చిరస్మరణీయుడు డా. హానిమెన్ - కుమారి. కొమ్మలూరు ప్రణవి

చిరస్మరణీయుడు డా. హానిమెన్

ఏప్రిల్ 10 వ తేదీ - ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన కొన్ని రకాల వైద్య విధానాల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కవగా వస్తున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఆ ఫలితం కూడా శాశ్వతంగా ఉండే వైద్య విధానమే హోమియో పతి. రోగి బాహ్య లక్షణాలతో పాటూ మానసిక లక్షణాలను బట్టి వైద్యం అందించడం దీని ప్రత్యేకత. జర్మనీకి చెందిన డా. హానిమెన్ ఈ గొప్ప వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇతని జయంతి ఏప్రిల్ 10 వ తేదీ ని ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’ గా జరుపుకుంటున్నారు.

డా. హానిమెన్ కృషి :

ఇతని పూర్తి పేరు క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హానీమెన్. జర్మనీలోని మీస్సెన్ అనే గ్రామంలో ఏప్రిల్ 10 వ తేదీ 1755 లో జన్మించాడు. ఇతని తండ్రి గొట్టి ఫ్రెడ్ హానిమెన్ పింగాణీ పాత్రలపై బొమ్మలు గీసే పెయింటర్. చాలీ చాలని ఆదాయం. పేద కుటుంబం. అయినా శామ్యూల్ హానిమెన్ లో ఉండే ప్రతిభను గుర్తించి ముల్లర్ అనే ఉపాధ్యాయుడు ప్రోత్సాహం అందించాడు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్ బాషలతో పాటూ ప్రాచీన బాషలైన గీకు, లాటిన్ బాషలపై హానిమెన్ పట్టు సాధించాడు. అనేక గ్రంథాలను చదివాడు. డాక్టర్ కావాలనే కోరికతో ఉండేవాడు. చిన్న పిల్లలకు ట్యుషన్ చెప్పి వచ్చిన డబ్బుతో లిప్ జిగ్ లో వైద్య విద్యను ప్రారంభించాడు. ప్రథమ స్థానాన్ని సంపాదించి వైద్య విద్యలో వచ్చిన పారితోషికంతో ఏర్లాంగెన్ విశ్వవిద్యాలయంలో యం.డి. పూర్తి చేశాడు. వైద్యుడిగా హాస్పిటల్ లో చేరాడు.

శాశ్వత పరిష్కారం చూపని వైద్య విధానానికి ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ప్రయోగాలు ప్రారంభించాడు. సింకోనా కషాయాన్ని నాలుగు రోజులు తీసుకున్నాడు. మలేరియా జ్వరం వచ్చింది. దాన్ని ఆపగానే జ్వరం తగ్గింది. దీని ఆధారంగా రోగాలను నయం చేసే మందులకు రోగాన్ని కలిగించే శక్తి ఉందా ? అన్న సందేహం వచ్చింది.

ప్రకృతిలోని ఏ పదార్థమైనా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఇచ్చినపుడు ఎటువంటి లక్షణాలను కలిగిస్తుందో అలాంటి లక్షణాలను కలిగిన రోగికి అదే పదార్థాన్ని సుక్ష్మ పరిమాణంలో ఇచ్చి వ్యాధిని నయం చేయవచ్చునని కనుక్కున్నాడు. దీనిని లాటిన్ లో ‘సిమిలియా సిమిలిబస్ క్యురెంటర్’ అని అంటారు. ప్రయోగ ఫలితాలను ‘లాన్సెట్’ అనే జర్నల్ లో ప్రచురించాడు. హోమియోపతి అనే కొత్త వైద్య విధానానికి బీజం వేశాడు. హోమోయిస్, పేథోస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి హోమియోపతి అనే పదం ఉద్భవించింది. ఒకే రకమైన, బాధ అని ఈ రెండు పదాల అర్థం. తన జీవితమంతా అనేక ప్రయోగాలను చేసి ‘మెటీరియా మెడికా ప్యూరా’ అనే గ్రంథాన్ని వ్రాశాడు. చాలా మంది వైద్యానికి ఇతని దగ్గరకు వచ్చేవారు. ఇతర వైద్యులు ఇది సహించలేక పోయారు. ఇలాగే కొనసాగితే లిప్ జిగ్ లో ఉన్న ఇతర హాస్పిటల్స్ ముతబడ్డాయని భావించారు. అక్కడి నుంచి తరిమి వేశారు. డ్యూక్ ఫెడ్రిక్ సహాయంతో కోథెన్ కు చేరి హాస్పిటల్ ప్రారంభించాడు. చివరికి ఫ్రాన్స్ లోని పారిస్ లో స్థిర పడ్డాడు. 1843 జులై 2 వ తేదీ తనువు చాలించాడు.

హోమియోపతి మూలసూత్రాలు :

1. వైయుక్తిక భేదాల ప్రకారం వైద్యం అనే సూత్రం : (An illness is specific to the individual) వైద్యం చేసేది వ్యాధికి కాదు. వైద్యం చేసేది వ్యక్తికి. ప్రతి వ్యక్తీ ఒకే రకంలా ఉండడు. కాబట్టి ఆ వ్యక్తి లక్షణాలను బట్టి వైద్యం అందిచాలి.

2. సారూప్య ఔషధ సూత్రం : (Like cures like) ఉదాహరణకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సింకోన అనే మందు ఇచ్చినప్పుడు చలి జ్వరం లక్షణాలు కనిపిస్తే, చలి జ్వరం ఉన్న వ్యక్తికి సింకోన మందు ఇస్తే పూర్తిగా చలిజ్వరం పోతుంది.

3. ఇన్ఫినిటిసిమల్ డోస్ సూత్రం : (The greater the dilution the greater its potency) అతి తక్కువ మోతాదులో మందు ఇవ్వాలి. ఎంత మందు పలచన (dilute) చేస్తే శక్తి (potency) అంత పెరుగుతుంది.

హోమియోపతి వైద్య విధానం :

మొక్కలు, జంతువులు, ఖనిజలవణాలు వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాల నుంచి మందులను తయారు చేస్తారు. వాటిని లాటిన్ పేర్లతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణ ఉప్పు ను నాట్రం మురియాటికం, నల్లమందును లాచెసిస్ మ్యూటా ఆర్సినిక్ ఆక్సైడ్ ని ఆర్సెనికం ఆల్బమ్ అనే పేర్లతో పిలుస్తారు. హానిమెన్ తదనంతరం అమెరికాలో దీనిని కాన్ స్టాన్ టైన్ హేరింగ్, హాన్స్ బుర్చ్ గ్రామ్ మొదలగు వారు విస్తృతం చేశారు. మన రాష్టంలో కీ.శే. డా. పావులూరి కృష్ణ చౌదరి వంటి వారు హోమియోపతి వైద్య సేవలు అందించారు.

భారతదేశంలో హోమియోపతి :

భారతదేశంలో హోమియోపతి బెంగాల్ లో ప్రారంభమైంది. హోమియోపతి మొదటి డాక్టర్ గా మహేంద్రలాల్ సర్కార్ పేరుగాంచారు. 1881 లో ‘కలకత్తా హోమియోపతిక్ మెడికల్ కాలేజ్’ ని ప్రారంభించారు. 1973 లో భారత ప్రభుత్వం హోమియోపతి వైద్యానికి గుర్తింపునిస్తూ ‘సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి’ ని స్థాపించింది. 2014 నవంబర్ 9 వ తేదీన అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయ్ గారు ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వశాఖ క్రింద ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, సోన-రిగ్ప మరియు హోమియోపతి (AYUSH) ని ఏర్పారు చేశారు.

భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం తన శరీరాన్నే ప్రయోగశాలగా చేసి తన ప్రాణాన్ని సైతం పణం పెట్టి హోమియోపతిని ప్రపంచానికి అందించిన చిరస్మరణీయుడు డా. హానిమెన్.