రామబాణం (పిల్లల కథలు - చెన్నూరి సుదర్శన్

రామబాణం (పిల్లల కథలు

 

 

రామబాణం (పిల్లల కథలు)

పుస్తకం టైటిల్ : రామబాణం (పిల్లల కథలు)

పేజీల సంఖ్య : 136

వెల : రూ.110/-

 

ఈగ్రంథంలో 27 పిల్లల కథలున్నాయి. కథలన్నీ గూడా పిల్లలకు నీతిబోధ చేయడమే గాకుండా పెద్దలుకు కనువిప్పు కలిగించేలా ఉన్నాయి.

మొదటి కథ ‘రామబాణం’. ఒక తాతయ్య పిల్లకు కథలు చెప్పే క్రమంలో శ్రీరామచంద్రుడు సంధించే బాణం.. దాని యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తాడు. అప్పుడు ఒక బాలుడు “‘రిమోట్ కంట్రోల్’ తో బాణాన్ని సంధించలేమా తాతయ్యా..” అని అడుగుతాడు. నేటి పిల్లల ఆలోచనాధోరణులకు ముచ్చటపడి ప్రోత్సహిస్తాడు. ఆ పిల్ల వాడు తాను అనుకున్నది సాధించి ఒక గజదొంగ భరతం పడతాడు.

రెండవ కథ ‘రామకము’. కథలో ఒక వానరము పేరు రామకము. బాధలో తనకు సాయం చేయక పోయినా.. వారి కుటుంబానికి సాయం చేసి యజమాని కళ్ళు తెరిపిస్తుంది.

ఉచిత పథకాలు అనుచితం. అని చెబుతుంది ‘ఉచితం..ఉచితం!‘ కథ.

పోలియో మహామ్మారి సోకిన కొడుకును ఎలా పెంచి పెద్ద చేసాడో! వివరించే కథ ‘నాన్నా.. నీకు వందనం!’

అమాయకపు అంజన్న’ కథ పిల్లలకు విద్య మరియు లోకజ్ఞానం అవసరమని ప్రభోదిస్తుంది.

అబద్దం ఆడరాదని.. సత్యమే జయమని ‘అమ్మ చెప్పింది’ విని ఆ మార్గాన్ని అనుసరించి తన జీవతాన్ని సాఫల్యం చేసుకున్న పిల్లవాని కథ.

కరోనా కష్టకాలంలో ఆపద నుండి తమ కుటుంబాన్ని ఆదుకున్న పిల్లల కథ ‘ఆత్మాభిమానం

రక్తదానానికి కులం, మతం ఆడ్డురాదని రుజువు చేసే కథ ‘కులం కాదు.. గుణం ప్రధానం!

ఒక వానరము చిన్న అమ్మాయిని రక్షించి.. ‘భువి మీద మానవులకు జీవించే హక్కు ఉన్నట్లే జంతువులకు లేదా?’ అని అమ్మాయి తల్లి దండ్రులను ప్రశ్నిస్తుంది. అదే కథ ‘కోతి సూటి ప్రశ్న’.

ఆపదలో ఉన్న వ్యక్తి సాయం చేయమని అడక్క పోయినా .. ఆపదను గుర్తించి మనం సాయం చేయాలనే నీతిని బోధిస్తుంది ‘స్సాయమే మిన్న’ కథ.

కోతుల నడుమ’ ఒక హాస్య కథ. కరీంనగర్ జిల్లాలో కోతుల నడుమ అనే ఒక ఊరు ఉంది. ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో ఊహించి హాస్యంగా మలిచిన కథ.

పిల్లల దుడుకు స్వభావంతో ఒక ‘మేకపిల్ల’ అపాయం బారిన పడితే, అది చూసి.. తన స్వభావాన్ని మార్చుకున్న ఒక పిల్ల వాని కథ.

మన సంపాదనను మరణానంతరం మనతో బాటే ఎలా తీసుకు పోవచ్చో విశదీకరించే కథ ‘నా సంపాదన నాతోనే”.

ఒక పిల్లవాడు చేసిన తప్పును పసిగట్టినా.. తండ్రి తన మాతృమూర్తినే అనుమానించినట్టు నాటకమాడి కొడుకును సరియైన దారిలో పెట్టిన కథ ‘నానమ్మ కాదు నాన్నా..!

సెల్ ఫోన్ మాయాజాలంలో.. పుస్తక పఠనం అడుగంటి పోతోంది. పిల్లలను రచయితలుగా తీర్చిదిద్దే కథ ‘నానమ్మకు ప్రేమతో..’ .

నామాలసామి హితవు’ కథలో నామాలు కలిగిన ఒక వానరము తోటి వానర మిత్రులను సన్మార్గంలో నడువాలని హితవు పలుకుతుంది. ఒక బాలుని మీద వానర హితవు ప్రభావం పడి .. తన తప్పు తెలుసుకుంటాడు.

పరిసరాల పరిశుభ్రంతో మన గ్రామాలు ఎలా విలసిల్లుతాయో వివరించే కథ ‘మహాముని పరిష్కారం

మాయా ఉంగరం’ కథలో మనిషి అత్యాశకు పోతే ఎలా పతనమవుతాడో చెబుతూ కనువిప్పు కలిగిస్తుంది.

వన్యప్రాణుల రక్షణ ప్రాముఖ్యతను విశదీకరించే కథ ‘వన్యప్రాణులను రక్షించుకుందాం..!

సింహరాజుకు సంబరం.. అడవి అంతటికీ ఆనందంకథ ‘చెట్లు ప్రగతికి మెట్లు’ అనే నినాదాన్ని బలపరుస్తూ.. సాగుతుంది.

తాతయ్య మనుమరాలును పాఠశాలకు తీసుకు వెళ్తుంటే.. దారిలో ఒక దివ్యాంగుడు కూరగాయలు అమ్మే దృశ్యం కనబడుతుంది. మనుమరాలు దానిని ‘స్ఫూర్తి’ గా తీసుకొని అతని మీద ఒక నవల రాస్తుంది. ఆ నవలకు వచ్చిన బహుమతిని దివ్యాంగునికి బహుమతిగా ఇస్తుంది.

దైవపూజ’ కథలో మనం దేవాలయానికి వెళ్ళేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భగవంతుణ్ణి ప్రలోభ పెట్టరాదని ప్రభోదిస్తుంది.

చతుర్విద దానాలలో ‘అన్నదానం’ యొక్క ప్రాముఖ్యతను, అవసరాన్ని వివరిస్తుంది.

కరోనా కాలంలో ఎందరో నిర్భాగ్యులు సరియైన దహన సంస్కారాలకు నోచుకోలేదు. బంధు, మిత్రులూ హాజరు కాలేని దారుణ పరిస్థితులు. అలాంటి సమయంలో విద్యార్థులు కులమతాలకు అతీతంగా తమ గురువుని ‘అంతిమ (సన్మానం) సంస్కారంజరిపించే కథ.

ఉపాధ్యాయులు బోధించే పాఠాలు కొన్ని విద్యార్థుల మనస్సులో నాటుకు పోతాయి. వాని ప్రభావం ఎలా ఉంటుందో చాటి చెప్పే కథ ‘పాఠం మహిమ’.

గుడికి వెళ్లి దైవాన్ని ప్రార్థించడం.. దారిలో చావు బ్రతుకుల్లో కనబడ్డ మనిషిని ఆదుకోవడం.. ఒకటే అని చెప్పే కథ ‘మానవ సేవయే మాధవ సేవ

ఒక విద్యార్థిని గుడిలో.. గ్రామంలో ప్రజల ప్రవర్తన విభిన్నంగా ఉండడం గమనిస్తుంది. దానికి పరిష్కరించే క్రమంలో ఊరికి మంచి పేరు తీసుకు వస్తుంది ‘భారతి’

ప్రతీ కథ చివరన ఆ కథకు సంబధించిన ‘సూక్తులు’ పిల్లలకు, పెద్దలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.

ఈ కథలన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.

పిన్నా, పెద్దా తప్పకుండా చదువాల్సిన గ్రంథం.

ప్రతులకు: చెన్నూరి సుదర్శన్,

1-1-21/19. ప్లాట్ నం: 5. రోడ్డు నామ్: 1,

శ్రీసాయి లక్ష్మీ శోభానిలయం,

రాంనరేష్ నగర్. హైదర్ నగర్. హైదరాబాదు – 500 085 (తె.రా.)