తెలుగు భాష
తెలుగు భాషాభిమానిగా -- మన తెలుగు భాష గురించి ఆలోచిస్తే, నాకు వివిధ రకాలుగా మనస్తాపం కలుగుతూంది.
అయితే, ఆ ఇబ్బంది నాకేనా, ఇంకా కొంతమంది కూడా అదే విధముగా ఆలోచిస్తూంటారా అనే ఆలోచన కూడా కలుగుతోంది. తెలుగు భాషాభిమానం కల వ్యక్తి ఎవరేనా నాలాగే ఆలోచిస్తూ ఉంటారని ఒక నమ్మకం.
తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యమైనది తెలుగులో మాట్లాడడం; తరువాత తెలుగు వ్రాయగలిగిన వారు తప్పనిసరిగా తెలుగులో వ్రాయడం.
కొన్ని పరభాషా పదాలు - ముఖ్యంగా వాడుకలో పాతుకుపడిపోయినవి - వాడక తప్పదు.
ఉదాహరణకి, ట్రైన్, రైల్, బస్సు, ఆటో, సైకిల్, సిగ్నల్ -- లాంటివి.
వాటికి కూడా నిఘంటువులో వెదికితే, తెలుగు భాషలో పదాలు దొరుకుతాయి. కానీ, అవి వెంటనే అర్ధం చేసుకోవడం సాధారణ జనానికి సౌలభ్యం కాదు.
అలాగని, సాధారణ జనం సులువుగా అర్ధం చేసుకొనే తెలుగు భాషా పదాలు కూడా పరభాషలో మాట్లాడడం సబబు కాదు.
తెలుగు భాషాభివృద్హికి నిర్వహించే వ్యాస రచన / వక్తృత్వ పోటీలు అంతో ఇంతో తెలుగు భాషాభివృద్హికి తోడ్పడతాయి.
కానీ, నిశితంగా పరిశీలిస్తే, ఆ పోటీలలో కూడా కొంతమంది పరభాషా పదాలు వాడడం సాగిస్తూనే ఉన్నారు. ఆ పోటీలు నిర్వహించే కొంతమంది కార్యనిర్వాహకులు, న్యాయనిర్ణయం చేసే కొంతమంది న్యాయనిర్ణేతలు పోటీల ఫలితాలు ప్రకటించేటప్పుడు పరభాషా పదాలు వాడుతూ ఉండడం కొండొకచో మనం గమనించవచ్చు. ఉదాహరణకి, ‘ ప్రథమ బహుమతి’ అని ప్రకటించే బదులు ‘ఫస్ట్ ప్రైజ్’ అంటూ ఉన్నారు.
కనుక, ఆ పోటీలు నిర్వహించే కార్యనిర్వాహకులు న్యాయనిర్ణయం చేసే న్యాయనిర్ణేతలు తప్పనిసరిగా తెలుగుభాషలోనే మాట్లాడాలి అని సంకల్పించుకోవాలి. ఆ విధంగా వ్యవహరించిన అభ్యర్థులకు మాత్రమే పట్టం కట్టాలి.
అప్పుడే, ఆ పోటీల నిర్వహణ యొక్క ఆశయం నెరవేరుతుంది.
తెలుగులో పాటల పోటీలు అలాగే నృత్య పొటీలు కొన్ని దూరదర్శన్ (తెలుగు) మాధ్యమాలలో ప్రసారం అవుతూ ఉంటాయి. వారికి కూడా పైన చెప్పుకున్నవి యధాతథంగా వర్తిస్తాయి.
ఈ రోజుకి కూడా రేడియోలో చాలా కార్యక్రమాలు వస్తున్నా, కొందరేనా అందులో వచ్చే తెలుగు చిత్రగీత కార్యక్రమాలు కనీసం వింటూ ఉంటారు. (అందులో, నేనొకడిని).
-2-
ఆ పాటలు ప్రసారం చేసే వ్యక్తులు (ఆడ కానీ మగ కానీ) సుమారుగా ఆంగ్లంలో, అప్పడప్పుడు హిందీలో కూడా. మాట్లాడుతూ - తెలుగు భాష రానివారిగా వ్యవహరిస్తున్నారు.
వారు మాట్లాడే పది పదాలలో రెండో మూడో తెలుగు పదాలుంటాయి.
ఒకరిని చూసి మరొకరు, ఒకరి తరువాత వచ్చే మరొకరు అలాగే మాట్లాడుతున్నారు.
వీరు మరి మారరు. ఎందుకంటే, ఆ ఆలోచనే వారిలో ఏ కోశానా కనబడదు.
ఏ కార్యక్రమానికైనా సుమారుగా వ్యాఖ్యాత అవసరం.
తెలుగు కార్యక్రమాల వ్యాఖ్యాతలు తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడవలసిన అగత్యం ఎంతేనా ఉంది అన్నది నిర్వివాదాంశము.
కానీ, మన దురదృష్టం వారు తెలుగు అంతంత మాత్రమే వచ్చినట్టుగా కార్యక్రమాన్ని ఎక్కువగా పరభాషా పదాలతోనే వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ మధ్యన బాగా పేరు పడిన ఒక మహిళా వ్యాఖ్యాత స్వయంగా ఆమే చెప్పుకున్నారు. -- (ఆమె మాటల్లోనే)
"చూడు నీకంటే ............ఎంత బాగా వ్యాఖ్యానం చేస్తూందో ఎంత హుందాగా వ్యవహరిస్తోందో. నువ్వెప్పుడు ఆ స్థాయికి ఎదుగుతావు"
----అని ఆమె నాన్నగారే ఆమెతో అన్నారట.
మన తెలుగు కార్యక్రమాలు నిర్వహించే వ్యాఖ్యాతల తీరు తెన్నులు పరిశీలిస్తే మనకు కనిపించేది -- వారు అయినదానికీ కానీ దానికి అరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు; వచ్చీరాని నాట్య విన్యాసాలతో (కొండొకచో అశ్లీలత జోడించి) ఏవేవో సందర్భం లేని మాటలతో పాటలతో కూడా వ్యాఖ్యానం సాగిస్తూ, ఎంతో గొప్పగా ప్రేక్షకులను అలరిస్తిన్నాము అనుకొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
వారు ఇలా వ్యవహరిస్తూంటే -- ఆ వేదిక మీద వారి విన్యాసంతో చలన చిత్ర సీమలోకి ప్రవేశించే అవకాశం దొరకదా అన్న ఆశ వారిని అలా వ్యవహరింపచేస్తున్నది అనిపిస్తోంది.
ఏది ఏమైనా, మన వ్యాఖ్యాతలు మన తెలుగు భాషకి తీరని అన్యాయం చేస్తున్నారు అన్నది తేట తెల్లమౌతూంది.
అన్నీ పరిశీలిస్తే -- ప్రస్తుతం మన తెలుగు భాష పరిస్థితి ఎలా ఉందంటే -- కీ.శే. విశ్వనాధ్ గారి మాట లాగా -- 'పరభాషా ప్రభంజనంతో స్వంతవారి నోటిలోనే మన తెలుగు భాష రెపరెపలాడుతున్నది.'.
ఈ సత్యం గ్రహించి మన తెలుగు వారు త్వరలోనే జాగృతులవుతారని ఆశించడం తప్ప చేయగలిగేది లేదు.
*****
---మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు