేస్తే, పెద్దయ్యాక చిన్న గడ్డిపరకని కట్టినా కూడా, అది బరువుగానే భావిస్తూ తెంచుకుని పారిపోకుండా ఉండిపోతుంది ఏనుగు. కాబట్టి, నేను (గడ్డి పోచ) తేలికగా కనిపించినా, నేను ఇచ్చే శక్తి, నేను కల్పించే అడ్డంకి చెప్పనలవి కాదు. పురాణ కాలంలో గడ్డినే మంత్రించి, బ్రహ్మాస్త్రంలా ప్రయోగించిన మునీశ్వరులు ఉన్నారు. గడ్డిని తమకు పూజా ద్రవ్యంగా భావించే దేవుళ్ళు ఉన్నారు. అందుకే గడ్డి సర్వే సర్వత్రా అన్ని ప్రదేశాల్లోనూ, చాలా సులభంగా పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది. అందుకే గడ్డికి దాని గౌరవాన్ని ఉంచండి, మంచిగా వాడుకోండి. గడ్డిగా ఇది నా విన్నపం.