అమ్మమ్మ ప్రేమకు పరాకాష్ట - డా. కె.ఎల్.వి.ప్రసాద్

అమ్మమ్మ ప్రేమకు పరాకాష్ట

అమ్మమ్మ ప్రేమకు పరాకాష్ఠ ..ఈ  ‘ ఆర్వీయం ‘   మినీ కవితా సంపుటి .. !! -----------------------------------                         ( పుస్తక సమీక్ష )                              –డా . కె ఎల్ వి ప్రసాద్ .  సాహిత్యం పట్ల ఆసక్తికలిగిన ,రచయితలు /రచయిత్రులు .కవులు / కవయిత్రులు ,తమకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియలలో రచనలు చేయడం  మామూలు విషయమే ! కొద్దిమంది మాత్రం ,జీవిత చరిత్రల పట్ల ఆత్మ కధల పట్ల ,స్మృతి కావ్యాలపట్ల ఆసక్తి చూపిస్తారు ,అదేవిధంగా అలాంటి రచనలు చేసే ప్రయత్నం చేస్తారు . జీవితంలో ఒకరకమయిన తృప్తిని ఆస్వాదిస్తారు ,అలాగే భావితరాలకు ఒక కుటుంబ చరిత్రను నిక్షిప్తం చేసే  సదావకాశాన్ని కల్పించుకుంటారు . అలాగే ప్రేయసి గురించి ప్రియుడు , ప్రియుడుగురించి ప్రేయసి రాసుకున్న ప్రేమకావ్యాలూ వున్నాయి .ఈ మధ్య కాలంలో అమ్మమ్మలూ ,నానమ్మలూ ,తాతయ్యలూ ,తమ తమ  మనుమలు ,మనుమరాండ్ర పై వున్న ప్రేమను ,కవిత్వం ద్వారానో ,కథల ద్వారానో ,వ్యాసాలద్వారానో ,తెలుపుకుంటూ రచనలు చేసి ,సాహిత్యం పైన ,తమ మనుమలపైనా ప్రేమను ప్రదర్శించుకుంటూ సంతృప్తి పొందుతున్నారు ఇది నిజంగా మంచి పరిణామమే !ఎదిగిన తర్వాత పిల్లలు తమ గురించి తమ పెద్దలు రాసిన సాహిత్యం చదువుకుని ఆనందించడమే కాదు ,గర్వపడతారు కూడా . అంతమాత్రమే కాదు వారిలో కూడా సాహిత్యాభిలాష అంకురించే అవకాశం ఉందన్నమాట ఒక రకంగా భావితరాలలో సాయిత్య తృష్ణ పెంచుకోడానికి ,ఇదొక మంచి మార్గమూ ,పునాదిరాయి కూడాను .  మనుమలగురించి కొందరు తాతలు (ఈ రచయితకూడా )వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు . అయితే ఈమాద్హ్య ఒక అమ్మమ్మ తన చిన్న  మనుమరాలు (పెద్దకూతురు కుమార్తె )నేపధ్యంగా ఒక వినూత్నమైన రచనను తీసుకువచ్చి అమితమైన అమ్మమ్మ ప్రేమను ప్రకటించుకున్నా రు . తెలుగు /ఆంగ్ల భాషల్లో అందంగా ముస్తాబై వచ్చిన పుస్తకం ఇది .  పుస్తకంలోకి ప్రవేశించక ముందే ,పుస్తకం చూడగానే ,తన ముద్దుల మానవరాలిపై అమ్మమ్మ ప్రేమ ఎంతటిదో యిట్టె లెక్కగట్టవచ్చు .ఇక్కడ  కవయిత్రి (ఈవిడ నవల /కథ ,రచయిత్రి కూడా )నిమాత్రమేకాదు ,ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసిన వారిని కూడా అభినందించే పద్దతిలో ఈ పుస్తకం ఉంటుంది . అమ్మమ్మగా ఇలాంటి రచన చేసిన మొదటి కవయిత్రి వీరే కావచ్చు . లేదా ఈ వ్యాస రచయిత దృష్టికి రాని మరికొంత  మంది ,అమ్మమ్మలూ ,నానమ్మలూ మరికొంత మంది వున్నా ఆశ్చర్య  పోనక్కరలేదేమో . ఈ పుస్తకం పేరు ‘ ఆర్వీయం ‘. మనవరాలి పేరు  ‘ ఆర్వీ ‘  ఈ హార్డ్ బౌండ్ అందమైన పుస్తకానికి టాగ్ లైన్ మాదిరిగా  ‘’ నిట్టి ,గ్రిట్టి ,ఆర్వీ,ప్రెటీ ‘’అనే మాటలు కూడా తగిలించారు . ఇంతకీ ఈ  పుస్తకం ఈ పుస్తకం రచించిన అమ్మమ్మ (కవయిత్రి )హైదరాబాద్ వాసీ  ఆస్ట్రేలియా నివాసి ,ప్రస్తుతం పుస్తక ప్రియులలో తరచుగా నలుగుతూన్న  పేరు ప్రముఖ నవల /కద/వ్యాస రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి .  మదిలోమెదిలిన తక్షణం కార్యరూపంలోపెట్టి పని పూర్తి అయ్యేవరకూ  నిద్రించని కఠిన క్రమశిక్షణ గల సాహితీ మిత్రమణి శ్రీమతి కొప్పిశెట్టి .  ఈ పుస్తకంలో తెలుగు /ఆంగ్ల భాషల్లో (అనువాదం ఈ కవయిత్రిదే )చిన్న  చిన్న మినీ కవితలు వున్నాయి . ప్రేమ -కవిత్వమూ రంగరించి పుస్తకం లో అద్దినట్టుగా చదివినప్పుడు అనిపిస్తుంది . ప్రముఖ సాహితీ వేత్త ,కవి  వక్త శ్రీ దర్భశయనం శ్రీనివాసా చార్య మంచి ‘ ముందు మాట రాశారు .  ఆర్వీ తో పాటు ,ఆర్వీ రక్తసంబంధీకుల అందరి ఫోటోలు ముచ్చటగా అమర్చడం వల్ల పుస్తకానికి కొత్త సొబగులు అద్ది నట్లై  పుస్తకానికి మరింత విలువ పెరిగినట్లయింది  ఈ బాలిక పుట్టుక కవయిత్రికి ప్రత్యేకం . అందుకే ఈ పాప (కవయిత్రి పెద్దకుమార్తె ,మూడవ కూతురు )పుట్టిన వెంటనే అమ్మమ్మ అయినా  ఝాన్సీ ఈ పొట్టి కవిత రూపంలో స్పందించారు,చదవండి :                  ఈ అమ్మమ్మ హృదయాకాశ ముంగిట                  మరోజాబిలమ్మ పుట్టిందీపూట …!                  పూలంటి పిల్లలంటేనే పరవశం                  మత్తిల్లే ఈ మకరందం మరింత వివశం .. !! దీని గురించి ప్రత్యేక వివరణ అవసరం లేదనుకుంటాను .  వృద్దాప్యం దగ్గరయ్యేకొద్దీ మనుష్యాలకి ఏదో తెలియని కొరత వేధిస్తూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది . ఇక్కడ రాజూ -పేద తేడా ఉండదు . దీనికి ఝాన్సీ గారు అతీతం కాదు . అందుకే కాబోలు మనవరాలి పుట్టుకను తలుచుకుంటూ —-                   ఈ ఆకులు రాలే శిశిరంలోకి                    హరితాన్ని మోసుకొచ్చిందీ వసంతం !                   నా వడలిన వదనంలో                    వెలుగులు నింపింది చంద్రమాంతం .. !! అని తెగ మురిసిపోయారు .  కవయిత్రికి ,ఆస్ట్రేలియా వదలి ,కొన్ని అత్యవసర పరిస్థితిల్లో స్వదేశానికి  రావలసిన పరిస్థితి ఏర్పడింది . తిరిగి వెళ్ళేది ఎప్పుడో తెలియని సందిగ్ధ  పరిస్థితి . అప్పుడు మనవరాలిని వదలి వెళ్ళాలన్న బాధలోఈఅమ్మమ్మ  గారి ఆవేదన చూడండి –                          నిన్ను వీడి వెళ్ళటం నాకో ఏసిడ్ పరీక్ష!                          వదలివెళ్లే పాశాల దుఃఖం మోస్తూ …                          భవబందాల తాపత్రయం గ్రహిస్తూ …                          సాగిస్తున్నా ఈ అసంతృప్త పయనం .. !! అంటూ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు కవయిత్రి .  ఇలా ఇంకా ఎన్నో హృదయాన్ని కరిగించే ,ద్రవింపజేసే చిరు కవితలు ఎన్నో వున్నాయి . వాటన్నింటిని ఇక్కడ ఉటంకించే అవకాశం లేదుకానీ  చివరి కవితలో కవయిత్రి అసలైన వ్యధను ఎలా వ్యక్త పరిచారో గమనించండి . —-                          జగన్నాటక మాయలో -                          ఏ పావేటు కదులుతుందో తెలియకుంది !                          ఈ కాలం కనికరించి వరకూ ,                          నా కలం ఇలా పలవరించి పరవశిస్తుంది !! ఇలా తాత్వికంగా ముగించారు . కారణం ,ఎప్పుడు తిరిగి ఆష్ట్రలియా వెళ్లి  మనుమరాలిని చూస్తుందో ఆవిడకి తెలియని పరిస్థితి . అందుకే కాలమే కనికరించాలని ఆవిడ వేడుకుంటున్న సందర్భం ,ఝాన్సీగారి చేత ఈ  ‘ ఆర్వీయం ‘ పుస్తకాన్ని రాయించిందన్న విషయం స్పష్టం .  ఇందులో పుస్తక ప్రాప్తిస్థానంగాని ,పుస్తకం వేల గాని కవయిత్రి ఎక్కడా పేర్కొన లేదు . బహుశా ఇది కొనడానికి దొరకని పుస్తకం అనుకుంటాను .  కానీ ,ఇలాంటి పుస్తకాలు ,రాయాలనుకునే రచయిత్రులు /రచయితలూ  కవులు ,కవయిత్రులు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారి మొబైల్ కు ఫోన్ చేసి(98660 59615) పుస్తకవివరాలు కనుక్కోవచ్చు .                                       ***